చార్టర్డ్ ప్లైట్లలో పనస పండ్ల ప్రయాణం! | jackfruit travels by chartered flight | Sakshi
Sakshi News home page

చార్టర్డ్ ప్లైట్లలో పనస పండ్ల ప్రయాణం!

Jul 12 2026 7:20 AM | Updated on Jul 12 2026 7:27 AM

jackfruit travels by chartered flight

మన దేశంలోని చాలా ప్రాంతాల్లో చెట్టుకు కాసి, వృథాగా రాలిపోయే పనస పండుకు అంతర్జాతీయ మార్కెట్లో ఇప్పుడు అత్యధిక డిమాండ్ పలుకుతోంది. కేరళ, తమిళనాడు రాష్ట్రాల అధికారిక ఫలమైన పనసపండు (జాక్‌ఫ్రూట్) ప్రస్తుతం సరిహద్దులు దాటి చార్టర్డ్ విమానాల్లో విదేశాలకు ఎగుమతి అవుతోంది. స్థానికంగా కేవలం రూ.10 పలుకుతున్న కిలో పనస ధర, విదేశీ మార్కెట్లలో ఏకంగా రూ.500 నుండి రూ.600 వరకు పలుకుతుండటం విశేషం. ముఖ్యంగా కేరళకు చెందిన ‘వరిక్క’ రకం పనస పండ్లకు గల్ఫ్, యూరప్ దేశాలలో విపరీతమైన ఆదరణ లభిస్తోంది.

చార్టర్డ్ విమానాల్లో.. 
పండగ సీజన్లలో గల్ఫ్, యూరప్ దేశాల నుండి వచ్చే డిమాండ్‌ను అందుకోవడానికి పనసపండ్ల విక్రయదారులు ఏకంగా చార్టర్డ్ విమానాలను కూడా ఉపయోగిస్తున్నారు. సాధారణంగా పండగ రోజుల్లో కేరళ నుండి ప్రతిరోజూ 500 కిలోల నుండి ఒక టన్ను వరకు పనస పండ్లను విదేశాలకు విమానాల ద్వారా తరలిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 11 దేశాలకు ఈ పండ్లు ప్రధానంగా ఎగుమతి అవుతున్నాయి. ఇతర దేశాల నుండి కూడా పనస పండ్లు గల్ఫ్, యూరప్ మార్కెట్లకు వస్తున్నప్పటికీ, కేరళ పనసకు ఉన్న ప్రత్యేక క్రేజ్ వల్ల దీనికే డిమాండ్ ఎక్కువగా ఉంటోంది.

పెరిగిన కార్గో ధరలు - ఎగుమతులపై ప్రభావం
ప్రస్తుత అంతర్జాతీయ యుద్ధ వాతావరణం కారణంగా కార్గో రవాణా ఛార్జీలు రెట్టింపయ్యాయి. దీనివల్ల గత కొన్ని నెలలుగా పనస ఎగుమతులు కొంత మేర తగ్గాయని పనస ఎగుమతిదారుడు ఆర్‌ అశోక్ తెలిపారు. విదేశీ ఎగుమతులతో పాటు, ఉత్తర భారత రాష్ట్రాలలో వేగన్ (పాలు, వెన్న, తేనె వంటి జంతుసంబంధిత ఉత్పత్తులను కూడా తీసుకోని వారు) ఆహారానికి ఆదరణ పెరగడంతో, వారికి అవసరమైన పచ్చి పనసకాయలను రైళ్ల ద్వారా ఉత్తరాది రాష్ట్రాలకు సరఫరా చేస్తున్నారు.

సీజన్ ఆధారిత ఎగుమతులు
పనస పండ్ల ఎగుమతి పూర్తిగా సీజన్లపై ఆధారపడి ఉంటుంది. కేరళలో ఫిబ్రవరి నుండి ఏప్రిల్ వరకు పనస పండ్లను ఎక్కువగా ఎగుమతి చేస్తారు. ఆ తర్వాత మే నుండి జూలై వరకు కేరళలో వర్షాకాలం (మాన్‌సూన్) ప్రారంభం కావడంతో, ఎగుమతిదారులు సరఫరా కోసం తమిళనాడుపై ఆధారపడతారు. వాతావరణ మార్పుల వల్ల కేరళలో పనస ఉత్పత్తిపై కొంత ప్రభావం పడినప్పటికీ, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో హైబ్రిడ్ పనస చెట్లను విస్తృతంగా సాగు చేస్తుండటంతో ఎగుమతులకు ఎలాంటి ఆటంకం కలగడం లేదు.

కొల్లి హిల్స్ పనస ప్రత్యేకత
తమిళనాడులోని నామక్కల్ జిల్లాలో సముద్ర మట్టానికి 1,300 మీటర్ల ఎత్తులో ఉన్న ‘కొల్లి హిల్స్’ ప్రాంతం పనస సాగుకు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ జూన్ నుండి ఆగస్టు వరకు పనస కోతల సీజన్ సాగుతుంది. కొల్లి హిల్స్ పనస పండ్లు వాటి పెద్ద తొనలు, అమితమైన తీపి, ప్రత్యేకమైన సువాసనకు మార్కెట్లో ఎంతో గుర్తింపు పొందాయి.

నాణ్యమైన సేకరణ విధానం
కొల్లి హిల్స్‌లో పనస పండ్లను సేకరించే విధానం ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది. ఎత్తైన, పెద్ద పెద్ద చెట్ల నుండి పండ్లు కింద పడి పాడవకుండా, నేలను తాకకుండా చాలా జాగ్రత్తగా తాడు సాయంతో కిందికి దించుతారు. ఇలా సేకరించిన నాణ్యమైన పండ్లను కొనుగోలుదారులు నేరుగా రైతులకు చెందిన తోటల వద్ద నుండి కానీ లేదా మధ్యవర్తుల ద్వారా కానీ కొనుగోలు చేస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement