చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్‌ దెబ్బకు అతలాకుతలం | typhoon bavi hits china videos Viral | Sakshi
Sakshi News home page

చైనాపై ప్రకృతి విలయం.. టైఫూన్‌ దెబ్బకు అతలాకుతలం

Jul 12 2026 11:19 AM | Updated on Jul 12 2026 11:19 AM

typhoon bavi hits china videos Viral

చైనాలో ప్రకృతి విలయం కొనసాగుతోంది. శక్తివంతమైన టైఫూన్ బవి (Typhoon Bavi) తూర్పు తీరాన్ని తాకడంతో భారీ వర్షాలు, పెనుగాలులు బీభత్సం సృష్టించాయి. ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా దాదాపు 20 లక్షల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుపాను ప్రభావంతో పలు ప్రాంతాల్లో వరదలు, చెట్లు విరిగిపడటం, రవాణా అంతరాయాలు చోటుచేసుకున్నాయి.

TyphoonBavi.. టైఫూన్ బవి చైనాలోని జెజియాంగ్ ప్రావిన్స్ తీర ప్రాంతాన్ని తాకింది. తీరాన్ని తాకే సమయంలో గంటకు సుమారు 144 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచినట్లు వాతావరణ అధికారులు తెలిపారు. అనంతరం తుపాను బలహీనపడి తీవ్ర ఉష్ణమండల తుపానుగా మారినప్పటికీ, భారీ వర్షాల ముప్పు కొనసాగుతోంది. తుపాను ప్రభావంతో జెజియాంగ్ ప్రావిన్స్‌లో పెద్ద ఎత్తున సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యంగా యూకింగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో చెట్లు నేలకూలగా, కొన్ని ప్రాంతాల్లో రోడ్లు నీటమునిగాయి. అత్యవసర సిబ్బంది భారీ యంత్రాలతో రంగంలోకి దిగి రోడ్లను శుభ్రం చేసే పనులు చేపట్టారు.

టైఫూన్ దెబ్బకు రవాణా వ్యవస్థ తీవ్రంగా ప్రభావితమైంది. విమాన సర్వీసులు రద్దయ్యాయి, హైస్పీడ్ రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షాంఘైలోని విమానాశ్రయాల్లో వందలాది విమానాలు రద్దు చేసినట్లు సమాచారం. చైనాతో పాటు తైవాన్, జపాన్ దక్షిణ దీవులపై కూడా టైఫూన్ ప్రభావం చూపింది. తైవాన్‌లో బలమైన గాలులు, వర్షాల కారణంగా పలువురు గాయపడినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు.. వాతావరణ నిపుణులు మరో హెచ్చరిక జారీ చేశారు. తుపాను బలహీనపడినప్పటికీ తూర్పు చైనా ప్రాంతాల్లో వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రస్తుతం చైనా అధికారులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. తీర ప్రాంతాల్లో అత్యవసర బృందాలను సిద్ధంగా ఉంచి, ప్రజలకు జాగ్రత్త సూచనలు జారీ చేశారు. ప్రకృతి ప్రకోపం నుంచి కోట్లాది మంది ప్రజలను రక్షించేందుకు భారీ స్థాయిలో చర్యలు కొనసాగుతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement