ఆ రోజుల్లో..ఇరుగూ పొరుగే..మెరుగు! | The way people lived in those days | Sakshi
Sakshi News home page

ఆ రోజుల్లో..ఇరుగూ పొరుగే..మెరుగు!

Jul 5 2026 10:20 AM | Updated on Jul 5 2026 10:20 AM

The way people lived in those days

ఈ రోజు లక్ష రూపాయల జీతం. ‘చాలట్లేదు’ శోకం. అన్నీ ఉన్నాయి.ఏదో లేని లోపం. గడ్డు రోజులు రాబోతున్నాయి... పేపర్‌ చదివితే భయం. ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయం. మన తల్లిదండ్రులూ తాతలూ ఇలా గాబరా పడ్డారా? వారిని నడిపించిన తారకమంత్రం తెలుసా..? అదే ఇరుగూ పొరుగూ.. అప్పట్లో ఇళ్లకు కాంపౌడ్‌ వాల్స్‌ ఉండేవి కావు. మనుషులు తలుపులు మూసుకుని బతికేవారు కాదు. ఇరుగిల్లు పొరుగిల్లు... లక్ష్మీ అక్క... తులసమ్మ వదిన.... ‘ఏమండీ సుందర్రావు గారూ’... ‘ఏం విశేషం రమణయ్య గారూ’...ఈ ఇంట్లో ఉప్పు తక్కువైతే ఆ ఇంట్లో నుంచి వెళ్లేది. ఎదురింట్లో పంచదార అయిపోతే పొరుగింటామె డబ్బాతో వచ్చేది. 

‘అప్పు’ అనే మాట ఉండేది కాదు. ‘చేబదులు’ అనేవారూ కాదు. అదో ‘సర్దుబాటు’. మనిషి తో మనిషి కలిసి బతకాలంటే పాదు చేసి పెంచుకునే మొక్క... చెట్టు.. మహావృక్షం.ఉదయం ఒక ఇంట్లో  రేడియో పెడితే ఆలిండియా వార్తలు వీధి మొత్తానికి వినిపించేవి. పక్కింటి తాతయ్య తన అరుగు మీద కూర్చునే ‘ఒరేయ్‌ శీను, సౌండ్‌ కొంచెం పెంచరా‘ అని కేకేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం రేడియో నాటకం... అందరూ ఒక్కచోట చేరి వినేవారు. అందుకు అవసరమైన ఆదరణ అనే ఐశ్వర్యం ప్రతి ఇంటా ఉండేది. 

ఒక అమ్మ చేసిన పులిహోర, మరో అమ్మ చేసిన గారెలు... వంటిళ్లు వేరైనా ఒకే కుటుంబంలా ఆరగింపు. వీధికో టీవీ ఉంటే గొప్ప. బుధవారం చిత్రహార్, శుక్రవారం చిత్రలహరి.... ఆదివారం సాయంత్రం అయిదు అవగానే ఉచిత సినిమా కోసం పిల్లలు బొంతలు, చాపలు పట్టుకుని టీవీ ఉన్న ఇంటికి పరుగో పరుగు. ఆ ఇంట్లో అంకులు ‘చెప్పులు బయట విడవండిరా’ అని అరిచేవాడు. సినిమా అయిపోయాక ‘వచ్చేవారం మళ్లీ రాండి’ అని నవ్వేవాడు. 

ఎవరింట్లో అశుభం జరిగినా వీధి వీధంతా కళ్లు తుడుచుకునేది. శుభకార్యం జరుగుతుందా... వీధి మొత్తం పందిరే. ‘తర్వాత ఇవ్వండి బంగారం కొనడానికి ఉంచండి’ అని ఒకాయన అమ్మాయి తండ్రికి డబ్బు అందిస్తే, ‘నాకు తెలిసిన షాపులో చెబుతాను ఫ్రిజ్జు తీసుకోండి... తర్వాత ఇద్దురు’ అని మరో పొరుగాయన సాయానికి వస్తాడు. బియ్యం ఫలానా చోట సలీసు అనంటే... వంటకు వేరే మనుషులు ఎందుకు... మేం వండేస్తాంగా అని వచ్చేవారు ఇంకొందరు... ‘సాటివాళ్లు’ అనే పెట్టుబడి భారీగా ఉన్న ఏ ఒక్క కుటుంబమూ దేనికీ భయపడేది కాదు. మన అమ్మానాన్నలు అలాగే నిర్భయంగా బతికారు.

పిల్లల్ని దండించే హక్కు అమ్మానాన్నలకే కాదు, పక్కింటి పిన్నికీ ఉండేది. ‘ఒరేయ్, చెరువులో ఈతకెళ్లావా? మీ అమ్మకు చెబుతా ఆగు’ అని బెదిరించేది. సాయంత్రానికి అమ్మకు నిజంగానే తెలిసేది. వీధంతా పిల్లల్ని కాచే నిజం కళ్ల సీసీ కెమెరాలు. నాలుగు నెల్ల అద్దె బాకీ ఉన్నా హౌస్‌ ఓనర్‌ అర్థం చేసుకునేవాడు. ‘క్యాష్‌ ఆన్‌ డెలివరీ’ ఎరగని నాటి శెట్టి గారూ మనిషి పరిస్థితిని బట్టి ‘చిట్టా పద్దు’ తెరిచేవాడు. 

అందరి బతుకులూ అందరికీ తెలుసు. ‘అందరూ బతకాలి గదా’ అనుకోవడమే నాటి మనుషులకు తెలుసు. గొడవలు లేవా? వచ్చేవి. కానీ సాయంత్రానికి కలిసి టీ తాగేవాళ్లు. ఈర్ష్యలు లేవా? ఉండేవి. కానీ కష్టంలో మొదట ఆదుకునేది వాళ్లే. ఒకరి ఇంట్లో పస్తులుంటే మరో ఇంట్లో మనసు కదిలేది. ఒకరి కొడుకు పాసయితే వీధంతా లడ్డూలు పంచుకునేది. సుఖం, దుఃఖం... వాటాలు వేసుకునేవాళ్లు. డెబ్బయిల, ఎనభైల మిడిల్‌ క్లాస్‌ కాలం... పర్సులు ఖాళీగా ఉన్నా మనసులు నిండుగా ఉండే కాలం అది. గోడలు తక్కువ గుమ్మాలు ఎక్కువ ఉన్న రోజులు. నేటి కరెన్సీ కంగారులో, ఇ.ఎం.ఐ. ఉక్కపోతలో ఆనాటి అరుగు కబుర్లే, ఆ రోజుల పాతగాలే ఊరట. వాటిని తలుచుకోవడమే మనకు మందు. 

ఆ బంగారు రోజులు రిపీట్‌ కావు. బతుకును బేరీజు వేసుకుని, కళ్లు తెరవడం పెద్ద కష్టమూ కాదు. బంధాలు స్నేహాలు కట్‌ చేసుకోవడం ఫ్యాషన్‌ అయి΄ోయిన ఈ రోజుల్లో చిన్న దుమారం వచ్చినా వణుకు రాక మరేం వస్తుంది? అభిమానాలు, అనుబంధాలు సిసలైన ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, అసెట్లు. అవి గట్టిగా ఉంటే రేట్లు పెరిగినా కాట్లు వేయలేవు. ఇబ్బందులు వీధిన పడేయవు.
గుర్తుంచుకోండి. కొన్ని పాత పద్ధతులు పని చేస్తాయి.    
 – కె. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement