కాంగ్రెస్ ప్రేమ దుకాణం తెరిచింది
ఇందిరా భవన్ స్వాతంత్య్ర వేడుకల్లో ఖర్గే
న్యూఢిల్లీ: దేశంలో బీజేపీ–ఆర్‌ఎస్‌ఎస్‌లు విద్వేషాన్ని వ్యాప్తి చేస్తూ ప్రజల మధ్య విభేదాలను పెంచుతూ శాంతికి విఘాతం కలిగిస్తున్నాయని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఇటువంటి పరిస్థితుల్లో సమాజంలో శాంతి, ఐక్యతలను పెంపొందించేందుకు తమ పార్టీ ప్రేమ దుకాణం తెరిచిందని చెప్పారు. శనివారం ఢిల్లీలో కాంగ్రెస్ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్‌లో జరిగిన స్వాతంత్య్ర వేడుకల్లో జాతీయ పతాకాన్ని ఖర్గే ఆవిష్కరించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్ సోనియా గాం«దీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాం«దీ, పలువురు సీనియర్ నేతలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఖర్గే ప్రసంగించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వాలు తీసుకువచ్చిన పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలకు పేర్లు మారుస్తూ వాటిని ప్రధాని మోదీ తమ ఘనతగా ప్రచారం చేసుకుంటున్నారని ఆరోపించారు. ఇలాగే కొనసాగితే, మున్ముందు మోదీ మన జాతీయ జెండాను సైతం ఎగురవేయబోరంటూ ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తూ ఈ ప్రపంచాన్ని తానే సృష్టించానంటూ మోదీ చెప్పుకోలేదని వ్యాఖ్యానించారు. ఎవరైనా సలహా ఇచ్చి ఈ ప్రపంచాన్ని తానే రక్షించానంటూ చెప్పుకునే ఉండేవారన్నారు.
అది మోదీ ఏర్పాటు చేసిన ట్రస్ట్
అయోధ్య రామమందిరంలో విరాళాల చోరీ ఆరోపణల అంశాన్ని ఖర్గే ఈ సందర్భంగా ప్రస్తావించారు. పేద ప్రజలు భక్తితో ఇచ్చిన రూ. 50 విరాళానికి కూడా భద్రత లేకుండా పోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. విరాళాల దొంగతనానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ‘తన ఘనతగా చెప్పుకునేందుకే ప్రధాని మోదీ రామాలయ ట్రస్ట్‌ను ఏర్పాటు చేసి, అందులోకి సొంతవాళ్లను నియమించుకున్నారు.
సాధుసంతులతో పనిలేకుండా ఒంటరిగా ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నిజంగాదేశభక్తుడే అయితే ఆధ్యాతి్మకవేత్తలను, రామభక్తులను కలుపుకుని ఈ కార్యక్రమం పూర్తి చేసేవారు’అని ఖర్గే వ్యాఖ్యానించారు. ప్రచారం కోసం ఎంతకైనా తెగించే ఇలాంటి ధోరణి వల్ల, భవిష్యత్తులో మోదీ జాతీయ జెండాను కూడా కిందకు దింపేందుకు ప్రయత్నించే ప్రమాదం ఉంది’అని ఆయన వ్యాఖ్యానించారు.
నిరసన రాజ్యాంగ హక్కు
స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకో వడం అంటే ఆనాటి యోధులు కలలుగన్న దేశాన్ని సాకారం చేసే క్రమంలో ఆత్మ విమర్శ చేసుకునేందుకు వచ్చిన ఓ అవకాశమని ఖర్గే చెప్పారు. జవహర్ లాల్ నెహ్రూ, ఇందిర, లాల్ బహదూర్ శాస్త్రి, రాజీవ్, మన్మోహన్ వంటి కాంగ్రెస్ ప్రధానులు తమ హయాంలోని సవాళ్లకు అనుగుణంగా దేశాన్ని ముందుకు నడిపారని, భవిష్యత్ భారత్‌కు బలమైన పునాది వేశారని ఖర్గే అన్నారు. నేటి యువత ఆశలను ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు.
ప్రభుత్వ విధానాలతో యువత తీవ్ర నిరాశకు గురై దేశవ్యాప్తంగా ఆందోళన బాట పట్టారని పేర్కొన్నారు. వారికి కాంగ్రెస్ అండగా నిలుస్తుందని స్పష్టం చేశారు. పౌరులకు శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం కల్పించిందని, హక్కుల కోసం వీధుల్లోకి వచ్చి పోరాడటం ఎంతమాత్రం దేశద్రోహం కాదని ఖర్గే స్పష్టం చేశారు. హక్కుల కోసం గొంతు విప్పుతున్న నేటి యువతను దేశద్రోహులుగా చిత్రీకరించవద్దని, స్వాతంత్య్ర పోరాటంతో సాధించిన హక్కులను కాపాడుకోవడం మనందరి బాధ్యత అని ఆయన పిలుపునిచ్చారు.


