బంగ్లాదేశ్‌లో బాంబు పేలుడు.. ఎన్‌సీపీ ర్యాలీలో ఘోరం! | Bomb Blast Triggers Panic at NCP Rally Near Dhaka 3 Injured | Sakshi
Sakshi News home page

బంగ్లాదేశ్‌లో బాంబు పేలుడు.. ఎన్‌సీపీ ర్యాలీలో ఘోరం!

Jul 7 2026 8:00 AM | Updated on Jul 7 2026 8:36 AM

Bomb Blast Triggers Panic at NCP Rally Near Dhaka 3 Injured

ఢాకా: బంగ్లాదేశ్ రాజధాని ఢాకా సమీపంలోని సావర్ వద్ద నేషనల్ సిటిజన్ పార్టీ (ఎన్‌సీపీ) నిర్వహించిన ర్యాలీలో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. మాజీ ప్రధాని షేక్ హసీనాకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి ఉద్యమం రెండేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నిరసన ప్రదర్శనను నిర్వహించారు. వేదికపై నుంచి ఒక పార్టీ నేత మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగిస్తున్న సమయంలో ఒక్కసారిగా స్టేజ్ సమీపంలోనే ఈ పేలుడు జరిగింది.

దీంతో అక్కడున్న వారంతా ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పరుగులు తీశారు. ఈ ఘటనపై ఎన్‌సీపీ సోమవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేస్తూ.. సావర్ థానా స్టాండ్ ఈద్గా మైదానంలో రాత్రి 9:45 గంటల సమయంలో ఉగ్రవాదులు బాంబు దాడికి పాల్పడ్డారని ఆరోపించింది. పేలుడుకు గల ఖచ్చితమైన కారణాలను అధికారులు ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. గాయపడిన వారికి వైద్య సహాయం అందిస్తున్నట్లు సమాచారం.

మరోవైపు ఈ ఘటనకు కొద్ది రోజుల ముందే ఢాకా సమీపంలోని కేరానిగంజ్‌లోని గ్యాస్ లైటర్ల తయారీ ఫ్యాక్టరీలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న ఫైర్ సర్వీస్ సిబ్బంది ఏడు అగ్నిమాపక యంత్రాలతో గంటలపాటు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement