ధర్మశాల: హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో ఉంటున్న 14వ దలైలామా జీవిత విశేషాలు, భారత్‌తో ఆయనకున్న అనుబంధంపై ‘ఎటర్నల్ లైట్: ది లైఫ్ అండ్ లెగసీ ఆఫ్ హిస్ హోలీనెస్ ది ఫోర్టీన్త్ దలైలామా’ అనే కొత్త పుస్తకం విడుదలైంది. టిబెట్‌లో చైనా నియంత్రణ పెరగడంతో, దలైలామా 1959లో లహాసా నుండి తప్పించుకుని భారత సరిహద్దుకు చేరుకున్నారు. ఆ సమయంలో భారత ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ఆయనకు ఆశ్రయం కల్పించడమే కాకుండా, ముస్సోరీలో ఆయనను కలుసుకుని టిబెట్ శరణార్థుల పునరావాసం, వారి పిల్లల విద్య కోసం పాఠశాలల ఏర్పాటుకు అవసరమైన సహాయాన్ని అందించారు.
ఈ నిర్ణయం చైనాతో దౌత్యపరమైన సవాళ్లను తెచ్చిపెట్టినప్పటికీ, భారత్‌లో టిబెట్ ప్రవాస ప్రభుత్వ ఏర్పాటుకు పునాది వేసింది. ఈ బయోగ్రఫీలో నెహ్రూ కుమార్తెగా, ఆ తర్వాత దేశ ప్రధానిగా ఇందిరా గాంధీకి దలైలామాతో ఉన్న అనుబంధాన్ని కూడా ప్రస్తావించించారు. టిబెట్ సంక్షోభాన్ని నెహ్రూ కాలం నుండి దగ్గరగా చూసిన ఇందిరా గాంధీ, ఈ సమస్యను కేవలం ఒక సాధారణ దౌత్య విషయంగా కాకుండా నైతిక, వ్యూహాత్మక బాధ్యతగా భావించారు. ఆమె ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో చైనాతో ఉన్న క్లిష్టమైన సంబంధాలను సమతుల్యం చేస్తూనే, టిబెట్ ప్రజల విషయంలో మానవతా దృక్పథాన్ని కొనసాగించారు.
ఇందిర హయాంలోనే ధర్మశాల టిబెట్ శరణార్థుల జీవన కేంద్రంగా రూపాంతరం చెందింది. దయ, దౌత్యం, శరణార్థుల పునరావాసాల కలయికతో ఆమె దలైలామాతో సంబంధాలను కొనసాగించారు. ఆ తర్వాత 1980ల నాటికి రాజీవ్ గాంధీ ప్రధాని అయ్యే సమయానికి, దలైలామా ఉనికి భారతదేశ నైతిక, దౌత్యపరమైన ముఖచిత్రంలో ఒక భాగంగా మారిపోయింది. భారత్ తన టిబెట్ విధానంలో సంయమనాన్ని ప్రదర్శించింది. ఈ పుస్తకంలో భారత్‌లో దలైలామా జీవితాన్ని కేవలం శరణార్థిగా కాకుండా రాజకీయాలు, జ్ఞాపకాలు, కరుణ, వ్యూహాత్మక సంయమనంతో కూడిన సుదీర్ఘ ప్రయాణంగా అభివర్ణించింది. కష్టకాలంలో తలుపులు తెరిచి ఆశ్రయమిచ్చిన ఒక దేశం, కఠిన నిర్ణయాలు తీసుకున్న నేతలు, వారి వెనుక నిర్మితమైన ఒక సమాజానికి ఈ పుస్తకం ఒక సజీవ సాక్ష్యంగా నిలుస్తుంది.


