మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్ | US Homicide Telugu Man Arrested for Wife's Murder | Sakshi
Sakshi News home page

మహిళ హత్య కేసు: అమెరికాలో తెలుగు యువకుడి అరెస్ట్

Jul 8 2026 1:51 PM | Updated on Jul 8 2026 2:14 PM

US Homicide Telugu Man Arrested for Wife's Murder

వాషింగ్టన్: అమెరికాలోని వాషింగ్టన్‌లో తన భార్యను హత్య చేసిన ఆరోపణలపై ఒక తెలుగు యువకుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. బెల్లేవ్‌లోని ఒక అపార్ట్‌మెంట్ బాత్రూమ్‌లో భార్య మృతదేహం లభ్యమైన దాదాపు ఎనిమిది నెలల తర్వాత ఈ అరెస్ట్ చోటుచేసుకుంది.

నిందితుడిని అవినాష్ నార్నె (30)గా గుర్తించారు. జూన్ 27న బెల్లేవ్ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని, భార్య సబ్బినేని రజిత (27) మరణానికి కారణమైనందుకు ఫస్ట్-డిగ్రీ మర్డర్ నిందారోపణలు మోపారు. ప్రస్తుతం అతడికి కింగ్ కౌంటీ జైలులో 5 మిలియన్ డాలర్ల (రూ. 47 కోట్లకు పైగా) భారీ బెయిల్ విధించారు. 2025 అక్టోబర్ 27న బెల్లేవ్ డౌన్‌టౌన్‌లోని ఉడ్‌ల్యాండ్ కామన్స్ అపార్ట్‌మెంట్‌లో తాళం వేసి ఉన్న బాత్రూమ్‌లో రజిత అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని అధికారులు గమనించారు.

వైద్య సిబ్బంది కాపాడటానికి ప్రయత్నించినప్పటికీ ఆమె అప్పటికే మరణించినట్లు తేలింది. ఆఫీసు నుండి వచ్చేసరికి భార్య బాత్రూమ్ ఫ్లోర్‌పై పడి ఉందని అవినాష్ పోలీసులకు తెలిపాడు. వీరిద్దరికీ 2025 జూన్‌లో పెద్దలు కుదిర్చిన వివాహం జరగ్గా, ఆ తర్వాతే ఈ అపార్ట్‌మెంట్‌కు మారారు. మొదట అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ, కింగ్ కౌంటీ మెడికల్ ఎగ్జామినర్ నివేదికలో ఆమె గొంతు నులిమి హత్య చేసినట్లు తేలడంతో దీనిని హత్యకేసుగా మార్చారు.

సుదీర్ఘ దర్యాప్తులో ఎలక్ట్రానిక్ డోర్ లాక్ రికార్డులు, మొబైల్ డేటా, వాట్సాప్ సందేశాలను డిటెక్టివ్‌లు పరిశీలించారు. రజిత మరణించిన సమయంలో అవినాష్ మినహా మరెవ్వరూ అపార్ట్‌మెంట్‌లోకి ప్రవేశించలేదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. కాగా, అవినాష్‌కు భారతదేశంలో మరో మహిళతో సంబంధం ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. విచారణలో నిందితుడు ఇచ్చిన పొంతనలేని సమాధానాలు, డిజిటల్ ఆధారాల బట్టి అతడే ప్రధాన నిందితుడిగా నిర్ధారించి కోర్టులో హాజరుపరిచారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement