జార్ఖండ్‌లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి! | Jharkhand students demand CM Hemant Sorens resignation, intensify protest | Sakshi
Sakshi News home page

జార్ఖండ్‌లో విద్యార్థుల రణరంగం: 20న సీఎం నివాసం ముట్టడి!

Aug 16 2026 7:56 AM | Updated on Aug 16 2026 7:56 AM

Jharkhand students demand CM Hemant Sorens resignation, intensify protest

రాంచీ: జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ , జేఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, విద్యార్థులు చేపట్టిన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. నిరసనలు శనివారంతో 23వ రోజుకు చేరుకోగా, ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అధికార జేఎంఎం, కాంగ్రెస్ కూటమి తమ భవిష్యత్తుతో చెలగాటమాడుతున్నాయని ఆరోపిస్తూ, తమ డిమాండ్లు నెరవేరకపోతే ఆగస్టు 20న ముఖ్యమంత్రి నివాసాన్ని ముట్టడిస్తామని హెచ్చరించాయి.

ఈ నిరసనల్లో భాగంగా ఆగస్టు 16న జార్ఖండ్‌లోని మొత్తం 24 జిల్లా కేంద్రాల్లో సీఎం సోరెన్, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీల దిష్టిబొమ్మలను దహనం చేయాలని విద్యార్థి నాయకులు పిలుపునిచ్చారు. జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల మంచ్ నాయకుడు రవీంద్ర పాశ్వాన్ మాట్లాడుతూ ‘మేము సీఎం రాజీనామాను కోరుతున్నాం. ముఖ్యమంత్రి స్పందించకపోతే, రాహుల్ గాంధీ జేఎంఎం కూటమి నుంచి మద్దతు ఉపసంహరించుకోవాలి’ అని డిమాండ్ చేశారు. ఇటీవల అసెంబ్లీ వద్ద ఆందోళన చేసిన విద్యార్థులపై పోలీసులు లాఠీచార్జి చేయడం, టియర్ గ్యాస్ ప్రయోగించడం ఉద్రిక్తతలకు దారితీసింది.

మరోవైపు, రాష్ట్ర ప్రభుత్వం 14వ జేపీఎస్‌సీ ప్రిలిమ్స్ సహా మూడు పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు కోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ను రంగంలోకి దించుతామని తెలిపింది. అయితే, కేసును సీబీఐకి బదిలీ చేయాలన్న విద్యార్థుల డిమాండ్‌ను మాత్రం ప్రభుత్వం అంగీకరించలేదు. సీఐడీ దర్యాప్తులో భాగంగా జేపీఎస్‌సీ మాజీ చీఫ్ ఎల్. ఖియాంగ్టెను పోలీసులు అరెస్టు చేశారు.

ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ మాట్లాడుతూ, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని విద్యార్థులకు విజ్ఞప్తి చేశారు. పారదర్శకమైన పరీక్షా విధానాన్ని రూపొందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, విద్యార్థుల ఆందోళనలను ప్రభుత్వం గౌరవిస్తుందని ఆయన పేర్కొన్నారు. కొందరు ప్రతిపక్ష నేతలు రాజకీయ లబ్ధి కోసం అమాయక విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, వారి ప్రలోభాలకు లోనుకావొద్దని సోరెన్ సూచించారు.

ఇది కూడా చదవండి: ప్రమాదంలో ‘జెన్‌ జీ’: పార్టీలు, విహారయాత్రలకు భారీగా అప్పులు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement