breaking news
Crime branch inspector
-
బెంగాల్ బాలిక అత్యాచారం: ఎన్కౌంటర్లో నిందితుడు హతం
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లోని బరుయిపూర్‌లో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచార ఘటనలో ప్రధాన నిందితుడు పోలీస్ ఎన్కౌంటర్లో మరణించాడు. సీన్ రీక్రియేషన్ (నేరస్థల పరిశీలన) కోసం తరలించిన సమయంలో పోలీసుల నుంచి తుపాకీని లాక్కొని పరారవుతుండగా ఈ ఘటన జరిగినట్లు అధికారులు వెల్లడించారు. మృతుడిని ప్రభాస్ మండల్‌గా గుర్తించారు.పోలీసుల కథనం ప్రకారం.. దర్యాప్తులో భాగంగా ఘటన జరిగిన తీరును తెలుసుకునేందుకు నిందితుడిని మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 12:45 గంటల ప్రాంతంలో నేరస్థలానికి తీసుకెళ్లారు. ఆ సమయంలో అతడు అకస్మాత్తుగా ఒక పోలీసు అధికారి నుంచి ఆయుధాన్ని లాక్కొని పారిపోవడానికి ప్రయత్నించాడు. నిందితుడిని అడ్డుకునే క్రమంలో పోలీసులు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన మండల్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించగా, అతడు మరణించినట్లు వైద్యులు ప్రకటించారు.ఈ ఘటనపై నిందితుడి తల్లి గతంలో స్పందిస్తూ.. తన కుమారుడు తప్పు చేసి ఉంటే కఠినంగా శిక్షించాలని, ఉరితీయడమో లేదా నరికేయడమో చేయాలని భావోద్వేగంగా పేర్కొన్నారు. కాగా, ఈ అత్యాచార ఘటనపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారి తీవ్రంగా స్పందించారు. కేసుపై సమగ్ర నివేదిక సమర్పించాలని డీజీపీ సిద్ధనాథ్ గుప్తాను ఆదేశించారు. బాలిక మృతదేహం లభ్యమైన తర్వాత జరిగిన ఆందోళనల్లో ప్రభుత్వ ఆస్తులను, పోలీసు వాహనాలను ధ్వంసం చేసిన దాదాపు 200 మందిపై చర్యలు తీసుకోనున్నట్లు సీఎం స్పష్టం చేశారు.దక్షిణ 24 పరగణాల జిల్లా బారూయీపూర్ పట్టణంలో 11 ఏళ్ల బాలికపై జరిగిన అత్యాచారం, హత్య కేసులో అరెస్ట్ అయిన ముగ్గురు నిందితుల్లో ప్రభాస్ మోండల్ ఒకడు. శనివారం బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు మొదట మిస్సింగ్ కేసుగా నమోదైనప్పటికీ, ఆ మరుసటి రోజు సూర్జ్యపూర్ ప్రాంతంలోని ఒక చెరువులో బస్తాలో ఉంచిన బాలిక మృతదేహం లభ్యమైంది. ప్రాథమిక విచారణ అనంతరం పోలీసులు ఈ కేసులో అత్యాచారం, సామూహిక అత్యాచారం, హత్య, సాక్ష్యాధారాల నాశనం వంటి సెక్షన్లతో పాటు పోక్సో చట్టాన్ని చేర్చారు.ఈ ఉదంతం స్థానికంగా తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆందోళనకారులు రోడ్లు, రైల్వే లైన్లను దిగ్బంధించి, టైర్లను తగులబెట్టడమే కాకుండా పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు. ఈ అల్లర్ల సమయంలో స్థానికులు ఇద్దరు అనుమానితులను పట్టుకుని చితకబాదారు. అలాగే ఈ ఘటనతో సంబంధం ఉందనే అనుమానంతో ఆదివారం ఒక యువకుడిపై మూకదాడి జరగడంతో అతను మరణించాడు.మరోవైపు నిందితుల్లో ఒకరు తప్పించుకోవడానికి సహకరించారనే ఆరోపణలపై స్థానిక రాజకీయ నేత శంతను మోండల్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్థానికులు ఇద్దరు నిందితులను పట్టుకుని పోలీస్ అవుట్‌పోస్ట్‌కు తీసుకువచ్చిన సమయంలో శంతను మోండల్ జోక్యం చేసుకున్నారని పోలీసులు తెలిపారు. ఆ గందరగోళాన్ని ఆసరాగా చేసుకుని ప్రధాన నిందితుడు ఆనంద సర్దార్ అక్కడి నుంచి పారిపోయాడని పోలీసులు వివరించారు. అనంతరం సోమవారం అతడిని మళ్లీ అరెస్ట్ చేశారు. ఈ కేసులో అరెస్టయిన మూడో నిందితుడు దిబాకర్ సర్దార్. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర విచారణ కోసం రాష్ట్ర ప్రభుత్వం అడిషనల్ ఎస్పీ పినాకి దత్తా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. -
క్రైంబ్రాంచ్ ఎస్ఐ ఇంటిలో చోరీ
బెంగళూరు నగరంతోపాటు రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల్లో దొంగలు స్వైర విహారం చేశారు. ఏకంగా ఓ ఎస్ఐ ఇంటిలోకి చొరబడి లక్షల రూపాయల విలువైన నగలు, నగదు దోచుకున్న దొంగలు ఓపారిశ్రామిక వేత్త ఇంటిలోనూ తమ ప్రతాపం చూపించారు. బెంగళూరు(బనశంకరి) : దుండగులు ఏకంగా ఓ ఎస్ఐ ఇంటిపై కన్నేసి భారీగా చోరీకి పాల్పడ్డారు. లక్షల విలువైన ఆభరణాలు, నగదును తస్కరించిన దొంగలు వెళ్తూ వెళ్తూ ఎస్ఐకు చెందిన సర్వీస్ రివాల్వార్‌ను కూడా వెంట తీసుకెళ్లారు. ఈ ఘటన బెళగావి జిల్లా రామదుర్గలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. రామదుర్గ పోలీస్‌స్టేషన్ పక్కనే ఉన్న పోలీస్క్వార్టర్స్లో క్రైంబ్రాంచ్ ఎస్ఐ బసవరాజు కొళ్లి నివాసం ఉంటున్నాడు. ఈయన మంగళవారం సవదత్తియల్లమ్మ జాతర భద్రతకోసం వెళ్లగా, కుటుంబసభ్యులు ఇంటికి తాళం వేసుకుని వేరేచోటుకు వెళ్లారు. రాత్రి ఇంటిలో ఎవరులేరు. పసిగట్టిన దుండగులు అర్ధరాత్రి దాటిన తర్వాత ఇంటి ముందుభాగంలో ఉన్న తలుపు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించారు. ఇంటిలో ఉన్న సర్వీస్ రివాల్వర్, ఐదు గుండ్లు, 50 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు రూ.2 లక్షల నగదు దోచుకుని పారిపోయారు. బసవరాజుకొళ్లి విధులు ముగించుకొని ఇంటికెళ్లిన తర్వాత ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. సీనియర్ పోలీస్ అధికారులు ఘటనా స్థలాన్ని సందర్శించి వివరాలు సేకరించారు.ఘటనపై రామదుర్గ పోలీసులు కేసు నమోదుచేసి దుండగుల ఆచూకీకోసం గాలింపుచర్యలు చేపట్టారు. విధుల్లో అలసత్వం వహించిన ఎస్ఐ సస్పెండ్ : ఇదిలా ఉండగా విధుల్లో అలసత్వం వహించిన ఎస్ఐ బసవరాజుకొళ్లిని సస్పెండ్ చేస్తూ జిల్లా ఎస్పీ రవికాంత్‌గౌడ బుధవారం ఆదేశాలు జారీ చేశారు. జాతరలో విధులకు వెళ్లిన సమయంలో సర్వీస్రివాల్వర్ వెంట తీసుకెళ్లకుండా ఇంటిలోనే ఉంచడానిన తీవ్రంగా పరిగణించి ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. 35 తులాల బంగారు నగలు చోరీ సిప్కాట్: హొసూరు పారిశ్రామిక వాడలో ఇంటి తాళాలు పగులగొట్టి 35 తులాల బంగార నగలు దోచుకెళ్లిన సంఘటన మంగళవారం రాత్రి జరిగింది. హొసూరు పారిశ్రామిక వాడ అరసనట్టిలో నివాసముంటున్న అండర్సన్. మధురైలోని వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. ఇతని భార్య సంతోషం. బెంగళూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో డాక్టర్‌గా పనిచేస్తోంది. సంతోషం తన భర్తను చూసేందుకు రెండు రోజుల క్రితం ఇంటికి తాళం వేసి మధురైకి వెళ్లి మంగళవారం రాత్రి హొసూరుకు తిరిగి వచ్చింది. సంతోషం తన ఇంటికి తిరిగి వచ్చేసరికి ఇంటి తలుపునకు వేసిన తాళం బద్దలు కొట్టివుండడం చూసి, ఇంట్లోకి వెళ్లి చూడగా బీరువాలో ఉంచిన 35 తులాల బంగారు నగలు అదృశ్యమయ్యాయని గుర్తించిన ఆమె సిప్కాట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిప్కాట్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వేలి ముద్ర నిపుణులతో విచారణ చేపట్టారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నారు. పారిశ్రామిక వేత్త ఇంటిలో భారీ చోరీ బెంగళూరు(బనశంకరి) : పారిశ్రామికవేత్త ఇంటిలో దుండగులు భారీ చోరీకి పాల్పడ్డారు. రూ.25 లక్షల విలువ చేసే వజ్రాలు, బంగారు ఆభరణాలతో పాటు రూ.25 వేల నగదు దోచుకెళ్లారు. ఈ ఘటన విల్సన్‌గార్డెన్ పోలీస్‌స్టేషన్ పరిధిలో మంగళవారం రాత్రి చోటుచేసుకుంది. సుధామనగర మొదటి మెయిన్‌రోడ్డులో పారిశ్రామిక వేత్త దినేశ్చోప్రా నివాసం ఉంటున్నారు. మంగళవారం సాయంత్రం 4.30 సమయంలో ఇంటికి తాళం వేసుకుని బయటికి వెళ్లారు. ఇదే అదనుగా దుండగులు ఇంటి ముందు తలుపు బద్దలు కొట్టిలోపలకు ప్రవేశించి మూడు బీరువాలను బద్దలు కొట్టి అందులో ఉన్న రూ.25 లక్షల విలువైన వజ్రం, బంగారు ఆభరణాలు, రూ.25వేల నగదు చోరీ చేసి ఉడాయించారు. రాత్రి 10.15 గంటలకు ఇంటికి చేరుకున్న దినేశ్చోప్రా..జరిగిన చోరీని గుర్తించి విల్సన్‌గార్డెన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు డాగ్‌స్క్వాడ్, వేలిముద్ర నిపుణులతో అక్కడికి చేరుకుని ఆనవాళ్లు సేకరించి దొంగల కోసం గాలింపు చేపట్టారు. కీలుకోట కాలనీలో భారీ చోరీ కోలారు : నగరంలోని కీలుకోట కాలనీలో దుండగులు తెగబడ్డారు. ఓ ఇంటిలోకి చొరబడి లక్షల రూపాయల నగదు, నగలు దోచుకెళ్లారు. పోలీసుల కథనం మేరకు... కీలుకోట కాలనీలో నివాసం ఉంటున్న నవీన్ మంగళవారం రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఊరు వెళ్లాడు. పసిగట్టిన దుండగలు తలుపులు బద్దలు కొట్టి లోపలకు చొరబడి బీరువా తెరచి అందులోని రూ.3లక్షల నగదు, రూ.5లక్షల విలువైన బంగారు నగలు దోచుకెళ్లారు. చోరీ జరిగినట్లు తెలుసుకున్న నవీన్ బుధవారం నగరానికి చేరుకొని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్ఐ లక్ష్మీనారాయణ పోలీసు జాగీలంతో ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించి దొంగల కోసం గాలింపు చేపట్టారు.


