లక్షన్నర ఇచ్చి మొదలుపెట్టారు! | Bhaskara Sharma Remember YS Rajasekhara reddy on his Birth Anniversary | Sakshi
Sakshi News home page

లక్షన్నర ఇచ్చి మొదలుపెట్టారు!

Jul 8 2026 1:01 PM | Updated on Jul 8 2026 1:13 PM

Bhaskara Sharma Remember YS Rajasekhara reddy on his Birth Anniversary

2004 జూలై 8 నాడు వైఎస్సార్‌తో వ్యాసకర్త

2004 జూలై 8.
ఆ రోజున అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి స్వయంగా లక్షన్నర రూపాయలను చెక్కు ద్వారా ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మోహన్‌ కందాకి సమర్పించారు. ఇందులో దురుద్దేశం లేదు, దురాశా లేదు. ‘ఒక మంచి కార్యం జరగాలని తాను ఆశిస్తున్నప్పుడు, అందులో అందరూ భాగస్వాములు కావాలని కోరుకుంటున్నప్పుడు నాయకుడన్నవాడు తానే ముందుండి నడిపించాలి. నడిపించటం అంటే కేవలం నినాదాలిచ్చి, ప్రకటనలిచ్చి, ‘పదండి ముందుకు’ అనటం కాదయ్యా. తానే ముందు చెయ్యివేసి, ‘ఇలా చేయండయ్యా’ అని చూపించాలి...’ అన్నారు వైఎస్‌ ఆ చెక్కు నేను తయారు చేస్తున్నప్పుడు.

2004 మేలో వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం ఏర్పడేనాటికి రాష్ట్ర ఖజానా ఖాళీగా వుంది. అంతకుముందు ఒకటి రెండు సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వం అనేకసార్లు ‘వేస్‌ అండ్‌ మీన్స్‌’ కింద ఓవర్‌ డ్రాఫ్టులు తీసుకుని ఈ వ్యవస్థని నిర్వహించాల్సి వచ్చింది. ఆ నేపథ్యంలో వైఎస్సార్‌ అధికారంలోకి వచ్చారు. పాద యాత్రలో పల్లె ప్రాంతాల్లోని పేదలు రకరకాల వ్యాధుల బారిన పడినప్పుడు, ఆర్థిక స్థోమత లేక వాళ్లు తగిన చికిత్సలు పొందలేక ప్రాణాలు కోల్పోతున్న దుఃస్థితిని చూసి ఆయన చలించిపోయారు. అధికారంలోకి రాగానే ‘మన ప్రభుత్వం’ వాళ్ల కోసం పెద్ద ఎత్తున సాయం చేయగలగాలి అనుకున్నారు. (ప్రతిపక్ష నాయకుడిగా వున్న ప్పుడు కూడా ఆయనకి నేను వ్యక్తిగత సహాయకుడిగా వున్నాను.)

అధికారంలోకి వచ్చాక, ఈ విషయం మీద ఆయన విచారిస్తే, ప్రభుత్వానికి అప్పట్లో వున్న ఒకే ఒక అవకాశం ‘ముఖ్యమంత్రి సహాయనిధి’ (సీఎంఆర్‌ఎఫ్‌). కానీ అందులో నిధులు ఖాళీ. తాను అనుకున్న దిశగా దయనీయ స్థితిలో వున్న సామాన్యులకు సహాయం అందించాలంటే, ఈ సీఎంఆర్‌ఎఫ్‌ని పటిష్ఠం చేయటమే మార్గం అనుకున్నారు. అందుకోసం ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తేనే ఈ నిధిని బలపర్చటం సులభమవుతుంది. ప్రజల్లో సంపన్నులు చాలా మంది ఉన్నారు. ‘వాళ్లని అడిగేముందు, నేను చేసి చూపిస్తేనే, వాళ్లని అడిగే నైతిక హక్కు వస్తుంది శర్మా... ఒక పని చెయ్యి. లక్షన్నర రూపాయలకి ఒక చెక్కు నేనే ఈ సీఎంఆర్‌ఎఫ్‌కి విరాళంగా ఇస్తాను. చీఫ్‌ సెక్రటరీగారికి చెప్పి, టైమ్‌ నిర్ణయించి చెప్పు నాకు’ అన్నారు.

అలాగే సీఎస్‌ మోహన్‌ కందా గారితో చెప్పి, సమయం తీసుకున్నాను. అది 2004 జూలై 8. డాక్టర్‌ వైఎస్సార్‌ లక్షన్నర రూపాయల చెక్కుని చీఫ్‌ సెక్రటరీ మోహన్‌ కందా గారికి అంద జేశారు. ఆ రోజే సీఎంఆర్‌ఎఫ్‌కి ఉదారంగా విరాళాలివ్వాలని ప్రజ లకు విజ్ఞప్తి చేశారు. ‘సీఎంని కలిసేవాళ్లు పూలగుత్తులు ఇవ్వాలను కుంటే, వాటి బదులు సీఎంఆర్‌ఎఫ్‌కి చెక్కులు ఇవ్వాలని సీఎం కోరు తున్నారు’ అని సీఎం కార్యాలయం ప్రకటించింది. పెద్ద మొత్తాల్ని ఇచ్చేవాళ్లు స్వయంగా ముఖ్యమంత్రిని కలిసి చెక్కు సమర్పించే అవకాశం కల్పిస్తామని ప్రకటించాం.

అక్కడ్నుంచి రోజూ మధ్యాహ్నం సమయంలో సీఎంని కలిసి విరాళాల చెక్కులివ్వాలని పెద్ద పెద్దవాళ్లు రావటం మొదలైంది. విరాళాలు తెచ్చేవాళ్లకి ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని సెక్రెటేరియేట్‌ సెక్యూరిటీ సిబ్బందికి ఆదేశాలు పంపించాం.

మొదటి 3–4 రోజులపాటు రోజుకి 5–10 మందే వచ్చారు. వచ్చి సీఎంకి చెక్కులిచ్చి ఫొటోలు దిగేవాళ్లు. పెద్ద మొత్తాలిచ్చిన వాళ్ల ఫొటోలు పత్రికల్లో వచ్చేవి. ఏ రోజు విరాళం ఎంత వచ్చిందో సమాచారశాఖ ద్వారా ప్రచారంలో పెట్టాం. దాంతో ఒకవారం గడిచే సరికి ఈ విరాళాలు తెచ్చేవాళ్లు వెల్లువలా రావటం మొదలైంది. రోజుకి 100–150–200... వీళ్లందరికీ విజిటర్స్‌ హాల్సు సరిపోక, సమావేశం హాలులో కూర్చోపెట్టాల్సి వచ్చింది. సీఎం స్వయంగా తనే అక్కడికి వెళ్లి విరాళాలు తీసుకోసాగారు.

పరిమితులు, అవాంతరాలు దాటి...
సీఎం క్యాంప్‌ ఆఫీసు ముందు కార్‌ పార్కింగు ఉండేది. అక్కడ సీఎంఆర్‌ఎఫ్‌ దరఖాస్తుల పరిశీలన కౌంటర్‌ ఏర్పాటు చేశారు. దారిద్య్రరేఖకి దిగువనున్న (తెల్లరేషన్‌ కార్డులేని) వాళ్లకి ఈ సహాయం కావల్సి వస్తే అక్కడికి వచ్చేవారు. సీఎంఆర్‌ఎఫ్‌ సహా యానికి రూ. 35,000 పరిమితి వుండేది. ఏవైనా న్యాయమైన కేసుల్లో సహాయం 35,000 కన్నా ఎక్కువ కావల్సివస్తే, హాస్పిటల్‌కి ఫోన్‌ చేయించి, ‘బిల్లులో రాయితీ ఇమ్మని సీఎం కోరుతున్నారు’ అని రాయితీ ఇప్పించేవారు. ఆ అవకాశం లేనిచోట (5 నుంచి 10, 15 వేల దాకా అదనంగా కావల్సివస్తోందనకున్నప్పుడు) అది తానే పి.ఎస్‌. కిరణ్‌కుమార్‌ రెడ్డి ద్వారా ఏర్పాటు చేసేవారు.

అలాంటి సమయంలోనే పుట్టుకతో హృద్రోగాలు, తదితర జన్యువ్యాధులకు గురయ్యే పిల్లల కోసం కూడా ఏదో చేయాలి అనిపించింది ముఖ్యమంత్రికి. అందుకని, ముఖ్యమంత్రి పిల్లల సహాయనిధి (సీఎంసీఆర్‌ఎఫ్‌) ప్రారంభించారు (ఈ నిధులకి ప్రభుత్వ బడ్జెట్‌ వుండదు). అయితే ఇలా సహాయనిధి కోసం దీర్ఘకాలంలో విరాళాలు సేకరించటం కష్టం అని అధికారులు సీఎంకి చెబుతూ వచ్చారు. ఆయన మొదట్లో పట్టించుకోలేదు. కానీ క్రమంగా వాళ్ల సలహాలో ఔచిత్యాన్ని గుర్తించారు. అప్పుడే కర్ణా టకలో రైతుకూలీల కోసం ఆరోగ్య బీమా నిర్వహిస్తున్న ‘నారాయణ హృదయాలయ’ సంస్థతో సంప్రదింపులు జరిపారు. రెండు మూడు సార్లు సమావేశాలు జరిగాయి.

‘నాకు ఆరోగ్య బీమా – సామాన్య ప్రజలందరి కోసం కావాలి. చేయగలరా?’ అని అడిగారు. వాళ్లు ఆలోచనలో పడ్డారు. కానీ వైఎస్‌ ఆగలేదు. ‘ఇది జరిగి తీరాలి సుబ్రహ్మణ్యం’ అన్నారు. సుబ్ర హ్మణ్యం సీఎంఓలో వైద్య ఆరోగ్యశాఖ చూస్తున్న కార్యదర్శి. అప్పటి ఆరోగ్య వైద్యశాఖ ముఖ్యకార్యదర్శి డాక్టర్‌ ఐ.వి. సుబ్బారావు ముఖ్యమంత్రి ఆరాటాన్ని అర్థం చేసుకున్నారు. బీమా కంపెనీలతో చాలా మీటింగులు సీఎం సమక్షంలో జరిపారు. అలా వైఎస్‌ పట్టు దలగా, అనేక అభ్యంతరాలు, అవాంతరాలు దాటి ప్రవేశపెట్టిన పథకమే రాజీవ్‌ ఆరోగ్యశ్రీ.

చ‌ద‌వండి: అమృతం కురిసిన రోజు

2007 ఏప్రిల్‌ నుంచి 2009 మే వరకూ ఈ పథకం కింద 15,58,828 మంది ఉచిత వైద్య పరీక్షల లబ్ధి పొందారు. వీళ్లల్లో 2,63,897 మందికి ఉచిత సర్జరీలు, ఇతర చికిత్సలు లభించాయి. 2,70,061 మంది అవుట్‌ పేషెంట్లుగా వైద్యసేవలు పొందారు. ‘ఆరోగ్యశ్రీ’ వల్ల ఉచితంగా గుండె ఆపరేషనో, కిడ్నీ ఆపరేషనో, మరో మరో ఆపరేషనో చేయించుకోగలిగి, ఆనందంగా జీవిస్తున్న ఏ ఒక్కరి ముందు వైఎస్సార్‌ పేరు ప్రస్తావించినా, రెండు చేతులూ జోడించి, నమస్కరిస్తారు. ఆ కళ్లు ఇప్పటికీ చెమరుస్తాయి.

ఒక మంచి పని కోసం ఒక్క వ్యక్తి తపన, ఆరాటం ఎంత గొప్ప వ్యవస్థని నిర్మించింది!

– టి. భాస్కర శర్మ 
ముఖ్యమంత్రికి పూర్వపు అడిషనల్‌ పి.ఎస్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement