తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్‌ అధికారి అడిగిన ప్రశ్న.. | She lived with father in jail until an IAS officer asked her one question | Sakshi
Sakshi News home page

తండ్రి చెంత జైలులోనే ఆ చిన్నారి..!ఆ ఐఏఎస్‌ అధికారి అడిగిన ప్రశ్న..

Aug 12 2026 4:22 PM | Updated on Aug 12 2026 4:32 PM

She lived with father in jail until an IAS officer asked her one question

తల్లిదండ్రులు చేసే తప్పులకు ఒక్కోసారి పిల్లల భవిష్యత్తు అంధకారంలో మగ్గిపోతుంటుంది. అంతేగాదు కొందరు అనాధలుగా మిగిలిపోతుంటారు. ఆదుకునేవాళ్లు ఉంటే..మంచి భవిష్యత్తు లభిస్తుంది లేదంటే ప్రశ్నార్థకంగా మిగిలిపోతుంటాయి వారి జీవితాలు. అలాంటి జీవితాన్నే గడుపుతున్న ఓ చిన్నారిని ఐఏఎస్‌ అధికారి అడిగిన ప్రశ్న ఆమె జీవితాన్నే మార్చేసింది. 

ఈ ఘటన చత్తీశ్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌ సెంట్రల్‌ జైలులో చోటు  చేసుకుంది. అక్కడ ఖుషీ అనే ఆరేళ్ల చిన్నారి బాల్యం జైలులో సాగుతోంది. ఆమె తండ్రి జైలులో సుదీర్ఘ శిక్ష అనుభవిస్తుండటంతో ఆ చిన్నారి కూడా తండ్రితోపాటే జైలులో గడుపుతోంది. ఎందుకంటే ఆమెకు కేవలం 15 రోజుల వయసు ఉన్నప్పుడే తల్లి కామెర్ల వ్యాధితో మరణించింది. దాంతో ఆమె బాధ్యత తీసుకునేవారెవ్వరూ లేకపోవడంతో..ఆ చిన్నారిని కూడా తండ్రి తోపాటు జైలుకు తీసుకువచ్చారు. అయితే 2019లో ఐఏఎస్‌ అధికారి సంజయ్‌ కుమార్‌ అలంగ్‌ జైలుని సందర్శించేంత వరకు ఆమె బాల్యం జైలులోనే గడిచింది. 

ఆయన జైలు పనితీరు పరిశీలించడానికి రావడంతో మహిళా ఖైదీలతో ఆడుకుంటున్న చిన్నారి ఖుషీని గమనించారు. ఆమెలో ఏదో ఆకర్షణీయమైన విషయం ఆయన్ని కదిలించింది. అసలు ఆ చిన్నారి జైలుకి ఎందుకు వచ్చింది అని తెలుసుకోవాలనే కుతూహలం ఏర్పడి..ఆమె గురించి క్షుణ్ణంగా ఆరా తీయడం ప్రారంభించారు. అప్పుడే ఖుషీ గురించి మొత్తం తెలుస్తుంది ఆ అధికారికి. ఆ తర్వాత ఆయన ఆ చిన్నారిని దగ్గరకు తీసుకుని జీవితంలో ఏం చేయాలనుకుంటున్నావని అడిగారు. దానికి ఆ చిన్నారి అమాయకంగా స్కూల్లో చదువుకుంటానని తడుముకోకుండా చెప్పేసింది. 

దాంతో ఆయన ఆ చిన్నారిని జైలు నుంచి బయటకు రప్పించి పాఠశాలలో చేర్పించే మార్గాల గురించి అన్వేషించడం ప్రారంభించారు. ఆ అధికారి ప్రయత్నాల కారణంగా.. బిలాస్‌పూర్‌లోని జైన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఆ చిన్నారికి చదువు, వసతికి మద్దతు ఇచ్చేందుకు ముందుకు వచ్చింది. ప్రారంభంతో ఆమె కోసం సంరక్షకురాలిని కూడా ఏర్పాటు చేశారు. ఒక నేరస్థుడి కూతురిగా జైల్లో మగ్గిపోతున్న ఆమె బాల్యాన్ని అనుకోని పరిస్థితులు మంచి స్థితి వైపుకి నడిచేలా చేసి..కొత్త జీవితాన్ని ప్రసాదించింది. ఇక్కడ ఖుషీ కథ పిల్లలు అద్భుతమైన పరిస్థితుల్లో పుట్టాల్సిన అవసరం లేకపోయినా..అంధకారం ముసిరినా..అభ్యున్నతి అనే వెలుగు ద్వారం, ఐఏఎస్‌ అధికారి రూపంలో తెరుచుకుంది. 

ఎత్తుగా ఉండే జైలు గోడల మధ్య సాగిన ఆమె బాల్యం బయట ప్రపంచాలన్ని చూడాలనే ఆరాటాన్ని రేకెత్తించి ఇలా చదువుకోవాలనే కోరికను వెలిబుచ్చేందుకు దారితీసింది. అలాగే ఆ ఐఏఎస్‌ అధికారి ఖుషీని అడిగిన ప్రశ్న..పరిస్థితుల కారణంగా మూసుకుపోయిన ద్వారాన్ని తెరిచింది. పైగా ఆ చిన్నారి కథ కేవలం సంరక్షణ మాత్రమే కాదు, సామర్థ్యాన్ని , వారి కోరికలు, ఆకాంక్షలు వినేవారు, మార్గం చూపేవారు కావలని చెబుతోంది. సరైన సమయంలో కల్పించే చిన్న అవకాశం ఒక బిడ్డ జీవిత గమనాన్నే మార్చగలదు అనేందుకు ఖుషీ జీవితమే ఉదాహరణ కదూ..!.

(చదవండి: లాయర్‌గా కంటే కంటెంట్‌ క్రియేటర్‌గానే ఎక్కువ సంపాదించా..!)
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement