125 ఏళ్ల ‘డబ్బావాలా’ సేవలకు బ్రేక్‌ | Mumbai Dabbawala's suspend services today | Sakshi
Sakshi News home page

125 ఏళ్ల ‘డబ్బావాలా’ సేవలకు బ్రేక్‌

Jul 6 2026 11:28 AM | Updated on Jul 8 2026 4:29 PM

Mumbai Dabbawala's suspend services today

ముంబై: ముంబైలో కురుస్తున్న కుండపోత వర్షాలు, వరదల కారణంగా నగరానికి జీవనాడి లాంటి ముంబయి ‘డబ్బావాలా’ల సేవలు సోమవారం తాత్కాలికంగా నిలిచిపోయాయి. పలు ప్రాంతాలు జలమయం కావడం, డబ్బావాలాల రవాణాకు ప్రధాన ఆధారమైన సబర్బన్ రైలు సర్వీసులకు అంతరాయం కలగడంతో డెలివరీలను నిలిపివేయాల్సి వచ్చింది. తమ సిబ్బంది రక్షణను దృష్టిలో ఉంచుకుని ముందస్తు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది.

డబ్బావాలా అసోసియేషన్ ప్రెసిడెంట్ ఉల్హాస్ ముకే మాట్లాడుతూ, విరార్-వసాయి ప్రాంతంలో భారీ వర్షాల కారణంగా పలువురు డబ్బావాలాల ఇళ్లలోకి వరద నీరు చేరి ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అనేక రైల్వే స్టేషన్లలో కూడా నీరు నిలిచిపోవడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని పేర్కొన్నారు. తమ ఉద్యోగుల భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈరోజు సేవలను నిలిపివేయాలని నిర్ణయించామన్నారు. ఈ తాత్కాలిక అంతరాయానికి వినియోగదారులకు అసోసియేషన్ క్షమాపణలు తెలిపింది.

భారీ వర్షాల కారణంగా వెస్ట్రన్ రైల్వే పరిధిలో పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయని అసోసియేషన్ పేర్కొంది. ప్రతిరోజూ వేలాది లంచ్ బాక్సులను రవాణా చేయడానికి డబ్బావాలాలు ముంబయి సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌పైనే ఎక్కువగా ఆధారపడతారు. రైళ్లు ఆలస్యం కావడం వల్ల సకాలంలో డెలివరీలు చేయడం కష్టమవుతుంది. ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, రవాణా ఇబ్బందులను పరిగణనలోకి తీసుకుని అసోసియేషన్‌ ఈ నిర్ణయం తీసుకుంది.

గడిచిన 125 ఏళ్లకు పైగా ముంబయి ప్రజలకు సేవలు అందిస్తున్నప్పటికీ, తమ కార్మికుల సంక్షేమమే తమకు అత్యంత ప్రాధాన్యత అని డబ్బావాలా అసోసియేషన్ తెలిపింది. ‘మాకు 125 సంవత్సరాల సుదీర్ఘ సంప్రదాయం ఉన్నప్పటికీ, మా ఉద్యోగుల భద్రతే మాకు అన్నింటికంటే ముఖ్యం. అందువల్ల, ముందస్తు జాగ్రత్తగా ఈరోజు సేవలను నిలిపివేస్తున్నాం’ అని అసోసియేషన్ తెలిపింది.

ముంబై డబ్బావాలాలు తమ అత్యంత సమర్థవంతమైన లంచ్ బాక్స్ డెలివరీ వ్యవస్థకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. ప్రతి పనిదినం నగరవ్యాప్తంగా వేలాది ఇంటి భోజన డబ్బాలను ఎంతో ఖచ్చితత్వంతో వీరు చేరవేస్తారు. వీరి లాజిస్టిక్స్ మోడల్‌ను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేనేజ్‌మెంట్ ఇన్‌స్టిట్యూట్‌లు అధ్యయనం చేశాయి. ఇది అత్యుత్తమ సప్లై చైన్ సిస్టమ్స్‌లో ఒకటిగా గుర్తింపు పొందింది. ముంబైలో అత్యంత నమ్మకమైన సేవగా పేరొందిన డబ్బావాలాల వ్యవస్థ  నిలిచిపోవడం అక్కడి వాతావరణ తీవ్రతకు అద్దం పడుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement