న్యూఢిల్లీ: దేశరాజధాని ఢిల్లీలో సంచలనం సృష్టించిన శ్రద్ధా వాకర్ హత్య కేసు నిందితుడు ఆఫ్తాబ్ అమీన్ పూనావాలా తీహార్ జైలు నుంచి ఎంఏ పరీక్షలు రాయనున్నాడు. ఈ నేపథ్యంలో జూలై 20న కోర్టులో వ్యక్తిగత హాజరు నుండి ఢిల్లీ న్యాయస్థానం అతనికి మినహాయింపునిచ్చింది. ప్రాసిక్యూషన్ సాక్ష్యాల నమోదు కోసం కోర్టు జూలై 20 నుండి 25 వరకు రోజువారీ విచారణను గత మే నెలలో ఖరారు చేసింది.
అయితే జూలై 20 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు తనకు ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో ఎంఏ సోషియాలజీ చివరి పరీక్ష ఉందని, అందుకే ఆ రోజు వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు ఇవ్వాలని ఆఫ్తాబ్ కోర్టును కోరారు. తీహార్‌లోని సెంట్రల్ జైలు నంబర్ 3లో జూలై 11 నుండి 20 వరకు ఈ పరీక్షలు జరుగుతున్నాయి.
ఈ కేసును విచారిస్తున్న సెషన్స్ న్యాయమూర్తి హర్‌గురువరిందర్ సింగ్ జగ్గీ.. జూలై 20న విచారణను వాయిదా వేస్తూ, జూలై 21 మధ్యాహ్నం 2 గంటల నుండి తిరిగి సాక్ష్యాల నమోదు ప్రక్రియను ప్రారంభించాలని ఆదేశించారు. కోర్టు ముందుగా నిర్ణయించిన మిగిలిన తేదీల విచారణ యథావిధిగా కొనసాగుతుందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ కేసులో ఇంకా ఎనిమిది మంది సాక్షులను విచారించాల్సి ఉందని ప్రాసిక్యూషన్ తెలిపింది. 13 మంది సాక్షుల వాంగ్మూలాలను పాక్షికంగా నమోదు చేయగా, 12 మంది సాక్షుల విచారణ వాయిదా పడింది.
లివ్-ఇన్ రిలేషన్‌షిప్‌లో ఉన్న తన భాగస్వామి శ్రద్ధా వాకర్ (27)ను ఆఫ్తాబ్ అత్యంత దారుణంగా హత్య చేసి, ఆమె శరీరాన్ని 35 ముక్కలుగా నరికి ఢిల్లీలోని వివిధ ప్రాంతాల్లో పడేసినట్లు ఆరోపణలు వచ్చాయి. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో 2023లో ఢిల్లీ పోలీసులు ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. కాగా తాను నిర్దోషినని ఆఫ్తాబ్ కోర్టులో వాదించారు. జైలు నిబంధనలు, కోర్టు ఆదేశాల ప్రకారం విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలు విద్యను అభ్యసించే అవకాశం ఉండటంతో కోర్టు ఈ మినహాయింపునిచ్చింది.


