breaking news
sunday special
-
తైలవర్ణ చిత్రం.. 'మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో..'
‘‘మీ అల్లుడికి హిమాచల్‌ప్రదేశ్‌లో చంబాకి బదిలీ అయింది.’’ సుధీర చెప్పింది. ‘‘అయ్యో! అంత దూరమా?’’ ఆమె తండ్రి వెంటనే చెప్పాడు. సాయంత్రం ఆయన సుధీరకి ఫోన్ చేసి చెప్పాడు.‘‘మీ మామయ్య దుర్గ గుడిలో అకౌంటెంట్ కదా. ఆయనకి మీ బదిలీ సంగతి చెప్తే, మిమ్మల్ని జాగ్రత్తగా ఉండమని, హిమాచల్‌ప్రదేశ్‌లో మంత్రతంత్రాలు తెలిసిన చాలామంది ఉన్నారని చెప్పారు. వాళ్ళు మనుషుల్ని వశీకరణ మంత్రాలతో ఆకర్షించి డబ్బు, బంగారం తీసుకోగలరట. ముఖ్యంగా నల్ల బట్టలు ధరించే అఘోరీలని అసలు నమ్మద్దని చెప్పమన్నారు. వాళ్ళ దగ్గర చాలా దుష్ట మంత్రశక్తులు ఉంటాయట.’’తన భర్త ఇంటికి రాగానే సుధీర ఆ సంగతులన్నీ చెప్పింది.‘‘అయితే మనం జాగ్రత్తగా ఉండాలి.’’ అతను చెప్పాడు.రెండు వారాల తర్వాత వాళ్ళు వరంగల్ నించి చంబాకి బయలుదేరారు.∙∙ సుధీర భర్త కొత్త బ్రాంచ్‌లోని సిబ్బందితో మాటల్లో తన మామగారు చెప్పింది చెప్పి అడిగాడు.‘‘అది నిజమా?’’‘‘అవును. ఎవరైనా పోయారని తెలిస్తే వచ్చి ఆ రాత్రికి శవాన్ని ఇవ్వమంటారు. సాధువుల్లా కనపడే కాషాయరంగు దుస్తులవాళ్ళ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. క్షుద్రపూజలో వారికి శవం అవసరం అవుతుంది.’’∙∙ చంబాకి వచ్చిన రెండేళ్ళల్లో వాళ్ళకి ఎలాంటి చేదు అనుభవం కలగకపోవడంతో క్రమంగా భయంపోయింది.రోజూ రాత్రి ఎనిమిదిలోగా ఇంటికి వచ్చే సుధీర భర్త ఓరోజు బ్రాంచ్ నించి రాత్రి పదకొండైనా రాలేదు. పదకొండుకి బ్రాంచ్‌కి ఫోన్ చేస్తే సెక్యూరిటీ గార్డ్ ఆన్సర్ చేశాడు.‘‘ఎవరూ లేరు మేడం. స్టాఫ్ అంతా వెళ్ళిపోయారు.’’ చెప్పాడు.తెల్లవారుజామున మూడు దాకా ఆమె మేలుకునే ఉంది. తన భర్త రాకపోవడంతో ఉదయం పదిన్నరకి బేంక్‌కి ఫోన్ చేసింది. రాలేదని తెలిశాక పోలీసులకి ఫిర్యాదు చేసింది.ముందుగా పోలీసులు అతని బ్రాంచ్‌కి వెళ్ళి కేష్ సరిగ్గా ఉందా లేదా అని తెలుసుకున్నారు. ఉందని తెలిశాక అతని కోసం వెదికారు. అతని జాడ తెలీలేదు.మర్నాడు మధ్యాహ్నం ఓ కాన్ స్టబుల్ వారింటికి వచ్చి అడిగాడు.‘‘మీవారి స్కూటర్ రోడ్ మీద ఎవరి ఇంటి ముందో ఉందట. అది దొంగిలించబడిందనే అనుమానంతో ఒకరు ఫోన్ చేశారు. చంపావతి నగర్లో మీకు బంధుమిత్రులు ఉన్నారా?’’ ‘‘లేరండి. అక్కడికి ఎందుకు వెళ్ళి ఉంటారు?’’ సుధీర ఆదుర్దాగా చెప్పింది. ఇద్దరూ అక్కడికి చేరుకున్నారు. వాళ్ళని చూసి ఎదురింట్లోంచి ఫిర్యాదు చేసిన ముసలాయన బయటికి వచ్చి చెప్పాడు.‘‘రాత్రి నించి ఇది ఇక్కడే ఉండటంతో ఎవరో దొంగిలించి ఇక్కడ వదిలారని అనుమానించాను.’’ ‘‘మీ ఎదురింట్లో ఎవరు ఉంటారు?’’ స్కూటర్ ఆ ఇంటివైపు పార్క్ చేసి ఉండటంతో పోలీస్ కానిస్టేబుల్ అడిగాడు. ‘‘అది ఖాళీ. అందులో ఎవరూ లేరు. అక్కడో సంఘటన జరిగాక ఎవరూ అద్దెకి రాలేదు.’’ ఆయన నెమ్మదిగా చెప్పాడు. ‘‘ఏమిటది?’’ సుధీర వెంటనే అడిగింది. ‘‘నాలుగైదేళ్ళ క్రితం ఆ ఇంటావిడ అకస్మాత్తుగా నెత్తురు కక్కుకుని మరణించింది. రాత్రుళ్ళు మగాళ్ళు ఆ ఇంటి పక్కనించి వెళ్తూంటే రమ్మని ఇంట్లోంచి ఆడవాళ్ళ పిలుపు వినిపిస్తుంది.’’కాన్ స్టబుల్ ఓ అపార్ట్మెంట్కి వీధివైపున్న సీసీటీవీ కెమెరాని గమనించి దాన్ని చెక్ చేస్తే, రెండు రోజుల క్రితం చీకటి పడుతూండగా సుధీర భర్త దాని డోర్ బెల్ నొక్కడం, తలుపు తెరుచుకున్నాక లోపలికి వెళ్ళడం కనిపించింది. తర్వాత రికార్డ్ అయినదంతా చెక్ చేశారు కాని, ఆ ఇంట్లోంచి సుధీర భర్త మళ్ళీ బయటకి రావడం కనిపించలేదు. ‘‘సందేహం లేదు. ఆయన ఏ కారణంగానో లోపలే ఉన్నారు.’’ సుధీర కంగారుగా చెప్పింది. ‘‘అదెలా జరుగుతుంది? దాని తాళంచెవులు నా దగ్గరే ఉన్నాయి. దాన్ని మా బాబాయి కొన్నారు.’’ ముసలాయన ఆశ్చర్యంగా చెప్పాడు. తాళం తెరిచి అంతా లోపలికి వెళ్ళగానే సుధీర గట్టిగా అరిచింది.‘‘ఏమండీ? ఉన్నారా?’’ పాతికేళ్ళ క్రితం కట్టిన ఆ ఆరు గదుల ఇంట్లోని ప్రతీ గదిని వెతికారు. బూజు. ఎవరూ లేరు. కాన్ స్టబుల్ ప్రతి అల్మరా తలుపులు తెరిచి చూస్తే లోపలా లేడు. పడక గదిలో గోడకి వేలాడే తైలవర్ణచిత్రంలో జలతారు చీరలోని అందమైన ఏభై ఏళ్ళ స్త్రీ కనిపించింది.‘‘ఆ తైలవర్ణచిత్రం మరణించిన ఆవిడది... అరే. ఈ బొమ్మలోకి కొత్తగా ఎవరో వచ్చారే? దీన్ని ఈ బొమ్మలో ఎవరు గీశారో?’’ ఎదురింటి ఆయన సంభ్రమంగా చెప్పాడు. ‘‘అది మా వారే.’’ సుధీర కెవ్వున అరిచి చెప్పింది.- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
ప్రాంక్ కాల్..
బిజినెస్‌మేన్ సారథి ఆఫీస్ పనిలో బిజీగా ఉన్నాడు. సరిగా అదే సమయంలో ఒక గుర్తుతెలియని నంబర్ నుంచి ఫోన్‌కాల్ వచ్చింది. సారథి ఫోన్ తీశాడు. అవతలి వ్యక్తి గొంతులో కరుకుదనం... ‘నీ కొడుకు రిత్విక్‌ను కిడ్నాప్ చేశాం. ఒక గంటలో పది లక్షల రూపాయలు తీసుకుని స్టార్ బేకరీ దగ్గరికి రా. పోలీసులకు చెబితే నీ కొడుకు ప్రాణాలు ఉండవు’ అని చెప్పి ఫోన్ కట్ చేశాడు.రిత్విక్ తన ఫ్రెండ్ బెనర్జీ ఇంటికి వెళ్తానని చెప్పాడు. వెంటనే సారథి బెనర్జీకి ఫోన్ చేశాడు. రిత్విక్ తన దగ్గరికి రాలేదని చెప్పాడు.సారథికి కాళ్లూ చేతులూ ఆడలేదు. పెళ్ళైన పదేళ్లకు లేకలేక పుట్టిన కొడుకు. ఇంకేమీ ఆలోచించలేదు. డబ్బులు సూట్ కేసులో పెట్టుకుని స్టార్ బేకరీ దగ్గరికి వెళ్ళాడు. కానీ కిడ్నాపర్ జాడ లేదు. ఐదు... పది నిమిషాలు... అప్పుడే నవ్వుతూ ఎదురొచ్చాడు బెనర్జీ. వెంటనే ఆందోళనగా ‘నువ్వేంటి ఇక్కడ?’ అంటూ కొడుకు కిడ్నాప్ అయిన విషయం చెప్పి, పది లక్షలు ఉన్న సూటుకేసు చూపించాడు సారథి.వెంటనే బెనర్జీ నవ్వడం మొదలుపెట్టాడు.నిజానికి అది స్నేహితుడు బెనర్జీ ఆడిన ఒక క్రూరమైన ‘ప్రాంక్ కాల్’ నాటకం. రిత్విక్‌ను స్టార్ బేకరీకి తీసుకువెళ్లి, అక్కడ కూర్చోబెట్టి సారథిని భయపెట్టాలని బెనర్జీ ప్లాన్ వేశాడు.కానీ అప్పుడే అనూహ్య సంఘటన జరిగింది. రిత్విక్ నిజంగానే కిడ్నాప్ అయ్యాడు.∙∙ ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న రంగంలోకి దిగాడు.ప్రాంక్ కాల్ చేసిన ఫ్రెండ్ బెనర్జీని అదుపులోకి తీసుకుని విచారించాడు. బెనర్జీ ఏడుస్తూ, ‘సార్, నేను కేవలం సరదా కోసమే ఫోన్ చేశాను. బేకరీలోనే బాబు ఉన్నాడు, ఇంతలోనే ఏమైందో తెలియదు’ అని చెప్పాడు.ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న వెంటనే బేకరీలోని సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించాడు. అందులో ముఖానికి మాస్క్ ధరించిన ఒక వ్యక్తి రిత్విక్‌ను తన వెంట తీసుకువెళ్లడం స్పష్టంగా కనిపించింది. ప్రద్యుమ్న చుట్టుపక్కల విచారణ మొదలుపెట్టాడు. కానీ ఎలాంటి ఆధారం లభించలేదు. అనుమానాస్పదంగా కూడా ఎవరూ కనిపించలేదు. వాడెవరా అని ఆరా తీసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.ప్రద్యుమ్న పోలీస్ బుర్ర శరవేగంగా పనిచేయడం ప్రారంభించింది. కిడ్నాప్ చేసినవాడికి ఏమైనా క్రిమినల్ రికార్డు ఉందా అని అనుమానించాడు. ఆ వ్యక్తి నడక, శైలిని బట్టి ప్రద్యుమ్న తన పోలీస్ డేటాబేస్‌ను తనిఖీ చేయగా, వాడు పాత క్రిమినల్ అని క్లూ దొరికింది. రిత్విక్ ఒంటరిగా బేకరీలో కనిపించేసరికి కిడ్నాప్ చేశాడు.కానీ వాడు ఎటు వెళ్లాడో తెలుసుకోవడం ఎలా? ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న ఒక అద్భుతమైన ప్లాన్ వేశాడు. కిడ్నాపర్ బేకరీకి వచ్చినప్పుడు కచ్చితంగా ఏదో ఒకటి ఆర్డర్ చేసి ఉంటాడని భావించి, ఆ సమయానికి సంబంధించిన బేకరీ బిల్స్, కౌంటర్ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశాడు. ప్రద్యుమ్న అనుకున్నట్లే, మాస్క్ ధరించిన ఆ క్రిమినల్ బేకరీలో బిల్లు చెల్లించడానికి తన మొబైల్ నుంచి ‘గూగుల్ పే’ చేసినట్లు గుర్తించాడు.వెంటనే ఆ ‘గూగుల్ పే’ లావాదేవీకి సంబంధించిన మొబైల్ నంబర్‌ను ట్రేస్ చేయాల్సిందిగా సైబర్ క్రైమ్ టీమ్‌ను ఆదేశించాడు ప్రద్యుమ్న.కేవలం పది నిమిషాల్లో ఆ నంబర్ లొకేషన్ నగర శివార్లలోని ఒక నిర్జన ప్రదేశాన్ని చూపించింది. ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న తన టీమ్‌తో కలిసి మెరుపు వేగంతో ఆ స్థావరంపై దాడి చేశాడు. రిత్విక్ నోటికి ప్లాస్టర్ వేసి బంధించిన ఆ పాత క్రిమినల్‌ను గన్ పాయింట్లో లొంగదీసుకుని, రిత్విక్‌ను సురక్షితంగా కాపాడాడు. అసలు కిడ్నాపర్‌ను అరెస్ట్ చేసిన తర్వాత, ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న బెనర్జీ వైపు సీరియస్‌గా చూశాడు. ‘చూశావా బెనర్జీ! కుటుంబ సభ్యులతో... స్నేహితులతో సరదాగా ఆడుకునే ఈ ప్రాంక్ కాల్స్ చాలాసార్లు ప్రమాదాలను తెచ్చి పెడుతుంది. సరదాకు ఒక లిమిట్ ఉంటుంది... నీ వెర్రి సరదా ఈరోజు ఒక పాత క్రిమినల్‌కు ఎంత పెద్ద అవకాశం ఇచ్చిందో!’ అని హెచ్చరించాడు ఇన్స్పెక్టర్ ప్రద్యుమ్న. బెనర్జీ తలదించుకుని క్షమాపణలు కోరాడు.- శ్రీసుధామయి -
దెయ్యం అనుకుని చంపాను...
మనిషి భయంతో ఉన్నప్పుడు తాడు కూడా పాములా కనిపిస్తుంది. ఒక్కోసారి ఎదురుగా ఉన్న మనిషిని కూడా దెయ్యంలా భ్రమింప చేస్తుంది. ఆ రాత్రీ సరిగ్గా ఇలానే జరిగింది. ఎదురుగా చీకట్లో కనిపిస్తున్న మహిళలే ఆ ఊరికి పట్టిన దెయ్యాల్లా ఓ వ్యక్తి భావించాడు. చేతిలో ఉన్న ఆయుధంతో దాడి చేశాడు.ఓ మహిళ ప్రాణం గాల్లో కలిసిపోయింది. కొంతసేపటికి అతని భ్రమ తొలగింది. వాస్తవం అర్థమైంది. భయం కారణంగా నేరానికి పాల్పడితే చట్టం రక్షిస్తుందా? భ్రమలో ప్రాణం తీస్తే శిక్ష ఉండదా? ఇదో అరుదైన కేసుగా నిలిచింది.ఆశ కేన్సర్ ఉన్న వాడ్ని కూడా బతికిస్తుంది. భయం ఏ రోగం లేని వాడిని కూడా చంపేస్తుంది. అలాంటి భయం– దెయ్యాలున్నాయనే ఓ గూర్ఖా నమ్మకం ఒక అమాయక మహిళ ప్రాణం తీసింది. మరో ఇద్దర్ని తీవ్రంగా గాయపరిచింది. అతడ్ని నిందితుడ్ని చేసింది. భ్రమలో జరిగిన నేరంగా పరిగణించాలని నిందితుడు, ఐపీసీ సెక్షన్ 79 ఇతడికి రక్షణ కల్పించదని ప్రభుత్వం – ఇరు పక్షాలు కోర్టులో వాదించాయి. చివరకు ఈ కేసును ఉన్నత న్యాయస్థానం పరిష్కరించింది.ఒడిశా బాలేశ్వర్ జిల్లాలోని రాసగోవింద్‌పూర్ గ్రామానికి సమీపంలో ఓ పాడుబడిన విమానాశ్రయం ఉంది. అక్కడ ఉన్న పాత వస్తువులను కొనేందుకు కలకత్తాకు చెందిన ఛటర్జీ అనే వ్యక్తి తన సేవకుడు, నేపాల్‌కు చెందిన గూర్ఖా రామ్ బహదూర్ థాపాతో అక్కడికి వెళ్లాడు. ఆ విమానాశ్రయ ప్రాంతాన్ని ‘దెయ్యాలు తిరిగే ప్రదేశంగా’ ఆ సమీప గ్రామాల ప్రజలు భావించేవారు. ఆ భయంతో రాత్రిపూట ఆ దారి గుండా తమ గ్రామాలకు ఒంటరిగా వెళ్లేందుకూ భయపడేవారు.చీకట్లో ఘోరం..సమీపంలోని తేల్కుండి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి రాత్రిపూట ఒంటరిగా తన గ్రామానికి వెళ్లేందుకు భయపడి రాసగోవింద్‌పూర్ గ్రామంలోనే ఉండిపోయాడు. ‘నీ ఊరికి వెళ్లేందుకు మేము తోడుగా వస్తామ’ని చటర్జీ, థాపా ఆ వ్యక్తికి చెప్పారు. ముగ్గురూ కలిసి బయలుదేరారు. కొంత దూరం వెళ్లాక అటవీ ప్రాంతంలో మసక వెలుతురులో మూడు నల్లటి ఆకారాలు వీరి కంటపడ్డాయి. దీంతో వీరి పైప్రాణాలు పైనే పోయాయి. భయంతో వణికిపోయారు. అవి దెయ్యాలే అని బలంగా నమ్మారు. ఆ ఆకారాలు దగ్గరకు రాగానే వెంటనే థాపా కత్తితో ఆ ముగ్గురిపై దాడికి దిగాడు. హాహాకారాలు వినిపించడంతో తేరుకున్న థాపా– పరీక్షించి చూడగా వారు సమీప గ్రామానికి చెందిన మహిళలు. అడవిలో విప్ప పూలను సేకరించేందుకు అక్కడికి వచ్చారని తెలిసింది. అప్పటికే ఓ మహిళ చనిపోయింది. మిగిలిన ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు.కోర్టులో విచారణ..థాపాపై ఐపీసీ 302, 326,324 సెక్షన్ల కింద అభియోగాలు నమోదయ్యాయి. ‘తాను మనుషులపై కాకుండా దెయ్యాలపై దాడి చేస్తున్నాననే భ్రమలో ఈ చర్యకు పాల్పడినట్టు సెషన్స్ కోర్టుకు థాపా వివరించాడు. ఐపీసీ సెక్షన్ 79 ప్రకారం రక్షణ కల్పించాలని వేడుకున్నాడు. హత్య చేయాలనే ఉద్దేశంతో దాడికి పాల్పడలేదు. మంచి విశ్వాసంతో జరిగిన పొరబాటు చర్యగా కోర్టు భావించింది. సెక్షన్ 79 వర్తిస్తుందని సెషన్స్ కోర్టు అతడ్ని నిర్దోషిగా విడుదల చేసింది.హైకోర్టులో వాదనలు..సెషన్స్ కోర్టు తీర్పుపై ప్రభుత్వం అప్పీలుకు వెళ్లింది. దాడి జరిగిన సమయంలో తగిన జాగ్రత్తలు పాటిస్తే ఈ ఘటన జరిగేది కాదని ప్రభుత్వ న్యాయవాది చెప్పారు. అతని చేతిలోని టార్చ్ వేసి ఆ ఆకారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేయలేదని ఆరోపించాడు. హత్య చేయాలనే ఉద్దేశం లేకపోయినా, అజాగ్రత్త కారణంగా ఓ వ్యక్తి మరణానికి, మరో ఇద్దరు గాయపడడానికి కారణం అయ్యాడని కోర్టుకు వివరించాడు. ఐపీసీ సెక్షన్ 304ఏ, 336 కింద శిక్షార్హుడని వాదించాడు. సాక్షుల విశ్వసనీయతపైనా కోర్టు పలు సందేహాలు వెలిబుచ్చింది. ఛటర్జీ సాక్ష్యం మాత్రమే స్థిరంగా, విశ్వసనీయంగా ఉందని దాన్ని మాత్రమే పరిగణనలోకి తీసుకోవచ్చని పేర్కొంది. ‘ఒక వ్యక్తి తాను చేస్తున్న పని చట్టపరంగా సరైందే అని అతను నమ్మితే సరిపోదు; ఆ నమ్మకం వాస్తవ పరిస్థితిని అర్థం చేసుకోవడంలో పొరపాటు; ఆ పని నిజాయితీతో, తగిన జాగ్రత్తతో ఉండాల’ని కోర్టు పేర్కొంది. ‘జాగ్రత్త’ అనే ప్రమాణాన్ని అన్ని సందర్భాల్లో, అందరికీ ఒకేలా వర్తింప చేయలేమని పేర్కొంది. వ్యక్తులు, పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండొచ్చని వెల్లడించింది. వేర్వేరు కేసుల్లో ఇది మారొచ్చని చెప్పింది. ఈ కేసులో అక్కడి పరిస్థితులు, అతని మానసిక పరిస్థితిని కూడా దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొంది. మరింత జాగ్రత్తగా, అప్రమత్తతో వ్యవహరించి ఉంటే ఈ ఘటనను నివారించగలిగే వాడనే కారణంగా సెక్షన్ 79 రక్షణను నిరాకరించలేమని కోర్టు స్పష్టం చేసింది. సెషన్స్ కోర్టు జడ్జి ఉత్తర్వులు సరైనవేనని ధ్రువీకరిస్తూ, అప్పీల్‌ను కొట్టేస్తూ తీర్పు ఇచ్చింది.- దిలీప్ మాదిరెడ్డి -
కథ: నిజమైన నాయకత్వం!
అనగనగా ఒక అడవిలో ఒక సింహం ఉండేది. అది చాలా శక్తిమంతమైనది, కానీ శక్తికి మించిన గర్వం దాని సొంతం. ప్రతిరోజూ ఉదయాన్నే ఆ సింహం చేసే భయంకరమైన గర్జనలకు అడవిలోని చెట్లు సైతం వణికిపోయేవి. ‘ఈ అడవికి నేనే సర్వాధికారిని, నా మాటే వేదవాక్కు’ అని అది విర్రవీగుతూ, మిగిలిన జంతువులను చులకనగా చూసేది. జంతువులన్నీ దాని నీడ కనిపిస్తేనే ప్రాణభయంతో చెల్లాచెదురైపోయేవి.ఒక మధ్యాహ్నం మండుతున్న ఎండలో ఒక ఏనుగు చెరువు దగ్గర ప్రశాంతంగా నీళ్లు తాగుతోంది. సరిగ్గా అదే సమయానికి అక్కడికి వచ్చిన సింహం, ఏనుగును చూడగానే అహంకారంతో ఊగిపోయింది. ‘ఓయ్ నల్ల బండా! నా దారికి అడ్డుగా నిలబడతావా? నేనెవరో తెలుసా? వెంటనే ఇక్కడి నుండి తప్పుకో!’ అని గర్జించింది. ఏనుగు చాలా సంస్కారవంతురాలు కాబట్టి, ఎంతో వినమ్రంగా ‘క్షమించు రాజా, దాహం వేసి ఇప్పుడే వచ్చాను, నీళ్లు తాగి వెళ్ళిపోతాను’ అని బదులిచ్చింది. కానీ సింహం శాంతించలేదు, ‘క్షణంలో నా కంట పడకుండా వెళ్ళిపోకపోతే నీ అంతం చూస్తాను’ అని హెచ్చరించింది. ఏనుగు ఏమీ మాట్లాడకుండా, ఆ గర్విష్టి సింహానికి తలవంచి అక్కడి నుండి మౌనంగా వెళ్ళిపోయింది.మరుసటి రోజు అడవిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. కారుమబ్బులు కమ్మి, భయంకరమైన తుఫాను మొదలైంది. ఉరుములు, మెరుపుల ధాటికి అడవి అంతా అతలాకుతలమైంది. పెనుగాలికి ఒక భారీవృక్షం వేళ్లతో సహా పెకలించుకుపోయి, సరిగ్గా గుహ బయట ఉన్న సింహం మీద పడింది. ఆ బరువుకు సింహం కింద పడిపోయి, కదలలేని స్థితికి చేరుకుంది. ‘ఎవరైనా కాపాడండి! చనిపోతున్నాను!’ అని ఎంత ఆక్రందన చేసినా, దాని గర్వానికి భయపడి ఏ జంతువూ దరిదాపుల్లోకి రాలేదు.అదే సమయంలో అడవిలో వైద్యం చేసే ఎలుగుబంటి సింహం పడుతున్న యాతనను చూసి చలించిపోయింది. వెంటనే సింహం దగ్గరకు వెళ్లి, ఆ భారీ చెట్టును పక్కకు జరపడానికి తన శక్తినంతా ధారపోసి ప్రయత్నించింది. కానీ ఒక్క ఎలుగుబంటి వల్ల అది సాధ్యం కాలేదు. అప్పుడు ఎలుగుబంటికి ఏనుగు గుర్తుకు వచ్చింది. సింహం చేసిన అవమానాన్ని మరచిపోయి, అడవి రాజు ప్రాణాలు కాపాడమని ఏనుగును వేడుకుంది. ఏనుగు క్షణం కూడా ఆలోచించకుండా అక్కడికి చేరుకుని, తన బలమైన తొండంతో ఆ భారీ వృక్షాన్ని ఒక్క ఊపున పక్కకు విసిరేసింది.ప్రాణాలు దక్కించుకున్న సింహం కళ్లలో నీళ్లు తిరిగాయి. ‘గజరాజా! నిన్న నిన్ను అంతగా అవమానించినా, నా ప్రాణాలు ఎందుకు కాపాడావు?’ అని పశ్చాత్తాపంతో అడిగింది. అప్పుడు ఏనుగు చిరునవ్వుతో ‘రాజా! ఇతరులను భయపెట్టడం అధికారం కాదు, ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే నిజమైన శక్తి’ అని హితవు పలికింది. ఎలుగుబంటి కూడా తోడై ‘ప్రేమతో సాధించలేనిది ఏదీ లేదు’ అని వివరించింది. ఆ మాటలతో సింహం అహంకారం పూర్తిగా నశించిపోయింది.అయితే, అడవిలో శాంతి నెలకొంటున్న తరుణంలో ఒక కొత్త ముప్పు పొంచి వచ్చింది. కొంతమంది వేటగాళ్లు అత్యాధునిక ఆయుధాలతో అడవిపై దాడి చేయడానికి సరిహద్దుల్లో తిష్ట వేశారు. గతంలో అయితే సింహం ఒంటరిగా వెళ్లి వారితో పోరాడి గాయపడేది, కానీ ఇప్పుడు అది ఏనుగు, ఎలుగుబంటితో కలిసి యుద్ధ తంత్రాన్ని రచించింది. పక్షులు ఆకాశం నుండి వేటగాళ్ల కదలికలను గమనించాయి, కోతులు చెట్లపై నుండి రాళ్లు రువ్వాయి, ఎలుగుబంటి తేనెటీగల గుంపును వారిపైకి ఉసిగొల్పింది. చివరగా సింహం, ఏనుగులు కలిసి చేసిన మెరుపు దాడికి వేటగాళ్లు ప్రాణభయంతో అడవి విడిచి పారిపోయారు.అడవిలో మునుపెన్నడూ లేని ఐక్యత కనిపించింది. సింహం తన గర్వాన్ని వదిలి, ఏనుగును తన మంత్రిగా, ఎలుగుబంటిని రాజ్య వైద్యుడిగా నియమించుకుంది. ప్రతి జంతువు సమస్యను స్వయంగా విని పరిష్కరించే నాయకుడిగా సింహం పేరు తెచ్చుకుంది. అడవిలో క్రూరత్వం పోయి అనురాగం పెరిగింది, బలహీనమైన జంతువులకు రక్షణ దొరికింది. శక్తికి వివేకం తోడైతే, అధికారం సేవగా మారితే ఎంతటి మార్పు వస్తుందో తెలుసుకుంది సింహం.- ముద్దు హేమలత -
'డ్రోన్ ఐస్'
చీకట్లోనే కాదు, వెలుతురులో కూడా చీకటి నేరాలు జరిగే సమయం.. మధ్యాహ్నం రెండు గంటలు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్ సమీపంలోని ఒక నిర్జన ప్రదేశం. మహాలక్ష్మి బ్యాంక్‌కు చెందిన చెస్ట్ వ్యాన్ భారీ నగదుతో వెళ్తోంది. అకస్మాత్తుగా రెండు బైక్‌లు, ఒక ఎస్యూవీ వ్యాన్ ను అడ్డుకున్నాయి. ముసుగులు ధరించిన నలుగురు దుండగులు క్షణాల వ్యవధిలో వ్యాన్ తలుపులు బద్దలు కొట్టారు. గార్డులపై దాడి చేసి, డబ్బుతో పరారయ్యారు.ఇదంతా మెరుపు వేగంతో జరిగింది. గార్డులు తేరుకునేలోపే ముసుగువ్యక్తులు మాయమయ్యారు. రాబరీకి ఐదు నిమిషాల ముందు ఆ ప్రాంతంలోని సీసీ కెమెరాల వైర్లు కట్ చేయబడ్డాయి. స్థానిక పోలీసులకు ఎలాంటి ఆధారాలూ దొరకలేదు. దీంతో ఢిల్లీ నుంచి ప్రైవేట్ డిటెక్టివ్ సిద్ధార్థ రంగంలోకి దిగాడు. సంఘటనా స్థలంలో సిద్ధార్థకు ఎలాంటి వేలిముద్రలు దొరకలేదు. సీసీటీవీ వైర్లను కట్ చేసిన తీరు చూసి, ఇది పక్కా ప్రొఫెషనల్స్ చేసిన రాబరీ అని గ్రహించాడు. ఏ కెమెరా ఎప్పుడు పనిచేయదు అనే విషయం తెలిసిన వారే దీని వెనుక ఉన్నారు. అదే సమయంలో ఆ ఏరియాకు కొద్ది దూరంలో ఒక సినిమా షూటింగ్ జరుగుతోంది.ఆ రోజు అక్కడ ఒక భారీ యాక్షన్ సీక్వెన్ ్స షూట్ చేస్తున్నారు. సిద్ధార్థ వెంటనే డైరెక్టర్‌ను కలిసి, ‘రాబరీ జరిగిన సమయంలో మీ దగ్గర ఎలాంటి కెమెరాలు రన్నింగ్‌లో ఉన్నాయి?’ అని అడిగాడు. అప్పుడు ఆ సినిమా కెమెరామెన్, తాము లొకేషన్ వైడ్ యాంగిల్ కోసం ఆ సమయంలో ఒక హై–రెజల్యూషన్ 4కే డ్రోన్‌ను గాల్లోకి పంపినట్లు చెప్పాడు.సిద్ధార్థ వెంటనే ఆ సమయంలో లొకేషన్ వైడ్ యాంగిల్ కోసం వాడుతున్న హై–రిజల్యూషన్ డ్రోన్ ఫుటేజీని సేకరించాడు.ల్యాబ్‌లో స్క్రీన్ పై ఆ డ్రోన్ ఫుటేజీని ప్లే చేసి చూశాడు. అందులో దొంగల ముఖాలు కనిపించలేదు కానీ, వాళ్ళు ఏ వైపు నుంచి వచ్చారో, దోచుకున్న తర్వాత ఏ రహదారి గుండా ఎటువైపు పారిపోతున్నారో స్పష్టంగా రికార్డయ్యింది. ఆ రూట్ మ్యాప్‌ను విశ్లేషిస్తున్నప్పుడు సిద్ధార్థకు ఒక కీలకమైన ట్విస్ట్ దొరికింది. వ్యాన్ లాక్ తీయడానికి దొంగలు వాడిన ఎలక్ట్రానిక్ కోడ్ బ్యాంక్ అంతర్గత సిస్టమ్‌కు చెందింది. అంటే లోపలి వాళ్ళ సహాయం లేనిదే ఈ ప్రొఫెషనల్ రాబరీ సాధ్యం కాదు.డిటెక్టివ్ సిద్ధార్థ నేరుగా మహాలక్ష్మి బ్యాంకుకు వెళ్లాడు. స్టాఫ్ అందరినీ ఒక కాన్ఫరెన్స్ హాల్లోకి పిలిపించాడు. అందులో బ్యాంక్ క్యాషియర్ రాఘవన్, సెక్యూరిటీ మేనేజర్ విక్రమ్ కూడా ఉన్నారు. అందరి ముందూ ఒక పెద్ద ప్రొజెక్టర్ స్క్రీన్ ను ఏర్పాటు చేశాడు సిద్ధార్థ.అందరూ చిన్నపాటి కన్ఫ్యూజన్లో వున్నారు. ‘ఓ వైపు రాబరీ జరిగిన ఆందోళనలో ఉంటే, ఏమిటిది?’ అనే ప్రశ్న వాళ్ళ మొహాల్లో క్లియర్ గా కనిపిస్తోంది.అందరి వైపు నవ్వుతూ చూస్తూ, ‘‘బ్యాంకు రాబరీ జరిగినప్పటి నుంచి మీరంతా టెన్షన్లో ఉన్నట్లున్నారు. ఆ టెన్షన్ నుంచి బయటపడడానికి ఒక మంచి యాక్షన్ సీక్వెన్ ్స చూద్దాం’’ అని చెప్పి డ్రోన్ ఫుటేజీని ప్లే చేశాడు.డిటెక్టివ్ సిద్దార్థకు ఎదురు చెప్పలేక చూడడం మొదలుపెట్టారు.స్క్రీన్ పై దొంగలు పారిపోతున్న విజువల్స్ వస్తుండగా సిద్ధార్థ గంభీరంగా మాట్లాడటం మొదలుపెట్టాడు.‘‘ఈ దొంగలు చాలా ప్రొఫెషనల్‌గా ప్లాన్ చేశారు. కానీ వ్యాన్ బయలుదేరడానికి మూడు నిమిషాల ముందు బ్యాంక్ లోపలి నుంచే ఒక ఎన్క్రిప్టెడ్ మెసేజ్ బయటకు వెళ్ళింది. దొంగలు వాడిన డిజిటల్ కీని కూడా బ్యాంక్ లోపలి నుంచే యాక్సెస్ చేశారు. ఆ పక్కా సమాచారం ఇచ్చింది మరెవరో కాదు...’’ అంటూ సిద్ధార్థ ప్రొజెక్టర్ లైట్ వెలుతురులో రాఘవన్, విక్రమ్ వైపు తీక్షణంగా చూశాడు.అప్పటికే రాఘవన్, విక్రమ్ ముఖ కవళికల్లో భయం స్పష్టంగా కనిపిస్తోంది. వారి ముఖాలు పాలిపోయాయి, నుదుటిపై చెమటలు పట్టాయి. వారి గుండె వేగం పెరగడం పక్కనే ఉన్నవాళ్లకు కూడా అర్థమవుతోంది.సిద్ధార్థ వారి ముందుకు నడుచుకుంటూ వచ్చి, ‘‘మిస్టర్ రాఘవన్ అండ్ విక్రమ్! మీ కోసం బయట పోలీసులు రెడీగా ఉన్నారు. వెళ్లి వాళ్లకు సరెండర్ అవ్వండి. నాక్కూడా ఢిల్లీకి వెళ్లే ఫ్లైట్‌కు టైమ్ అవుతోంది’’ అని స్టైలిష్‌గా తన వాచ్ చూసుకుంటూ చెప్పాడు.హాల్లోకి పోలీసులు ప్రవేశించి రాఘవన్, విక్రమ్‌లను బేడీలు వేసి తీసుకువెళ్లారు.డిటెక్టివ్ సిద్దార్థ ఎయిర్ పోర్ట్‌లో ఉండగా బ్యాంకు చైర్మన్ ఫోన్ చేశాడు.‘‘థాంక్యూ... గంటల వ్యవధిలోనే బ్యాంకు డబ్బును కాపాడారు’’ అన్నాడు కృతజ్ఞతాపూర్వకంగా...‘‘ఈ పరిశోధనలో ఒక క్రూషియల్ క్లూ డ్రోన్! డ్రోన్ కళ్ళే ఇంటి దొంగలను పట్టించాయి. డిటెక్టివ్లు అవసరంలోనే కాదు, వ్యాపారంలో అప్రమత్తంగా ఉండడానికి కూడా... బ్యాంకులో జరిగే కార్యకలాపాల మీద నిఘా వేయడానికి కూడా ఉపయోగపడుతారు’’ చెప్పాడు డిటెక్టివ్ సిద్దార్థ.- శ్రీసుధామయి -
భయం అంచులో...
కర్పూరవల్లి ఏర్ ఇండియా విమానం దిగి న్యూయార్క్ ఏర్పోర్ట్కి చేరుకున్నాక, ఇమిగ్రేషన్ ముగించుకుని లగేజ్ కేరసోల్ దగ్గరకి వెళ్ళింది.ఓ కుక్క కిందకి దింపిన సూట్‌కేస్‌లను వాసన చూడటం గమనించింది. ఆ కుక్క ఆవిడ సూట్‌కేస్ దగ్గరకి వచ్చి వాసన చూసి, ఓదాని మీద ముందు కాళ్లు ఉంచి నిల్చుంది. వెంటనే యూనిఫాంలోని సెక్యూరిటీ గార్డ్ తన జేబులోంచి ఏదో తీసి ఆ కుక్క నోటికి అందించి దాన్ని నిమిరాడు. ఆవిడ అతన్ని నవ్వుతూ చూస్తూ అడిగింది.‘‘నైస్ డాగ్. వాట్స్ హిజ్ నేమ్?’’‘‘ఈ రెండు సూట్‌కేసులు మీవేనా?’’ అతను కర్పూరవల్లిని అడిగాడు.‘‘అవును.’’‘‘మీ సూట్కేసులని మీరే పేక్ చేసారా?’’‘‘అవును. నేనే.’’‘‘ఈ సూట్‌కేసుల్లో ఏమేం ఉన్నాయో మీకు గుర్తుందా?’’ అతని తర్వాతి ప్రశ్న.‘‘ఉంది. నా బట్టలు, మందులు, బహుమతి వస్తువులు.’’‘‘మీరు నా వెంట రావాలి.’’ అతను ఆజ్ఞాపిస్తున్నట్లుగా చెప్పి ఎడమ భుజం దగ్గరున్న వైర్లెస్ సెట్లో ఎవరికో ఏదో చెప్పాడు.కొద్ది క్షణాల్లో యూనిఫాంలోని ఇద్దరు సెక్యూరిటీ పోలీసులు ట్రాలీతో అక్కడికి చేరుకున్నారు. వాళ్ళు ఆవిడ సూట్‌కేసులను జాగ్రత్తగా ట్రాలీ మీదకి ఎక్కించి నడిచారు.‘‘నాతో రండి.’’ ఆ గార్డ్ ఆవిడతో చెప్పాడు.‘‘ఎందుకు?’’ ఆవిడ అతని వెంట నడుస్తూ అడిగింది.అతను ఆవిడ ప్రశ్నకి జవాబు చెప్పలేదు. ‘ఇ¯Œ స్పెక్షన్’ అని రాసున్న తలుపులోంచి లోపలికి తీసుకెళ్ళాడు.‘‘మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్నారా?’’ లోపల కూర్చున్న ఓ అధికారి ప్రశ్నించాడు.‘‘అవును.’’‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు?’’‘‘నా కూతురితో గడపడానికి. మీరీ ప్రశ్నలు ఎందుకు అడుగుతున్నారు?’’ కర్పూరవల్లి ప్రశ్నించింది.అక్కడికి మరొక కుక్కని తెచ్చారు. అది కూడా సూట్‌కేసుల చుట్టూ తిరిగి ఇందాకటి సూట్‌కేస్ మీద ముందు కాళ్ళు పెట్టింది. దాని శిక్షకుడు కూడా దానికి బహుమతిగా తినడానికి డాగ్ బిస్కెట్ ఇచ్చి, దాన్ని దువ్వి తీసుకెళ్ళిపోయాడు. ఆవిడకి ఏం జరుగుతోందో అర్థం కాక అయోమయంలో పడింది.‘‘మీకు ఏదైనా టెర్రరిస్ట్ సంస్థ మీద సానుభూతి ఉందా?’’ ఆ అధికారి ప్రశ్నించాడు.‘‘లేదు.’’ ఆవిడ తుళ్ళిపడి జవాబు చెప్పింది.గార్డ్ ఆవిడ హేండ్‌బేగ్‌ని తీసుకుని అందులోని వస్తువులన్నీ బల్ల మీద పోశాడు.‘‘ఈ సూట్‌కేస్‌లో మీరు ఏం తీసుకొస్తున్నారు? అంగీకరిస్తే తక్కువ శిక్ష పడుతుంది. మా అంతట మేమే కనుక్కుంటే శిక్ష పెరుగుతుంది.’’ అధికారి చెప్పాడు.‘‘శిక్షా? బయటే ఉంటాడు. మా అల్లుడికి ఫోన్ చేస్తాను.’’ కర్పూరవల్లి భయంగా చెప్పింది.‘‘తర్వాత. నా ప్రశ్నకి జవాబు చెప్పండి.’’‘‘నేనే నిషిద్ధ వస్తువులు తీసుకురాలేదు.’’ ఆవిడ భయంగా చూస్తూ చెప్పింది.ఇద్దరు గార్డ్లు ఆ సూట్‌కేసులు తెరిచి ఒక్కొక్క సామాను బయటకి తీయసాగారు. ప్రతి డ్రెస్ లైనింగ్ తడిమి, లోపల ఏదైనా ఉంచి కుట్టారా అని తనిఖీ చేయసాగారు. కర్పూరవల్లి భయంగా, ఆశ్చర్యంగా జరిగేది చూస్తోంది.ఆవిడ మొబైల్ తీసుకుని పాస్వర్డ్ అడిగి తెరిచి, అందులోని కాంటాక్ట్ నంబర్లలోని వారి పేర్లు ఒకొక్కటీ అడిగి వారు ఏమవుతారు అని ప్రశ్నించాడు. అవన్నీ ఇండియాలోని పేర్లు. కొన్ని పేర్లు అతనికి నోరు తిరగలేదు కూడా. ఆవిడలో భయం అధికం అవసాగింది. వాళ్ళు వెతుకుతూంటే అధికారి ఆవిడని ప్రశ్నించసాగాడు.‘‘అమెరికాకి ఎందుకు వచ్చారు? మీ అల్లుడు ఏం చేస్తూంటాడు? మీ అమ్మాయి ఏం చేస్తుంది? ఇదివరకు ఎప్పుడైనా అమెరికాకి వచ్చారా? మీరు వచ్చిన పని ఏమిటి? ఇండియాలో ఏం చేస్తూంటారు?’’చివరికి ఆ పెట్టెలో వారు వెతికేది కనిపించింది. వెంటనే ఒకరి మొహం మరొకరు చూసుకున్నారు.‘‘వీటిని ఎందుకు కొన్నారు?’’ ఓ గార్డ్ ఒకటి తీసి చూపిస్తూ ప్రశ్నించాడు.‘‘బహుమతిగా కొన్నాను.’’‘‘ఎవరికి?’’‘‘మా అల్లుడికి. కిందటిసారి ఇండియా వచ్చినప్పుడు అతను తెచ్చినవి వాళ్ళ స్పాటీకి బాగా నచ్చాయట. వీటిని కొని తెమ్మని మెసేజ్ ఇచ్చాడు.’’వాళ్ళు ఆ పేకెట్స్ని విప్పి క్షుణ్ణంగా పరిశీలించి, వాటిలో డ్రగ్స్ గాని, పేలుడు పదార్థాలు కాని లేవని రూఢీ చేసుకున్నాక వివిధ జాతుల కుక్కల బొమ్మలున్న డాగ్ ఫుడ్ పాకెట్స్ చూపించి నవ్వుతూ చెప్పారు.‘‘వియార్ సారీ. చిన్న పొరపాటు. మా రెండు కుక్కలు తమ ఆహారాన్ని పసికట్టాయి. మేం ఇంకేదో అని ఊహించాం.’’వాళ్ళు బయటికి తీసిన వస్తువులని లోపల ఉంచి మూత మూస్తే అది మూసుకోలేదు. అది గమనించి ఆవిడ మళ్ళీ సర్ది ఒక గార్డ్ని కోరింది.‘‘మా వారు నాతో రాలేదు. దయచేసి మీరు దీని మీద నిల్చుంటే జిప్ వేస్తాను.’’- మల్లాది వెంకట కృష్ణమూర్తి -
దెయ్యంపై కేసు..! జడ్జీ వేసిన ఆ ఒక్క ప్రశ్నతో..
మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే మొదట ఓసారి చెప్పి చూస్తాం; వినకపోతే గొడవపడతాం; మరీ సీరియస్ అయితే పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేస్తాం; కోర్టుకెళతాం. అయితే మన సమస్యలకు ఓ దెయ్యం కారణమైతే, మనల్ని అనేక రకాలుగా ఇబ్బంది పెడుతూ ఉంటే? దెయ్యమా? ఇదెక్కడి చోద్యం అనుకుంటున్నారా? నిజమే, అమెరికాలో ఓ ఖైదీ తన సమస్యలన్నింటికీ ఓ దెయ్యమే కారణమని బలంగా నమ్మాడు. ఆ దెయ్యాన్ని ఎలాగైనా కోర్టుకీడ్చి శిక్ష వేయించాలనుకున్నాడు. కోర్టులో కేసు కూడా వేశాడు. ఇక్కడే అసలు ట్విస్ట్ మొదలైంది. జడ్జి వేసిన ఓ ప్రశ్నతో ఇది ఆసక్తికరంగా మారింది. అమెరికాలో అత్యంత అరుదైన కేసుగా, వేలాదిమంది న్యాయ విద్యార్థులకు ఇదో పాఠంగా మిగిలింది.పెన్సిల్వేనియాలోని వెస్టర్న్ పెనిటెన్షియరీ జైలులో జెరాల్డ్ మేయో అనే 22 ఏళ్ల ఓ వ్యక్తి ఖైదీగా ఉన్నాడు. తన జీవితం ఇలా ఎందుకు అయిపోయింది? తన సమస్యలకు కారణం ఏంటని ప్రతి రోజూ దీర్ఘంగా ఆలోచించేవాడు. తనకు జీవితంలో ఎదురైన ప్రతీ అపజయం, బాధ, కష్టాలు, చివరకు జైలుకు రావడానికి కూడా ఆ దెయ్యమే కారణమనే అభిప్రాయానికి వచ్చాడు. వెంటనే మేయో జిల్లా ఫెడరల్ కోర్టుకు ఓ పిటిషన్ పంపాడు. ఓ దెయ్యం, ఆ దెయ్యం సహాయకులు ఉద్దేశపూర్వకంగా తన జీవితంలో జోక్యం చేసుకుని ఇబ్బంది పెడుతున్నారని, తన హక్కులూ హరిస్తున్నారని ఆ పిటిషన్లో పేర్కొన్నాడు. కోర్టు ఫీజు కట్టడానికి డబ్బులు లేవని, ఫీజు మాఫీ చేయాలని అభ్యర్థించాడు. ఆ దెయ్యం, సహాయకులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోర్టును వేడుకున్నాడు. అధికార పరిధిపై సందేహంఫెడరల్ కోర్టు జడ్జి గెరాల్డ్ జే. వెబర్ ఈ కేసుపై పలు సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తారు. ఏదైనా నేరంలో ఫిర్యాదు దారు పేర్కొన్న ప్రత్యర్థులకు సమన్లు జారీ చేస్తాం. అయితే ఈ కేసులో సమన్లు ఏ పేరుతో ఎక్కడికి పంపించాలని ప్రశ్నించారు. మేయో తన పిటిషన్లోనూ ఎవరికి? ఎలా సమన్లు పంపాలనే వివరాలు జత చేయలేదని చెప్పారు. దెయ్యాన్ని విచారించే అధికార పరిధి ఈ కోర్టుకు ఉందా? లేదా? అనే అంశంపై కూడా స్పష్టత లేదని జడ్జి పేర్కొన్నారు. దెయ్యాల వల్ల తనలాగే ఇబ్బంది పడుతున్న బాధితుల తరఫున ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేయాలని మేయో చేసిన ప్రయత్నాన్ని జడ్జి తిరస్కరించారు. అలాంటి వర్గానికి అతడు ప్రతినిధిగా చూపించే ఆధారాలు ఏమీ కోర్టుకు సమర్పించలేదని పేర్కొన్నారు. అందువల్ల ఈ పిటిషన్‌ను ఉమ్మడి వ్యాజ్యంగా పరిగణించలేమని స్పష్టం చేశారు. నిబంధనల ప్రకారం..దెయ్యం ఉనికి, మతపరమైన అంశాలు, ఆధ్యాత్మిక భావనల జోలికి వెళ్లడం లేదని జడ్జి గెరాల్డ్ జే. వెబర్ స్పష్టం చేశారు. కోర్టు అధికార పరిధి– ప్రతివాదికి సమన్లు పంపడం, వ్యాజ్యం చట్టబద్ధంగా విచారణార్హత కలిగి ఉండడం– ఈ అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు చెప్పారు. దీని ఆధారంగా పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్టు వెల్లడించారు. ఈ కేసు చట్టపరంగా న్యాయ వ్యవస్థ పరిధిలోకి వస్తుందా? లేదా అనే అంశాలను మాత్రమే పరిగణనలోకి తీసుకున్నట్టు వ్యాఖ్యానించారు. ఫీజు లేకుండా పిటిషన్‌ను స్వీకరించాలన్న అభ్యర్థనను జడ్జి తోసిపుచ్చారు.భావోద్వేగాలపై కాదు, న్యాయప్రక్రియ ఆధారంగానే న్యాయస్థానాలు వ్యవహరిస్తాయని ఈ కేసు ద్వారా వెల్లడైంది. 1971లో ఈ పిటిషన్ దాఖలైంది. అయినా దీనిని ఇప్పటికీ అమెరికాలోని పలు న్యాయకళాశాలల్లో ఓ కేస్ స్టడీగా విద్యార్థులకు వివరిస్తారు. ఒక కేసు విచారణకు వచ్చే ముందు న్యాయస్థానం ఏయే అంశాలను పరిశీలిస్తోంది, ఎప్పుడు తిరస్కరిస్తోందనే అంశాల్లో ముఖ్యమైన కేసుగా ఇది నిలిచిపోయింది.దిలీప్ మాదిరెడ్డి (చదవండి: పన్నేండువేల ఏళ్ల నాటి పాచికలు..!) -
పనిని ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్
రోజూవారీ వంటలు వండటం ఒక ఎత్తయితే, వాటిని వేడి వేడిగా వడ్డించడం, పిల్లలు అడిగిన స్నాక్స్ అప్పటికప్పుడు చేయడం గృహిణులకు పెద్ద టాస్క్. ఇలా కాకండా, వంట పనిని స్మార్ట్‌గా, ఈజీగా మార్చేసే ఇంట్రెస్టింగ్ కిచెన్ గ్యాడ్జెట్స్ ఇవే...ఇంట్లోనే ఐస్‌క్రీమ్ రోల్స్!‘ఐస్‌క్రీమ్ కావాలి!’ అని పిల్లలు అడిగిన వెంటనే.. హెల్దీ హోమ్ మేడ్ ఐస్‌క్రీమ్ కోసం షాప్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. కేవలం నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రోల్స్ చేసి ఇచ్చేయడానికి వచ్చేసింది ఈ ఇన్ స్టంట్ ఐస్‌క్రీమ్ మేకర్. ఇది మీ కిచెన్ ను చిన్న ఐస్‌క్రీమ్ పార్లర్గా మార్చేస్తుంది. ఈ కోల్డ్ ప్లేట్‌ను కొన్ని గంటల ముందు ఫ్రీజర్‌లో ఉంచి. బయటకు తీసిన తర్వాత దానిపై ఐస్‌క్రీమ్ మిశ్రమాన్ని పోయాలి. ఇక క్షణాల్లో గడ్డకట్టిన మిశ్రమాన్ని స్క్రాపర్లతో రోల్స్‌గా మార్చేస్తే చాలు! చల్లచల్లని ఐస్‌క్రీమ్ రోల్స్ రెడీ! ఇలా రోల్స్‌తో పాటు గెలాటో, సార్బెట్ వంటి ఫ్రోజెన్ డెజర్ట్స్ కూడా తయారు చేసుకోవచ్చు. పైగా దీనిని వాడటానికి కరెంట్ అవసరం లేదు. ఎలాంటి క్లిష్టమైన యంత్ర భాగాలు లేవు. ఫుడ్ గ్రేడ్ మెటీరియల్‌తో తయారైన ఈ ట్రేను శుభ్రం చేయడం కూడా చాలా సులభం. ధర రూ.3,000 మాత్రమే!దోసెల ప్రేమికులకు గుడ్ న్యూస్!గ్యాస్ స్టవ్ ముందు గంటల తరబడి నిలబడి దోసెలు వేయడం మరచిపోండి! ఇప్పుడు ప్లగ్ పెడితే చాలు, నిమిషాల్లో వేడి వేడి దోసెలు మీ ప్లేట్లోకి వచ్చేస్తాయి. ఎందుకంటే, ఈ ఎలక్ట్రిక్ గ్రిడిల్ క్రేప్ మేకర్‌తో దోసెలు, పాన్ కేక్‌లు, ఆమ్లెట్లు, క్రేప్లను ఎలాంటి గ్యాస్ అవసరం లేకుండా ఎక్కడైనా సులభంగా తయారుచేసుకోవచ్చు. నాన్–స్టిక్ కోటింగ్ ఉండటంతో తక్కువ నూనెతోనే వంట పూర్తవుతుంది. ఆటోమేటిక్ టెంపరేచర్ కంట్రోల్ వల్ల ప్రతి దోసె సమంగా కాలి, రుచిగా ఉంటుంది. తేలికైన బరువుతో ఉండటంతో హాస్టల్ గదుల్లో, చిన్న ఇళ్లలో, ఆఫీసుల్లో ఎక్కడైనా ఈజీగా ఉపయోగించు కోవచ్చు. ధర కేవలం రూ.1,400 మాత్రమే!టేబుల్‌పైనే వేడి వేడి విందు!అతిథులు ఒక్కోసారి వచ్చి కూర్చుంటే, కిచెన్ కి వెళ్లి మళ్లీ మళ్లీ వేడి చేయడం కాని పని. అలాగని, వారు వచ్చే ముందు వేడివేడిగా వండటమూ కష్టమే. ఇలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేందుకు వచ్చేసింది ఎలక్ట్రిక్ ఫుడ్ వార్మింగ్ ట్రే మ్యాట్. దీనిపై ఒకేసారి 3 నుంచి 4 పెద్ద గిన్నెలను సులభంగా ఉంచుకోవచ్చు. అలా ఒకేసారి అన్నం, కూరలు, సూప్‌లు, స్నాక్స్... ఏవైనా సరే గంటల తరబడి సరైన ఉష్ణోగ్రతలో వేడిగా ఉంచుతుంది. పైగా ఇందులో ఉన్న స్మార్ట్ టచ్ కంట్రోల్ ప్యానెల్ ద్వారా వేడిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అప్పుడు ఆహారం ఓవర్–కుక్ అవ్వకుండా, ఎండిపోకుండా ఫ్రెష్‌గా ఉంటుంది. దీని సర్ఫేస్ నాన్–స్టిక్ మెటీరియల్‌తో రావడం వల్ల ఏదైనా ఒలికినా, ఒక చిన్న గుడ్డతో ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. కిచెన్ చుట్టూ తిరిగే పని లేకుండా చేసే ఈ సూపర్ గాడ్జెట్ అసలు ధర రూ. 5,000. -
బీమా పదాలకు అర్థాలే వేరులే..
బీమా ఉంది కదా అని ఆ యజమాని ధీమాగా ఉన్నాడు. ఇన్సూరెన్స్ క్లైమ్ చేసి నష్టపరిహారం పొందచ్చనుకున్నాడు. కానీ, నిబంధనలను సరిగా అర్థం చేసుకోలేదు. పరిహారం రాదని కంపెనీ చెప్పింది. ఒకే ఒక్క పదం ఆ యజమానిని ముప్పు తిప్పలు పెట్టింది. కోర్టుల చుట్టూ తిప్పింది. వినియోగదారుల ఫోరంలో ఊరట దక్కినా, ఆ తీర్పుపై కంపెనీ సుప్రీంకోర్టుకు వెళ్లింది. సొంత అర్థాలు చెల్లవని, బీమా ఒప్పందాల్లోని పదాలను సరిగా అర్థం చేసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం తేల్చింది. చివరకు ఒక అరుదైన తీర్పును వెలువరించింది. గోడౌన్ తలుపులు, తాళాలు వేసినవి వేసినట్టే ఉన్నాయి. పగుళ్లు లేవు, బలవంతంగా లోపలికి చొరబడిన ఆనవాళ్లూ కనిపించలేదు. కానీ లోపల నిల్వ ఉంచిన 197 బస్తాలు మాత్రం మాయమయ్యాయి. పోలీసులు వచ్చి పరిశీలించారు. దొంగతనం జరిగిందని నిర్ధారించారు. బీమా ఉండడంతో కంపెనీ ప్రతినిధులు వచ్చారు. చోరీ నిజమేనని వారూ తేల్చారు. కానీ పరిహారం ఇవ్వలేమని చేతులెత్తేశారు.పరిహారం కోసం ఫోరానికిహరిచంద్రాయ్ చందన్‌లాల్ అనే వ్యాపారి ఢిల్లీలోని ఓ గోడౌన్లో ఆహారధాన్యాలను నిల్వ ఉంచాడు. వీటికి రూ.7లక్షల మొత్తానికి బర్గ్లరీ అండ్ హౌస్ బ్రేకింగ్ థెఫ్ట్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నాడు. దీనికి రూ.7 లక్షలు బీమా సంస్థకు చెల్లించాడు. 1992లో గోదాములో నిల్వ ఉంచిన 197 బస్తాలు మాయమయ్యాయి. పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. బీమా కోసం అప్లయ్ చేశాడు. గోదాంలోకి బలవంతపు ప్రవేశం లేదా హింస జరిగినట్లు ఆధారాలు లేవని క్లైమ్ను సంస్థ తిరస్కరించింది. దీంతో చందన్‌లాల్ జిల్లా వినియోగదారుల ఫోరాన్ని ఆశ్రయించాడు.కంపెనీకి అనుకూలంగా తీర్పుబర్గ్లరీ అనే పదానికి దొంగతనం అనే సాధారణ అర్థం కూడా వస్తుంది కనుక బాధితుడికి రెండు నెలల్లో పరిహారాన్ని 15% వడ్డీతో చెల్లించాలని, అదనంగా ఖర్చులకు రూ. 1,000 ఇవ్వాలని ఫోరం తీర్పు ఇచ్చింది. దీనిపై బీమా కంపెనీ రాష్ట్ర వినియోగదారుల వివాద పరిష్కార కమిషన్‌లో అప్పీలు దాఖలు చేసింది. అక్కడా తీర్పు వ్యాపారికి అనుకూలంగా వచ్చింది. దీంతో జాతీయ వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించింది. ఫోరం తీర్పును సమర్థిస్తూ రివిజన్ పిటిషన్‌ను తిరస్కరించింది.సర్వోన్నత న్యాయస్థానానికి చేరిన కేసుబీమా కంపెనీ సుప్రీంకోర్టులో అప్పీలు దాఖలు చేసింది. ఈ పాలసీ రెండు పక్షాల మధ్య ఒప్పందం. అందువల్ల బీమా పాలసీలో ఇచ్చిన నిర్వచనం ఇరుపక్షాలకు వర్తిస్తుందని కోర్టు చెప్పింది. బర్గ్లరీకి ప్రత్యేక నిర్వచనం ఉన్నప్పుడు, సాధారణ దొంగతనం జరిగినా బీమా వర్తిస్తుందా? లేదా? అనేది ఈ కేసులో ప్రధానాంశంగా కోర్టు పేర్కొంది. బీమా పాలసీ విషయంలో కేవలం సాధారణ అర్థాన్ని మాత్రమే తీసుకోలేం. పాలసీలో ప్రత్యేకంగా నిర్వచనం ఇచ్చినప్పుడు అదే అర్థాన్ని తీసుకోవాలని కోర్టు స్పష్టం చేసింది. ఇది దొంగతనం మాత్రమే..బర్గ్లరీ అనే పదాన్ని ‘దొంగతనం’ అనే సాధారణ అర్థంలో వాడతారు. కానీ పాలసీలో అది హింస లేదా బలప్రయోగంతో కూడిన దొంగతనానికి పరిమితం చేశారు. ఈ సంఘటనలో తలుపులు విరగలేదు, తాళాలు పగలలేదు. ఆ సంస్థ ఉద్యోగులు లేదా కుటుంబ సభ్యులపై ఎటువంటి దౌర్జన్యం జరగలేదు. ఇవేమీ లేకుండా కేవలం దొంగతనం జరిగిందనే కారణంతో పరిహారం కోరే హక్కు బీమాదారుడికి లేదని కోర్టు తేల్చింది. పాలసీ నిర్వచనం ప్రకారం ఇది దొంగతనం మాత్రమే! బర్గ్లరీ కాదని చెప్పింది. పాలసీలో ఏ షరతు ఉంటే దానిని కోర్టు అమలు చేయాలి. మార్చకూడదు. కొత్త అర్థాల్ని ఇవ్వకూడదని పేర్కొంది. ఈ కారణంతో బీమా కంపెనీ విజయం సాధించింది. వినియోగదారుల ఫోరం తీర్పును సుప్రీంకోర్టు రద్దు చేసింది. అయితే, వినియోగదారుల ఫోరం తీర్పుకనుగుణంగా బాధితుడికి ఇప్పటికే పరిహారం చెల్లిస్తే ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఆ మొత్తాన్ని తిరిగి తీసుకోవాలని తాము ఆదేశించడం లేదని కోర్టు చెప్పింది. బీమా సంస్థలు కఠినమైన పదాలు కాకుండా, వాస్తవ పరిస్థితికి దగ్గరగా ఉండేలా నిబంధనలు రూపొందించాలని సూచించింది.'పాలసీలో పేర్కొన్న వి«ధంగా నష్టం జరిగితేనే బీమా ఉంటుంది. దానికి దగ్గరగా ఉండే ప్రతి నష్టానికి కాదని ఈ కేసు రుజువు చేసింది. బీమా పాలసీ తీసుకునేటప్పుడు అందులో పేర్కొన్న వాస్తవ అర్థాలను సంపూర్ణంగా తెలుసుకోవాలి లేకపోతే బీమా ఉందనే ధీమా పనికిరాదని, పరిహారం దక్కదని రుజువైంది.' - దిలీప్ మాదిరెడ్డి -
పిల్లల కథ: వింత వస్తువు
ఆనందవనానికి సింహసేనుడు అనే సింహం రాజు. ఒకరోజు నక్క అడవి సరిహద్దుల్లో ఒక వింతవస్తువును చూసి ఆశ్చర్యపోయింది. ఆ వింత వస్తువును చూడగానే, ‘ఇది నోటికి చిక్కదు, కాలికి అందదు’ అనుకుంది.‘ఈ వస్తువును సింహసేనుడు సహా అన్ని జంతువులకు చూపించి, తానొక గొప్పదాన్నని నిరూపించుకోవాలి’ అనుకుంది.అనుకున్నదే తడవుగా అడవిలోని అందరికీ చెప్పేసింది.సింహసేనుడు సహా జంతువులన్నీ వింత వస్తువున్న చెట్టు వద్దకు చేరుకున్నాయి.జంతువులన్నింటి వైపు తేరిపార చూస్తూ నక్క ఇలా అంది.‘ఆకాశం నుండి రాలిపడిన వింత వస్తువిది. దీనిని ఎవరు తాకుతారో వారు అత్యంత బలవంతులైపోతారు’.నక్క మాట వినగానే... ‘అయితే నేను ముందంటే నేను ముందు’ అంటూ సింహం, ఏనుగు, ఎలుగుబంటి, జింక ముందుకు కదిలాయి.‘కానీ ఒక నియమం పాటిస్తేనే వస్తువును ముట్టుకోగలరు’ అంది నక్క.‘ఏమిటా నియమం?’ జంతువులన్నీ నక్కను ఆత్రంగా అడిగాయి.‘వస్తువును తాకేముందు తమ తమ సహజ స్వభావాన్ని వదులుకుంటామని వస్తువుకు మాటివ్వాలి. అప్పుడే అద్భుత శక్తి వస్తుంది.’నక్క మాటలు విన్న జింక ‘ఓస్! అంతే కదా’ అంటూ వింతవస్తువు వద్దకు వెళ్ళింది.సింహం, ఎలుగుబంటి, ఏనుగు, నక్క– జింకకేసి విచిత్రంగా చూడసాగాయి.‘నాకు భయం ఎక్కువ. ఇప్పుడు నా భయాన్ని పోగొట్టుకుని, పులిలా గాండ్రిస్తాను’ అంటూ గట్టిగా అరవడానికి ప్రయత్నించింది. కానీ జింక గొంతు సహకరించలేదు.‘నా స్వభావం మార్చుకోవడం నా వల్ల కాదు’ అంటూ జింక వెనుతిరిగింది.‘నన్ను చూడండి’ అంటూ ఎలుగుబంటి గొప్పగా ముందుకు కదిలింది.‘నాకు తేనెపట్టులోని తేనె కడుపునిండా తిన్నాక హాయిగా నిద్ర పోవడం నాకిష్టం. ఈ రోజునుంచి నిద్రపోకుండా మేల్కొనే ఉంటాను’ అంది. అంతలోనే ఆవులింత రావడంతో, ‘అమ్మో! నిద్రను ఆపడం నా వల్ల కాదు’ అంటూ వెనుతిరిగింది.‘ఇప్పుడు ఏనుగు వంతు’ నక్క అనడంతో ఏనుగు ముందుకు కదిలింది.ఏనుగు వింతవస్తువు వద్దకు వెళ్లి, ‘దారిలో అడ్డంగా పడిపోయిన చెట్లను నా తొండంతో వేగంగా పైకి తీయడం అలవాటు. ఇక నుంచి చీమలా నెమ్మదిగా నడుస్తాను’ అంటూ మెల్లగా నడవబోయింది.‘నా శరీరానికి చీమలాగా నెమ్మదిగా నడవడం కుదరదు’ అంటూ ఏనుగు కూడా వెనుతిరిగింది.‘మీలో ఒక్కరూ సాధించ లేకపోయారు. నన్ను చూడండి’ అంటూ మృగరాజు సింహసేనుడు వింతవస్తువు వైపు కదిలాడు.నక్క, ఏనుగు, ఎలుగు, జింక అన్నీ సింహాన్ని ఆసక్తిగా గమనించసాగాయి. వింతవస్తువు దగ్గరకు వెళ్ళి సింహం ఇలా అంది.‘నేను మాంసాహారిని. కానీ ఈ రోజు నుండీ గడ్డి తింటాను’ అంటూ అక్కడే ఉన్న కొంత పచ్చగడ్డిని పళ్లతో పీకి నోట్లో వేసుకుంది. కానీ తినలేకపోయింది.‘ఆకలేసినంత మాత్రాన సింహం గడ్డి తినలేదు’ అనుకుంటూ వింతవస్తువును తాకకుండానే మృగరాజు కూడా వెనుతిరిగింది.ఇదంతా అక్కడే చెట్టు పైనున్న ఉడుత గమనించి, కిందకు దిగి గట్టిగా నవ్వింది.‘మమ్మల్ని చూస్తే నీకు నవ్వొస్తోందా?’ సింహం కోపంగా అంది.‘కోపం వద్దు మృగరాజా! నా నవ్వుకు కారణం ఉంది’ అంది ఉడుత.‘ఏమిటిది?’ ఏనుగు అడిగింది.‘మీరంతా వింతవస్తువంటూ, విచిత్రంగా చూస్తున్న ఆ వస్తువు పేరు ‘గ్లోబు’. భూగోళానికి నమూనా అది. మన అడవి దాటితే ఒక ఊరు ఉంది. ఆ ఊరి బడిలో దీనిని నేను చూశాను. అక్కడి పిల్లలకు మాస్టారు దీని గురించి చెబితే విన్నాను. ఆ మాస్టారు, పిల్లలతో అడవిలోని చెట్లను చూడటానికి మన సరిహద్దు వైపు వాహనంలో వచ్చారు. అలా వచ్చినప్పుడు పిల్లలు ఈ గ్లోబును ఇక్కడ మరచిపోయి వెళ్లిపోయారు.ఈ వస్తువు సంగతి తెలియని నక్క మిమ్మల్ని ఆట పట్టించడానికే ఇలా నాటకమాడింది. మీరే కాదు, సృష్టిలో ఏ జీవీ తన సహజ స్వభావానికి విరుద్ధంగా ప్రవర్తించలేదు. అలా ప్రవర్తించి మనుగడ సాధించలేదు.ఇప్పుడర్థమైందా? మృగరాజా? నేనెందుకు నవ్వానో?’ఉడుత మాటలతో సింహం సహా జంతువులన్నింటికీ విషయం అర్థం కావడంతో వాటి తెలివి తక్కువతనానికి నవ్వుకున్నాయి.‘మనందరినీ ఆట పట్టించిన ఈ టక్కరి నక్క అంతుచూస్తాను’ అని మృగరాజు గట్టిగా అనడంతో నక్క ‘అయ్య బాబోయ్’ అంటూ తుర్రుమంటూ కాళ్లకు బుద్ధి చెప్పింది.‘ఇంకెప్పుడూ ఇటువైపు రాకు’ సింహం అంది.భయంతో పరుగుతీస్తున్న నక్కను చూసి జంతువులు నవ్వుకున్నాయి. - కొక్కెరగడ్డ శ్రీదేవి హితవచనం..అంభస్యాభిద్యతే సేతుస్తథా మంత్రోప్యరక్షితఃపైశున్యాద్భిద్యతే స్నేహో వాచా భిద్యేత కాతరఃనీటి ఉద్ధృతికి ఆనకట్ట కొట్టుకుపోతుంది. రక్షించకపోతే రహస్యం బయటపడిపోతుంది. చాడీలకోరు వల్ల స్నేహం చెడిపోతుంది. పిరికిపంద మాటలకే బెదిరిపోతాడు. -
ఆ రోజుల్లో..ఇరుగూ పొరుగే..మెరుగు!
