ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్య రామ మందిర్‌లో విరాళాల గోల్‌మాల్ వ్యవహారం దుమారం రేపుతున్న వేళ బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ అయోధ్యలో స్థలం కొనుగోలుకు సంబంధించిన అంశం ఒకటి నెట్టింట తెగ హల్‌చల్ చేస్తోంది. 'హిందుస్థాన్ టైమ్స్ ఇండియా నెక్స్ట్ రియల్ ఎస్టేట్ సమిట్ 2026'లో రియల్ ఎస్టేట్ పారిశ్రామికవేత్త అభినందన్ లోధాఅమితాబ్ ల్యాండ్ డీల్ గురించిన విశేషాలను పంచుకున్నారు.
2023లో తాను ఆస్ట్రేలియాలో ఉన్నప్పుడు అమితాబ్ బచ్చన్ నుండి కొన్ని మిస్డ్‌కాల్స్, ఒక మెసేజ్ వచ్చిందని లోధా గుర్తుచేసుకున్నారు. అర్ధరాత్రి తర్వాత సుమారు తెల్లవారుజామున 3 గంటల సమయంలో 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' (HoABL) వ్యవస్థాపకుడు, ఛైర్మన్ అభినందన్ లోధాకు అమితాబ్ స్వయంగా ఫోన్ చేశారట. స్థలం ధర తెలుసుకున్న మరుసటి రోజే రూ. 15 కోట్లు డీల్ ఒకే చేయడంతోపాటు, సంబంధిత సొమ్మను బదిలీ చేశారని లోధా వెల్లడించారు.
"కొన్ని మిస్డ్‌కాల్స్ తర్వాత, 'నేను అమితాబ్ బచ్చన్‌ను, మీకు వీలైనప్పుడు తిరిగి కాల్ చేయండి' అని ఒక మెసేజ్ వచ్చింది. దీంతో వెంటనే ఆయనకు తిరిగి కాల్ చేసానని లోధా చెప్పారు. ఈ సందర్బంగా తమ సంభాషణను గుర్తుచేసుకుంటూ.. ‘‘అభినందన్ జీ, నేను ఉత్తరప్రదేశ్ వాసిని, నాకు పవిత్ర అయోధ్య నగరంలో స్థలం కావాలి" అని బచ్చన్ తనతో చెప్పినట్లు లోధా పేర్కొన్నారు. అమితాబ్ మొదట స్థలం ధర ఎంత అని అడిగి, తనకు 15,000 చదరపు అడుగుల స్థలం కావాలని అడిగారని లోధా చెప్పారు. కి సుమారు రూ. 15 కోట్లు కావచ్చని తాను చెప్పగా, మరుసటి రోజే ఆయన రూ. 15 కోట్లు పంపించారన్నారు.
బాలీవుడ్‌లో బిగ్‌బీ పేరుగాంచిన అమితాబ్ బచ్చన్ గత కొన్నేళ్లుగా ప్రముఖ ఆధ్యాత్మిక నగరం అయోధ్యలో అమితాబ్ ఇప్పటికే పలు పెట్టుబడులు పెట్టారు. ఒక్క లోధా ప్రాజెక్ట్‌ల్లో మూడు చోట్ల, మొత్తంగా అయోధ్యలో నాలుగు చోట్ల పెట్టుబడులు పెట్టారు.
మార్చి 2026 పెట్టుబడి: 'ది హౌస్ ఆఫ్ అభినందన్ లోధా' సంస్థ నుండి అమితాబ్ బచ్చన్ రూ. 35 కోట్ల విలువైన 2.67 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. అయోధ్యలో ఆయనకు ఇది మూడవ పెట్టుబడి కాగా, HoABL సంస్థతో నాలుగవ ప్లాట్ కొనుగోలు. ఈ స్థలం కంపెనీకి చెందిన 75 ఎకరాల భారీ ప్రాజెక్ట్ 'ది సరయు' (The Sarayu) సమీపంలో ఉంది.
2025,మే : 'ది సరయు' ప్రాజెక్ట్‌కు ఆనుకుని ఉన్న 25,000 చదరపు అడుగుల ప్లాట్‌ను అమితాబ్ బచ్చన్ దాదాపు రూ. 40 కోట్లకు కొనుగోలు చేశారు.
2024లో : అంతకుముందు 2024లో, HoABL కి చెందిన ఫ్లాగ్‌షిప్ మిక్స్డ్-యూజ్ డెవలప్‌మెంట్ ప్రాజెక్ట్ 'ది సరయు'లో 10,000 చదరపు అడుగుల ప్లాట్‌ను రూ. 14.5 కోట్లకు కొనుగోలు చేశారు.
ఇదీ చదవండి: కేతన్ హత్యకు నాలుగు నెలలముందే.. సీక్రెట్ మ్యారేజ్
ఈ పెట్టుబడులపై అభినందన్ లోధా స్పందిస్తూ.. భూమి తరతరాల ఆస్తి, అది దీర్ఘకాలంలో విలువను మరింత పెంచుతుందనే నమ్మకానికి బచ్చన్ పెట్టుబడులే నిదర్శనమని పేర్కొన్నారు. అయోధ్యలో మౌలిక సదుపాయాల అభివృద్ధి, ప్రభుత్వ పెట్టుబడుల మద్దతు కారణంగా, ఇది దీర్ఘకాలిక పెట్టుబడులకు అద్భుత మైన గమ్యస్థానంగా మారుతోందన్నారు.
ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్


