ఇరాన్‌-అమెరికా మధ్య పతాక స్థాయి​​​​​కి క్షిపణి పోరు | Explosions Heard Over Qatar Capital Doha | Sakshi
Sakshi News home page

ఇరాన్‌-అమెరికా మధ్య పతాక స్థాయి​​​​​కి క్షిపణి పోరు

Jul 12 2026 10:06 AM | Updated on Jul 12 2026 10:35 AM

Explosions Heard Over Qatar Capital Doha

ఇరాన్‌-అమెరికా మధ్య  క్షిపణి పోరు పతాక స్థాయికి చేరింది. నిన్న అర్ధరాత్రి ఇరాన్‌పై మూడో విడతగా యూఎస్‌ మిలిటరీ భారీ వైమానిక దాడులు చేసింది. తాజా దాడుల్లో ఇరాన్‌, డ్రోన్‌, క్షిపణి కేంద్రాలు, కమ్యూనికేషన్‌ వ్యవస్థలే లక్ష్యంగా అమెరికా దాడులకు దిగింది. 140 ప్రాంతాలను ధ్వంసం చేశామని యూఎస్‌ సెంట్రల్‌ కమాండ్‌ పేర్కొంది. ఈ ఒక్కవారంలోనే అమెరికా జరిపిన 3 విడతల దాడుల్లో ఇరాన్‌కు చెందిన 300కు పైగా వ్యూహాత్మక సైనిక కేంద్రాలు తగలబడ్డాయి.

అమెరికా దాడులకు వ్యతిరేకంగా బాలిస్టిక్‌ క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతున్న ఇరాన్‌ రివల్యూషనరీ గార్డ్స్ జోర్డాన్‌లోని యూఎస్‌ సైనిక స్థావరంపై ఇరాన్‌ క్షిపణి దాడి జరిపింది. కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌, కీలక డ్రోన్‌ హ్యాంగర్లు ధ్వంసమయ్యాయి. కువైట్‌, బహ్రెయిన్‌లో అమెరికా పేట్రియాట్‌ రక్షణ వ్యవస్థల రాడర్‌ కేంద్రాలే లక్ష్యంగా ఇరాన్‌ డ్రోన్‌ దాడులు చేస్తోంది. ఖతార్‌, యూఏఈ దేశాలపైకి దూసుకొచ్చిన ఇరాన్‌ క్షిపణులను గాల్లోనే రక్షణ వ్యవస్థలు అడ్డుకున్నాయి.  

దోహా భారీ పేలుళ్ల శబ్దాలతో దద్దరిల్లింది. ఖతార్ సర్కార్.. భద్రతా అలర్ట్ జారీ చేసింది. ఇరాన్ క్షిపణులను అడ్డుకున్నామని యూఏఈ ప్రకటించింది. అమెరికా ఇరాన్‌పై దాడులు చేసిన అనంతరం మొత్తం మధ్యప్రాచ్యంలో మళ్లీ తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అమెరికా దాడులకు ప్రతిస్పందనగా గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ బలమైన ప్రతిదాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఖతార్ రాజధాని దోహాలో భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించడంతో.. ప్రభుత్వం పౌరుల మొబైల్ ఫోన్లకు అత్యవసర భద్రతా హెచ్చరిక పంపింది.

దేశంలో భద్రతా ముప్పు స్థాయి గణనీయంగా పెరిగినట్లు ఖతార్ అంతర్గత మంత్రిత్వ శాఖ అధికారికంగా ప్రకటించింది. దోహాతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న పౌరులంతా తమ ఇళ్లలో లేదా సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని.. అనవసర ప్రయాణాలకు దూరంగా ఉండాలని మంత్రిత్వ శాఖ కోరింది. ఏవిధమైన వైమానిక ముప్పు నుంచైనా రక్షణ పొందేందుకు ఈ జాగ్రత్తలు పాటించాలని పౌరులు, వలస కార్మికులకు సూచించారు. దోహాలో తీవ్రమైన పేలుళ్ల శబ్దాలు.. అలాగే ఇరాన్.. అమెరికా స్థావరాలపై చేపట్టిన ప్రతిదాడుల అనంతరం కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలో కూడా పేలుళ్లు సంభవించడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు మంత్రిత్వ శాఖ వెల్లడించింది.

ఇదిలా ఉండగా, తమ దేశంలోని వివిధ ప్రాంతాల్లో వినిపించిన భారీ పేలుళ్ల శబ్దాలు వాస్తవానికి ఇరాన్ బాలిస్టిక్ క్షిపణులు, క్రూయిజ్ క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న ఫలితమేనని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE) రక్షణ మంత్రిత్వ శాఖ ధృవీకరించింది. తమ వైమానిక రక్షణ వ్యవస్థ (ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్) దేశంలోని వివిధ ప్రాంతాల్లోకి ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణులతో పాటు దాడిచేసే డ్రోన్లను గగనతలంలోనే విజయవంతంగా అడ్డగించి ధ్వంసం చేసినట్లు యూఏఈ రక్షణ శాఖ తెలిపింది.

ఫార్స్ న్యూస్ నివేదిక ప్రకారం.. అమెరికా స్థావరాలపై ఇరాన్ సైన్యం చేపట్టిన ప్రతిదాడుల అనంతరం గల్ఫ్ ప్రాంతంలోని ఇతర ప్రధాన దేశాల్లో కూడా కలకలం రేగింది. యూఏఈ, ఖతార్‌లతో పాటు కువైట్, బహ్రెయిన్, జోర్డాన్‌లలో కూడా భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయి. పరిస్థితి తీవ్రతను గమనించిన గల్ఫ్ ప్రాంత దేశాలన్నీ తమ భద్రతా వ్యవస్థలను మరింత పటిష్టం చేసుకుంటూ, వైమానిక దాడులను ఎదుర్కొనేందుకు సన్నద్ధమవుతున్నాయి. మొత్తంగా చూస్తే, అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న సైనిక ఘర్షణ ఇప్పుడు కేవలం ఆ రెండు దేశాలకే పరిమితం కాకుండా, మొత్తం గల్ఫ్ ప్రాంతాన్ని ఆందోళనలోకి నెట్టేస్తోంది. అంతర్జాతీయ చమురు, గ్యాస్ సరఫరాపై కూడా ఈ ఉద్రిక్తతలు ప్రభావం చూపే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement