బెంగాల్‌ బాలిక అత్యాచారం: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం | West Bengal Baruipur Minor Girl Horror Case, Key Accused Shot Dead In Police Encounter Alleged Attack On Cops | Sakshi
Sakshi News home page

బెంగాల్‌ బాలిక అత్యాచారం: ఎన్‌కౌంటర్‌లో నిందితుడు హతం

Jul 8 2026 10:16 AM | Updated on Jul 8 2026 10:35 AM

Baruipur Rape Murder Accused Shot Dead in Police Encounter

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు పోలీస్ ఎన్‌కౌంటర్‌లో మరణించాడు. సీన్ రీక్రియేషన్ (నేరస్థల పరిశీలన) కోసం తరలించిన సమయంలో పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని పరారవుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడిని ప్రభాస్ మండల్‌గా గుర్తించారు.

పోలీసుల కథనం ప్రకారం.. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు నిందితుడిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో నేరస్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతడు అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మండల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.

ఈ ఘటనపై నిందితుడి తల్లి గతంలో స్పందిస్తూ.. తన కుమారుడు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని, ఉరితీయడమో లేదా నరికేయడమో చేయాలని భావోద్వేగంగా పేర్కొన్నారు. కాగా, ఈ అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. కేసుపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ సిద్ధనాథ్ గుప్తాను ఆదేశించారు. బాలిక మృతదేహం లభ్యమైన తర్వాత జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులను, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.

దక్షిణ 24 పరగణాల జిల్లా బారూయీపూర్ పట్టణంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ప్రభాస్ మోండల్ ఒకడు. శనివారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ, ఆ మరుసటి రోజు సూర్జ్యపూర్ ప్రాంతంలోని ఒక చెరువులో బస్తాలో ఉంచిన బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ కేసులో అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల నాశనం వంటి సెక్షన్లతో పాటు పోక్సో చట్టాన్ని చేర్చారు.

ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆందోళనకారులు రోడ్లు, రైల్వే లైన్లను దిగ్బంధించి, టైర్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల సమయంలో స్థానికులు ఇద్దరు అనుమానితులను పట్టుకుని చితకబాదారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం ఒక యువకుడిపై మూకదాడి జరగడంతో అతను మరణించాడు.

మరోవైపు నిందితుల్లో ఒకరు తప్పించుకోవడానికి సహకరించారనే ఆరోపణలపై స్థానిక రాజకీయ నేత శంతను మోండల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీస్ అవుట్‌పోస్ట్‌కు తీసుకువచ్చిన సమయంలో శంతను మోండల్ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ప్రధాన నిందితుడు ఆనంద సర్దార్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వివరించారు. అనంతరం సోమవారం అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన మూడో నిందితుడు దిబాకర్ సర్దార్. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ ఎస్పీ పినాకి దత్తా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది.
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement