మోకాలు పట్టేస్తోందా? | Torn Meniscus: Causes Symptoms Treatment And Prevention | Sakshi
Sakshi News home page

మోకాలు పట్టేస్తోందా?

Jul 5 2026 12:38 PM | Updated on Jul 5 2026 12:38 PM

Torn Meniscus: Causes Symptoms Treatment And Prevention

మెనిస్కస్‌ అంటే... అది మోకాలి జాయింట్‌ దగ్గర పైన ఉండే తొడ ఎముక (ఫీమర్‌)కూ, కిందనుండే కాలి ఎముక (టిబియా)కూ మధ్యన ‘సి’ ఆకారంలో ఉండే కార్టిలేజ్‌ అని పిలిచే మృదులాస్థి. నడుస్తున్నప్పుడూ, పరుగెడుతున్నప్పుడూ... కాలితో జరుగుతున్న ప్రతి పనిలోనూ ఇది ఈ రెండు ఎముకల మధ్య ఓ కుషన్‌లా, షాక్‌ అబ్జార్బర్‌లా పనిచేస్తుంటుంది. కాలిపై పడే ప్రతి ఒత్తిడిని తాను తీసుకుంటూ ఉంటుంది. మోకాలి కదలికలు సాఫీగా జరిగేందుకు, కీళ్లను రక్షించేందుకు ఇది ఎంతో ముఖ్యమైన భాగం. ఏదైనా కారణాల వల్ల ఇది దెబ్బతినడాన్ని ‘మెనిస్కస్‌ టియర్‌’ అంటారు. ఇది ఏయే సందర్భాల్లో జరుగుతుంటుంది, అప్పుడు కనిపించే లక్షణాలూ, చికిత్స వంటి అనేక అంశాలపై అవగాహన కోసం ఈ కథనం...

మోకాలి నొప్పి, వాపు, నడిచేటప్పుడు ఇబ్బంది లేదా మోకాలు ఒక్కసారిగా ‘లాక్‌‘ అయినట్లు అనిపించడం వంటి లక్షణాలను చాలామంది సాధారణ సమస్య అనుకుని నిర్లక్ష్యం చేస్తుంటారు. అయితే ఇవి మోకాలి దగ్గరి మృదులాస్థి ‘మెనిస్కస్‌ టియర్‌’ సమస్యకు సూచనలు కావచ్చు. సరైన సమయంలో గుర్తించి చికిత్స తీసుకుంటే కొన్ని ్ర΄ాథమికమైన జాగ్రత్తలతో... శస్త్రచికిత్స అవసరం లేకుండానే కోలుకునే అవకాశం ఎక్కువ. ఆ వివరాలను తెలుసుకుందాం. 

మెనిస్కస్‌ టియర్‌ సమస్య ఎందుకు వస్తుందంటే..? 

ఆటల్లో మోకాలు ప్రమాదవశాత్తూ ఆకస్మికంగామెలితిరగడం 

ప్రమాదాల్లో గానీ లేదా ఇతరత్రా మోకాలి దగ్గర బలమైన దెబ్బ తగలడం 

వయస్సు పెరగడంతో మెనిస్కస్‌ అరుగుదలకు లోనై బలహీనపడడం 

మెట్లు ఎక్కడం లేదా బరువులు ఎత్తేటప్పుడు మోకాలిపై ఎక్కువ ఒత్తిడి పడడం

ప్రధాన లక్షణాలు... 
మోకాలి నొప్పి , వాపు 
మోకాలు లాక్‌ అయినట్లు అనిపించడం 
నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు ఇబ్బంది 
మోకాలు పూర్తిగా వంచలేకపోవడం లేదా చాపలేకపోవడం 
కదిలించినప్పుడు ‘క్లిక్‌‘ లేదా ‘పాప్‌‘ శబ్దం వినిపించడం 
మోకాలిలో ఇబ్బందిగా అనిపించడం

నిర్థారణ ఇలా... 
డాక్టర్లు చాలావరకు బాధితులు చెప్పే లక్షణాలను బట్టి శారీరకంగా (ఫిజికల్‌గా) పరీక్షించి... ఈ సమస్యను చాలావరకు అంచనా వేయగలుగుతారు. అవసరమైతే ఎమ్మారై స్కాన్‌ ద్వారా మెనిస్కస్‌ టియర్‌ను ఖచ్చితంగా నిర్ధారణ చేస్తారు. 

నివారణ కోసం జాగ్రత్తలివి... 
వ్యాయామానికి ముందు వార్మప్‌ చేయడం ∙తొడ అలాగే మోకాలి కండరాలను బలపరిచే వ్యాయామాలు చేయడం ∙అధిక బరువును నియంత్రించుకోవడం ∙ఆటల్లో స్వీయభద్రత కోసం తగిన ఉపకరణాలూ, పరికరాల ఉపయోగం ∙మోకాలి నొప్పిని నిర్లక్ష్యం చేయకుండా తొలి దశలోనే డాక్టర్‌ను సంప్రదించడం. 

డాక్టర్‌ను సంప్రదించాల్సిందెప్పుడు? మోకాలి నొప్పి కొన్ని రోజుల పాటు తగ్గకపోయినా, మోకాలి దగ్గర వాపు ఎక్కువైనా, మోకాలు లాక్‌ అవుతున్నా లేదా నడవడం కష్టంగా ఉంటే వెంటనే ఆర్థోపెడిక్‌ నిపుణుడిని సంప్రదించాలి. ఆలస్యం చేస్తే మోకాలి దగ్గరి కీళ్లకు మరింత నష్టం జరిగే అవకాశం 
ఉంటుంది.

చికిత్స ఇలా... మోకాలి దగ్గర అయ్యే చిన్న΄ాటి గాయాలకు ‘రైస్‌’ అనే తేలిగ్గా గుర్తుంచుకునే యాక్రనిమ్‌ సహాయంతో సులభంగా చికిత్స అందించుకోవచ్చు. ఇంగ్లిష్‌ అక్షరాలు ‘ఆర్‌’ అంటే రెస్ట్‌ (విశ్రాంతి), ‘ఐ’ అంటే ఐస్‌ (ఐస్‌తో కోల్డ్‌ కాపడం పెట్టడం), ‘సి’ అంటే కంప్రెషన్‌ (అంటే ఒత్తిడి కలిగించేలా క్రేప్‌ బ్యాండ్‌ చుట్టడం), ‘ఈ’ అంటే ఎలివేషన్‌... అంటే మోకాలిని ఓ తలగడ సహాయంతో మిగతా దేహ భాగం కంటే కాస్త పైన ఉండేలా చూసుకోవడం ద్వారా సులభంగా చికిత్స అందించవచ్చు. 

తొలిదశల్లో ఇది శస్త్రచికిత్స అవసరం లేకుండా ఎవరికి వారు ఇంట్లోనే తీసుకోగల జాగ్రత్తలుగా అనుకోవచ్చు. ఇక మెనిస్కస్‌ టియర్‌ సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే కొన్ని మందులు, ఫిజియోథెరపీ సహాయంతో చికిత్స అందిస్తారు. అయితే ఈ మృదులాస్థి తాలూకు టియర్‌ చాలా తీవ్రంగా ఉండి మోకాలు లాక్‌ అవుతున్నా లేదా రోజువారీ పనులకు ఆటంకం కలిగిస్తే ఆర్థ్రోస్కోపీ (కీహోల్‌) శస్త్రచికిత్స అవసరం కావచ్చు. అతి చిన్న కోతలతో చికిత్స చేయడం వల్ల నొప్పి తక్కువగా ఉండి, బాధితులు చాలా త్వరగా కోలుకునే అవకాశం ఉంటుంది.

చివరగా... మోకాలి నొప్పి, అక్కడ వాపు లేదా లాక్‌ అవ్వడం వంటి లక్షణాలు కనిపిస్తున్నప్పుడు దాన్ని చిన్న సమస్యగా పరిగణించకుండా అవి మెనిస్కస్‌ టియర్‌కు సంకేతాలుగా భావించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలి. సకాలంలో నిర్ధారణ, సరైన చికిత్స తీసుకుంటే మోకాలి పనితీరును కాపాడుకోవడంతో పాటు భవిష్యత్తులో తీవ్రమైన కీళ్ల సమస్యలు రాకుండా నివారించవచ్చు. 
డాక్టర్‌ పి.ఆర్‌. వినయ్‌ కిషోర్‌, సీనియర్‌ ఆర్థోపెడిక్‌ సర్జన్‌


 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement