సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన శుక్రవారం జరిగిన కేబినెట్ భేటీకి కొందరు మంత్రులు గైర్హాజరయ్యారు. దీంతో కీలక సమావేశంలో పలువురు మంత్రులు అందుబాటులో లేకపోవడంతో కొన్ని కుర్చీలు ఖాళీగా కనిపించాయి.
ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి మరోసారి హాజరు కాలేదు. అనారోగ్య కారణాలతో ఆయన ముంబై వెళ్లనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి. గత రెండు కేబినెట్ సమావేశాల్లోనూ నడుం నొప్పి, ఇతరత్ర కారణాలతో పవన్ కళ్యాణ్ మధ్యలోనే వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఈసారి కూడా ఆ కారణంతోనే ఆయన సమావేశానికి రాలేదని పార్టీ వర్గాలు వెల్లడించాయి.
ఇక మంత్రి నారా లోకేశ్ ప్రస్తుతం దక్షిణ కొరియా పర్యటనలో ఉన్నారు. మంత్రి టీజీ భరత్ ఏమో అమెరికా పర్యటనలో ఉన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు మంత్రులంతా విదేశీ పర్యటనలు చేయొద్దని చంద్రబాబు పిలుపు ఇచ్చిన సంగతి తెలిసిందే.
ఇక మరో మంత్రి నిమ్మల రామానాయుడు వ్యక్తిగత కారణాలతో(బెంగళూరు పర్యటనలో ఉన్నట్లు సమాచారం) హాజరు కాలేదు. మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తిరుపతికి కేంద్రమంత్రి రాక సందర్భంగా ప్రొటోకాల్ విధుల్లో పాల్గొంటున్నట్లు సమాచారం. మరో ఇద్దరు కూడా హాజరు కాలేదని తెలుస్తున్నా.. ఈ విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. అయితే..
ముఖ్యమంత్రి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో పలువురు మంత్రులు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఆయా కారణాలతోనే మంత్రులు గైర్హాజరయ్యారని అధికార వర్గాలు చెబుతున్నాయి. మంత్రులు దాదాపుగా లేకున్నా.. మీటింగ్‌ను పోస్ట్ పోన్ చేసే అవకాశం ఉన్నా.. చంద్రబాబు పంక్చువాలిటీ పేరిట మంత్రివర్గ భేటీ కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.


