కేరళలోని కన్నూర్‌లో ఒక ఆసుపత్రిలో దారుణం చోటు చేసుకుంది. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే తమ ఏకైక కుమారుడు, 18 నెలల చిన్నారి కన్నుమూశాడు అంటూ కుటుంబ సభ్యులు ఆరోపించడం కలకలం రేపింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలు పెట్టారు.
కన్నూర్‌లోని ఎరమామ్-కుట్టూర్ నివాసులైన టి. సూరజ్, విజయషాల ఏకైక కుమారుడు ఏడాదిన్నర బాలుడు దేవాన్ష్ శౌర్య. జూలై 5న ఇంటి బయట ఆడుకుంటుండగా కిందపడి పెదవికి గాయమైంది. తొలుతు బాలుడిని మాతమంగళంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి ప్రథమ చికిత్స అందించారు.ఆ తర్వాత అతడిని పయ్యన్నూర్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తీసుకెళ్లగా, అక్కడ అనస్థీషియా ఇచ్చి గాయానికి కుట్లు వేశారు. ఆ తర్వాత అతను స్పృహ కోల్పోయినట్లు సమాచారం.
పరిస్థితి మరింత విషమించడంతో అనంతరం కన్నూర్‌లోని బేబీ మెమోరియల్ ఆసుపత్రికి తరలించగా, శుక్రవారం రాత్రి సుమారు 9 గంటలకు శౌర్య ప్రాణాలు విడిచాడు. అనస్థీషియా ఇచ్చిన తర్వాత స్పృహ కోల్పోయి, తమ బిడ్డ చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపించారు. డాక్టర్ అంజలి పొడువాల్ నిర్లక్ష్యమే తమ బిడ్డ చావుకు కారణమని వాపోయారు.
#WATCH | Keralam: A toddler from Kannur died five days after undergoing anaesthesia for a procedure to treat a cut lip at Kannur Government Medical College.
Post-mortem examination has been completed, and police have registered a case investigating the circumstances surrounding… pic.twitter.com/EsW9Zmt3pp— ANI (@ANI) July 11, 2026
అయితే ఈ ఆరోపణలను ఆసుపత్రి ఖండించింది. అనస్థీషియా ఇచ్చిన వెంటనే ఆ బిడ్డకు ఊహించని విధంగా గుండెపోటు వచ్చింది. వెంటనే వెంటిలేటర్‌పై ఉంచి, మెరుగైన క్రిటికల్ కేర్ కోసం తమ కన్నూర్ ఆసుపత్రికి తరలించామని యాజమాన్యం ఒక ప్రకటనలో తెలిపింది. సరైన మోతాదులో అనస్థీషియా ఇచ్చినా, సరైన వైద్య సంరక్షణ అందించినా సమస్యలు తలెత్తవచ్చని ఆసుపత్రి పేర్కొంది. బిడ్డ ప్రాణాలను కాపాడటానికి సాధ్యమైన అన్ని ప్రయత్నాలు చేశామని ఆసుపత్రి వాదిస్తోంది. ప్రస్తుతం దీనిపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.


