ఇల్లు మారాలనుకున్నారు : అంతలోనే కుటుంబం సజీవ సమాధి | Family Killed In Mumbai Building Collapse Had Planned To Shift The Next Day | Sakshi
Sakshi News home page

ఇల్లు మారాలనుకున్నారు : అంతలోనే కుటుంబం సజీవ సమాధి

Jul 7 2026 4:50 PM | Updated on Jul 8 2026 4:27 PM

 Family Killed In Mumbai Building Collapse Had Planned To Shift The Next Day

దేశ వాణిజ్య నగరం ముంబై భారీ వర్షాలతో అతలాకుతలమవుతోంది. కురిసిన భారీ వర్షాల కారణంగా ఒక అక్రమ భవనం కూలిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. ముంబైలోని మాన్‌ఖుర్ద్ పరిధిలో గల మండాలా (జనతా నగర్) ప్రాంతంలో భారీ వర్షాల వల్ల ఒక నాలుగు అంతస్తుల అక్రమ కట్టడం పక్కనే ఉన్న రేకుల ఇళ్లపై కూలిపోయింది. ఈ ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయిన ఘటన కలకలం రేపింది. వారంతా ఆ మర్నాడే ఇల్లు మారాలనుకున్నారు. ఇంతలోనే మృత్యువు వారిని వెంటాడింది.

ప్రమాదాన్ని ముందే ఊహించినా
రోజువారీ కూలిగా  పనిచేసే మొయినుద్దీన్ వాజిద్ అలీ షా, ఆయన భార్య అక్తర్ జహాన్ తమ నలుగురు పిల్లలతో కలిసి   ఒక రేకుల ఇట్లో నివసిస్తున్నారు. అయితే  పక్కనే ఉన్న భవనం వర్షాలకు దెబ్బతిని, కూలిపోయేలా ఉందని వారు ముందే  ప్రమాదాన్ని పసిగట్టారు. ఆదివారం నాడే ఆ ఇల్లు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతానికి వెళ్లాలని ప్లాన్ చేసుకున్నారు. ఈ  ఒక్క రాత్రి గడిస్తే చాలు.. మనం బతికిపోతాం అని భార్యాబిడ్డలతో చెప్పాడు. ఫుడ్‌ తీసుకు రావడానికి అలా బయటికి వెళ్లాడో.. లేదో  10 నిమిషాల్లో అంతా ముగిసిపోయింది.

శనివారం రాత్రి అక్తర్ జహాన్ ఇల్లు మారడానికి సామాన్లు ప్యాక్ చేసుకుంటున్న సమయంలో పక్కనే ఉన్న  మూడంతస్తుల భవనం ఒక్కసారిగా వారి ఇంటిపై కూలిపడింది. మొయినుద్దీన్ ప్రమాదం జరగడానికి కొద్దిసేపటి ముందే బయటకు వెళ్లడం వల్ల ప్రాణాలతో బయటపడ్డాడు. కానీ, ఇంట్లోనే ఉన్న  భార్య, నలుగురు పిల్లలు శిథిలాల క్రింద చిక్కుకుపోయి ప్రాణాలు  కోల్పోయారు.  ప్రాణాలు కోల్పోయిన వారిలో ఐదుగురు చిన్న పిల్లలే ఉన్నారు. ఇందులో పొరుగింట చిన్నారి కూడా ఉంది. 

భవనం కూలిపోవడానికి కొన్ని గంటల ముందే అందులో స్పష్టమైన మార్పులు కనిపించాయని స్థానికులు తెలిపారు. గోడలకు పగుళ్లు రావడం, టైల్స్ ఊడిపడటం, భవనం ఒక పక్కకు వంగిపోవడంతో ఆ బిల్డింగ్‌లో ఉంటున్న కుటుంబాలు ముందే ఖాళీ చేసి వెళ్ళిపోయాయి. అలా వారు ప్రాణాలు దక్కించుకున్నప్పటికీ, ఆ భవనం పక్కనే ఉన్న పేదల రేకుల షెడ్లపై పడటంతో ఆరుగురి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి.

ఇదీ చదవండి: నీళ్లు ఇవ్వకపోతే..యుద్ధమే : రంకెలేస్తున్న పాకిస్థాన్‌

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసింది. కూలిపోయిన ఆ అక్రమ కట్టడం యజమానిని, దానిని నిర్మించిన కాంట్రాక్టర్‌ను పోలీసులుఅరెస్ట్ చేశారు. భవన నిర్మాణంలో భద్రతా ప్రమాణాల ఉల్లంఘన కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ముంబై మున్సిపల్ అధికారులు కూడా అది అనధికారిక కట్టడమేనని ధృవీకరించారు. మరోవైపు ముంబై ఫైర్ బ్రిగేడ్, పోలీసులు, స్థానిక మున్సిపల్ సిబ్బంది రాత్రంతా శ్రమించి శిథిలాల కింద ఉన్నవారిని వెలికితీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

ఇదీ చదవండి: హాట్‌ టాపిక్‌గా బిగ్‌బీ అమితాబ్‌ రూ. 15 కోట్ల ల్యాండ్‌ డీల్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement