మొబైల్ ఫోన్ వినియోగం నేటి జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. పనితో పాటు వినోదం, సోషల్ మీడియా, గేమ్స్.. ఇలా ప్రతి అవసరానికీ ఫోన్‌పైనే ఆధారపడుతున్న పరిస్థితి నెలకొంది. అయితే, అవసరానికి మించి గంటల తరబడి మొబైల్ చూడటం ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు తరచూ హెచ్చరిస్తుంటారు. తాజాగా ప్రముఖ నటి షకీలా తనకు ఎదురైన అనుభవాన్ని వెల్లడిస్తూ మొబైల్ వినియోగంపై అభిమానులను అప్రమత్తం చేశారు.
అతిగా ఫోన్ ఉపయోగించడం కారణంగా తాను తీవ్రమైన మెడ నొప్పితో బాధపడ్డానని షకీలా తెలిపారు. పరిస్థితి మరింత తీవ్రమవడంతో చివరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇందుకోసం సుమారు రూ.3 లక్షలు ఖర్చయినట్లు ఆమె వెల్లడించారు. ఈ సందర్భంగా మొబైల్ వినియోగాన్ని తగ్గించాలని అభిమానులకు సూచించారు.
గంటలు గంటలు ఫోన్ చూడటంతో..
ఫోన్‌లో ఎక్కువసేపు గేమ్స్ ఆడటం, యూట్యూబ్ వీడియోలు చూడటం, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ వీక్షించడం తనకు అలవాటుగా మారిపోయిందని షకీలా పేర్కొన్నారు. చివరకు నిద్రపోయే సమయంలో కూడా ఫోన్‌ను పక్కకు వాల్చుకుని గంటల తరబడి చూస్తూ ఉండేదానినని చెప్పింది. ఈ అలవాటు కారణంగా మెడపై నిరంతరం ఒత్తిడి పడిందని, మెడలోని నరాలపై తీవ్ర ప్రభావం పడటంతో నొప్పి భరించలేని స్థాయికి చేరిందని ఆమె చెప్పారు. వైద్యుల సూచన మేరకు శస్త్రచికిత్స చేయించుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు.
అవసరాన్ని మించి వాడకండి
తనకు ఎదురైన అనుభవాన్ని పంచుకుంటూ మొబైల్‌ను అవసరానికి మించి ఉపయోగించవద్దని షకీలా కోరారు. ‘ఫోన్ చాలా ముఖ్యం. కానీ అవసరానికి మించి దాన్ని వాడకండి. ఉపయోగం లేని వీడియోలు చూస్తూ సమయాన్ని వృథా చేసుకోకండి. మొబైల్‌ను సరిగ్గా ఉపయోగించకపోతే డబ్బులు ఖర్చవడమే కాకుండా, భరించలేని నొప్పిని కూడా అనుభవించాల్సి వస్తుంది. చిన్న పిల్లలకు ఫోన్ ఇచ్చే విషయంలో తల్లిదండ్రులు మరింత జాగ్రత్తగా ఉండాలి. మొబైల్ వినియోగాన్ని తగ్గించాలి’ అని ఆమె సూచించారు.
షకీలా 18 ఏళ్ల వయసులో తమిళ చిత్రం ‘ప్లే గర్ల్స్’తో సినీ రంగంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత మలయాళ చిత్రాల్లో నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా 2000లో విడుదలైన ‘కిన్నార తుంబికల్’ ఆమె కెరీర్‌కు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. తర్వాత దక్షిణాది భాషల్లో వరుస అవకాశాలు అందుకున్నారు. తెలుగులో దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం’ చిత్రంతో ఆమె ఎంట్రీ ఇచ్చారు. అనంతరం ‘నిజం’, ‘బంగారం’, ‘తొట్టిగ్యాంగ్’ తదితర చిత్రాల్లో నటించారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో పలు సినిమాల్లో నటించారు.


