breaking news
Independence Day 2026
-
వంతారా నుంచి గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలు
భారతదేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. గుజరాత్ అటవీ శాఖ వన్యప్రాణి సంరక్షణ కార్యక్రమాన్ని చేపట్టింది. గ్రీన్స్ జూలాజికల్ రెస్క్యూ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ (GZRRC), వంతారా సహకారంతో కచ్‌లోని బన్ని గడ్డి భూముల్లోకి 20 కృష్ణజింకలను తిరిగి సహజ వాతావరణంలోకి విడుదల చేశారు. ఇందులో 5 మగ కృష్ణజింకలు, 15 ఆడ కృష్ణజింకలు ఉన్నాయి. వీటిని జామ్‌నగర్‌లోని వంతారా నుంచి బన్నికి తరలించారు.ఈ కృష్ణజింకలను అడవిలోకి వదిలిపెట్టడానికి ముందు.. వాటికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, కొంతకాలం క్వారంటైన్లో ఉంచారు. వ్యాధుల విషయంలో పర్యవేక్షణ చేసిన తర్వాత ప్రత్యేక జాగ్రత్తలతో బన్నికి తరలించారు. ఇందుకోసం సెంట్రల్ జూ అథారిటీ, గుజరాత్ చీఫ్ వైల్డ్‌లైఫ్ వార్డెన్ నుంచి అవసరమైన అనుమతులు కూడా తీసుకున్నారు.బన్ని గడ్డి భూముల్లో గతంలో కృష్ణజింకలతో పాటు చింకారా, నీలగాయలు, అడవి పందులు వంటి జంతువులు పెద్ద సంఖ్యలో ఉండేవి. ఇప్పుడు కృష్ణజింకలను తిరిగి ప్రవేశపెట్టడం వల్ల అక్కడి సహజ ఆహార గొలుసు మరింత బలపడుతుందని అధికారులు భావిస్తున్నారు. అంతే కాకుండా.. గడ్డి భూముల జీవవైవిధ్యం, పర్యావరణ సమతుల్యత కూడా మెరుగుపడే అవకాశం ఉంది. View this post on Instagram A post shared by Vantara (@vantara) -
అణచి వేయడానికే ‘దిమాగీ’ మాట
న్యూఢిల్లీ: దేశంలో దిమాగీ నక్సలైట్లు అశాంతి, అరాచకాలకు సృష్టించడానికి కుట్రలు సాగిస్తున్నారంటూ ప్రధాని మోదీ చేసిన ఆరోపణలపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. అసమ్మతిని అణచివేయడానికే ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డాయి. నక్సలిజాన్ని తమ పార్టీ వ్యతిరేకిస్తున్నప్పటికీ, మావోయిస్టుల విషయంలో మోదీ ప్రభుత్వం చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి ఎం.ఎ.బేబీ ఆరోపించారు. దిమాగీ నక్సలైట్లుఅంటూ ప్రధానమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రతిపక్షాన్ని లక్ష్యంగా చేసుకునే ప్రయత్నమేనని విమర్శించారు. ప్రతిపక్షంలో ఉన్నవారిని దేశద్రోహులుగా ముద్ర వేయడం, పాకిస్తాన్‌కు వెళ్లాలని అనడం ప్రభుత్వ పెద్దలకు అలవాటుగా మారిందని ధ్వజమెత్తారు. అరెస్టయిన మావోయిస్టుల పట్ల మోదీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు ఉగ్రవాద చర్యలను తలపిస్తోందని ఆరోపించారు. కొందరిపై చట్టపరమైన విచారణ జరపకుండా, కస్టడీలోనే కాల్చి చంపారని ఆగ్రహం వ్యక్తంచేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున కూడా మోదీ అసమ్మతివాదులను టార్గెట్ చేశారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా ఆక్షేపించరు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కళంకం వేయడానికి దిమాగీ నక్సల్స్ అనే పదాన్ని వాడుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారో మర్చిపోయి, అసమ్మతివాదులను లక్ష్యంగా చేసుకోవడానికి సమయం, అవకాశం వెతుక్కుంటున్నారని రాజా తప్పుపట్టారు. ఇది కేవలం భిన్నాభిప్రాయాలను అణచివేయడానికి, ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిని భయపెట్టడానికి చేసే ప్రయత్నం మాత్రమేనని తేల్చిచెప్పారు. విద్య, ఉపాధికి సంబంధించి విద్యార్థులు, యువత లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరించాలని ప్రధాన మోదీకి డి.రాజా సూచించారు. రాజకీయ శాస్త్రంలో మోదీ ‘ఎంఏ’ ‘‘స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ తన ప్రత్యర్థులను దిమాగీ నక్సల్స్ అని పిలుస్తూ చౌకబారు విమర్శలు చేయడం సిగ్గుచేటు. విమర్శకులను లక్ష్యంగా చేసుకోవడానికి స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఉపయోగించుకోవడం సరైంది కాదు. మోదీ ఇకనైనా అహంకారం వదిలించుకోవాలి’’ అని తృణమూల్ కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ సాకేత్ గోఖలే ‘ఎక్స్’లో పోస్టుచేశారు. ‘‘ప్రధానమంత్రి మొదట తన ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అని విమర్శించారు. ఇప్పుడు వారిని దిమాగీ నక్సల్స్ అని పిలుస్తున్నారు. ఇది మోదీ నిస్సహాయతకు స్పష్టమైన సంకేతం. ఇతరులపై నిందలు వేయడంతో మోదీ ఆరితేరిపోయారు. మొత్తం రాజకీయ శాస్త్రంలోనే ఆయన మాస్టర్ అబ్యూజర్(ఎంఏ). కాబట్టి ప్రధానమంత్రికి ఎంఏ డిగ్రీ ఉండటంలో ఆశ్చర్యం లేదు’’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేష్ ‘ఎక్స్’లో తేల్చిచెప్పారు. -
పూర్తి వందేమాతరం సోనియా వద్దన్నారు
న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ చేపట్టిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుక సందర్భంగా వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై ఆ పార్టీ అగ్ర నేత సోనియా గాంధీ అభ్యంతరం తెలిపారని శనివారం బీజేపీ ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఓ వీడియోను బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి(సంస్థాగత)బీఎల్ సంతోష్ ఎక్స్‌లో షేర్ చేశారు. ‘తల్లి(సోనియాగాం«దీ), కుమారుడు(రాహుల్ గాం«దీ), కాంగ్రెస్ పార్టీ చీఫ్ ఖర్గే వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై నిరాశ చెందినట్లు కనిపిస్తున్నారు’అంటూ సంతోష్ వ్యాఖ్యానించారు. ఇలాంటి కొందరి మనస్తత్వాలు స్వాతంత్య్రానికి పూర్వం, స్వాతంత్య్రానంతరం కూడా ఏమార్పూ లేకుండా ఒకేలా ఉన్నాయన్నారు. వందేమాతర గేయం ఆరు చరణాలను ఆలపించేందుకు సోనియా గాంధీ విముఖత చూపడం సిగ్గు చేటని బీజేపీ ప్రతినిధి గోపాల్ కృష్ణ అగర్వాల్ అన్నారు. ‘కాంగ్రెస్‌ది ఎమర్జెన్సీ మైండ్ సెట్, ఇటువంటి మైండ్‌సెట్‌ను దేశ ప్రజలు ఇప్పటికే తిరస్కరించారు. ఇకపైనా తిరస్కరిస్తూనే ఉంటారు’అని ఆయన వ్యాఖ్యానించారు. వాస్తవంగా జరిగిందిదే: బీజేపీ నేతల ఆరోపణలను కాంగ్రెస్ తీవ్రంగా ఖండించింది. బీజేపీ చెబుతున్నట్లుగా ఆ వీడియోలో సోనియా గాంధీ వందేమాతర గేయంపై అభ్యంతరం తెలపడం లేదని, కేవలం ఆ కార్యక్రమంలో పాల్గొన్న ఖర్గేకు కుర్చీ ఇవ్వాలని మాత్రమే ఆమె కోరుతున్నారని వివరించింది. 1937 అక్టోబర్ 28వ తేదీన కోల్‌కతాలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ(సీడబ్ల్యూసీ) సమావేశంలో మహాత్మా గాం«దీ, నేతాజీ, పటేల్, అబుల్ కలాం ఆజాద్, నెహ్రూ, గోవింద్ వల్లభ్ పంత్, రాజగోపాలాచారి పాల్గొన్నారు. ఈ సమావేశంలో గురుదేవ్ రవీంద్రనాథ్ ఠాకూర్ ఇచ్చిన సూచనల మేరకు వందేమాతరం ఆరంభం చరణాలను మాత్రమే కాంగ్రెస్ సమావేశాల్లో ఆలపించాలని నిర్ణయించారు’అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ అప్పటి చారిత్రక ఘటనను గుర్తు చేశారు. ‘అప్పట్నుంచి మా పార్టీ ప్రతి సెషన్లోనూ, సేవాదళ్ కార్యక్రమాల్లోనూ ఇలాగే ఆరంభ చరణాలను ఆలపిస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. శనివారం ఇందిరాభవన్‌లో జరిగిన కార్యక్రమంలో మాత్రం పూర్తి గేయాన్ని ఆలపించాం, ఇది వాస్తవం’అని ఆయన వివరించారు. వందేమాతర గేయాన్ని పూర్తిగా ఆలపించడంపై పార్లమెంట్లో 16 గంటలపాటు జరిగిన చర్చల్లోనూ తమ పార్టీ అభిప్రాయాన్ని వెల్లడించామన్నారు. తాజాగా, బీజేపీ నేతలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవాలని ఆయన స్పష్టం చేశారు -
ఇంకా సాధించాల్సింది ఎంతో ఉంది
న్యూఢిల్లీ: గత ఎనిమిది దశాబ్దాల్లో మనదేశం అనేక కఠినమైన సవాళ్లను అధిగమించిందని, అయితే ఇంకా సాధించాల్సింది చాలా ఉందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ అన్నారు. భవిష్యత్తు బాధ్యతలను స్వీకరించడానికి యువ న్యాయ పట్టభద్రులు, న్యాయవాదులు సిద్ధంగా ఉండాలని సూచించారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆయన శనివారం సుప్రీంకోర్టు ప్రాంగణంలో జాతీయ జెండాను ఎగురవేశారు. దేశ ప్రస్థానం అది సాధించిన విజయాలతోనే ముగిసిపోదని అన్నారు. ప్రతి విజయంతోపాటు నూతన బాధ్యత, కర్తవ్య భావన కూడా కలుగుతుందని వివరించారు. ఇంకా చేయాల్సింది ఎంతో ఉందని, మన ముందున్న ప్రయాణంలో ఇంకా ఎన్నో మైళ్లు ప్రయాణించాల్సి ఉందని ఉద్ఘాటించారు. యువ న్యాయవాదులను ఉద్దేశించి జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ.. స్వాతంత్య్ర పోరాట రోజుల నుంచి బార్ అసోసియేషన్ మోస్తున్న బాధ్యత త్వరలోనే వారి భుజాలపై పడుతుందని అన్నారు. ముందు తరాల వారు నిర్మించి, బలోపేతం చేసిన న్యాయ సంస్థలను ఇప్పుడు రక్షించి, ముందుకు తీసుకెళ్లాలని యువ లాయర్లకు సూచించారు. తాము మార్గనిర్దేశం చేస్తామని అన్నారు. స్వాతంత్య్ర పోరాటానికి, చట్టంతో లోతైన, శాశ్వతమైన సంబంధం ఉందని గుర్తుచేశారు. ఆ తరంలోని అత్యుత్తమ న్యాయ నిపుణుల దార్శనికత, కృషి ద్వారానే చట్టం నిజమైన ఉద్దేశం కేవలం ఆజ్ఞాపించడం లేదా నియంత్రించడం మాత్రమే కాదని.. న్యాయాన్ని అందించడం, స్వేచ్ఛను పరిరక్షించడం, మానవ గౌరవాన్ని నిలబెట్టడం అని మనం తెలుసుకోవడం ప్రారంభించామని వివరించారు. -
యువతకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్
న్యూఢిల్లీ: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కుటుంబాలపై ఆర్థిక భారాన్ని తగ్గించడమే లక్ష్యంగా ప్రధాని మోదీ ఉచిత ఆన్లైన్ కోచింగ్ కార్యక్రమాన్ని ప్రకటించారు. అలాగే కోటి మంది యువతకు కృత్రిమ మేధ(ఏఐ) శిక్షణ ఇస్తామని వెల్లడించారు. ఆయన స్వాతంత్య్ర దినోత్సవ ప్రసంగంలో మాట్లాడుతూ.. కోచింగ్ తరగతులు పేద, మధ్యతరగతి ప్రజలపై ఆర్థిక భారం మోపుతున్నాయని చెప్పారు. అందుకే వివిధ పరీక్షలకు ఉచితంగా ఆన్లైన్ కోచింగ్ అందించబోతున్నట్లు తెలిపారు. పిల్లలను కోచింగ్ క్లాసులకు పంపించడం తల్లిదండ్రులకు నేడు ఒక ప్రతిష్టగా మారిపోయిందని గుర్తుచేశారు. కోచింగ్‌పై వెచ్చించే వేల కోట్ల రూపాయలను ఉచిత ఆన్లైన్ శిక్షణతో ఆదా చేసుకోవచ్చని, పిల్లలకు దగ్గరగా ఉంటూ వారిని జాగ్రత్తగా చూసుకోవచ్చని అన్నారు. మనకు డిజిటల్ ప్రజా మౌలిక సదుపాయాలు ఉన్నాయని, అద్భుతమైన ప్రతిభ, చక్కటి ఉపాధ్యాయులు ఉన్నారని ప్రధానమంత్రి చెప్పారు. ఈ వనరులన్నింటినీ ఏకతాటిపైకి తీసుకురావడం ద్వారా యువతకు ఉచిత కోచింగ్ అందించేందుకు పూర్తిస్థాయి నెట్‌వర్క్‌ను నిర్మించబోతున్నామని స్పష్టంచేశారు. -
‘ఉర్దూమే తిరంగా పెహనాహై’
న్యూఢిల్లీ: స్వాతంత్య్రోత్సవాల్లో ప్రధాని నరేంద్రమోదీ కోటు జేబులోని ఒక వస్త్ర విశేషం శనివారం సామాజిక మాధ్యమంలో పెద్ద దుమారమే రేపింది. మూడు రంగులున్న ఈ పాకెట్ స్క్వెర్‌పై కాంగ్రెస్ నేతలు విమర్శలు ఎక్కుపెట్టారు. జాతీయ జెండా రంగుల్లోనే ఉన్నప్పటికీ వాటి క్రమం తిరగేసి ఉండటం విమర్శలకు కారణమైంది. ఆ పాకెట్ స్క్వెర్ భారత జాతీయ జెండాలా లేదని, ఐర్లాండ్ పతాకంలా ఉందని కాంగ్రెస్ నేతలు కొందరు వ్యంగ్య వ్యాఖ్యలు చేస్తే... ఆ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా ‘‘లగ్తా హై సాహిబ్ నే ఉర్దూ మే తిరంగా పెహనా హై. యా ఫిర్ భారత్ కి జగా ఐర్లాండ్‌గా ఇండిపెండెన్స్ డే మనా రహా హై’’(బహుశా ప్రధాని త్రివర్ణ పతాకాన్ని ఉర్దూలో ధరించినట్లు ఉన్నారు. లేదంటే ఐర్లాండ్ స్వాతంత్య్ర దినోత్సవాలు జరుపుకుంటున్నారేమో) అని ఎక్స్ వేదికగా వ్యాఖ్యానించారు. ఉర్దూ భాషను కుడి నుంచి ఎడమకు రాస్తారన్న విషయం తెలిసిందే. పవన్ ఖేరా వ్యాఖ్యలకు కాంగ్రెస్ నేత సుప్రియా శ్రీనేథ్ సమర్థించడమే కాకుండా... ఆ పాకెట్ స్క్వెర్లోని రంగులు కాషాయం, తెలుపు, పచ్చలుగా కాకుండా తిరగేసి ఉన్నాయని ఎత్తి చూపారు. ‘‘ఇది ఏ శైలి త్రివర్ణ పతాకం. తిరగేసి ఉంది. భారతదేశానిది కాకుండా ఐర్లాండ్దిలా ఉంది’’అని ఆమె ఎక్స్ పోస్టులో తెలిపారు. ఈ వ్యవహారం మొత్తం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారి తీసింది. కొందరు కాంగ్రెస్‌ను విమర్శిస్తే మరికొందరు మోదీ జాతీయ పతాకాన్ని వేసుకుని తిరగడం లేదని అశోక చక్రం లేని విషయాన్ని ఎత్తి చూపారు. మరికొందరు జాతీయ జెండాకు సంబంధించిన నిబంధనలు పాటించి ఉండాల్సిందని సలహా ఇచ్చారు. ఇంకొందరైతే త్రివర్ణం ధరించడం వెనుక ఉద్దేశాన్ని చూడాలని దీన్ని కూడా రాజకీయం చేస్తే ఎలా అని ప్రశ్నించారు. -
అభివృద్ధి చెందిన భారత్ కోసం.. 'సప్తధార' సూత్రం!
2047 నాటికి భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలనే లక్ష్యంతో ప్రధాని నరేంద్ర మోదీ కీలక దిశానిర్దేశం చేశారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా.. ఎర్రకోట నుంచి జాతి ఉద్దేశించి ప్రసంగించిన ఆయన.. దేశ ప్రగతికి ఏడు ప్రధాన శక్తులు అవసరమని పేర్కొన్నారు. వీటినే 'సప్తధార'గా అభివర్ణించారు.ఉత్పాదక శక్తి (Manufacturing power)మోదీ 'సప్తధార'లో మొదటి స్థానాన్ని తయారీ రంగానికి ఇచ్చారు. చిన్న వస్తువుల నుంచి భారీ పరిశ్రమల వరకు సాధ్యమైనంత ఎక్కువగా భారత్‌లోనే తయారు చేయాలి అనేది ప్రధాని ఆలోచన. కేవలం ఉత్పత్తి చేయడం మాత్రమే కాకుండా.. డిజైన్, తయారీ, నాణ్యత, సరఫరా వంటి మొత్తం విలువ గొలుసును దేశంలోనే అభివృద్ధి చేయాలని ఆయన సూచించారు. ప్రపంచ దేశాలకు భారత్ ఒక నమ్మకమైన సప్లై చైన్ భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈలు, పారిశ్రామికవేత్తలు ధరతో పాటు నాణ్యత, ఉత్పత్తి సామర్థ్యంపై కూడా దృష్టి పెట్టాలని పిలుపునిచ్చారు.వ్యవసాయం, ఆహార ఉత్పత్తి (Agriculture and food production)రెండో శక్తిగా వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, ఫుడ్ ప్రాసెసింగ్ రంగాలను ప్రధాని ప్రస్తావించారు. మన రైతులు కేవలం దేశీయ మార్కెట్‌పైనే ఆధారపడకుండా.. ప్రపంచ మార్కెట్‌ను కూడా లక్ష్యంగా చేసుకోవాలని ఆయన అన్నారు. చిరుధాన్యాలు, సుగంధ ద్రవ్యాలు, పండ్లు, పూలు, సంప్రదాయ ఆహార పదార్థాలు, రసాయన రహిత వ్యవసాయ ఉత్పత్తులకు అంతర్జాతీయ మార్కెట్లో మంచి అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. అంటే.. పొలంలో పంట పండించడం దగ్గరే ప్రక్రియ ఆగిపోకూడదు. ఫుడ్ ప్రాసెసింగ్, ప్యాకేజింగ్, బ్రాండింగ్, ఎగుమతుల వరకు పూర్తి వ్యవస్థను అభివృద్ధి చేయాలి చెప్పారు.టెక్నాలజీ, ఆవిష్కరణ (Technology and innovation)మూడో శక్తిగా టెక్నాలజీ, ఇన్నోవేషన్‌ను ప్రధాని ప్రస్తావించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), క్వాంటం టెక్నాలజీ, అంతరిక్ష రంగం, రోబోటిక్స్, డేటా సెంటర్లు వంటి భవిష్యత్ రంగాల్లో భారత్ మరింత ముందుకు వెళ్లాలని అన్నారు. యూపీఐ, డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భారత్ సాధించిన విజయాలను ప్రస్తావిస్తూ.. తదుపరి తరం కమ్యూనికేషన్ టెక్నాలజీలో కూడా దేశం నాయకత్వం వహించాలని చెప్పారు. ముఖ్యంగా మేడ్ ఇన్ ఇండియా 6జీను ప్రపంచానికి అందించే స్థాయికి భారత్ ఎదగడమే లక్ష్యంగా పెట్టుకోవాలని సూచించారు.గతి శక్తి (Gati Shakti)నాలుగో శక్తిగా గతిశక్తిని ప్రధాని పేర్కొన్నారు. దేశంలో రవాణా, కనెక్టివిటీ మరింత వేగంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని మోదీ అన్నారు. హైస్పీడ్ రైళ్లు, కొత్త పోర్టులు, విమానాశ్రయాలు, హైవేలు వంటి మౌలిక వసతులను విస్తరించడంతో పాటు.. దేశంలోని నగరాలు, పరిశ్రమలు, పోర్టులు పరస్పరం మెరుగ్గా అనుసంధానమయ్యేలా చూడాలని సూచించారు. పోర్టులను కేవలం సరుకులు ఎగుమతి, దిగుమతి చేసే ప్రాంతాలుగా కాకుండా.. ఆర్థిక అభివృద్ధికి కేంద్రాలుగా మార్చాలని ఆయన అభిప్రాయపడ్డారు.రక్షణ శక్తి (Raksha Shakti)ఐదో శక్తిగా రక్షణ రంగం గురించి పేర్కొన్నారు. రక్షణ ఉత్పత్తుల కోసం ఇతర దేశాలపై ఆధారపడకుండా.. భారత్ మరింత ఆత్మనిర్భర్‌గా మారాలని ప్రధాని చెప్పారు. డ్రోన్లు, కౌంటర్ డ్రోన్ వ్యవస్థలు, హైపర్సోనిక్ టెక్నాలజీ, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక రంగాల్లో భారత్ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అన్నారు. భారత్ కేవలం ప్రపంచ దేశాలకు మార్కెట్‌గా ఉండకుండా.. అత్యాధునిక రక్షణ సాంకేతికతను తయారు చేసి ఇతర దేశాలకు అందించే స్థాయికి ఎదగాలన్నది లక్ష్యం.గ్రీన్, బ్లూ ఎకానమీ (Green economy and blue economy)ఆరవ శక్తిగా గ్రీన్, బ్లూ ఎకానమీలను ప్రధాని ప్రస్తావించారు. గ్రీన్ హైడ్రోజన్, పునరుత్పాదక ఇంధనం, ఎనర్జీ స్టోరేజ్, ఎలక్ట్రిక్ మొబిలిటీ, పర్యావరణహిత తయారీ వంటి రంగాల్లో భారత్ భారీ అవకాశాలను అందిపుచ్చుకోవాలని అన్నారు.అదే సమయంలో.. దేశానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని కూడా ఆర్థిక అభివృద్ధికి ఉపయోగించుకోవాలని సూచించారు. మత్స్య పరిశ్రమ, సముద్ర సాంకేతికత, తీర ప్రాంత పర్యాటకం వంటి రంగాలను అభివృద్ధి చేయడం ద్వారా బ్లూ ఎకానమీకి మరింత ఊతమివ్వాలని అన్నారు.యువశక్తి, సాఫ్ట్ పవర్ (India’s soft power)'సప్తధార'లో చివరి శక్తిగా యువశక్తి, భారత సాఫ్ట్ పవర్‌ను ప్రధాని వివరించారు. యోగా, ఆయుర్వేదం, ఆధ్యాత్మికత, ఆరోగ్యం, హస్తకళలు వంటి సంప్రదాయ రంగాలతో పాటు సినిమాలు, యానిమేషన్, వీఎఫ్ఎక్స్, గేమింగ్, డిజిటల్ కంటెంట్ వంటి ఆధునిక సృజనాత్మక రంగాల్లో కూడా భారత్ ప్రపంచవ్యాప్తంగా తన ప్రభావాన్ని పెంచుకోవాలని అన్నారు.అంతే కాకుండా.. వైద్య పర్యాటకాన్ని ప్రోత్సహించడం, భారతదేశంలోని ప్రకృతి అందాలు, జాతీయ పార్కులు, పర్యాటక ప్రాంతాలను ప్రపంచానికి మరింతగా పరిచయం చేయడం ద్వారా దేశ సాఫ్ట్ పవర్‌ను పెంచుకోవాలని సూచించారు.'సప్తధార'లో ముఖ్యమైన విషయం ఏమిటంటే.. ఈ ఏడు రంగాలను వేర్వేరుగా చూడకూడదని ప్రధాని స్పష్టం చేయడం. ఉదాహరణకు తయారీ రంగానికి టెక్నాలజీ అవసరం. వ్యవసాయానికి ఫుడ్ ప్రాసెసింగ్ అవసరం. ఎగుమతులకు మెరుగైన లాజిస్టిక్స్ అవసరం. రక్షణ రంగానికి ఆవిష్కరణలు అవసరం. గ్రీన్ ఎకానమీకి యువత, టెక్నాలజీ అవసరం. అంటే.. ఒక రంగం అభివృద్ధి చెందితే దాని ప్రభావం మరో రంగంపైనా పడుతుంది. ఈ రంగాలన్నింటినీ కలిపి ముందుకు తీసుకెళ్లడమే 'సప్తధార' ఆలోచనలోని అసలు ఉద్దేశం.వికసిత్ భారత్ లక్ష్యానికి.. సప్తధార!మన దేశం స్వాతంత్య్రం సాధించి 100 సంవత్సరాలు పూర్తిచేసుకునే 2047 నాటికి వికసిత్ భారత్‌గా మారాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యాల్లో ఒకటి. ఆ లక్ష్యాన్ని చేరుకోవాలంటే కేవలం ఒకటి రెండు రంగాలు అభివృద్ధి చెందితే సరిపోదు. తయారీ నుంచి వ్యవసాయం వరకు, టెక్నాలజీ నుంచి రక్షణ వరకు, గ్రీన్ ఎకానమీ నుంచి యువశక్తి వరకు అన్ని రంగాలు కలిసి ముందుకు సాగాలి.ఇదీ చదవండి: 80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం! -
80 ఏళ్లలో 1711 రెట్లు పెరిగిన బంగారం!
భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.ఈ రోజు ధరలుభారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు! -
వివాదంలో బాలయ్య సతీమణి వసుంధర
సాక్షి, శ్రీ సత్యసాయి: నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడం వివాదానికి దారితీసింది. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం హిందూపురం నంది సర్కిల్లో జరిగిన అధికారిక కార్యక్రమంలో ఆమె జెండా ఎగురవేశారు. అయితే వసుంధరకు ప్రొటోకాల్ మర్యాదలు కల్పించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఎమ్మెల్యే బాలకృష్ణ అనారోగ్యం, శస్త్రచికిత్స కారణంగా కార్యక్రమానికి హాజరుకాలేకపోయారని వసుంధర తెలిపారు. ఆయన తరఫునే తాను కార్యక్రమంలో పాల్గొన్నట్లు చెప్పారు. అయితే ఎలాంటి అధికారిక పదవి లేని వ్యక్తికి అధికారిక కార్యక్రమంలో ప్రొటోకాల్ కల్పించడం, అధికారులు–పోలీసులు గౌరవాలు ఇవ్వడంపై పలువురు విమర్శలు చేస్తున్నారు.పదవి లేకుండానే ప్రొటోకాల్ ఎందుకు? అంటూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. అధికారిక కార్యక్రమాల నిర్వహణలో నిబంధనలు పాటించాల్సిన అవసరం ఉందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారం ప్రస్తుతం హిందూపురం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
సమయం.. అవసరం.. సంకల్పం మనది: ఎర్రకోటపై ప్రధాని మోదీ
సాక్షి, న్యూఢిల్లీ: మన దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని.. ఆ అభివృద్ధిని ఆపడం ఎవరి వల్ల కాదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా చారిత్రక ఎర్రకోట పై జాతీయ పతాకాన్ని ఎగరేసిన అనంతరం.. ఆయన జాతిని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ ఏడాది వేడుకల్లో ‘వందేమాతరం’ 150 ఏళ్ల వారసత్వం, ‘యువశక్తి–వికసిత్ భారత్ 2047’ అంశాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకున్న ప్రధాని.. వారి కలలు, ఆశయాల స్ఫూర్తితో భారత్ అభివృద్ధి పథంలో ముందుకు సాగుతోందని అన్నారు. ఇవాళ ప్రతీ ఇంటిపై జాతీయ జెండా ఎగురుతోందని.. ప్రతీ భారతీయుడి గుండెలో వందేమాతరం ప్రతిధ్వనిస్తోందని పేర్కొన్నారు. దేశం కొత్త సంకల్పంతో ముందుకు వెళ్తోందని, పెద్ద కలలు కనాలని, వాటిని సాకారం చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ‘‘సమయం.. అవసరం.. సంకల్పం మనది. సామర్థ్యం పెంచుకుని విజయం సాధిద్దాం’’ అని ప్రధాని పేర్కొన్నారు.వికసిత్ భారత్ కోసం సప్తధార ప్రణాళికతయారీ శక్తిఫుడ్ ప్రొడక్షన్టెక్నాలజీగతిశక్తిరక్షణ రంగంగ్రీన్ ఎకానమీ.. బ్లూ ఎకానమీయువశక్తి25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారుతమ హయాంలో దేశ వికాసం కోసం కృషి చేశామని.. వివిధ రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందినట్లు గణాంకాలే చెబుతున్నాయని అన్నారు. గత కొన్నేళ్లలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడి తమ జీవితాలను మెరుగుపర్చుకున్నారని ప్రధాని తెలిపారు. రక్షణ ఉత్పత్తులు పెరిగాయని, అనేక రంగాల్లో భారత్ తన సామర్థ్యాన్ని నిరూపించుకుందని అన్నారు. దేశ ప్రయోజనాలను కాపాడుకోవడంతో పాటు ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.కరోనా నుంచి యుద్ధాల వరకు సవాళ్లు ఎదుర్కొన్నాంగత 12 ఏళ్లలో భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొందని ప్రధాని గుర్తుచేశారు. కరోనా మహమ్మారి, ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధ పరిస్థితుల మధ్య కూడా దేశం అభివృద్ధి బాటలో ముందుకు సాగిందన్నారు. యూపీఏ హయాంలో ప్రజలు భయాందోళనతో గడిపారని.. ఆ తర్వాత కూడా ప్రజల్ని భయపెట్టడమే పనిగా కొందరు పెట్టుకున్నారని అన్నారు. యుద్ధాలతో పెట్రోల్, డీజిల్, ఫర్టిలైజర్లు దొరకవని జనాలకు భయపెట్టారని.. కానీ, అడ్డంకులు అధిగమించామని ప్రధాని అన్నారు. దేశ ప్రగతిని ఆపడం ఎవరి తరం కాదని చెప్పారు.సంస్కరణలు మరింత వేగంగా..ఇక ఆగేదే లేదని.. తగ్గేదే లేదని ప్రధాని మోదీ అన్నారు. దేశాభివృద్ధికి ఆర్థిక సంస్కరణలను మరింత వేగవంతం చేస్తామని ప్రధాని తెలిపారు. తయారీ రంగాన్ని బలోపేతం చేయడం, మౌలిక వసతుల అభివృద్ధి, సాంకేతిక రంగంలో ముందంజ వేయడమే లక్ష్యమన్నారు. రైల్వే విద్యుద్దీకరణ, మెట్రో విస్తరణ, హైడ్రోజన్ రైలు, సెమీకండక్టర్ రంగం వంటి అంశాలను ప్రస్తావించారు. ఇంధన భద్రతను అత్యవసర అంశంగా పరిగణించి.. దాని కోసం చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. దేశ ప్రయోజనాల కోసం ఇతర దేశాలపై ఆధారపడడం తగ్గించాలని అభిప్రాయపడ్డారు.ఆత్మనిర్భర్ భారత్.. మేడిన్ ఇండియానే లక్ష్యంభారత్ స్వయం సమృద్ధి దిశగా వేగంగా అడుగులు వేస్తోందని ప్రధాని తెలిపారు. డిజిటల్ టెక్నాలజీ, సెమీకండక్టర్లు, గ్రీన్ ఎనర్జీ, తయారీ రంగాల్లో భారత్ ప్రపంచానికి కీలక భాగస్వామిగా ఎదగాలని ఆకాంక్షించారు. ‘‘మన ఉత్పత్తుల ఆధారంగానే ప్రపంచంలో మనకు గుర్తింపు రావాలి. ప్రతి మార్కెట్‌కు భారత ఉత్పత్తులు చేరాలి’’ అని అన్నారు. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో భారత కంపెనీల సంఖ్య పెరగాలని, ప్రపంచ స్థాయి ఫార్మా సంస్థలు భారత్ నుంచి రావాలని లక్ష్యాలను వివరించారు.ఉగ్రవాదం, నక్సలిజంపై పోరాటం కొనసాగుతుందిదేశ భద్రతపై మాట్లాడుతూ.. సరిహద్దుల అవతల, ఇవతల భారత్ ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటోందని ప్రధాని అన్నారు. ఉగ్రవాదం అనేక కుటుంబాలను నాశనం చేసిందని, నక్సలిజం వల్ల కూడా ఎంతో నష్టం జరిగిందని పేర్కొన్నారు. దేశాన్ని మావోయిజం నుంచి విముక్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.యువత తోడుంటేనే..దేశం ముందున్న అతిపెద్ద లక్ష్యం వికసిత్ భారత్ అని ప్రధాని స్పష్టం చేశారు. 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా భారత్‌ను నిలబెట్టాలంటే యువత కీలక పాత్ర పోషించాలని అన్నారు. యువతే దేశానికి వెన్నెముక అని పేర్కొన్న ప్రధాని.. ఏఐ, సాంకేతికత, క్రీడలు, ఆవిష్కరణల రంగాల్లో యువత సామర్థ్యాలను పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. యువశక్తితోనే వికసిత్ భారత్ కల సాకారం అవుతుందని చెప్పారు. అందుకోసం యువత తనకు మద్దతు నిలవాలని పిలుపు ఇచ్చారు. ఇప్పుడు గ్లోబలైజేషన్ అనే మాటే వినిపించడం లేదని.. ప్రతీ దేశం దాని సంక్షోభాల మీదే దృష్టిసారిస్తున్నాయని అన్నారు. ఇలాంటి తరుణంలో భారత్ గ్లోబల్ లీడర్షిప్, సప్లై చైన్‌గా మారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యం సాధిస్తే ప్రపంచం మనవైపు చూస్తుందని అన్నారాయన. మహిళా బిల్లుకు ముందుకు రండిమహిళా సాధికారతపై ప్రధాని కీలక వ్యాఖ్యలు చేశారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ వారి హక్కు అని అన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు అన్ని రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరారు. రాజకీయాలను పక్కన పెట్టి మహిళల అభివృద్ధికి అందరూ కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు. అవసరమైతే క్రెడిట్ వారే తీసుకోవాలంటూ విపక్షాలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. దేశంలో 3 కోట్ల మంది మహిళలను ‘లక్పతి దీదీ’లుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని తెలిపారు.తొలిసారి ఎర్రకోటపై వందేమాతరంఈసారి స్వాతంత్య్ర వేడుకల్లో వందేమాతరం ప్రత్యేకంగా నిలిచింది. వందేమాతరం 150 ఏళ్ల ప్రస్థానాన్ని గుర్తుచేస్తూ తొలిసారి ఎర్రకోట అధికారిక కార్యక్రమంలో ఆలపించారు. ప్రతి భారతీయుడి హృదయం వందేమాతరం నినాదంతో మారుమోగుతోందని ప్రధాని అన్నారు. వేడుకలు ఇలా.. స్వాతంత్య్ర వేడుకలకు ముందు ప్రధాని మోదీ రాజ్‌ఘాట్ వద్ద మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అనంతరం ఎర్రకోటకు చేరుకుని త్రివిధ దళాలు, ఢిల్లీ పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం 21 గన్ సెల్యూట్, సైనిక గౌరవ కార్యక్రమాలు జరిగాయి. ఎర్రకోట ప్రాంగణంలో పరేడ్, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. వికసిత్ భారత్ లక్ష్య సాధనకు యువత, మహిళలు, స్వయం సమృద్ధి, ఆవిష్కరణలే కీలకమని ప్రధాని మోదీ ఎర్రకోట వేదికగా దేశానికి సందేశం ఇచ్చారు. -
80 ఏళ్ల భారతం.. నాటి కలలు.. నేటి వాస్తవాలు
ఒకప్పుడు బ్యాంకులో డబ్బు కోసం క్యూ.. ఇప్పుడు ఫోన్లోనే డబ్బు. ఒకప్పుడు ఉత్తరం కోసం రోజులు.. ఇప్పుడు క్షణాల్లో వీడియో కాల్. కానీ.. సామాన్యుడి జేబులో మిగిలేది ఎంత?1947 ఆగస్టు 15న దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది. అప్పటికి ఒక సాధారణ భారతీయుడి జీవితాన్ని ఊహించుకుంటే.. మట్టి ఇల్లు, కిరోసిన్ దీపం, ఎద్దుల బండి, రేషన్ దుకాణం, ప్రభుత్వ ఆసుపత్రి, పాఠశాలకు వెళ్లే కొద్దిమంది పిల్లలు కనిపిస్తారు. దేశం ముందున్న లక్ష్యం ఒక్కట.. ఎలాగైనా బతకాలి, దేశాన్ని నిలబెట్టాలి.80 ఏళ్ల తర్వాత అదే దేశాన్ని చూస్తే దృశ్యం పూర్తిగా మారిపోయింది.ఒకప్పుడు ఇంట్లో టెలిఫోన్ ఉండటం గొప్ప విషయం. ఫోన్ చేయాలంటే పక్కింటికో, పోస్టాఫీసుకో వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు చేతిలో ఉన్న చిన్న మొబైల్‌నే బ్యాంకు, టీవీ, కెమెరా, పుస్తకం, టికెట్ కౌంటర్.. అన్నీ అయిపోయాయి. డబ్బు పంపడానికి బ్యాంకు క్యూలో నిలబడాల్సిన అవసరం లేదు. కొన్ని సెకన్లలోనే చెల్లింపు పూర్తవుతోంది.ఒకప్పుడు ప్రభుత్వ కార్యాలయంలో ఒక సర్టిఫికెట్ కోసం రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు అదే పని చాలావరకు ఇంట్లో కూర్చునే చేయగలుగుతున్నాం. రైల్వే టికెట్ కోసం స్టేషన్ క్యూలో నిలబడిన రోజులు పోయాయి. పిల్లల చదువు నుంచి ఉద్యోగ దరఖాస్తుల వరకు.. డిజిటల్ ప్రపంచం సామాన్యుడి చేతిలోకి వచ్చింది. కానీ కథ ఇక్కడితో పూర్తికాదు.దేశం ఎదిగింది.. మరి సామాన్యుడి జేబు కూడా అదే స్థాయిలో ఎదిగిందా?.ఇదే అసలు ప్రశ్న. నగరాల్లో జీతాలు పెరిగాయి. కానీ ఇంటి అద్దె, పిల్లల స్కూల్ ఫీజు, వైద్యం, ప్రయాణ ఖర్చులు కూడా పెరిగాయి. ఒకప్పుడు నెల జీతంతో కుటుంబాన్ని నడిపిన తండ్రి.. ఇప్పుడు ఇద్దరి సంపాదన వచ్చినా నెలాఖరుకు లెక్కలు వేసుకోవాల్సిన పరిస్థితి. మధ్యతరగతి కుటుంబానికి ‘సొంత ఇల్లు’ ఇప్పటికీ పెద్ద కలగానే ఉంది.గ్రామాల్లోనూ మార్పు వచ్చింది. రోడ్లు వచ్చాయి. కరెంట్ వచ్చింది. మొబైల్ వచ్చింది. ఇంటర్నెట్ వచ్చింది. కానీ వ్యవసాయం మీద ఆధారపడే కుటుంబానికి వాతావరణం, పంట ధర, అప్పులు ఇంకా పెద్ద సవాళ్లే. చదువుకున్న యువకుడికి గ్రామంలో ఉద్యోగం లేకపోతే.. నగరానికి వెళ్లాల్సిందే.అయినా 80 ఏళ్ల ప్రయాణాన్ని తక్కువ చేసి చూడలేం. ఒకప్పుడు ఆకలితో పోరాడిన దేశం.. నేడు ప్రపంచానికి ఆహారం, ఔషధాలు, సాంకేతిక సేవలు అందించే స్థాయికి వచ్చింది. ఒకప్పుడు విదేశాలపై ఆధారపడిన దేశం.. నేడు అంతరిక్షంలో తన జెండాను ఎగురవేస్తోంది. ప్రపంచంలోని పెద్ద దేశాలతో భారత్ సమానంగా మాట్లాడుతోంది.అయితే స్వాతంత్ర్యానికి అసలు కొలమానం జీడీపీ కాదు. స్టాక్ మార్కెట్ కాదు. భారీ భవనాలు కాదు. ఒక పేద తల్లి తన పిల్లాడిని మంచి స్కూల్లో చదివించగలుగుతుందా? ఒక రైతు తన పంటకు గిట్టుబాటు ధర పొందుతున్నాడా?. ఒక సాధారణ కుటుంబం అనారోగ్యం వస్తే అప్పులపాలు కాకుండా చికిత్స పొందగలుగుతుందా?. ఒక యువకుడికి తన ఊర్లోనే గౌరవంగా బతికే ఉద్యోగం దొరుకుతుందా?ఈ ప్రశ్నలకు సమాధానమే.. రాబోయే భారతదేశం ఎలా ఉండాలో చెబుతుంది. 80 ఏళ్ల క్రితం మన పెద్దలు దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం తెచ్చారు. వచ్చే తరాల బాధ్యత మాత్రం మరో స్వాతంత్ర్యం తీసుకురావడం.. పేదరికం నుంచి, నిరుద్యోగం నుంచి, ఆకలి నుంచి, అన్యాయం నుంచి సామాన్యుడికి స్వేచ్ఛ. అప్పుడే ఆగస్టు 15న ఎగిరే జెండా.. ప్రతి ఇంటి జీవితంలోనూ నిజమైన అర్థాన్ని సంతరించుకుంటుంది. -
78 మందికి శౌర్య పురస్కారాలు
న్యూఢిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రక్షణ దళాలు, కేంద్ర సాయుధ పోలీసు బలగాల సిబ్బందిలో 78 మందికి శౌర్య పురస్కారాలు ప్రదానం చేయడానికి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము శుక్రవారం ఆమోదం తెలిపారు. వీటిలో 13 మరణానంతర పురస్కారాలు ఉన్నాయి. 9 కీర్తిచక్రలు, 19 శౌర్యచక్రలు, 5 బార్ టు సేనా మెడల్స్(గ్యాలంట్రీ), 36 సేనా మెడల్స్(గ్యాలంట్రీ)తోపాటు మరికొన్ని అవార్డులను ప్రభుత్వం ప్రదానం చేయనుంది. అశోక చక్ర తర్వాత ప్రదానం చేసే భారతదేశపు రెండో అత్యున్నత శౌర్య పురస్కారం కీర్తిచక్ర. శౌర్యచక్ర అనేది మూడో అత్యున్నత శౌర్య పురస్కారం. కీర్తిచక్ర అవార్డు గ్రహీతలు 21 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన లెఫ్టినెంట్ కల్నల్ మనోజ్ ఫ్రాన్సిస్, 2 పారా (స్పెషల్ ఫోర్సెస్)కు చెందిన మేజర్ జితేంద్ర రాఠీ. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన హవల్దార్ గజేంద్ర సింగ్, హెడ్ కానిస్టేబుళ్లు జగ్బీర్ సింగ్, బషీర్ అహ్మద్, కానిస్టేబుళ్లు జశ్వంత్ సింగ్, బల్వీందర్ సింగ్, తారిఖ్ హుస్సేన్, ఇన్స్పెక్టర్ సునీల్ కుమార్‌కు కూడా కీర్తిచక్ర పురస్కారాలను ప్రకటించారు. మేజర్ పరమ్‌వీర్, మేజర్ తరుణ్ వాసుదేవన్, మనోజ్ కేశవ్ కుమార్, మేజర్ గౌరవ్ సింగ్ బ్రిజ్వాల్, మేజర్ విపీన్ కుమార్, నాయబ్ సుబేదార్ శంకర్ రామ్, నాయబ్ సుబేదార్ దబ్బాల్ సింగ్ బిష్త్ తదితరులకు శౌర్యచక్ర పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. -
TG: ప్రజలకు గవర్నర్ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు
హైదరాబాద్: భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవంను పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా దేశ ప్రజలకు, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన మహనీయుల త్యాగాలను ఈ సందర్భంగా ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలు, ధైర్యసాహసాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా వాయువులు పీలుస్తున్నామని గవర్నర్ పేర్కొన్నారు. దేశ స్వాతంత్ర్యం, సార్వభౌమత్వం, సమగ్రతను పరిరక్షించేందుకు ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలని సూచించారు.ఆత్మనిర్భర్ భారత్ నిర్మాణానికి కృషిభారత్ను మరింత బలమైన, స్వావలంబనతో కూడిన ఆత్మనిర్భర్ భారత్‌గా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని శ్రీ శివప్రతాప్ శుక్లా కోరారు. అభివృద్ధి ఫలాలు సమాజంలోని అన్ని వర్గాలకు సమానంగా అందేలా శాంతి, సౌభ్రాతృత్వం, సమగ్ర అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని అన్నారు.ఐక్యతతోనే అభివృద్ధిఐక్యత, సమగ్రత, అభివృద్ధి స్ఫూర్తితో ఉజ్వల భారతావని నిర్మాణానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని గవర్నర్ ఆకాంక్షించారు. దేశ ప్రగతిలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, విద్యార్థులు సహా అన్ని వర్గాల ప్రజలు చురుకైన పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.త్రివర్ణ పతాకం ఎల్లప్పుడూ గర్వంగా రెపరెపలాడాలని, దాని మూడు రంగులు దేశ ప్రజల్లో ధైర్యం, శాంతి, విశ్వాసానికి ప్రతీకలుగా నిలవాలని గవర్నర్ శ్రీ శివప్రతాప్ శుక్లా ఆకాంక్షించారు. స్వాతంత్ర్య సమరయోధుల ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని వికసిత్ భారత్ నిర్మాణానికి పునరంకితం కావాలని గవర్నర్ పిలుపునిచ్చారు -
వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి: రాష్ట్రపతి
ఢిల్లీ భారతదేశ 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న(శుక్రవారం) సాయంత్రం జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరిస్తూ, దేశ భద్రత, ఐక్యత, మరియు ప్రగతికి ప్రతి ఒక్కరూ బాధ్యత వహించాలని ఆమె తన సందేశంలో పిలుపునిచ్చారు. రాష్ట్రపతి ప్రసంగంలోని ముఖ్యాంశాలు.. ‘ వికసిత్ భారత్ కోసం అందరూ కృషి చేయాలి. రాజ్యాంగాన్ని ప్రతి ఒక్కరూ గౌరవించాలి. అభివృద్ధి ఫలాలు ప్రతి పౌరుడికీ అందించాలి. వందేమాతరం గీతాన్ని మనం గౌరవించాలి. యువత తమ స్పప్నాలను సాకారం చేసుకోవాలి. న్యాయవ్యవస్థ, చట్ట సభలను గౌరవించాలి. ఆయుష్మాన్ భారత్ ద్వారా 70 కోట్ల మందికి వైద్య సేవలు అందుతున్నాయి. కిసాన్ సమ్మాన్‌తో వ్యవసాయం, అనుబంధాల రంగాల బలోపేతం’ అని తన సందేశంలో పేర్కొన్నారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. -
79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు!
