భారతదేశంలో బంగారానికి ఎప్పుడూ డిమాండ్ ఉంటుంది. ఈ కారణంగానే ధరలు మెల్లగా పెరుగుతూ.. ఇప్పుడు రూ.1.50 లక్షలకు (10 గ్రాములు) చేరింది. అయితే.. మన దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు గోల్డ్ రేటు ఎలా ఉండేది?, ఆ తరువాత జరిగిన పరిణామం ఏమిటి?, అనే విషయాలను ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
మనదేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు(1947లో) 10 గ్రాముల బంగారం ధర కేవలం రూ.88.62 మాత్రమే. కానీ అదే 10 గ్రాముల గోల్డ్ రేటు ఇప్పుడు 2026 ఆగస్టు రూ.1,55,130 వద్దకు చేరింది. అంటే 80 ఏళ్లలో పసిడి ధర ఏకంగా 1711 రెట్లు పెరిగిందన్నమాట.
అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే.. బంగారం ధర ఇంతగా పెరగడం ఒక్కసారిగా జరగలేదు. దాదాపు ఎనిమిది దశాబ్దాల పాటు నెమ్మదిగా, మధ్య మధ్యలో హెచ్చుతగ్గులతో ఈ ప్రయాణం సాగింది. 1950లో 10 గ్రాముల గోల్డ్ రేటు 99.18 రూపాయలుగా ఉండేది. ఆ తరువాత 1964లో రూ.63.25కు చేరింది. అంటే.. బంగారం ధర కూడా ఎప్పుడూ పెరుగుతూనే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే కొన్నిసార్లు ధరలు తగ్గడం, మరికొన్ని సంవత్సరాలు పెద్దగా మార్పు లేకపోవడం జరిగింది.
ఇదే సమయంలో వెండి ధర కూడా భారీగా పెరిగింది. 1970-71లో ఒక కిలో వెండి సగటు ధర రూ.536.08 మాత్రమే. 2026 ఆగస్టు 15 నాటికి అది రూ.2.55 లక్షలకు చేరింది. అంటే దాదాపు 56 ఏళ్లలో వెండి ధర సుమారు 390 రెట్లు పెరిగింది. అయితే.. వెండి ధర కూడా ఎప్పుడూ ఒకే విధంగా పెరగలేదు. 2011-12లో కేజీ వెండి ధర రూ.57,315.87కు చేరిన తర్వాత, 2015-16లో రూ.36,318.10కు పడిపోయింది. ఆ తర్వాత మళ్లీ ధర పెరుగుతూ వచ్చింది.
బంగారం, వెండిని ధరలను పోల్చి చూస్తే ఒక ఆసక్తికరమైన విషయం కనిపిస్తుంది. 1984-85 నుంచి లెక్కిస్తే బంగారం ధర సుమారు 76 రెట్లు పెరిగింది. అదే సమయంలో వెండి ధర సుమారు 55 రెట్లు పెరిగింది. అంటే ఆ కాలంలో వెండితో పోలిస్తే బంగారం ధర పెరుగుదల ఎక్కువగా ఉందన్న విషయం స్పష్టమవుతుంది.
ఈ రోజు ధరలు
భారతదేశంలో ఈ రోజు గోల్డ్ రేటు రూ.1,55,130 (10 గ్రాముల 24 క్యారెట్స్ ధర) వద్ద ఉంటే.. 10 గ్రాముల 22 క్యారెట్స్ రేటు రూ.142200 వద్ద ఉంది. వెండి ధర రూ.2.55 లక్షలకు చేరింది. ఈ ధరలు ఇంకా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోల్డ్ రేటు ఎంత పెరుగుతుందనే విషయం తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: 79 ఏళ్లలో మారిపోయిన భారతీయుల ఖర్చు తీరు!


