25 ఏళ్ల స్నేహం, రూ. 25 వేల అప్పు : ధర్మపురికి చేరిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ | Rs 25000 loan to friend Man travels from Kerala to Telangana to repay after 25 years | Sakshi
Sakshi News home page

25 ఏళ్ల స్నేహం, రూ. 25 వేల అప్పు : ధర్మపురికి చేరిన ఇంట్రస్టింగ్‌ స్టోరీ

Jul 10 2026 5:27 PM | Updated on Jul 10 2026 5:36 PM

Rs 25000 loan to friend Man travels from Kerala to Telangana to repay after 25 years

నిజాయితీకి, స్నేహానికి ప్రతీకగా నిలిచే ఒక అద్భుతమైన సంఘటన వెలుగులోకి వచ్చింది. దాదాపు 25 ఏళ్ల క్రితం తీసుకున్న అప్పును తిరిగి చెల్లించడం కోసం కేరళకు చెందిన ఒక వ్యక్తి వందల కిలోమీటర్లు ప్రయాణించి తెలంగాణకు వచ్చిన వైనం ప్రశంసల్ని దక్కించుకుంటోంది. అసలు ఏం జరిగిందంటే..

కేరళలోని పాలక్కాడ్‌కు చెందిన మహమ్మద్ ఇస్మాయిల్, తెలంగాణలోని జగిత్యాల జిల్లా ధర్మపురికి చెందిన తన  స్నేహితుడు ఎడ్ల లచ్చన్నకు రూ. 25,000 తిరిగి ఇవ్వడానికి ఇక్కడికి చేరుకున్నారు. దశాబ్దాల క్రితం వీరిద్దరూ సౌదీ అరేబియాలో కలిసి పనిచేస్తున్నప్పుడు ఈ డబ్బును అప్పుగా తీసుకున్నారు.

అసలేంటీ అప్పు?
సుమారు 25 ఏళ్ల క్రితం సౌదీ అరేబియాలోని ఒకే కంపెనీలో పనిచేస్తున్నప్పుడు ఇస్మాయిల్, లచ్చన్న మంచి స్నేహితులయ్యారు. ఆ సమయంలో ఇస్మాయిల్‌కు ఆర్థిక అత్యవసర పరిస్థితి ఏర్పడటంతో, లచ్చన్న అతనికి రూ. 25,000 ఇచ్చి సహాయం చేశారు. భారతదేశానికి తిరిగి వెళ్లేముందు ఆ డబ్బును తిరిగి ఇచ్చేస్తానని ఇస్మాయిల్ మాట ఇచ్చారు. అయితే, ఇద్దరూ సౌదీ విడిచి స్వదేశానికి వచ్చిన తర్వాత ఒకరి ఫోన్ నంబర్లు, చిరునామాలు మరొకరి వద్ద లేకపోవడంతో పూర్తిగా పరిచయాలు తెగిపోయాయి.

గూగుల్ మ్యాప్స్ సాయంతో 
లచ్చన్న కాంటాక్ట్ లేకపోయినా, ఇస్మాయిల్‌కు తాను చేసిన అప్పు,  ఇచ్చిన మాట మాత్రం ఎపుడూ  మర్చిపోలేదు. అతని అప్పు  ఎలా తీర్చాలా మధనపడుతూ వచ్చాడు. అయితే తన దగ్గర ఎలాంటి ఆధారం లేదు.కానీ లచ్చన్నది "ధర్మపురి" అనే విషయం మాత్రమే అతనికి గుర్తుంది. ఎలాగైనా అప్పు తీర్చాలనే పట్టుదలతో, ఇస్మాయిల్ గూగుల్ మ్యాప్స్ (Google Maps) సహాయంతో ఆ ఊరిని వెతుక్కుంటూ కేరళ నుండి తెలంగాణలోని .  ధర్మపురి చేరుకున్నాక, స్థానికులను అడిగి మొత్తం మీద  లచ్చన్న ఆచూకీని కనిపెట్టారు.

ఇదీ చదవండి: 5 రకాల ఫుడ్స్‌ కంప్లీట్‌ బంద్‌ : 11 నెలల్లో 32 కిలోలు తగ్గింది

భావోద్వేగ కలయిక
ఇస్మాయిల్ అక్కడికి వెళ్లేసరికి, లచ్చన్న మళ్లీ ఉపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లినట్లు తెలిసింది.దాంతో ఇస్మాయిల్ తనను తాను లచ్చన్న కుటుంబ సభ్యులకు పరిచయం చేసుకుని, ఫోన్ ద్వారా లచ్చన్నతో మాట్లాడారు. తాను ఇచ్చిన అప్పు సంగతినే పూర్తిగా మర్చిపోయిన లచ్చన్న, 25 ఏళ్ల తర్వాత తన స్నేహితుడి గొంతు విని ఆశ్చర్యపోయారు. ఇద్దరూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అనంతరం ఇస్మాయిల్ ఆ రూ. 25,000 నగదును లచ్చన్న కుటుంబ సభ్యులకు అందజేశారు.

ఇదీ చదవండి: 20 రోజుల్లోనే కొడుకు, తండ్రిని కోల్పోయాను : న్యాయం చేయండి!

భారం దిగిపోయింది
"ఇన్నాళ్లుగా నా గుండెల్లో ఒక పెద్ద భారాన్ని మోస్తున్నట్లు అనిపించేది. ఈరోజు నా స్నేహితుడికి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నందుకు చాలా ప్రశాంతంగా ఉంది." అంటూ ఇస్మాయిల్‌   చాలా రిలీఫ్‌గా ఫీలవ్వడం విశేషం. ఇస్మాయిల్ చూపిన ఈ గొప్ప నిజాయితీకి లచ్చన్న కుటుంబ సభ్యులు కన్నీళ్లు పెట్టుకున్నారు. స్థానిక ప్రజలు కూడా ఇస్మాయిల్ నిబద్ధతను, స్నేహాన్ని ఎంతో అభినందించారు. కాలం ఎంత మారినా నమ్మకం, కృతజ్ఞత, నిజమైన స్నేహం ఎప్పటికీ సజీవంగానే ఉంటాయని ఈ ఘటన నిరూపించింది.

ఇదీ చదవండి: లక్ష ఉద్యోగాల కోత, ప్లాంట్లు మూసివేత : వెల్లువెత్తిన నిరసన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement