ఇన్ బాక్స్
ఒక దేశ అభివృద్ధి కేవలం ప్రభుత్వాల నిర్ణయాలతోనే సాధ్యం కాదు. సమాజంలోని ప్రతి వర్గం, ముఖ్యంగా యువత తమ బాధ్యతను గుర్తించి దేశ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అయినప్పుడే సంపూర్ణమైన ప్రగతి సాధ్యమవుతుంది. ఈ ఆలోచనకు కార్య రూపమే అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ). 1948 జూన్‌లో ప్రారంభమైన ఈ సంస్థ 1949 జూలై 9న అధికారికంగా నమోదు అయ్యింది. ఏబీవీపీ మొదటి రోజు నుంచే జాతీయ పునర్నిర్మాణం తన లక్ష్యం అని స్పష్టంగా ప్రకటించింది.
విద్యార్థులు కేవలం విద్యను పొందే వ్యక్తులు కాకుండా, సమాజ సమస్యలను అర్థం చేసుకుని పరిష్కార మార్గాలను అన్వేషించే బాధ్యత గల పౌరులుగా ఎదగా లని పరిషత్ భావించింది. ఈ లక్ష్య సాధన కోసం నిర్మాణా త్మక కార్యక్రమాలు, ప్రజాస్వామ్య పద్ధతుల్లో ఉద్యమాలు, విద్యార్థి వ్యవస్థల్లో భాగస్వామ్యం అనే మూడు ప్రధాన మార్గాలను అనుసరించింది.
భారతదేశ వైవిధ్యంలో ఏకత్వాన్ని బలపరిచే లక్ష్యంతో ఏబీవీపీ చేపట్టిన ముఖ్యమైన కార్యక్రమాల్లో సేయిల్ (స్టూడెంట్స్ ఎక్స్‌పీరియన్స్ ఇన్ ఇంటర్ స్టేట్ లివింగ్ ) ఒకటి. దీని ద్వారా ఈశాన్య భారత రాష్ట్రాల విద్యార్థులు దేశంలోని ఇతర ప్రాంతాల కుటుంబాలతో కలిసి నివసిస్తూ భిన్న సంస్కృతులు, భాషలు, సంప్రదాయాలను ప్రత్యక్షంగా అనుభవించే అవకాశం పొందారు. ఇది కేవలం పరిచయ కార్యక్రమం కాకుండా భావోద్వేగపూర్వక జాతీయ ఐక్యతకు ఒక వేదికగా నిలిచింది. ప్రత్యేక తెలంగాణ అంశంపై 1998లో తీర్మానం చేయడం, 2001లో ‘తెలంగాణ సస్యశ్యామల యాత్ర’ నిర్వహించడం, మలిదశ ఉద్యమ సమయంలో విద్యార్థులను సంఘటితం చేయడం వంటి కార్యక్రమాలు కూడా చేపట్టింది.
కాలం మారుతున్న కొద్దీ విద్యార్థి ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లు మారుతున్నాయి. ప్రపంచీకరణ, సాంకేతిక విప్లవం, కృత్రిమ మేధస్సు, పర్యావరణ మార్పులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఏబీవీపీ తన కార్యక్రమాలను విస్తరించింది. అలాగే ‘ఖేలో భారత్’ ద్వారా క్రీడాస్ఫూర్తిని, ‘రాష్ట్రీయ కళా మంచ్’ ద్వారా భారతీయ కళా సంస్కృతిని, ‘స్టూడెంట్స్ ఫర్ డెవలప్‌మెంట్’ ద్వారా పర్యావరణ బాధ్యతను, ‘స్టూడెంట్స్ ఫర్ సేవ’ ద్వారా సేవా భావాన్ని ప్రోత్సహిస్తోంది. మెడివిజన్, అగ్రివిజన్, టెక్నికల్ సెల్, లా సెల్, పరిశోధన, విద్యా విధానాలపై చర్చలు, నైపుణ్యాభివృద్ధి వంటి రంగాల్లో తన కార్యకలాపాలను విస్తరించింది. యువ శక్తిని జాతీయ పునర్నిర్మాణ దిశగా నడిపించే ఈ ప్రయాణాన్ని ఏబీవీపీ నిరంతరం కొనసాగిస్తోంది.
– రావుల కృష్ణ, ఏబీవీపీ తెలంగాణ అధ్యక్షుడు, (నేడు ఏబీవీపీ ఆవిర్భవించిన రోజు)


