‘అయోధ్య’ సీఈవో ఇంటర్వ్యూలో.. ‘మందు కొడతారా?.. శాకాహారులా?’ | Ayodhya Ram Mandir CEO Interview Sparks Debate Over Questions On Religion, Diet And Personal Beliefs, Check Out Full Story Inside | Sakshi
Sakshi News home page

‘అయోధ్య’ సీఈవో ఇంటర్వ్యూలో.. ‘మందు కొడతారా?.. శాకాహారులా?’

Aug 12 2026 10:49 AM | Updated on Aug 12 2026 11:01 AM

Ram Temple CEO Selection Process Questions on Religious Practices Spark Debate

అయోధ్య: అయోధ్యలోని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ కోసం మొదటి పూర్తిస్థాయి సీఈఓ నియామక ప్రక్రియ ఆసక్తికరంగా సాగుతోంది. ఈ పదవి కోసం అర్హులైన అభ్యర్థులను ఇంటర్వ్యూ ప్యానెల్ అడిగిన ప్రశ్నలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. సుమారు 5,200 దరఖాస్తుల నుంచి షార్ట్‌లిస్ట్ చేసిన 18 మంది అభ్యర్థులలో మంగళవారం ఎనిమిది మందికి ఇంటర్వ్యూలు నిర్వహించారు.

ఈ ఇంటర్వ్యూ ప్రక్రియలో అభ్యర్థులను కేవలం పరిపాలనా నైపుణ్యాల గురించి మాత్రమే కాకుండా, వారి వ్యక్తిగత ఆచారాలు, ఆహారపు అలవాట్లు, మతపరమైన నమ్మకాల గురించి కూడా ప్రశ్నించడం గమనార్హం. ‘మీరు నిజమైన హిందువా? కేవలం నమ్మకం కలిగినవారా? మీరు జంధ్యం ధరిస్తారా? శిఖ ఉంచుకుంటారా? శాకాహారా?’ తదితర ప్రశ్నలు అభ్యర్థులకు ఎదురయ్యాయి. అంతేకాకుండా, మద్యం సేవిస్తారా లేదా అని కూడా ప్యానెల్ సభ్యులు అడిగినట్లు పీటీఐ వార్తా సంస్థ పేర్కొంది.

రామ మందిరానికి సంబంధించిన మతపరమైన ఆచారాలను ఎంతవరకు పాటిస్తారో, వేషధారణ ఎలా ఉంటుందో కూడా పరిశీలించారు. అయితే, ఇంటర్వ్యూలో వీటితో పాటు నాయకత్వ లక్షణాలు, సామాజిక కార్యకలాపాల్లో భాగస్వామ్యం, రామ మందిరం అభివృద్ధికి వారి ప్రణాళికలు వంటి అంశాలపై కూడా చర్చించారు. మాజీ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ప్రమోద్ కోహ్లీ, రిటైర్డ్ లెఫ్టినెంట్ జనరల్ విశ్వకాంత్ చతుర్వేది, సురేష్ హవారేలతో కూడిన ముగ్గురు సభ్యుల కమిటీ ఈ ఎంపిక ప్రక్రియను చేపట్టింది. విరాళాల దుర్వినియోగంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, పారదర్శకమైన పాలన కోసం ట్రస్ట్ ఈ నియామకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.

అభ్యర్థులు మీడియాకు ఎలాంటి సమాచారం ఇవ్వకూడదని ట్రస్ట్ కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆలయ ప్రాంగణంలోని ‘గ్రీన్ హౌస్’లో అత్యంత గోప్యంగా ఈ ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి. నివేదికల ప్రకారం ఈ ప్రక్రియ మరో నాలుగు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. కమిటీ ముగ్గురు అభ్యర్థుల పేర్లను ట్రస్ట్‌కు సిఫార్సు చేయనుంది. వారిలో ఒకరిని సెప్టెంబర్ 2న సీఈఓగా ప్రకటించే అవకాశం ఉంది.

ఇది కూడా చదవండి: నసీరుద్దీన్‌ షా ఒక గుంటనక్క: కంగనా ఫైర్

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement