ఏనుమాములలో ప్రభుత్వ భూమి కబ్జా? | More than 60 acres occupied in survey number 158 | Sakshi
Sakshi News home page

ఏనుమాములలో ప్రభుత్వ భూమి కబ్జా?

Jul 10 2026 1:16 AM | Updated on Jul 10 2026 1:25 AM

More than 60 acres occupied in survey number 158

సర్వే నంబర్‌ 158లో 60 ఎకరాలకు పైగా అక్రమార్కుల పాలు 

బహిరంగ మార్కెట్లో దీని విలువ రూ.300 కోట్లు 

మున్సిపల్‌ ఇళ్ల నంబర్లతో ‘రిజిస్ట్రేషన్ల’మాయాజాలం 

రెండు ఇంటి నంబర్లతో ఏకంగా 49 రిజిస్ట్రేషన్లు  

రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారిస్తే విలువైన భూమి స్వాదీనానికి అవకాశం 

సాక్షి, వరంగల్‌: వరంగల్‌ నగర పరిధి ఏనుమాముల శివారులో ప్రభుత్వ భూమి కబ్జాపాలవుతోంది. ప్రభుత్వ రికార్డుల (సెత్వార్, ఖాస్ర పహాణీ) ప్రకారం సర్వే నంబరు 158లో ఉన్న 86.09 ఎకరాల ప్రభుత్వ భూమిలో అత్యధిక భాగం ప్రైవేట్‌ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లింది. బహిరంగ మార్కెట్‌లో దీని విలువ సుమారు రూ.300 కోట్లపైనే ఉంటుందని అంచనా. 

ఈ సర్వే నంబరు ద్వారా రిజిస్ట్రేషన్లు జరిగే అవకాశం లేకపోవడంతో అక్రమార్కులు గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ద్వారా పొందిన రెండు ఇంటి నంబర్లతో సబ్‌ రిజిస్ట్రార్‌లు కూడా ‘మామూలు’గా పనిచేయడంతో ఏకంగా 49 రిజిస్ట్రేషన్లు జరిగిపోయాయి. ఇంటి నంబరు 46–6–809/1 పై వరంగల్‌ రూరల్‌ సబ్‌ రిజిస్ట్రేషన్‌ కార్యాలయంలో 21 రిజిస్ట్రేషన్లు, మరో ఇంటి నంబరు 46–6–811 ద్వారా వరంగల్‌ ఆర్‌ఓ కార్యాలయంలో మరో 28 రిజిస్ట్రేషన్లు 2019 నుంచి ఇప్పటివరకు జరిగాయి. అందులో ఈ ఏడాది జనవరిలో జరిగిన రిజిస్ట్రేషన్లు 7వరకూ ఉన్నాయి.  

          అసైనీలకు 158 సర్వేనంబరులో ఇచ్చిన భూములకు సంబంధించిన మ్యాప్‌  

                  ఒకే ఇంటి నంబరుతో జరిగిన పలు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన ఈసీ  

అసైన్‌మెంట్‌ చట్టానికి తూట్లు.. 
1981 ఏప్రిల్‌ 23వ తేదీన అప్పటి ప్రభుత్వం సర్వేనంబరు 158లోని సగానికిపైగా భూమిని నిరుపేదలు, మాజీ సైనికులు, స్వాతంత్య్ర సమరయోధులకు వ్యవసాయ పనులు చేసుకునేందుకు ఇచ్చింది. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ ల్యాండ్‌ సర్వేయర్‌చే సర్వే చేయించి, అసైనీలకు హద్దులు పెట్టి భూమిని అప్పగించారు. 1977 పీఓటీ చట్టం ప్రకారం ఈ అసైన్డ్‌ భూములను అమ్ముకోవడంగానీ, ఇతరులు కొనడానికి గానీ వీల్లేదు. 

ఒకవేళ అమ్మకాలు జరిగితే ఆ భూమిని ప్రభుత్వం వెంటనే స్వాధీనం చేసుకోవాలి. మాజీ సైనికులు, స్వాతంత్య్ర తసమరయోధుల కోటా భూమిని సైతం 10 ఏళ్ల తర్వాత జిల్లా కలెక్టర్‌ నుంచి నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌ తీసుకున్న తర్వాతే విక్రయించాలి. కానీ ఇక్కడ ఏ నిబంధనా అమలులో లేదు. అసలైన లబ్దిదారులు పోయి అక్రమార్కులు చకచకా ఇళ్లు కట్టేసుకోవడం, మరికొందరు ఓపెన్‌ ప్లాట్ల చుట్టూ ప్రహరీలు, లోపల చిన్న రేకుల షెడ్డు నిర్మించుకున్నారు.  

క్షేత్రస్థాయి సర్వే చేస్తే రూ.300 కోట్ల ఆస్తి చేజిక్కినట్టే... 
2009లో అప్పటి ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకం కోసం ఇదే సర్వే నంబరు 158లోని కొంతమంది అసైనీల నుంచి 21.32 ఎకరాల భూమిని సేకరించి దాదా పు 90 మంది రైతులకు రూ.85,87,020 నష్టపరిహారం చెల్లించింది. అంటే ఆ భూమి ప్రభుత్వ అవసరాల కోసం సేకరించింది. ఆ తర్వాత ఈ ప్రక్రియ అటకెక్కడంతో అక్కడా భూమిని పర్యవేక్షించేవారు కరువయ్యారు. ఈ సర్వే నంబర్‌లోని అత్యధిక భూమిని కబ్జాదారులు ఆక్రమించుకున్నారు. 

ప్రస్తుతం ఇక్కడ ఎకరం ప్రభుత్వ లెక్క ప్రకారం రూ.3.20 కోట్లకు పైమాటే ఉంది. బహిరంగ మార్కెట్‌లో అయితే ఏకంగా రూ.5 నుంచి రూ.6 కోట్ల మధ్య ఉంది. సుమారు 60 ఎకరాలపైనా కబ్జాకు గురైంది.  ఈ విషయమై వరంగల్‌ తహసీల్దార్‌ శ్రీకాంత్‌ మాట్లాడుతూ అసైన్, ప్రభుత్వ భూములు అమ్మడం చట్ట విరుద్ధమన్నారు. సర్వేనంబరు 158లో ఏమైనా అమ్మకాలు జరిగిఉంటే విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement