ప్రస్తుత డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) అన్ని రంగాలను శాసిస్తోంది. అయితే, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు వెన్నుముకగా నిలిచే ఇంధన (ఎనర్జీ) రంగం మాత్రం ఈ సాంకేతిక విప్లవాన్ని అందుకోవడంలో వెనుకబడి ఉందని కొందరు నిపుణులు చెబుతున్నారు. గ్లోబల్ టెక్నాలజీ నివేదికల ప్రకారం, సాంకేతిక పెట్టుబడులపై ఇతర రంగాలు సాధిస్తున్న 200 శాతం రాబడిని (ఆర్‌ఓఐ) ఇంధన రంగం అందుకోలేకపోతోంది. మెజారిటీ కంపెనీలు కేవలం పెట్టిన ఖర్చును మాత్రమే వెనక్కి రాబట్టగలుగుతున్నాయి.
ప్రయోగాల దశలోనే..
ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక చమురు శుద్ధి కర్మాగారాలు, పంపిణీ గ్రిడ్‌లు దశాబ్దాల క్రితం నాటి పాత నియంత్రణ వ్యవస్థలపై నడుస్తుండడమే ఇందుకు కారణమని నివేదికలు చెబుతున్నాయి. ఇవి ఆధునిక క్లౌడ్ ప్లాట్‌ఫారమ్‌లతో లేదా మెషిన్ లెర్నింగ్ మోడళ్లతో డేటాను పంచుకోవడానికి ఏమాత్రం సరిపోవు. వీటిని మార్చడం అత్యంత ఖరీదైన వ్యవహారం. దాంతో సంస్థలు ఇంధన వ్యవస్థలో ఏఐ ఆధునీకరణను వాయిదా వేస్తున్నాయి. ఫలితంగా, దాదాపు ప్రతి పెద్ద సంస్థ ఏఐ పైలట్ ప్రాజెక్టులను ప్రారంభిస్తున్నప్పటికీ అవి కేవలం ప్రయోగాల దశలోనే నిలిచిపోతున్నాయి కానీ క్షేత్రస్థాయిలో పూర్తిస్థాయి విస్తరణకు నోచుకోవడం లేదు.
ఏఐ కొన్ని విభాగాలకే పరిమితం
భారతదేశం విషయానికి వస్తే ఎన్టీపీసీ, ఓఎన్‌జీసీ వంటి దిగ్గజాలు డిజిటల్ వైపు అడుగులు వేస్తున్నా క్షేత్రస్థాయిలో విద్యుత్‌ను సరఫరా చేసే రాష్ట్ర పంపిణీ సంస్థలు (డిస్కమ్‌లు) ఇప్పటికీ తప్పుడు మీటర్ డేటా, బిల్లింగ్ లోపాలు, గ్రిడ్ నష్టాలతో కొట్టుమిట్టాడుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఉత్పత్తి అయిన విద్యుత్తులో 25 శాతానికి పైగా వృథా అవుతోంది. ఇలాంటి ప్రాథమిక సమస్యలు ఉన్నప్పుడు అధునాతన ఏజెంటిక్ ఏఐ గురించి ఆలోచించడం అప్రస్తుతం అవుతుందనే భావనలున్నాయి. ప్రస్తుతం లభిస్తున్న ఆర్థిక ప్రయోజనాలు కూడా కేవలం బ్యాక్ ఆఫీస్, ఫైనాన్స్, హెచ్ఆర్ వంటి పరిపాలనా విభాగాలకే పరిమితమయ్యాయి.
అయితే, భవిష్యత్ అవసరాల దృష్ట్యా ఇంధన రంగానికి ఏఐ అనివార్యం. ముఖ్యంగా, 2030 నాటికి 500 గిగావాట్ల శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని సాధించాలనే భారతదేశ లక్ష్యానికి గ్రిడ్ నిర్వహణ చాలా కీలకం. సౌర, పవన విద్యుత్ వంటి పునరుత్పాదక ఇంధనాల సరఫరా వాతావరణంపై ఆధారపడి మారుతుంటుంది. నిరంతరం మారే డిమాండ్‌కు అనుగుణంగా గ్రిడ్‌ను సమతుల్యం చేయడం హ్యుమన్ ఆపరేటర్ల వల్ల సాధ్యం కాదు. ఇక్కడే ఏఐ ఆధారిత గ్రిడ్ మేనేజ్‌మెంట్ అవసరమవుతుంది.
సైబర్ భద్రత మాటేంటి..
సైబర్ భద్రత ఇక్కడ మరో పెద్ద సవాలు. ఇంధన రంగంలో భద్రతా లోపాలు ఏర్పడితే దేశవ్యాప్త బ్లాక్‌అవుట్‌లు వచ్చే ప్రమాదం ఉంది. దీనితో పాటు, అటు ఇంధన వ్యవస్థల మౌలిక సదుపాయాలు, ఇటు ఏఐ ఆర్కిటెక్చర్‌ను రెండింటినీ సమగ్రంగా అర్థం చేసుకోగల నిపుణుల కొరత భారతదేశంలో స్పష్టంగా కనిపిస్తోంది.
ఇంధన రంగం నిజంగా ఏఐకి సిద్ధంగా మారాలంటే కేవలం కొత్త సాఫ్ట్‌వేర్‌లను కొనుగోలు చేస్తే సరిపోదని కొందరు చెబుతున్నారు. పాత మౌలిక సదుపాయాలను ఆధునీకరించడం, నమ్మదగిన డేటా వ్యవస్థలను నిర్మించడం, సాంకేతికతను, మౌలిక సదుపాయాలను అనుసంధానించే సమర్థవంతమైన మానవ వనరులను తయారు చేయడం చాలా అవసరం. అప్పుడే ఇంధన భద్రత, స్థిరమైన ప్రగతి సాధ్యమవుతాయి.
ఇదీ చదవండి: బంగారం కొనాలా? వద్దా?


