17 నుంచి తొలి హైడ్రోజన్ రైలు పరుగులు | Indias First Hydrogen Powered Train to Be Flagged Off on July 17 | Sakshi
Sakshi News home page

17 నుంచి తొలి హైడ్రోజన్ రైలు పరుగులు

Jul 7 2026 8:37 AM | Updated on Jul 7 2026 8:43 AM

Indias First Hydrogen Powered Train to Be Flagged Off on July 17

న్యూఢిల్లీ: దేశంలో సరికొత్త హరిత విప్లవానికి భారతీయ రైల్వే శ్రీకారం చుట్టబోతోంది. పర్యావరణహిత రవాణా వ్యవస్థను ప్రోత్సహించే లక్ష్యంతో దేశంలోనే తొలి హైడ్రోజన్ ఆధారిత రైలును ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 17న ప్రారంభించనున్నారు.

హర్యానాలోని జింద్ - సోనిపట్ మధ్య దాదాపు 90 కిలోమీటర్ల దూరంలో ఈ రైలు నడవనుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న డీజిల్ మల్టిపుల్ యూనిట్ (డీఎంయూ) రైలు ఈ ప్రయాణానికి రెండు గంటల సమయం తీసుకోగా, ఈ సరికొత్త హైడ్రోజన్ రైలు కేవలం ఒక్క గంటలోనే గమ్యస్థానానికి చేరుస్తుంది. ‘మేక్ ఇన్ ఇండియా’, హరిత రవాణా మిషన్‌లో భాగంగా చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ఐసీఎఫ్‌)లో రూ. 89 కోట్ల అంచనా వ్యయంతో దీనిని రూపకల్పన చేశారు.

ఈ రైలులో 1,200 కిలోవాట్ల హైడ్రోజన్ ఫ్యూయల్ సెల్ ప్రొపల్షన్ సిస్టమ్‌ను అమర్చారు. హైడ్రోజన్, ఆక్సిజన్ల రసాయన ప్రక్రియ ద్వారా విద్యుత్‌ను ఉత్పత్తి చేసి ఈ రైలును నడుపుతారు. దీనివల్ల పొగకు బదులు కేవలం నీటి ఆవిరి, వేడి మాత్రమే వెలువడుతుంది. ఒక్కసారి హైడ్రోజన్ నింపితే దాదాపు 250 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు.

ఈ రైలులో సుమారు 2,500 మంది ప్రయాణించవచ్చు. టికెట్ ధరలను సామాన్యులకు అందుబాటులో ఉంచుతూ రూ. 5 నుంచి రూ. 25 మధ్య ఉండేలా నిర్ణయించారు. ప్రయాణికుల భద్రత కోసం లీకేజీ డిటెక్టర్లు, ఫైర్ డిటెక్టర్లు సహా 27 హైడ్రోజన్ సిలిండర్లను ఆర్డీఎస్ఓ పర్యవేక్షణలో ఏర్పాటు చేశారు. ఈ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతమైతే, భవిష్యత్తులో మరిన్ని రూట్లలో వీటిని ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ భావిస్తోంది.

ఇది కూడా చదవండి: వణికిస్తున్న వర్షాలు: పలు రాష్ట్రాల్లో వరద భీభత్సం

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement