భారతదేశంలో వేగంగా చోటుచేసుకుంటున్న జనాభా మార్పులు రాబోయే దశాబ్దాల్లో దేశ ఆర్థిక వృద్ధికి ప్రధాన ఇంజిన్‌గా మారనున్నాయి. పని చేస్తున్న జనాభా పెరుగుదుల, విస్తరిస్తున్న మధ్యతరగతి, వేగవంతమైన పట్టణీకరణ కలసి వినియోగ రంగాన్ని, విద్యుత్తు, ఇంధన అవసరాలను మెరుగైన స్థాయికి తీసుకెళ్తున్నాయి.
వినియోగ వైఖరిలో మార్పులు
గతంలో కేవలం ప్రాథమిక అవసరాలకే పరిమితమైన భారతీయ కుటుంబాల వ్యయం, ప్రస్తుతం మెరుగైన జీవనశైలి, ప్రీమియమైజేషన్ వైపు మళ్లుతోంది. 2030 నాటికి దేశంలో పట్టణ జనాభా దాదాపు 40 శాతానికి (సుమారు 60 కోట్లు) చేరనుండటంతో పాటు మధ్యతరగతి గృహాల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ప్రధాన మెట్రో నగరాలకే పరిమితం కాకుండా టైర్-2, టైర్-3 నగరాలు (కన్జ్యూమర్ సిటీస్) సరికొత్త వినియోగ కేంద్రాలుగా అవతరిస్తున్నాయి. డిజిటల్ నెట్‌వర్క్, ఎలక్ట్రానిక్స్, వాహనాలు, గృహోపకరణాలు, క్విక్ కామర్స్ వ్యాపారాల్లో వృద్ధి నమోదువుతోంది.
ఇంధన రంగానికి సవాళ్లు.. పెట్టుబడుల అవకాశాలు
పట్టణీకరణ పెరగడంతో ఇళ్లలో ఏసీలు, డిజిటల్ పరికరాలు, రవాణా రంగంలో వాహనాల వినియోగం విపరీతంగా పెరిగింది. ఇది దేశీయ విద్యుత్తు డిమాండ్‌ను రికార్డు స్థాయికి తీసుకెళ్తోంది. ఈ భారీ డిమాండ్‌ను అందుకోవడానికి సంప్రదాయ విద్యుత్తు వ్యవస్థలతో పాటు సోలార్, విండ్ వంటి పునరుత్పాదక ఇంధన రంగాన్ని విస్తరించాల్సిన అవసరం ఏర్పడింది. 2036 నాటికి పట్టణ మౌలిక వసతుల కల్పనకు సుమారు 840 బిలియన్ డాలర్ల మేర పెట్టుబడులు అవసరమవుతాయని ఆర్థిక రంగానికి చెందిన అధికారిక అంచనాలు స్పష్టం చేస్తున్నాయి.
భారతదేశ జనాభా అనుకూలత దేశానికి లభించిన ఒక గొప్ప ఆర్థిక అవకాశమని నిపుణులు చెబుతున్నారు. అయితే, పెరుగుతున్న వినియోగం, ఇంధన డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్ ఆధునీకరణ, క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్, సుస్థిర మౌలిక సదుపాయాలను సకాలంలో నిర్మించడంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టమైన వ్యూహంతో ముందుకు సాగాలి. సరైన ప్రణాళికలు అమలైతేనే ఈ జనాభా పరిణామం వికసిత్ భారత్ స్వప్నానికి బలమైన పునాదిగా నిలుస్తుంది.
ఇదీ చదవండి: ‘నన్ను నగ్నంగా మార్చకండి!’


