అల్పాహారంలో తరాలు మారిన తరగని ఆదరణ ఒక్క ఇడ్లీకే ఉంది. అంతలా ప్రజాదరణ కలిగిన ఇడ్లీని ఎన్నో రకాలుగా అందిస్తున్నారు. కానీ కొందరు లాభప్రేక్షతో సంబంధం లేకుండా కడుపు నిండా ఆహారం అందించడమే ధ్యేయంగా నడుపుతున్న వ్యాపారాలు కూడా ఉన్నాయి. ఎన్నో హోటళ్లు, రెస్టారెంట్లు ఏ రేంజ్‌లో ఇడ్లీని విక్రయిస్తాయో తెలిసిందే. ఆఖరికి చిన్న చిన్న దుకాణాలు సైతం ఓ మోస్తారుగా రేటుని పెంచేశాయి. కానీ ఇప్పటికీ ఈ 70 ఏళ్ల వృద్ధుడు కేవలం రూ. 5లకే ఇడ్లీన అమ్ముతుండటం విశేషం. పైగా ఆ చుట్టపక్కల ఉండే ఏ రెస్టారెంట్ ఆయన ఇడ్లీ రుచికి పోటీ పడలేదంటే అతిశయోక్తి కాదేమో. అంత క్రేజ్ ఆ తాతగారి ఇడ్లీకి.
ఆయనే కర్ణాటకలోని బెంగళూరుకు చెందిన 70 ఏళ్ల రామచంద్ర. ఆయన తన తండ్రి వారసత్వాన్ని 56 ఏళ్లుగా కొనసాగిస్తున్నారు. ఇప్పటికీ కట్టెల పొయ్యిపై దక్షిణ భారతదేశపు ప్రసిద్ధ అల్పహారమైన ఇడ్లీని తయరు చేసి అందిస్తుంటాడు. ఆయన ప్రతి రోజు సుమారు 1500 ఇడ్లీలదాక తయరు చేస్తాడట. అవన్నీ అమ్ముడైపోవడం విశేషం. కారం కలిగిన ఎర్ర చట్నీతో కేవలం రూ. 5లకే అందిస్తుంటాడు. బెంగళూరు రెండు గంటల దూరంలో కనకపుర నగరంలో ఉన్న అతడి చిన్న దుకాణం క్రేజ్ మాములుగా ఉండదు. అక్కడుండే ప్రసిద్ధ హోటళ్లు కూడా రామచంద్ర ఇడ్లీ రుచి ముందు సరితూగవట.
తన తండ్రి శేషప్ప 1970లో ఈ 'కోటె మానే ఇడ్లీ' దుకాణాన్ని స్థాపించారని, అప్పట్లో పది ఇడ్లీలు ఒక్క రూపాయికే అమ్మేవారని వెల్లడించాడు. ఆయన అడుగుజాడల్లో నడుస్తూ..16వ ఏట ఈ దుకాణం బాధ్యతలు తీసుకున్నట్లు తెలిపారు. తాను ఆ వారసత్వాన్ని ముందుకు తీసుకువెళ్తున్నానని అన్నారు. రామచంద్ర దుకాణానికి వినియోగదారులను ఆకర్షించే ప్రధాన అంశం ఆయన తయారు చేసే ఇడ్లీల ప్రత్యేక రుచి. ఆయన రోజు ఉదయం నాలుగు గంటల నుంచి మొదలవుతుంది. మొత్తం ఆరు గంటలు పొయ్యి ముందే ఉంటారు. అయినా గానీ అలసట అనిపించదని, కస్టమర్లు గుంపులు గుంపులగా రావడం చూడగానే ఆ కష్టమంతా ఆవిరి అయిపోతుందని అంటున్నాడు.
ఈ పనిలో తన కుమారుడు అనంత్, కోడలు నిరోషా సహాయం అందిస్తారని చెప్పుకొచ్చాడు. ఇక ఆయన ఇడ్లీలు అంత రుచిగా ఉండటానికి ప్రధాన కారణం ఉడికించిన బియ్యం కలపడమేనని చెప్పారు. అలాగే తాను చట్నీని బైడగి మిరపకాయలు, తాజా పుదీనా, శనగపప్పులతో అందించడంతోనే తను అందించే టిఫిన్‌కి ఇంత గిరాకీ అని అంటున్నారు. మరి ఇంత తక్కువ ధరకు అమ్మితే లాభం వస్తుందా అంటే..అందుకు రామచంద్రా ప్రజలకు కడుపు నిండా ఆహారం అందించడంలోనే అసలైన ఆనందం ఉంటుందంటున్నారు. అలాగే తన తండ్రి జ్ఞాపకార్థం లాభంతో పనిలేకుండా ఈ సేవను కొనసాగిస్తున్నట్లు తెలిపారు.
(చదవండి: లగ్జరీ లైఫ్ వదిలి.. భారత్‌లోని మారుమూల గ్రామంలో ఆమె!)


