కోటి మందికి ఏఐ నైపుణ్యాల్లో శిక్షణ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటన
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే కోటి మంది యువతకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. అందుకే వివిధ పరీక్షలకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించబోతున్నట్లు తెలిపారు.
పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపించడం తల్లిదండ్రులకు నేడు ఒక ప్రతిష్టగా మారిపోయిందని గుర్తుచేశారు. కోచింగ్‌పై వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఉచిత ఆన్‌లైన్ శిక్షణతో ఆదా చేసుకోవచ్చని, పిల్లలకు దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని అన్నారు. మనకు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వనరులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు.