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు దేశం ముందు పేదరికం, నిరక్షరాస్యత, ఆహార కొరత, తక్కువ పారిశ్రామిక సామర్థ్యం వంటి అనేక సవాళ్లు ఉన్నాయి. అప్పట్లో.. సాధారణ కుటుంబానికి స్వాతంత్య్రం అంటే కేవలం రాజకీయ స్వేచ్ఛ మాత్రమే కాదు.. కనీస అవసరాలు తీరే మంచి జీవితం రావాలనే ఆశ కూడా.చారిత్రక అంచనాల ప్రకారం.. స్వాతంత్య్రం వచ్చిన సమయంలో భారతదేశంలో పేదరికం చాలా ఎక్కువగా ఉండేది. అందుకే తొలి దశాబ్దాల్లో దేశ ఆర్థిక ప్రయాణం ప్రధానంగా ప్రజలను కనీస జీవన ప్రమాణాల వైపు తీసుకెళ్లడంపైనే సాగింది. కానీ.. ఇప్పుడు పరిస్థితి క్రమంగా మారుతోంది. ఒకప్పుడు కుటుంబానికి అవసరమైన వస్తువులు కొనడం పెద్ద లక్ష్యంగా ఉండేది. ఇప్పుడు ఏ బ్రాండ్ కొనాలి, ఎలాంటి కారు తీసుకోవాలి, వెకేషన్‌కు ఎక్కడికి వెళ్లాలి అనే స్థాయికి భారతీయుల ఆలోచనలు మారాయి.ఈ మార్పు మన ఇళ్లలోనే స్పష్టంగా కనిపిస్తుంది. ఒకప్పుడు టీవీ కొనడం పెద్ద విషయం. ఆ తర్వాత ఫ్రిజ్, వాషింగ్ మెషీన్, స్కూటర్, కారు వంటివి కుటుంబాల అవసరాల జాబితాలోకి చేరాయి. ఇప్పుడు మాత్రం సాధారణ కారు సరిపోతుందా? SUV కొనాలా? ఎలక్ట్రిక్ కారు తీసుకోవాలా? అనే స్థాయికి వినియోగదారుల ఆలోచన చేరింది.ఏం కొనాలి నుంచి..పొదుపు విషయంలోనూ మార్పు వచ్చింది. గతంలో బ్యాంక్ డిపాజిట్లు, బంగారం, స్థిరాస్తులే ప్రధానంగా ఉండేవి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్, షేర్లు, సిప్, ఇన్సూరెన్స్ వంటి పెట్టుబడులు కూడా సాధారణ కుటుంబాలకు పరిచయం అయ్యాయి. అంటే.. భారతీయుల కథ ''ఏం కొనాలి?'' అనే స్థాయి నుంచి ''ఏది నాకు ఎక్కువ విలువ ఇస్తుంది?'' అనే స్థాయికి మారుతోంది.కుటుంబాల ఖర్చుల్లో కూడా ఈ మార్పు కనిపిస్తోంది. ముఖ్యంగా.. గ్రామీణ, పట్టణ వినియోగ వ్యత్యాసం కూడా క్రమంగా తగ్గుతోంది. గతంలో పట్టణ కుటుంబాలు గ్రామీణ కుటుంబాల కంటే చాలా ఎక్కువ ఖర్చు చేసేవి. ఇప్పుడు చిన్న పట్టణాలు, గ్రామాల్లో కూడా ఆదాయం, డిజిటల్ సేవలు, క్రెడిట్ సౌకర్యాలు, ఆన్లైన్ షాపింగ్ పెరగడంతో వినియోగ అవకాశాలు విస్తరిస్తున్నాయి. గతంలో ''కూడు, గూడు, గుడ్డ'' ప్రధాన అవసరాలైతే.. ఇప్పుడు ఏ ఫుడ్ తినాలి, ఏ బ్రాండ్ దుస్తులు ధరించాలి, ఏ ప్రాంతంలో నివసించాలి అనే ఎంపికలు కూడా వినియోగంలో భాగమవుతున్నాయి.ఎలక్ట్రానిక్స్ విషయంలో..కారు, మొబైల్, ప్రయాణం వంటి రంగాల్లో ఈ ప్రీమియమైజేషన్ మరింత స్పష్టంగా కనిపిస్తోంది. ఒకప్పుడు చిన్న హ్యాచ్‌బ్యాక్ కారు కొనడం పెద్ద కల. ఇప్పుడు SUVలపై భారతీయుల ఆసక్తి భారీగా పెరిగింది. కొత్త కారు కొనలేని వారు కూడా మంచి ఫీచర్లు ఉన్న ప్రీమియం సెకండ్‌హ్యాండ్ కార్ల వైపు చూస్తున్నారు.ఇదే విధంగా రూ.30 వేలకుపైగా ధర ఉన్న ప్రీమియం స్మార్ట్ఫోన్ల మార్కెట్ వాటా కూడా గణనీయంగా పెరిగింది. వినియోగదారులు ప్రతి వస్తువుపై ఎక్కువ ఖర్చు చేయడం లేదు. తమకు ముఖ్యమైన వస్తువుల విషయంలో మాత్రం ఎక్కువ డబ్బు పెట్టడానికి సిద్ధపడుతున్నారు. ఇక ప్రయాణాల విషయంలోనూ మార్పు వచ్చింది. విదేశీ పర్యటనలు ఒకప్పుడు కొద్దిమంది సంపన్నులకు మాత్రమే సాధ్యమైన విషయం. ఇప్పుడు మధ్యతరగతి కుటుంబాల్లో కూడా విదేశీ ట్రిప్ ఒక సాధారణ ఆశగా మారుతోంది. 2025లో భారతీయులు రికార్డు స్థాయిలో 3.28 కోట్లకు పైగా విదేశీ ప్రయాణాలు చేసినట్లు గణాంకాలు చెబుతున్నాయి.పొదుపు నుంచి సంపద సృష్టిఇక మరో పెద్ద మార్పు పొదుపు నుంచి సంపద సృష్టి వైపు వచ్చింది. గతంలో భవిష్యత్ భద్రత కోసం డబ్బును బ్యాంకులో దాచుకోవడం, బంగారం కొనడం లేదా స్థలం తీసుకోవడం సాధారణం. ఇప్పుడు యువతతో పాటు మధ్యతరగతి కుటుంబాలు కూడా సిప్, మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెడుతున్నాయి. వార్షిక గృహ ఆర్థిక పొదుపుల్లో ఈక్విటీ, మ్యూచువల్ ఫండ్స్ వాటా FY12లో కేవలం 2 శాతం ఉండగా, FY25 నాటికి 15 శాతానికి పైగా పెరిగింది. సిప్ పెట్టుబడులు కూడా భారీగా పెరిగాయి. అంటే భారతీయుల ఆర్థిక ఆశయం కూడా మారుతోంది. 'డబ్బు దాచుకోవాలి అనే ఆలోచన నుంచి 'డబ్బుతో మరింత సంపద సృష్టించాలి' అనే ఆలోచనకు ప్రజలు వస్తున్నారు. -
79 నుంచి 80కి.. మన జీవితంలో ఏం మారింది?
జాతీయ జెండా రెపరెపలాడుతుంది.. దేశభక్తి గీతాలు మార్మోగుతాయి.. ఎర్రకోట వేదికగా దేశ ప్రగతి ప్రస్థానం మరోసారి వినిపిస్తుంది. రహదారుల నుంచి రాకెట్ల వరకు.. డిజిటల్ చెల్లింపుల నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ సాధించిన విజయాలను ప్రభుత్వం దేశం ముందుంచుతుంది. కానీ ప్రతి స్వాతంత్ర్య దినోత్సవం కేవలం విజయాలను లెక్కించుకునే సందర్భమే కాదు.. ఆ అభివృద్ధి సామాన్యుడి జీవితంలో ఎంత మార్పు తీసుకొచ్చిందో సమీక్షించుకునే సమయం కూడా.79వ స్వాతంత్ర్య దినోత్సవం నుంచి 80వ దినోత్సవం వరకు భారత్ ఎన్నో రంగాల్లో ముందడుగు వేసింది. ఆర్థిక వృద్ధి, మౌలిక వసతులు, డిజిటల్ విప్లవం, అంతరిక్ష పరిశోధనలు, ప్రపంచ వేదికపై పెరిగిన ప్రాధాన్యం.. ఇవన్నీ కొత్త భారత్ చిత్రాన్ని చూపిస్తున్నాయి. అదే సమయంలో ఉద్యోగాలు, ధరల భారం, ఆదాయ అసమానతలు, వ్యవసాయ సమస్యలు వంటి ప్రశ్నలు కూడా కొనసాగుతున్నాయి. అభివృద్ధి వేగం పెరిగిన ఈ ఏడాదిలో.. ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో ఎంతవరకు కనిపించింది? ఇదే 80వ స్వాతంత్ర్య దినోత్సవం ముందున్న అసలు ప్రశ్న.జీడీపీ నుంచి జేబు దాకా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో అనిశ్చిత పరిస్థితులు ఉన్నప్పటికీ భారత్ వేగంగా ఎదుగుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా కొనసాగుతోంది. తయారీ రంగం, సేవల రంగం, మౌలిక వసతులు, స్టార్టప్ వ్యవస్థల్లో పెట్టుబడులు పెరిగాయి. దేశాన్ని తయారీ కేంద్రంగా మార్చాలన్న లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పలు కార్యక్రమాలు పరిశ్రమలకు ఊతమిస్తున్నాయి.భారత్ ఆర్థిక పరిమాణం పెరుగుతోందని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిలో భారత మార్కెట్ ఆకర్షణీయంగా మారిందని ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.అయితే మరోవైపు సామాన్య కుటుంబాల లెక్కలు వేరుగా ఉన్నాయి. నిత్యావసర ధరలు, విద్య, వైద్య ఖర్చులు, ఇళ్ల అద్దెలు పెరగడం మధ్యతరగతి కుటుంబాల బడ్జెట్‌పై ప్రభావం చూపుతోంది. దేశ సంపద పెరుగుతున్న వేగం.. ప్రతి కుటుంబ ఆర్థిక భద్రత పెరుగుతున్న వేగంతో సమానమా? అనే చర్చ కొనసాగుతోంది.మన డిజిటల్ భారతం.. భారత్‌లో అత్యంత వేగంగా కనిపించిన మార్పుల్లో డిజిటల్ విప్లవం ఒకటి. ఒకప్పుడు బ్యాంకు సేవల కోసం రోజుల తరబడి వేచి చూసిన ప్రజలు ఇప్పుడు మొబైల్ ద్వారా క్షణాల్లో లావాదేవీలు నిర్వహిస్తున్నారు. చిన్న వ్యాపారి, కూరగాయల విక్రేత, ఆటో డ్రైవర్.. ఇలా సామాన్యుడి జీవితంలోనూ డిజిటల్ చెల్లింపులు భాగమయ్యాయి. యూపీఐ వంటి వ్యవస్థలు భారత ఆర్థిక లావాదేవీల రూపాన్ని మార్చాయి.అదే సమయంలో కృత్రిమ మేధస్సు (AI) కొత్త అవకాశాలను తెస్తోంది. విద్య, వైద్యం, వ్యవసాయం, పరిశ్రమలు, మీడియా రంగాల్లో సాంకేతిక మార్పులు వేగంగా జరుగుతున్నాయి. అయితే AI కారణంగా ఉద్యోగాల స్వరూపం ఎలా మారుతుందన్న ఆందోళన కూడా పెరుగుతోంది.రయ్.. రయ్..తిరిగేయ్దేశంలో మౌలిక వసతుల అభివృద్ధి గత కొన్నేళ్లుగా ప్రభుత్వ ప్రాధాన్యాల్లో ఒకటిగా కొనసాగుతోంది. కొత్త ఎక్స్‌ప్రెస్‌వేలు, రహదారులు, మెట్రో ప్రాజెక్టులు, రైల్వే ఆధునీకరణతో ప్రయాణ రూపం మారుతోంది. వందే భారత్ వంటి రైళ్లు ఆధునిక రైల్వేకు ప్రతీకగా నిలుస్తున్నాయి. నగరాల మధ్య కనెక్టివిటీ పెరుగుతోంది. విమానాశ్రయాల విస్తరణతో విమాన ప్రయాణం కూడా ఎక్కువ మందికి అందుబాటులోకి వస్తోంది.అయితే మరోవైపు గ్రామీణ రహదారులు, ప్రజా రవాణా, నగరాల్లో ట్రాఫిక్, కాలుష్యం వంటి సమస్యలు ఇంకా సవాళ్లుగానే ఉన్నాయి. అభివృద్ధి ప్రాజెక్టులతో పాటు వాటి ప్రయోజనాలు చివరి వ్యక్తికి చేరడం కూడా అంతే ముఖ్యం.అంతరిక్ష విజయాలే..చంద్రయాన్ విజయంతో అంతరిక్ష రంగంలో భారత్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు మానవ సహిత అంతరిక్ష ప్రయాణం, ప్రైవేటు అంతరిక్ష సంస్థలకు అవకాశాలు, కొత్త పరిశోధనలపై దృష్టి పెరిగింది. అంతర్జాతీయ రాజకీయాల్లోనూ భారత్ పాత్ర పెరిగింది. అమెరికా, రష్యా, యూరప్, ఇండో-పసిఫిక్ దేశాలతో సంబంధాలను కొనసాగిస్తూ ప్రపంచ సమస్యలపై తన అభిప్రాయాన్ని బలంగా వినిపిస్తోంది. ప్రపంచ వేదికపై పెరిగిన ఈ ప్రాధాన్యం భారత్ ఆర్థిక, దౌత్య శక్తిని ప్రతిబింబిస్తోంది.యువ భారత్.. ఆశలు పెద్దవి, సవాళ్లు కూడాభారత్ యువ జనాభా దేశానికి అతిపెద్ద బలం. అదే సమయంలో వారికి అవకాశాలు కల్పించడం అతిపెద్ద బాధ్యత. ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లు, కొత్త పరిశ్రమల ద్వారా ఉపాధి అవకాశాలు పెంచే ప్రయత్నాలు చేస్తోంది. కొత్త రంగాల్లో అవకాశాలు వస్తున్నాయి. అయితే లక్షలాది మంది యువతకు స్థిరమైన ఉద్యోగం, మెరుగైన వేతనం, ఉద్యోగ భద్రత ఇప్పటికీ కీలక అంశాలుగానే ఉన్నాయి. పోటీ పరీక్షలు, నియామకాల ఆలస్యం వంటి అంశాలు యువతలో అసంతృప్తికి కారణమవుతున్నాయి. జెన్‌జీ ఉద్యమాలు తెరపైకి వస్తున్నాయి.అభివృద్ధి కథలో మరో వైపు79 నుంచి 80కి భారత్ ప్రయాణం చూస్తే విజయాలు స్పష్టంగా కనిపిస్తాయి. డిజిటల్ శక్తి పెరిగింది. మౌలిక వసతులు విస్తరించాయి. అంతరిక్షం నుంచి ప్రపంచ రాజకీయాల వరకు భారత్ తన ముద్ర వేస్తోంది. కానీ ఒక దేశ అభివృద్ధిని కేవలం జీడీపీ, భారీ ప్రాజెక్టులు, అంతర్జాతీయ గుర్తింపుతో మాత్రమే కొలవలేం.ఒక రైతు ఆదాయం పెరిగిందా?ఒక యువకుడికి ఉద్యోగం దొరికిందా?ఒక కుటుంబానికి వైద్యం, విద్య భారం తగ్గిందా?ఒక సామాన్యుడి జీవన ప్రమాణం మెరుగుపడిందా?.. ఈ ప్రశ్నలకు వచ్చే సమాధానాలే అసలు అభివృద్ధికి కొలమానం.80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా భారత్ తన విజయాలను వేడుకగా జరుపుకుంటోంది. అదే సమయంలో ఇంకా చేరుకోవాల్సిన లక్ష్యాలను గుర్తు చేసుకోవాల్సిన సందర్భమూ ఇదే. గత ఏడాదిలో భారత్ చాలా మారింది.. కానీ ఆ మార్పు ప్రతి భారతీయుడి జీవితంలో మరింత స్పష్టంగా కనిపించడమే వచ్చే ప్రయాణానికి అసలైన సవాల్.:::వెబ్ ప్రత్యేకం


