లేహ్: లద్ధాఖ్‌లోని లేహ్ ప్రాంతంలో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ (ఎన్‌సీఎస్) వెల్లడించిన వివరాల ప్రకారం రిక్టరు స్కేలుపై ఈ భూకంప తీవ్రత 5.5గా నమోదైంది. ఉదయం సరిగ్గా 6:05 గంటలకు భూమి ఉపరితలానికి 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు కేంద్రీకృతమై ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ భారీ భూకంపం కారణంగా ఇప్పటివరకు ఎటువంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం సంభవించినట్లు సమాచారం లేదని అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే హఠాత్తుగా వచ్చిన ప్రకంపనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురై ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. భూకంప కేంద్రానికి సంబంధించిన కచ్చితమైన సమాచారం ఇంకా తెలియాల్సి ఉందని, తదుపరి వివరాల కోసం వేచి చూస్తున్నామని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ పేర్కొంది.


