ప్లాంట్‌ను పరిశీలిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో కాలె యాదయ్య, శ్రీధర్‌బాబు, పట్నం మహేందర్ రెడ్డి
అభివృద్ధి జరగనివ్వండి: సీఎం రేవంత్‌రెడ్డి
రాజకీయాలకు సమయం కాదు.. ఎన్నికలప్పుడే రాజకీయాలు
ప్రీమియర్ ఎనర్జీస్ సోలార్ ప్లాంట్ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్/ సాక్షి ప్రతినిధి రంగారెడ్డి: ‘మేము చేస్తున్న అభివృద్ధి పనులకు సహకరించకపోయినా పరవాలేదు కానీ.. అడ్డు తగులుతూ కడుపులో ఉన్న విషాన్నంతా రోజూ మాపై కక్కొద్దు.. రాజకీయాలు ఏమైనా ఉంటే ఎన్నికలప్పుడు చూసుకుందాం. ఎవరు ఏం చేశారో? అప్పుడు చర్చిద్దాం. మమ్మల్ని కొంతకాలం పని చేసుకోనివ్వండి..’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అధికారం కోల్పోయిన బాధ మీకు ఉన్నా అభివృద్ధి జరగనివ్వండని పరోక్షంగా విపక్ష బీఆర్‌ఎస్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం సీతారాంపురంలో ప్రీమియర్ ఎనర్జీస్ ఏర్పాటు చేసిన 5.6 గిగావాట్ల సామర్థ్యంగల సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..రాజకీయంగా ఎన్ని ఆరోపణలు వచ్చినా తెలంగాణ అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్నామని రేవంత్ చెప్పారు. తెలంగాణను దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రయత్నిస్తున్నామన్నారు. కాలుష్యం కారణంగా దేశ రాజధాని ఢిల్లీ లాంటి నగరాల్లో నివసించలేని పరిస్థితి తలెత్తిందని, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా ఉందని సీఎం పేర్కొన్నారు. మెట్రోపాలిటన్ నగరాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, అందుకే హైదరాబాద్ నగరంలో కాలుష్య రహిత అభివృద్ధి జరగాలని నిర్ణయించామని వివరించారు. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న 2,100 చ.కి.మీ విస్తీర్ణంలోని క్యూర్ ఏరియాను పూర్తిగా సర్వీస్ సెక్టార్‌గా నిర్ణయించామని తెలిపారు.
నైపుణ్య పెంపు బాధ్యత పరిశ్రమలదే..
ప్రస్తుతం వైట్‌కాలర్ ఉద్యోగాలకు కాలం చెల్లింది. స్కిల్స్ ఉన్న వారికి బ్లూకాలర్ జాబ్స్‌కు కొదవ లేదు. ఇప్పటివరకు అమెరికా వైపు చూశాం. ప్రస్తుతం జర్మన్, జపాన్, చైనా, సౌత్ కొరియాను ఆదర్శంగా తీసుకుంటున్నాం. ఆయా దేశాలతో పోటీపడదాం. రాష్ట్రంలో ఏటా 10 లక్షల మంది ఇంజనీరింగ్ పట్టాలు తీసుకుని బయటికి వస్తున్నారు. సంబంధిత సాంకేతిక నైపుణ్యం లేకపోవడంతో పది శాతం మందికి కూడా ఉద్యోగ అవకాశాలు లభించడం లేదు. వీరి నైపుణ్యాలను పెంచి, అవకాశాలు కల్పించే బాధ్యతలను పరిశ్రమలు తీసుకోవాలి.
నిర్వాసితులకు ఇంటి పట్టాలు
రాష్ట్రాన్ని 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తీర్చిదిద్దాలని సంకల్పించామని ముఖ్యమంత్రి వెల్లడించారు. దేశ ఆర్థిక వ్యవస్థలో తెలంగాణ 10 శాతం భాగస్వామ్యం కలిగి ఉండటమే లక్ష్యంగా పనిచేస్తున్నామని చెప్పారు. సీతారాంపురంలో సోలార్ మాడ్యూల్ ప్లాంట్‌ను ప్రారంభించుకోవడం సంతోషంగా ఉందంటూ.. గ్రామంలో భూములు కోల్పోయిన కుటుంబాలకు ఇంటి పట్టాలు, ఉపాధి కోసం వ్యాపార సముదాయాలను నిర్మించి ఇవ్వాలని కలెక్టర్‌ను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా రైతులు త్యాగం చేయడం వల్లే ఈ అభివృద్ధి సాధ్యమైందని అన్నారు. చేవెళ్ల నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ విశ్వవ్యాప్తం కావాలి: మంత్రి శ్రీధర్‌బాబు
‘కేవలం పెట్టుబడులు ఆకర్షించడమే కాదు. ఆవిష్కరణలు, తయారీ ఇక్కడే జరగాలి. మేడ్ ఇన్ తెలంగాణ బ్రాండ్ మరింత విశ్వవ్యాప్తం అయ్యేలా ఇక్కడి నుంచే ప్రపంచానికి ఉత్పత్తులను అందించాలి. ఇదే మా ప్రభుత్వ సంకల్పం’అని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ప్రీమియర్ ఎనర్జీస్ లాంటి ప్రపంచ స్థాయి సంస్థలు తమ కార్యకలాపాలను ప్రారంభించేందుకు తెలంగాణను ఎంచుకోవడం ఇక్కడి పారిశ్రామిక ప్రగతికి, రాష్ట్ర ప్రభుత్వంపై ఇన్వెస్టర్లకు ఉన్న విశ్వాసానికి నిలువెత్తు నిదర్శనమని పేర్కొన్నారు.
3 వేల మందికి ఉపాధి అవకాశాలు
సోలార్ మాడ్యూళ్ల తయారీ కేంద్రం 75 ఎకరాల్లో ఏర్పాటైంది. యూనిట్ పూర్తి సామర్థ్యానికి చేరుకుంటే 3 వేల మందికి ఉపాధి అవకాశాలు దక్కుతాయి. కంపెనీ 6 గిగావాట్ల సామర్థ్యం గల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ఫెసిలిటీతో పాటు ఏటా 18 వేల మెట్రిక్ టన్నుల తయారీ సామర్థ్యంతో రానున్న అల్యూమినియం ఫ్రేమ్స్ యూనిట్‌కు శంకుస్థాపన చేసింది. దేశవ్యాప్తంగా ప్రస్తుత కేంద్రాల విస్తరణ, నూతన ఫెసిలిటీల కోసం సంస్థ 2028 నాటికి సుమారు రూ.12 వేల కోట్లు ఖర్చు చేస్తోంది.


