‘జీవన్‌రెడ్డి మనుషులా?..’ ఎస్సై లాఠీ చార్జ్‌ వైరల్‌ | Anganwadi Land Dispute in Jagtial; SI Alleged Remarks Spark Row | Sakshi
Sakshi News home page

‘జీవన్‌రెడ్డి మనుషులా?..’ ఎస్సై లాఠీ చార్జ్‌ వైరల్‌

Jul 10 2026 9:15 AM | Updated on Jul 10 2026 9:19 AM

Anganwadi Land Dispute in Jagtial; SI Alleged Remarks Spark Row

సాక్షి, జగిత్యాల: బీర్పూర్‌ మండలం నర్సింహులపల్లిలో అంగన్వాడీ కేంద్ర స్థల వివాదం ఉద్రిక్తతకు దారి తీసింది. గ్రామస్తుల్ని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీ ఛార్జి చేయగా.. ఆ సమయంలో ఎస్సై చేసిన వ్యాఖ్యలు రాజకీయ విమర్శలకు దారి తీశాయి. 

అంగన్వాడీకి కేటాయించిన స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతోందంటూ గ్రామస్థులు తాజాగా ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో పోలీసులు రంగప్రవేశం చేయగా.. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. గ్రామస్థుల ఆందోళనను అదుపు చేసే క్రమంలో బీర్పూర్‌ ఎస్సై రాజు లాఠీచార్జ్‌ చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఎస్సైపై గ్రామస్థుల ఆరోపణలు
ఆందోళన సమయంలో ఎస్సై రాజు తమపై దురుసుగా ప్రవర్తించారని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. “జీవన్‌ రెడ్డి మనుషులా?” అంటూ ఎస్సై వ్యాఖ్యలు చేశారని కొందరు గ్రామస్థులు ఆరోపించారు. అయితే ఈ ఆరోపణలపై పోలీసుల వివరణ వెలువడాల్సి ఉంది.

అంగన్వాడీ స్థలాన్ని పరిరక్షించాల్సిన అధికారులు.. అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు డిమాండ్‌ చేస్తున్నారు. లాఠీచార్జ్‌ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

వైరల్‌ వీడియోలతో చర్చ
బీర్పూర్‌లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో జిల్లా వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అంగన్వాడీ స్థల వివాదం, పోలీసుల చర్యలపై ఉన్నతాధికారులు విచారణ చేపట్టాలని గ్రామస్థులు కోరుతున్నారు. ఈ ఘటనపై పోలీసుల అధికారిక స్పందన రావాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement