స్విట్జర్లాండ్‌ ట్రిప్‌ మిస్టరీ.. హైదరాబాదీ జంట ఎక్కడ? | Hyderabad Couple Missing In Switzerland Phones Switched Off, Police Launch Investigation, More Details Inside | Sakshi
Sakshi News home page

స్విట్జర్లాండ్‌ ట్రిప్‌ మిస్టరీ.. హైదరాబాదీ జంట ఎక్కడ?

Jul 10 2026 8:49 AM | Updated on Jul 10 2026 10:07 AM

Hyderabad Couple Missing in Switzerland Phones Switched Off

సాక్షి, హైదరాబాద్‌: విదేశీ పర్యటనకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన దంపతులు అనుమానాస్పద రీతిలో అదృశ్యమయ్యారు. చర్లపల్లికి చెందిన పబ్బా చంద్రశేఖర్‌, ఆయన భార్య స్వప్న స్విట్జర్లాండ్‌ వెళ్లిన తర్వాత కుటుంబ సభ్యులకు అందుబాటులో లేకుండా పోయారు. 22 రోజులుగా వారి ఫోన్లు స్విచ్‌ ఆఫ్‌లో ఉండటంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో పోలీసులను ఆశ్రయించారు.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. చర్లపల్లి ప్రాంతానికి చెందిన పబ్బా చంద్రశేఖర్‌, స్వప్న దంపతులు జూన్‌ 22న స్విట్జర్లాండ్‌ పర్యటనకు బయలుదేరారు. విదేశాలకు వెళ్లిన తర్వాత కొంతకాలం కుటుంబ సభ్యులతో సంప్రదింపులు కొనసాగించినప్పటికీ, ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి సమాచారం అందలేదు. దంపతుల మొబైల్‌ ఫోన్లు నిరంతరం స్విచ్‌ ఆఫ్‌ రావడంతో అనుమానం వచ్చిన వారి కుమార్తె పబ్బా శ్రేయ చర్లపల్లి పోలీసులను ఆశ్రయించారు. తమ తల్లిదండ్రుల ఆచూకీ తెలియడం లేదని ఫిర్యాదు చేశారు.

కుమార్తె ఫిర్యాదు ఆధారంగా పోలీసులు మిస్సింగ్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దంపతులు చివరిసారిగా ఎక్కడ ఉన్నారు?. స్విట్జర్లాండ్‌లో వారి ప్రయాణ వివరాలు ఏమిటి? ఫోన్లు ఎందుకు పనిచేయడం లేదు? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఇన్ని రోజులు గడిచినా తల్లిదండ్రుల నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విదేశాల్లో ఉన్న భారత రాయబార కార్యాలయ అధికారులతోనూ పోలీసులు సమన్వయం చేసే అవకాశం ఉంది.

ఇదిలా ఉండగా.. కుషాయిగూడలోని చక్రపురం, భగవాన్‌ కాలనీకి చెందిన చంద్రశేఖర్‌ స్థానికంగా శ్రీవెంకటేశ్వర మార్కెటింగ్‌ పేరుతో సిమెంట్‌ వ్యాపారం చేస్తూ, ఆల్‌ ఇండియా వైశ్య ఫెడరేషన్‌ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతూ స్థానికంగా ఉన్నవారితో పాటు తన సామాజిక వర్గంతో నమ్మకంగా ఉండేవాడు. ఈ పరిచయంతో వివిధ కారణాలు చెబుతూ పలువురి వద్ద నుంచి భారీ ఎత్తున వసూలు చేశాడు. ఇలా ఒకరికి తెలియకుండా మరొకరి వద్ద మొత్తంగా రూ.50 కోట్ల వరకు వసూలు చేసి పక్కా ప్లాన్‌తో ఇంటికి తాళం వేసి ఉడాయించినట్టు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై బాధితులు గత నెల 30వ తేదీన మల్కాజిగిరి పోలీస్‌ కమిషనర్‌ సుమతికి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఫిర్యాదు చేసి రోజులు గడిచినా వారి ఆచూకీ లభించకపోవడంపై బాధితులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement