మణిపూర్‌లో మళ్లీ హింస: సరిహద్దు గ్రామాలకు నిప్పు | Manipur Kuki Naga Villages Torched Along Indo Myanmar Border | Sakshi
Sakshi News home page

మణిపూర్‌లో మళ్లీ హింస: సరిహద్దు గ్రామాలకు నిప్పు

Jul 2 2026 12:57 PM | Updated on Jul 2 2026 1:03 PM

Manipur Kuki Naga Villages Torched Along Indo Myanmar Border

కామ్‌జోంగ్: మణిపూర్‌లోని కామ్‌జోంగ్ జిల్లా పరిధిలో గల భారత్-మయన్మార్ సరిహద్దు ప్రాంతంలో మళ్లీ హింస చెలరేగింది. కుకీ, నాగా సామాజిక వర్గాలకు చెందిన పలు సరిహద్దు గ్రామాలు అగ్నికి ఆహుతవడంతో ఈ రెండు వర్గాలు ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ తాజా ఘర్షణల్లో కుకీ వర్గానికి చెందిన ఫైమోల్ గ్రామంతో పాటు, తంగ్ఖుల్ నాగా వర్గానికి చెందిన కొంగ్కాన్ థానా, షాంగ్కలోక్ గ్రామాలలోని పలు ఇళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి.

కుకీ ఇన్పి మణిపూర్ (కేఐఎం) సంస్థ ఆరోపణల ప్రకారం.. మయన్మార్‌కు చెందిన షాన్ని నేషనాలిటీస్ ఆర్మీ (ఎస్‌ఎన్‌ఏ) సభ్యులతో కలిసి ఎన్‌ఎస్‌సీఎన్‌-ఐఎం క్యాడర్లు బుధవారం తెల్లవారుజామున అంతర్జాతీయ సరిహద్దు దాటి వచ్చి ఫైమోల్ గ్రామంపై దాడి చేసి నిప్పు పెట్టారు. అసోం రైఫిల్స్ సిబ్బంది ఈ ప్రాంతం నుండి ఉపసంహరించుకున్న మరుసటి రోజే ఈ దాడి జరగడంపై వారు భద్రతా లోపాలను లేవనెత్తారు. మరోవైపు, నాగా గ్రామ అధికారులు ఈ వాదనను తోసిపుచ్చారు. కుకీ నేషనల్ ఆర్మీ-బి క్యాడర్లతో కూడిన సాయుధ ముఠాలే కొంగ్కాన్ థానా, షాంగ్కలోక్ గ్రామాల్లోని ఇళ్లను తగులబెట్టాయని వారు ఆరోపించారు.

ఈ దాడులు దాదాపు ఒకే సమయంలో జరిగాయని, ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలను పెంచేందుకే కుకీ ఉగ్రవాద గ్రూపులు ఈ చర్యకు పాల్పడ్డాయని నాగా సంస్థలు ఆరోపించాయి. పౌర గ్రామాలపై దాడులు చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, తగినంత మంది భద్రతా సిబ్బందిని మోహరించి శాంతిభద్రతలను పునరుద్ధరించాలని నాగా గ్రామ అధికారులు కోరారు. మరింత హింస చెలరేగకుండా నిరోధించడానికి సున్నితమైన సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తున్న పౌరుల భద్రతకు తక్షణ చర్యలు చేపట్టాలని కుకీ, నాగా గ్రూపులు రెండూ కేంద్ర, మణిపూర్ ప్రభుత్వాలను,  భద్రతా సంస్థలను అభ్యర్థించాయి.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement