ప్రతిరోజూ ఓ మల్టీవిటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడం వృద్ధాప్యాన్ని కాస్తంత ఆలస్యం చేస్తుందని హార్వర్డ్ పరిశోధకులు నిర్వహించిన ఓ పరిశోధనలో తేలింది. ఈ పరిశోధన వివరాలు ఇలా ఉన్నాయి. మన దేహం తాలూకు వయసు (బయలాజికల్ ఏజ్), మన క్యాలెండర్ వయస్సు కంటే కాస్త వేరుగా ఉండవచ్చు. అంటే ఉదాహరణకు ఒక వ్యక్తికి 70 ఏళ్లు అనుకుందాం. అయితే అతని శరీరంలోని కణాలు అంతకంటే తక్కువ వయసున్నవిగా లేదా ఎక్కువ వయసున్నవిగా ప్రవర్తించవచ్చు.
శరీరం ఎంత వేగంగా వృద్ధాప్యానికి దగ్గరవుతోందో అంచనా వేయడానికి శాస్త్రవేత్తలు ఎపిజెనెటిక్ క్లాక్స్ అనే పద్ధతులను ఉపయోగిస్తారు. ఇవి కాలక్రమేణా డీఎన్‌ఏలో చోటుచేసుకునే చిన్న చిన్న మార్పులను పరిశీలిస్తాయి. ముఖ్యంగా, జన్యువులు ఎలా పనిచేయాలో నియంత్రించే ఈ డీఎన్‌ఏలోని కొన్ని ప్రాంతాల్లో జరిగే డీఎన్‌ఏ మిథిలేషన్ మార్పులను ఇవి కొలుస్తాయి. అంతేకాదు, ఒక వ్యక్తి ఎంత వేగంగా వృద్ధాప్యానికి లోనవుతున్నాడో, అలాగే మరణానికి చేరువయ్యే ముప్పు ఎంత ఉందో అంచనా వేయడానికి కూడా ఇవి ఉపయోగపడతాయి. ఈ అధ్యయనంలో మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వృద్ధాప్య ప్రక్రియ కొంత నెమ్మదించినట్లు కనిపించింది.
మొత్తంగా చూస్తే, రెండేళ్ల కాలం పాటు మల్టీవిటమిన్ తీసుకున్నవారిలో వారి అసలు వయసు కంటే వారి బయాలజికల్ వయసు నాలుగు నెలల మేర తక్కువగా ఉన్నట్లు తేలింది. ఈ పరిశోధనల ఫలితాలు ‘నేచర్ మెడిసిన్’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఈ అధ్యయనం ఆధారంగా ఎవరికి వారు మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ తీసుకోవడమూ అంత సరికాదు. తమ డాక్టర్‌ను సంప్రదించాకే దీనిపై నిర్ణయం తీసుకోవడం మంచిందంటున్నారు నిపుణులు.
యాసిన్
(చదవండి: ఎర్రమట్టితో ముఖానికి మెరుపు..!)


