కర్బలా: ఇరాన్ దివంగత సర్వోన్నత నేత అయతొల్లా అలీ ఖమేనీ అంతిమయాత్ర బుధవారం ఇరాక్‌కు చేరుకుంది. షియా ముస్లింల పవిత్ర నగరాలైన నజాఫ్, కర్బలాల్లో ఖమేనీకి వీడ్కోలు పలికేందుకు వేలాది మంది ప్రజలు తరలివచ్చారు. గత ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన సైనిక దాడుల్లో ఖమేనీ మరణించిన సంగతి తెలిసిందే. శనివారం ఇరాన్‌లో ప్రారంభమైన ఆరు రోజుల జాతీయ సంతాప దినాల్లో భాగంగా, ఇరు దేశాల మధ్య ఉన్న ఆధ్యాత్మిక, రాజకీయ సంబంధాలకు ప్రతీకగా ఒక రోజు అంతిమయాత్రను ఇరాక్‌లో నిర్వహించారు.
ఖమేనీ భౌతికకాయాన్ని ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ పెజెష్కియాన్, ఇరాక్ ఉన్నతాధికారులు నజాఫ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో గౌరవపూర్వకంగా స్వీకరించారు. ఈ సందర్భంగా ఇరాక్ ప్రభుత్వం బుధవారం ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. నజాఫ్‌లోని పవిత్ర ఇమామ్ అలీ దర్గా వరకు సుమారు ఆరు కిలోమీటర్ల మేర ఈ శోభాయాత్ర సాగింది. ఆపై కర్బలాలోని ఇమామ్ హుస్సేన్ దర్గాకు భౌతికకాయాన్ని తరలించారు. అమెరికా, ఇజ్రాయెల్‌లను ఎదిరించిన నేతకు నివాళులర్పించేందుకు ఇరాక్ నలుమూలల నుంచే కాక, ఇతర ప్రాంతాల నుండి కూడా పెద్ద సంఖ్యలో జనం తరలివచ్చారు. గురువారం ఇరాన్‌లోని ఖమేనీ స్వస్థలమైన మషద్ నగరంలో అంత్యక్రియలు పూర్తికానున్నాయి.


