ముంబై: మహారాష్ట్ర ప్రతిపక్ష‘మహా వికాస్ అఘాడీ’కూటమిలో నెలకొన్న తీవ్ర అసంతృప్తిని చల్లార్చేందుకు శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (ఎస్పీ) రంగంలోకి దిగింది. బుధవారం రాష్ట్ర అసెంబ్లీ ప్రాంగణంలోని డిప్యూటీ సీఎం ఏకనాథ్ షిండే కార్యాలయంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఆయనతో సమావేశం కావడం, అనంతరం తన పార్టీ ఎమ్మెల్యేలతో అక్కడే భేటీ నిర్వహించడం రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపింది. ఈ పరిణామంపై మిత్రపక్షమైన శివసేన (యూబీటీ) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో కూటమిలో ముసలం పుట్టిందనే ఊహాగానాలు మొదలయ్యాయి.
అయితే, ఈ మొత్తం వ్యవహారంపై శరద్ పవార్ కుమార్తె, ఎంపీ సుప్రీయా సూలే స్పందించారు. ఇదంతా కేవలం ‘టీకప్పులో తుఫాను’ లాంటిదని కొట్టిపారేశారు.ఈ వివాదంపై శుక్రవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడిన సుప్రీయా సూలే, అది కేవలం మర్యాదపూర్వకంగా జరిగిన స్వల్పకాలిక భేటీ మాత్రమేనని, దానికి అంతకంటే ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.
తమ పార్టీలోని కొందరు నాయకులు ఎన్డీఏ వైపు వెళ్లాలని ఒత్తిడి తెస్తున్నారనే ప్రచారాన్ని ఆమె పూర్తిగా తోసిపుచ్చారు. తమ పార్టీకి చెందిన ఎనిమిది మంది ఎంపీలతో తాను నిరంతరం టచ్‌లోనే ఉన్నానని, తమ శ్రేణులన్నీ పూర్తి ఐక్యతతో ఉన్నాయని వివరించారు. శివసేన (యూబీటీ) నేతలతో నెలకొన్న అసంతృప్తిపై స్పందిస్తూ.. తాము చర్చలు జరుపుతున్నామని, అదంతా ఒక చిన్న అవగాహనా లోపం వల్ల జరిగిందన్నారు. ప్రస్తుతం అంతా సవ్యంగానే ఉందని ఆమె పేర్కొన్నారు.
అయితే అంతకుముందు శివసేన (యూబీటీ) అగ్రనేత సంజయ్ రౌత్ ఈ భేటీపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. షిండేను ఒక ‘ద్రోహి’గా అభివర్ణించిన ఆయన, అటువంటి వ్యక్తితో శరద్ పవార్ భేటీ కావడం అఘాడీ కూటమి నమ్మకత్వాన్ని దెబ్బతీస్తుందని, ఈ చర్యతో మిత్రపక్షాలన్నీ నొచ్చుకున్నాయని ఆరోపించారు. కూటమి శ్రేణుల భావోద్వేగాలను ప్రతిబింబించడానికే తాను ఆ వ్యాఖ్యలు చేశానని రౌత్ పేర్కొంటూ, కూటమి నేతలకు షిండే ఎప్పటికీ అంటరాని వ్యక్తిగానే మిగిలిపోవాలని హితవు పలికారు.
మహారాష్ట్ర-కర్ణాటక సరిహద్దు వివాదంపై సీఎం దేవేంద్ర ఫడణవీస్ అధ్యక్షతన జరిగిన కీలక సమావేశానికి హాజరైన శరద్ పవార్, ఆ తర్వాతే షిండే కార్యాలయానికి వెళ్లాల్సి వచ్చిందని ఎన్సీపీ వర్గాలు సమర్థించుకున్నాయి. ఇదే తరుణంలో కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ సైతం ఈ వివాదంపై స్పందించారు. శరద్ పవార్ వర్గానికి చెందిన ఐదారుగురు ఎంపీలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని, వారు ఏ క్షణంలోనైనా వైఖరి మార్చుకునే అవకాశం ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
కాంగ్రెస్ వ్యాఖ్యలను ఎన్సీపీ (ఎస్పీ) ఎమ్మెల్యే జయంత్ పాటిల్ తీవ్రంగా ఖండించారు. తమ పార్టీ ఎంపీలు కానీ, పది మంది ఎమ్మెల్యేలు కానీ ఎక్కడికీ వెళ్లడం లేదని అందరూ సమైక్యంగా ఉన్నారని స్పష్టం చేశారు. ఆధారాలు లేకుండా తోటి మిత్రపక్షాలపై ఇటువంటి ఊహాజనిత వ్యాఖ్యలు చేయడం రాజకీయంగా సరైన పద్ధతి కాదని ఆయన హితవు పలికారు. శివసేన (యూబీటీ)కి చెందిన ఆరుగురు ఎంపీలు ఇప్పటికే షిండే వర్గంలోకి మారిన నేపథ్యంలో, ఈ తాజా పరిణామాలు మహా వికాస్ అఘాడీ కూటమిలో అంతర్గత ప్రకంపనలను సృష్టిస్తున్నాయి.


