యువతిని బెదిరించినట్లుగా ప్రముఖ గాయకుడు, బిగ్‌బాస్ తెలుగు విజేత రాహుల్ సిప్లిగంజ్ ఆంధ్రప్రదేశ్‌లో కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే . ఓ యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనతో పాటు మరో 15 మందిపై విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదు చేశారు. రాహుల్ సిప్లిగంజ్ బావమరిది రాహుల్ రెడ్డి తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని.. తర్వాత తన ఫొటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిట్ చేశాడని ఫిర్యాదులో పేర్కొంది.
తాజాగా ఈ వ్యవహారానికి సంబంధించినదిగా పేర్కొంటున్న బాధితురాలి వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. రాహుల్ సిప్లిగంజ్, ఆయన భార్య హిరణ్య రెడ్డి తనను బెదిరించారని ఆ వీడియోలో సదరు యువతి ఆరోపించింది.
నరికి చంపుతామని బెదిరించారు
తనను చంపుతామని రాహుల్ సిప్లిగంజ్ బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. అంతేకాకుండా.. రాహుల్ భార్య హిరణ్య రెడ్డి తనను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ‘నువ్వు చచ్చిపో’అంటూ హిరణ్య రెడ్డి అన్నారని ఆమె వీడియోలో చెప్పింది. అలాగే, ‘నిన్ను నరికి చంపుతాం’అంటూ రాహుల్ సిప్లిగంజ్ తనను బెదిరించారని బాధితురాలు ఆరోపించింది. ఈ వ్యాఖ్యలతో తాను తీవ్ర భయాందోళనకు గురయ్యానని పేర్కొంది.
హైదరాబాద్‌లో ఇంటికి తీసుకెళ్లి..
హైదరాబాద్‌లోని మరో వ్యక్తికి చెందిన ఇంటికి తనను తీసుకెళ్లారని, అక్కడ పలువురు కలిసి తనను వేధించారని బాధితురాలు ఆరోపించింది. ఆ సమయంలో తనకు ఎదురైన పరిస్థితులను గుర్తుచేసుకుంటూ వీడియోలో ఆమె కన్నీటి పర్యంతమైనట్లు తెలుస్తోంది.
అయితే ఈ ఆరోపణలకు సంబంధించి పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది. బాధితురాలు చేసిన ఆరోపణలు ప్రస్తుతం ఆమె వాంగ్మూలం, ఫిర్యాదు, వైరల్ వీడియో ఆధారంగానే ఉన్నాయి. వాటిపై రాహుల్ సిప్లిగంజ్, హిరణ్య రెడ్డి అధికారికంగా స్పందిస్తారా లేదా అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.


