శ్రీనగర్: జమ్ముకశ్మీర్‌లోని కిష్త్వార్, దోడా జిల్లాల్లో భారీ వర్షాల కారణంగా హఠాత్తుగా వరదలు రావడానికి తోడు కొండచరియలు విరిగిపడ్డాయి. కిష్త్వార్‌లోని 540 మెగావాట్ల క్వార్ హైడ్రోఎలక్ట్రిక్ పవర్ ప్రాజెక్ట్ సమీపంలో సోమవారం ఉదయం ఒక భారీ కొండచరియ విరిగిపడటంతో అక్కడి రహదారిపై వెళ్తున్న, నిలిపి ఉంచిన పలు వాహనాలు ధ్వంసమయ్యాయి. భారీ యంత్రాలతో రంగంలోకి దిగిన సహాయక సిబ్బంది శిథిలాలను తొలగించి, వాహనాలను వెలికితీసేందుకు చర్యలు చేపడుతున్నారు.
మరోవైపు దోడా జిల్లాలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా పౌరజీవనం అస్తవ్యస్తమైంది. దోడా జిల్లా ప్రేమ్ నగర్ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడటంతో దోడా-కిష్త్వార్ రహదారిని సోమవారం ఉదయం అధికారులు పూర్తిగా మూసివేశారు. రహదారిపై భారీ బండరాళ్లు, బురద పేరుకుపోవడంతో రవాణా పూర్తిగా నిలిచిపోయింది. దీంతో ప్రయాణికుల రాకపోకలతో పాటు అత్యవసర వస్తువుల రవాణాకు తీవ్ర అంతరాయం కలిగింది. సంబంధిత శాఖల యంత్రాంగం యుద్ధప్రాతిపదికన రహదారిని పునరుద్ధరించే పనుల్లో నిమగ్నమైంది.
కొండ ప్రాంతాల్లో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడం, నీరు నిలిచిపోవడం లాంటి సమస్యలతో స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటివరకు ఎలాంటి ప్రాణనష్టం సంభవించినట్లు తెలియరాలేదు. పరిపాలనా యంత్రాంగం హై అలర్ట్ ప్రకటించింది. వాతావరణ పరిస్థితులు మెరుగుపడి, రోడ్ల మరమ్మతులు పూర్తయ్యే వరకూ అనవసర ప్రయాణాలు చేయవద్దని, తాజా వాతావరణ హెచ్చరికలను గమనించాలని అధికారులు స్థానికులకు, ప్రయాణికులకు సూచించారు.
ఇది కూడా చదవండి: ముంబైలో వర్ష బీభత్సం: ఆరుగురు మృతి


