హీరోయిన్‌ అందానికి దాసోహమై.. | Asha Parekh's Reveals Shocking Stalker Story, Fan Camped Outside Her Home And Ended Up In Jail, Read Full Story Inside | Sakshi
Sakshi News home page

హీరోయిన్‌ అందానికి దాసోహమై..

Jul 7 2026 7:31 AM | Updated on Jul 7 2026 9:43 AM

When Actress Asha Parekh Had to Send Her Crazy Stalker Fan to Jail

బాలీవుడ్ చిత్ర పరిశ్రమను 60, 70వ దశకాల్లో తన అద్భుతమైన అందం, అభినయంతో ఏలిన అగ్ర కథానాయిక ఆశా పరేఖ్. వెండితెరపై తిరుగులేని స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న ఈమెను అత్యంత ప్రతిభావంతులైన నటీమణులలో ఒకరిగా పరిగణిస్తారు. అయితే, సెలబ్రిటీలపై అభిమానులు చూపించే అమితమైన ప్రేమ ఒక్కోసారి వారి ప్రాణాల మీదకు తెస్తుంటుంది. ఒకానొక సమయంలో ఓ చైనీస్ అభిమాని చేసిన పిచ్చి పని వల్ల ఆశా పరేఖ్ తన సొంత ఇంట్లోనే తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. గతంలో ఆమె ఒక ఇంటర్వ్యూలో వెల్లడించిన ఆ ఉత్కంఠభరిత ఘటన వివరాలు..

సినిమా రంగాన్ని ఏలిన అందాల నటి
ఆశా పరేఖ్‌కు ఇప్పటికీ  సినిమా ఇండస్ట్రీలో మంచిపేరుంది. అలాగే అభిమాన గణం కూడా భారీగానే ఉంది. 2017లో ప్రముఖ పత్రిక ‘ఫిల్మ్‌ఫేర్’కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో, తనను తీవ్ర భయానికి గురిచేసిన ఒక వింత సంఘటన గురించి ఆశా పరేఖ్ తెలిపారు. తనపై విపరీతమైన వ్యామోహం పెంచుకున్న ఒక చైనీస్ అభిమాని తన జీవితంలో ఎలాంటి కలకలం సృష్టించాడో ఆమె వివరించారు.

చైనీస్ అభిమాని విపరీత చేష్టలు
ఆశా పరేఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. సదరు చైనీస్ వ్యక్తి ఆమెపై అభిమానం చాటుకునేందుకు ఏకంగా ఆమె ఇంటి బయటే తిష్ట వేశాడు. అక్కడే బస చేస్తూ నిరంతరం ఆమె కదలికలను, రోజువారీ కార్యకలాపాలను గమనించేవాడు. అతడి వింత ప్రవర్తనతో ఆమె తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోజురోజుకూ అతడి నిఘా ఎక్కువవడంతో, ఆఖరికి అతడి కంట పడకుండా తప్పించుకునేందుకు ఆశా పరేఖ్ తన సొంత కారులోనే దొంగచాటుగా బయటకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది.

కత్తితో పొరుగువారిని బెదిరించి..
సదరు అభిమాని అశా ఇంటి బయట తిష్టవేయడమే కాకుండా, ఎలాగైనా ఆమె పెళ్లి చేసుకోవాలనే మొండి పట్టుదలతో ఉన్నాడు. ఈ క్రమంలో ఆశా పరేఖ్ ఇంటి ఇరుగుపొరుగు వారు అతడి ప్రవర్తనను గమనించి, అక్కడి నుండి వెళ్లొపొమ్మని గట్టిగా మందలించారు. దాంతో ఆగ్రహానికి గురైన ఆ చైనీస్ అభిమాని వెంటనే తన వద్ద ఉన్న కత్తిని తీసి, వారిని చంపేస్తానని బెదిరించాడు. ఈ ఘటనతో స్థానికులు కూడా తీవ్ర భయాందోళనలకు లోనయ్యారు.

పోలీస్ కమిషనర్‌ రంగప్రవేశం
ఈ విపరీత పరిణామాల చూసి ఆశా పరేఖ్ షాకయ్యారు. సొంత ఇంట్లోనే రక్షణ కరువైందనే భయం ఆమెలో మొదలైంది. ఎంత చెప్పినా వినని ఆ అభిమాని వేధింపుల నుండి ఎలా బయటపడాలో ఆమెకు అర్థం కాలేదు. చివరకు ఏ పరిష్కారం దొరక్కపోవడంతో, ఆశా పరేఖ్ అప్పటి ముంబై పోలీస్ కమిషనర్‌కు స్వయంగా ఫోన్ చేసి రక్షణ కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఆ చైనీస్ అభిమానిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

జైలు నుండి వచ్చిన వింత లేఖ
ఈ సంఘటన గురించి ఆశా పరేఖ్ స్పందిస్తూ.. జైలుకు వెళ్లిన తర్వాత కూడా ఆ అభిమాని మారలేదని నవ్వుతూ గుర్తుచేసుకున్నారు. జైలు నుంచే ఆమెకు ఒక లేఖ రాస్తూ, ‘నన్ను జైలులో పెట్టారు, దయచేసి నన్ను బయటకు తీసుకురండి’ అని వేడుకున్నాడట. దీనిపై ఆశా స్పందిస్తూ, ‘నేనే నిన్ను లోపల పెట్టించాను.. మరి ఎలా బయటకు తీసుకువస్తానని అనుకున్నావు?’ అని చమత్కరించారు. ఈ  ఆసక్తికరమైన ఘటనను ఆమె ‘ది కపిల్ శర్మ షో’లో కూడా పంచుకున్నారు.

దాదాసాహెబ్ అవార్డు గ్రహీత వ్యక్తిగత జీవితం
సినీ పరిశ్రమకు ఆమె చేసిన విశిష్ట కృషికి గానూ 2020లో భారత ప్రభుత్వం ఆమెను అత్యున్నత ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుతో సత్కరించింది. ఆశా పరేఖ్ ప్రముఖ చిత్రనిర్మాత నాసిర్ హుస్సేన్‌తో ప్రేమలో పడినప్పటికీ, అతనిని వివాహం చేసుకోలేదు. ఆమె జీవితాంతం వివాహం చేసుకోకుండా ఒంటరిగానే ఉండిపోయారు. తన దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఆమె ‘తీస్రీ మంజిల్’, ‘జబ్ ప్యార్ కిసీ సే హోతా హై’, ‘కార్వాన్’ తదితర అద్భుత చిత్రాలలో నటించి ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేశారు.

ఇది కూడా చదవండి: నాడు చైనా నుంచి తప్పించుకున్న దలైలామా ఏం చేశారు?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement