కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళగ వెట్రి కళగం (టీవీకే) అధినేత విజయ్ తొలిసారి సీఎం హోదాలో స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి తనపై, తన పార్టీపై వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన ఆయన.. గత ప్రభుత్వంతో పాటు పోలీసుల తీరును తప్పబట్టారు. ఈ క్రమంలో ఈ విషాదం తనను జీవితాంతం వెంటాడుతుందని భావోద్వేగానికి గురయ్యారు.
శుక్రవారం కరూర్‌లో పర్యటించిన విజయ్.. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామకాల పత్రాలను అందజేశారు. తొక్కిసలాటలో ప్రాణాలు కోల్పోయిన 41 మంది బాధిత కుటుంబాలను పరామర్శించారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. ‘‘కరూర్ తొక్కిసలాట ఎంతో బాధను మిగిల్చింది. మన సోదరీమణుల పిల్లలను కోల్పోయాం. ఎన్ని విజయాలు వచ్చినా.. ఆ బాధను ఎప్పటికీ మర్చిపోలేం’’ అని విజయ్ అన్నారు.
41 మంది మృతి.. వంద మందికి పైగా గాయాలు
గత ఏడాది సెప్టెంబర్‌లో కరూర్‌లోని వేలుసామిపురంలో టీవీకే నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో భారీ తొక్కిసలాట జరిగింది. విజయ్‌ను చూసేందుకు భారీగా అభిమానులు, కార్యకర్తలు తరలిరావడంతో పరిస్థితి అదుపుతప్పింది. ఈ ఘటనలో చిన్నారులు సహా 41 మంది ప్రాణాలు కోల్పోగా.. 100 మందికి పైగా గాయపడ్డారు. ప్రస్తుతం ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కొనసాగుతోంది.
‘‘పోలీసులను నమ్మాను.. కానీ నన్నే నిందించారు’’
తొక్కిసలాటకు టీవీకే కారణమన్న ఆరోపణలను విజయ్ తోసిపుచ్చారు. ర్యాలీలో భద్రత, జన నియంత్రణ బాధ్యతలు పోలీసులవేనని అన్నారు. “జనాన్ని నియంత్రిస్తారని పోలీసు శాఖను నమ్మాను. ఆ రోజు వారికి ధన్యవాదాలు కూడా చెప్పాను. కానీ జరిగిన మరణాలకు నన్నే బాధ్యుడిని చేశారు” అని విజయ్ వ్యాఖ్యానించారు. కరూర్ పోలీసులు పరిస్థితి విషమిస్తున్న విషయాన్ని ముందుగానే తమకు తెలియజేసి ఉంటే ప్రమాదాన్ని నివారించగలిగేవారని ఆయన అన్నారు.
“పెరంబలూరు పోలీసులు చేసినట్టుగా కరూర్ పోలీసులు మమ్మల్ని ఎందుకు అప్రమత్తం చేయలేకపోయారు? పరిస్థితి అదుపు తప్పుతోందని చెప్పి ఉంటే చర్యలు తీసుకునేవాళ్లం. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లింది కూడా పోలీసులే. ఇదంతా ఓ డ్రామాలా అనిపిస్తోంది. దీని వెనుక ఎవరు ఉన్నారు?” అని విజయ్ ప్రశ్నించారు.
విజయ్‌కు కరూర్ ప్రజల బ్రహ్మరథం
కరూర్ పర్యటన సందర్భంగా విజయ్ ప్రయాణించిన మార్గం మొత్తం అభిమానులు, ప్రజలతో కిక్కిరిసిపోయింది. టీవీకే కేడర్‌తో పాటు ముఖ్యమంత్రిని చూసేందుకు భారీ సంఖ్యలో ప్రజలు రోడ్లపైకి వచ్చారు. కొందరు సీఎం కాన్వాయ్‌కు దిష్టి తీశారు. పోలీసులు కూడా జనాన్ని నియంత్రించేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఓ దశలో భారీగా దూసుకొచ్చిన జనసందోహం కారణంగా కొందరు పోలీసులు కూడా అదుపు తప్పి కిందపడిపోయారు. ఈ సమయంలో విజయ్ భద్రతా సిబ్బంది స్పందించి కిందపడిన పోలీసులను పైకి లేపి సహాయం చేశారు. ఈ దృశ్యాలు కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
கரூர் நோக்கிய பயணத்தில் முதலமைச்சர் விஜயை பார்க்க வழிநெடுகிலும் கூடியிருந்த கூட்டம்.. முதலமைச்சரை பார்க்க முண்டியடித்த கூட்டத்தால், தடுமாறி கீழே விழுந்த போலீஸ்.. கைகொடுத்து தூக்கி விட்ட முதலமைச்சர் விஜயின் பாதுகாவலர்கள்#Karur | #CMVijay | #Vijay | #CMVijayKarurVisit |… pic.twitter.com/2Qh9cm2Ltd
— Polimer News (@polimernews) July 10, 2026
డీఎంకే ప్రభుత్వంపైనా విమర్శలు
కరూర్ ఘటనపై గత డీఎంకే ప్రభుత్వ వ్యవహార శైలిని కూడా విజయ్ ప్రశ్నించారు. భద్రతా ఏర్పాట్లు, జన నియంత్రణలో లోపాలపై సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని అన్నారు. అయితే, పోలీసులు చేసిన ఆరోపణలను టీవీకే ఇప్పటికే ఖండించింది. విజయ్ ఆలస్యంగా రావడం వల్లే భారీగా జనం చేరారని పోలీసులు పేర్కొన్న వాదనలను ఆ పార్టీ తోసిపుచ్చింది.
బాధితుల జ్ఞాపకార్థం స్మారకం
కరూర్ విషాదంలో మృతి చెందిన వారి జ్ఞాపకార్థం తమ పార్టీ తరఫున స్మారకాన్ని నిర్మిస్తామని విజయ్ ప్రకటించారు. “కరూర్ నా హృదయం నుంచి ఎప్పటికీ దూరం కాదు. బాధితుల జ్ఞాపకార్థం ఇక్కడ స్మారకం నిర్మిస్తాం” అని ఆయన తెలిపారు.
నల్ల దుస్తులతో విజయ్..
సీఎం అయ్యాక బ్లాక్ అండ్ వైట్ డ్రెస్సులోనే విజయ్ కనిపిస్తూ వస్తున్నారు. అయితే.. కరూర్‌కు సీఎంగా తొలిసారి వెళ్లిన విజయ్ తన వేషధారణతోనూ ఓ సందేశం ఇచ్చారు. సాధారణంగా ధరించే నలుపు-తెలుపు దుస్తులకు భిన్నంగా పూర్తిగా నల్ల దుస్తుల్లో ఆయన కనిపించారు. విషాదానికి, సంతాపానికి ప్రతీకగా భావించే నలుపు రంగును ఎంచుకోవడం ద్వారా బాధిత కుటుంబాల పట్ల సానుభూతిని, సంఘీభావాన్ని వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కరూర్ పర్యటనను వేడుకగా కాకుండా.. విషాద ఘటనను గుర్తు చేసుకునే సందర్భంగా చూపించేందుకు విజయ్ ఈ నిర్ణయం తీసుకున్నారని పేర్కొన్నారు.
విజయ్ వైఖరి ఇలా..
కరూర్ ఘటన తర్వాత విజయ్ వైఖరిపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తాయి. ఘటన జరిగిన తర్వాత ఆయన అక్కడికి వెళ్లకుండా తప్పించుకున్నారని డీఎంకే, బీజేపీ, అన్నాడీఎంకే నేతలు ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలను టీవీకే వర్గాలు ఖండించాయి. ఘటన జరిగిన మరుసటి రోజే విజయ్ వీడియో సందేశం విడుదల చేసి, మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు.
అనంతరం కరూర్‌లో పర్యటించి బాధిత కుటుంబాలను పరామర్శించాలని విజయ్ ప్రయత్నించారు. అయితే అప్పటి డీఎంకే ప్రభుత్వం, పోలీసులు భద్రతా కారణాలను చూపుతూ ఆయన పర్యటనకు అనుమతి ఇవ్వలేదని టీవీకే ఆరోపించింది. దీంతో విజయ్ కరూర్ బాధిత కుటుంబాలను మహాబలిపురంలోని ఓ రిసార్ట్‌కు పిలిపించి వారిని పరామర్శించి, ఆర్థిక సాయం అందించారు.
తాజాగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ తొలిసారి కరూర్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబాలను స్వయంగా కలుసుకుని పరామర్శించడంతో పాటు, ప్రభుత్వం తరఫున ఉద్యోగ నియామక పత్రాలను అందించారు. సీఎం హోదాలో విజయ్ చేసిన తొలి కరూర్ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. తొక్కిసలాట ఘటనపై ఆయన చేసిన వ్యాఖ్యలు, పోలీసులపై లేవనెత్తిన ప్రశ్నలు తమిళనాడు రాజకీయాల్లో మరోసారి చర్చకు దారితీశాయి.