ఈ రోజు లక్ష రూపాయల జీతం. ‘చాలట్లేదు’ శోకం. అన్నీ ఉన్నాయి.ఏదో లేని లోపం. గడ్డు రోజులు రాబోతున్నాయి... పేపర్ చదివితే భయం. ఎలా ఎదుర్కొనాలో తెలియని అయోమయం. మన తల్లిదండ్రులూ తాతలూ ఇలా గాబరా పడ్డారా? వారిని నడిపించిన తారకమంత్రం తెలుసా..? అదే ఇరుగూ పొరుగూ.. అప్పట్లో ఇళ్లకు కాంపౌడ్ వాల్స్ ఉండేవి కావు. మనుషులు తలుపులు మూసుకుని బతికేవారు కాదు. ఇరుగిల్లు పొరుగిల్లు... లక్ష్మీ అక్క... తులసమ్మ వదిన.... ‘ఏమండీ సుందర్రావు గారూ’... ‘ఏం విశేషం రమణయ్య గారూ’...ఈ ఇంట్లో ఉప్పు తక్కువైతే ఆ ఇంట్లో నుంచి వెళ్లేది. ఎదురింట్లో పంచదార అయిపోతే పొరుగింటామె డబ్బాతో వచ్చేది. ‘అప్పు’ అనే మాట ఉండేది కాదు. ‘చేబదులు’ అనేవారూ కాదు. అదో ‘సర్దుబాటు’. మనిషి తో మనిషి కలిసి బతకాలంటే పాదు చేసి పెంచుకునే మొక్క... చెట్టు.. మహావృక్షం.ఉదయం ఒక ఇంట్లో రేడియో పెడితే ఆలిండియా వార్తలు వీధి మొత్తానికి వినిపించేవి. పక్కింటి తాతయ్య తన అరుగు మీద కూర్చునే ‘ఒరేయ్ శీను, సౌండ్ కొంచెం పెంచరా‘ అని కేకేసేవాడు. ఆదివారం మధ్యాహ్నం రేడియో నాటకం... అందరూ ఒక్కచోట చేరి వినేవారు. అందుకు అవసరమైన ఆదరణ అనే ఐశ్వర్యం ప్రతి ఇంటా ఉండేది. ఒక అమ్మ చేసిన పులిహోర, మరో అమ్మ చేసిన గారెలు... వంటిళ్లు వేరైనా ఒకే కుటుంబంలా ఆరగింపు. వీధికో టీవీ ఉంటే గొప్ప. బుధవారం చిత్రహార్, శుక్రవారం చిత్రలహరి.... ఆదివారం సాయంత్రం అయిదు అవగానే ఉచిత సినిమా కోసం పిల్లలు బొంతలు, చాపలు పట్టుకుని టీవీ ఉన్న ఇంటికి పరుగో పరుగు. ఆ ఇంట్లో అంకులు ‘చెప్పులు బయట విడవండిరా’ అని అరిచేవాడు. సినిమా అయిపోయాక ‘వచ్చేవారం మళ్లీ రాండి’ అని నవ్వేవాడు. ఎవరింట్లో అశుభం జరిగినా వీధి వీధంతా కళ్లు తుడుచుకునేది. శుభకార్యం జరుగుతుందా... వీధి మొత్తం పందిరే. ‘తర్వాత ఇవ్వండి బంగారం కొనడానికి ఉంచండి’ అని ఒకాయన అమ్మాయి తండ్రికి డబ్బు అందిస్తే, ‘నాకు తెలిసిన షాపులో చెబుతాను ఫ్రిజ్జు తీసుకోండి... తర్వాత ఇద్దురు’ అని మరో పొరుగాయన సాయానికి వస్తాడు. బియ్యం ఫలానా చోట సలీసు అనంటే... వంటకు వేరే మనుషులు ఎందుకు... మేం వండేస్తాంగా అని వచ్చేవారు ఇంకొందరు... ‘సాటివాళ్లు’ అనే పెట్టుబడి భారీగా ఉన్న ఏ ఒక్క కుటుంబమూ దేనికీ భయపడేది కాదు. మన అమ్మానాన్నలు అలాగే నిర్భయంగా బతికారు.పిల్లల్ని దండించే హక్కు అమ్మానాన్నలకే కాదు, పక్కింటి పిన్నికీ ఉండేది. ‘ఒరేయ్, చెరువులో ఈతకెళ్లావా? మీ అమ్మకు చెబుతా ఆగు’ అని బెదిరించేది. సాయంత్రానికి అమ్మకు నిజంగానే తెలిసేది. వీధంతా పిల్లల్ని కాచే నిజం కళ్ల సీసీ కెమెరాలు. నాలుగు నెల్ల అద్దె బాకీ ఉన్నా హౌస్ ఓనర్ అర్థం చేసుకునేవాడు. ‘క్యాష్ ఆన్ డెలివరీ’ ఎరగని నాటి శెట్టి గారూ మనిషి పరిస్థితిని బట్టి ‘చిట్టా పద్దు’ తెరిచేవాడు. అందరి బతుకులూ అందరికీ తెలుసు. ‘అందరూ బతకాలి గదా’ అనుకోవడమే నాటి మనుషులకు తెలుసు. గొడవలు లేవా? వచ్చేవి. కానీ సాయంత్రానికి కలిసి టీ తాగేవాళ్లు. ఈర్ష్యలు లేవా? ఉండేవి. కానీ కష్టంలో మొదట ఆదుకునేది వాళ్లే. ఒకరి ఇంట్లో పస్తులుంటే మరో ఇంట్లో మనసు కదిలేది. ఒకరి కొడుకు పాసయితే వీధంతా లడ్డూలు పంచుకునేది. సుఖం, దుఃఖం... వాటాలు వేసుకునేవాళ్లు. డెబ్బయిల, ఎనభైల మిడిల్ క్లాస్ కాలం... పర్సులు ఖాళీగా ఉన్నా మనసులు నిండుగా ఉండే కాలం అది. గోడలు తక్కువ గుమ్మాలు ఎక్కువ ఉన్న రోజులు. నేటి కరెన్సీ కంగారులో, ఇ.ఎం.ఐ. ఉక్కపోతలో ఆనాటి అరుగు కబుర్లే, ఆ రోజుల పాతగాలే ఊరట. వాటిని తలుచుకోవడమే మనకు మందు. ఆ బంగారు రోజులు రిపీట్ కావు. బతుకును బేరీజు వేసుకుని, కళ్లు తెరవడం పెద్ద కష్టమూ కాదు. బంధాలు స్నేహాలు కట్ చేసుకోవడం ఫ్యాషన్ అయి΄ోయిన ఈ రోజుల్లో చిన్న దుమారం వచ్చినా వణుకు రాక మరేం వస్తుంది? అభిమానాలు, అనుబంధాలు సిసలైన ఫిక్స్డ్ డిపాజిట్లు, అసెట్లు. అవి గట్టిగా ఉంటే రేట్లు పెరిగినా కాట్లు వేయలేవు. ఇబ్బందులు వీధిన పడేయవు.గుర్తుంచుకోండి. కొన్ని పాత పద్ధతులు పని చేస్తాయి. – కె. -
దశాశ్వమేధ ఘట్టం
దేవశిల్పి విశ్వకర్మ మనవడైన ప్రథముడికి భౌవనుడు అనే కొడుకు కలిగాడు. అతడు దినదినాభివృద్ధి చెంది సకల శాస్త్రాలను అభ్యసించి, సార్వభౌముడిగా ఎదిగాడు. భౌవనుడికి ఒకేసారి దశాశ్వమేధ యాగాలు చేయాలనే సంకల్పం కలిగింది. అతడు తన ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని దర్శించుకుని, ‘ఏకకాలంలో దశాశ్వమేధ యాగాలు చేయాలని కోరికగా ఉంది. ఈ యాగాల నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో సెలవివ్వండి’ అని అభ్యర్థించాడు.‘రాజా! పూర్వకాలం నుంచి రాజులందరూ ఏ ప్రదేశంలో అశ్వమేధ యాగాలు చేసేవారో, అదే ప్రదేశంలోనే నువ్వు కూడా యాగాలు నిర్వహించు’ అని చెప్పాడు కశ్యపుడు.కశ్యపుడి సూచనతో భౌవనుడు ఋత్విక్కులను ఏర్పాటు చేసుకుని, పూర్వీకులు యాగాలు నిర్వహించిన ప్రదేశంలోనే పది అశ్వమేధ యాగాలూ ఒకేసారి ప్రారంభించాడు. అయితే, ఎంత ప్రయత్నించినా ఆ యాగాలు సంపూర్ణం కాలేదు.యాగాలు సఫలం కాకపోవడంతో భౌవనుడు విచారించాడు. పురోహితులతో చర్చించి, ఆ స్థలాన్ని విడిచిపెట్టి వేరే స్థలంలో యాగాలను తిరిగి ప్రారంభించాడు. అక్కడ కూడా యాగాలకు అంతరాయాలు కలిగాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి.భౌవనుడు చింతాక్రాంతుడయ్యాడు. ఆస్థాన పురోహితుడైన కశ్యపుడిని కలుసుకున్నాడు. ‘మహర్షీ! నా దోషమో, మీ దోషమో, దేశ కాల దోషమో నాకు అర్థం కాకున్నది. నేను తలపెట్టిన యాగాలు ఎంతగా ప్రయత్నించినా సంపూర్ణం కాకున్నవి. దీనికి మార్గాంతరమేమిటో అంతుచిక్కకున్నది’ అని విచారంగా పలికాడు.కశ్యపుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. కొద్దిసేపటి తర్వాత, ‘రాజా! పద’ అంటూ భౌవనుడిని తనతో పాటు బృహస్పతి అన్న అయిన సంవర్తకుడి దగ్గరకు తీసుకుపోయాడు. ‘మహాత్మా! మేము దశాశ్వమేధ యాగాలు తలపెట్టాము. యాగ నిర్వహణకు ఇదివరకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. యాగాలు అసంపూర్ణంగానే మిగిలాయి. మేము తలపెట్టిన యాగ నిర్వహణకు తగిన ఉత్తమ ప్రదేశమేదో నువ్వే చెప్పాలి’ అని అడిగాడు కశ్యపుడు. సంవర్తకుడు కొద్దిసేపు ఆలోచించి, ‘మునివర్యా! మీరిద్దరూ నేరుగా బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లి అడగండి. మీరు సంకల్పించిన యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలాన్ని ఆయనే చెప్పగలడు’ అని చెప్పి, వారిని సాదరంగా సాగనంపాడు. భౌవనుడిని వెంటపెట్టుకుని కశ్యపుడు బ్రహ్మదేవుడి వద్దకు వెళ్లాడు.బ్రహ్మదేవుడిని దర్శించుకుని, వారిద్దరూ నమస్కరించారు. ‘బ్రహ్మదేవా! మా రాజైన ఈ భౌవనుడు దశాశ్వమేధ యాగాలను ఏకకాలంలో తలపెట్టాడు. ఇదివరకటి యత్నాలు విఫలం కావడంతో వ్యాకులం చెందుతున్నాడు. యాగ నిర్వహణకు తగిన పుణ్యస్థలమేదో నువ్వే సెలవివ్వాలి’ అడిగాడు కశ్యపుడు. ‘పవిత్ర గౌతమీతటాన యాగ నిర్వహణ కావించండి. అక్కడ నిర్వహించే ఏ యాగమైనా సంపూర్ణంగా ఫలిస్తుంది’ అని చెప్పి, భౌవనుడిని ఉద్దేశించి, ‘రాజా! నువ్వు ఇందుకు వేరే గురువును ఆశ్రయించవలసిన పనిలేదు. వేదపారంగతుడైన ఈ కశ్యపుడే గురుశ్రేష్ఠుడై యాగాన్ని పరిపూర్ణం చేయించగలడు’ అని చెప్పాడు.కశ్యపుడి ఆధ్వర్యంలో భౌవనుడు గౌతమీ తీరంలో దశాశ్వమేధం ప్రారంభించాడు. యాగం దిగ్విజయంగా పరిపూర్ణమైంది. యాగ పరిసమాప్తి సందర్భంగా భౌవనుడు భూదానానికి ఉద్యుక్తుడయ్యాడు.అదే సమయంలో అశరీరవాణి ‘ఓ రాజా! సమస్త భూమండలాన్నీ నువ్వు ఈ కశ్యప మహర్షికి దానం చేయాలని సంకల్పించుకున్నావు. నీ సత్సంకల్ప మాత్రానే భూమండలం సర్వసుభిక్షమైంది. నీ మనసులోనున్న భూదాన సంకల్పాన్ని విరమించుకుని, మహాఫలప్రదమైన అన్నదానం కావించు. నీకు శుభం కలుగుతుంది’ అని పలికింది. అశరీరవాణి పలుకులు విన్నప్పటికీ భౌవనుడు తన భూదాన సంకల్పం నుంచి వెనక్కు తగ్గలేదు. అప్పుడు భూదేవి స్వయంగా ప్రత్యక్షమై, ‘మహారాజా! మాటిమాటికి నన్ను దానం చేయడం తగదు. నీ సంకల్పం విడిచిపెట్టు’ అని చెప్పింది.భూదేవి స్వయంగా ప్రత్యక్షం కావడంతో భౌవనుడు చలించిపోయాడు. ‘తల్లీ! యాగ పరిసమాప్తి సందర్భంగా నేనిప్పుడు ఏ దానం చేయాలో నువ్వే చెప్పు’ అన్నాడు.‘పవిత్రమైన ఈ గౌతమీ తీరాన నవధాన్యాలు, గోవులు, ధన కనక వస్తు వాహనాలు వేటిని దానం చేసినా అక్షయఫలం లభిస్తుంది. ఇక్కడ అన్నదానం చేసినవారికి సమస్తదానాలూ చేసినంత ఫలం దక్కుతుంది.’ అని పలికింది. భౌవనుడు యాగస్థలంలో వేలాదిమందికి అన్నదానం చేశాడు. అతడి యాగస్థలి దశాశ్వమేధ తీర్థంగా ప్రసిద్ధి పొందింది. - సాంఖ్యాయనపురావిశేషం..ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు చేరువలోని హీరాపూర్ గ్రామంలో అత్యంత అరుదైన పురాతన శాక్తేయ ఆలయం ఉంది. ఇది చతుష్షష్టి యోగినుల మందిరం. ఇందులో అధిష్ఠాన దేవత మహామాయ విగ్రహంతో పాటు అరవైనాలుగు మంది యోగినుల విగ్రహాలు ఉంటాయి. పైకప్పు లేకుండా ఈ ఆలయాన్ని నిర్మించడం విశేషం. దీనిని భౌమవంశానికి చెందిన రాణి హీరాదేవి క్రీస్తుశకం 864లో నిర్మించింది. పదహారో శతాబ్దిలో కాలాపహాడ్ అనే సేనాని జరిపిన దాడిలో ధ్వంసమైన ఈ ఆలయం ప్రస్తుతం శిథిలావస్థలో మిగిలింది. -
చేదు మేసి నెమరేసిన రచయిత!
‘నా దృష్టిలో శిశిరం ఎప్పుడూ విషాదాన్ని మిగిల్చే రుతువు కాదు. రాలిన ఆకులూ, బక్కచిక్కిన పగళ్ళూ అంతిమ ఘడియలకు ప్రతీకలుగా కనిపించవు నాకు. అవి నా కళ్ళకు భవిష్యత్తు గురించిన ఆశల్లా కనిపిస్తాయి. అక్టోబరు మాసపు అసురసంజ వేళల్లో ఏదో విద్యుద్వాహిని ప్యారిస్ వీథుల్లో ప్రవహిస్తున్నట్లు అనిపిస్తుంది నాకు. అలాంటప్పుడు ముసురుపట్టి చినుకులు పడుతున్నా, నా మనసేం కుంగిపోదు! అలాగని కాలం పిట్ట రెక్కలమీద ఎగురుతున్నట్లూ అనిపించదు!!అలాంటి వేళల్లో ఏం జరిగినా జరగొచ్చని మాత్రమే అనిపిస్తుంది నాకు. నా వరకూ నాకు, అక్టోబరులోనే నూతన సంవత్సరానికి తెర తీస్తున్నట్లు భావిస్తాన’న్న రచయిత ఏ భావకవిగారో కాదు సుమా! అతగాడు ఫక్తు నవలా రచయిత! 2014లో నోబెల్ సాహిత్య పురస్కారం గెల్చుకున్న ప్యాట్రిక్ మొద్యానా చారిత్రక కాల్పనిక నవలలు రాసి ప్రపంచ ప్రసిద్ధి పొందినవాడు. ఆయన రాసిన నాలుగు పదులకు మించిన పుస్తకాలన్నింటా ప్రాథమిక ఇతివృత్తం దాదాపు ఒకటే! రెండో ప్రపంచ యుద్ధకాలంలో ఫ్రాన్స్ ప్రజలు పడ్డపాట్లకే ఒకింత కాల్పనికత మేళవించి, మొద్యానా ఈ నవలలు రాశాడు. ‘చేజారిన యవ్వనం కెఫేలో...’ అనే నవలలో రాసినవే పైన ఉట్టంకించిన మాటలు.రెండో ప్రపంచ యుద్ధకాలంలో దాదాపు ఎనిమిది కోట్లమంది జనం ఉన్నవూరికీ, కన్నవారికీ, కట్టుకున్నవారికీ, కన్న బిడ్డలకూ, చేసుకునే వృత్తులకూ దూరమై అలమటించారు. ఈ యుద్ధానికి ప్రధాన రణక్షేత్రంగా ఉండిన యూరపులోనే ఇలాంటి బాధితుల సంఖ్య సగానికి సగం వుంటుంది. యుద్ధబాధితుల్లో సగానికి సగం మంది స్త్రీ– శిశు– వృద్ధులే! ముఖ్యంగా, వేర్వేరు నిర్బంధ శిబిరాల్లో బంధితులైన స్త్రీపురుషుల సంతానం అకస్మాత్తుగా అనాథలుగా మారి, నడివీథిలో నిలబడవలసి వచ్చింది. అలాంటి వారిలో, 1945లో పుట్టిన మొద్యానా కూడా ఒకడు.ఈ యుద్ధం సందర్భంగానే, అరవై లక్షలమంది యూదులను ఊచకోత కోశారు. మొద్యానా తండ్రి ఆల్బెర్ట్ కూడా యూదు మతస్థుడే; ఇటాలియన్ కులీన వంశానికి చెందిన ఆల్బెర్ట్ నాజీలతో చేతులు కలిపినవాడు. అతని తల్లి లూయిజా ఫ్లెమిష్ (బెల్జియన్–డచ్) సాంప్రదాయిక నర్తకి. ఫ్రాన్స్ విదేశీ దురాక్రమణకు గురైన రోజుల్లో, 1942లో, వారిద్దరి మధ్య పరిచయం ఏర్పడి అది ప్రణయానికీ, పరిణయానికీ దారితీసింది. యుద్ధకాలంలో, మొద్యానా తండ్రి కార్లాంగ్ అనే ఫ్రెంచ్ గెశ్టాపో ఆశీర్వాద బలంతో– బ్లాక్ మార్కెట్లో వీరవిహారం చేశాడంటారు. కార్లాంగ్ సారథులు, నేర ప్రపంచంలో కొమ్ములు తిరిగిన దున్నపోతులై వుండడం వల్లనే, ఇది సాధ్యమైందని కూడా చెప్తారు!రెండో ప్రపంచ యుద్ధాన్ని తెచ్చిపెట్టిన వాళ్ళు మొద్యానా తల్లితండ్రులు కారనేది వాస్తవం! అయితే ఆ యుద్ధ పరిణామాల వల్ల, మొద్యానా మాదిరిగా, ‘పాపం పుణ్యం ప్రపంచ మార్గం ఏమీ తెలియని కూనలు’ ఎందరో అత్యంత తీవ్రమైన పర్యవసానాలను ఎదుర్కోవలసి వచ్చిందనే మాట కూడా వాస్తవమే మరి! అందుకే, మొద్యానా తన తల్లిదండ్రుల తరాన్ని జీవితంలో ఎన్నడూ క్షమించలేదు!! ఫ్రాన్స్‌లో చిన్నాపెద్దా ఊళ్ళకు కూడా మొద్యానా పేరును పరిచయం చేసిన ‘మాయమైన మనిషి’ లాంటి నవలలు మొదలుకొని ‘డారా బ్రూడర్’, ‘ముక్కలైన వాక్యాలు (మూడు నవలల సంపుటి)’, ‘కనిపించని సిరా’– ఇలా ఏ నవలను చూసినా ఇదే విషయం కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.నోబెల్ ప్రైజ్ పొందిన తర్వాత, అనేక భాషల్లోకి అనువాదమైన మొద్యానా 139 పుస్తకాలలో దేన్ని చూసినా ఇదే అభిప్రాయం ఏర్పడుతుంది. పైపైన చూస్తే మొద్యానా రాసింది అపరాధ పరిశోధన సాహిత్యం అనిపిస్తుంది. అయితే, ఆ ‘అపరాధం’ చట్టాలు నిషేధించిన నేరాలు చేయడమే కాదు– స్త్రీలనూ, బాలలనూ– వృద్ధులనూ వేధించిన కండకావరం! దాన్ని నిరసించడానికే మొద్యానా తన సాహిత్య జీవితాన్ని మొత్తం అంకితం చేశాడు. అయితే, ఆ విషయం వాచ్యంగా చెప్పకుండా, సాహిత్య మర్యాదలన్నీ పాటించడంలో మొద్యానా శిల్ప పరిణతి కనిపిస్తుంది. అందువల్లనే ఈ అపరాధ పరిశోధక రచయితకు నోబెల్ పురస్కారం దక్కింది!మొద్యానా చవిచూసిన చేదు అనుభవాల్లో, ఘోరాతి ఘోరమైన విషయాలున్నాయి. అతన్ని పెంచి పెద్ద చేయడం ‘పెనుభారం’గా అటు తల్లీ, ఇటు తండ్రీ కూడా భావించడం వాటిలో మొదటిది. సదరు భారాన్ని తమ నెత్తిమీంచి దించి, ఎదుటివారి నెత్తిన మోపేందుకు నానా పాట్లూ పడ్డం రెండో ఘోరం. సహాయం కోరి ఆశ్రయించిన పాపానికి, మొద్యానాను తాము విదిలించి పారేయడమే కాకుండా, తమ బాయ్ ఫ్రెండ్సూ– గర్ల్ ఫ్రెండ్సూ చేత కూడా అదే సత్కారం జరిపించడం ఘోరాతి ఘోరం! ఇంత జరిగిన తర్వాత, తన తల్లితండ్రుల తరాన్ని అసహ్యించుకున్నందుకు మొద్యానాను ఎవరైనా తప్పు పట్టగలరా? సొంత అనుభవాలే పూర్వరంగంగా ఆనాటి ఫ్రాన్స్‌లో రచయితగా మనగలగడం మజాకా కాదు.ఆధునిక ఫ్రెంచ్ వాడుకభాషను ఓ మలుపుతిప్పిన రేమన్ కెనో, మొద్యానా తల్లికి నేస్తం; మొద్యానాకు గురువు. అతని చలవతోనే, మొద్యానా తన తొలినవల ‘నక్షత్ర కూడలి’ అచ్చువేయించుకున్నాడు. అందులో ప్రధాన పాత్రలు మొద్యానా తండ్రిని పోలివుండడం మింగుడు పడనందువల్లనే ఆ పెద్దమనిషి సదరు నవల కాపీలు దొరికినన్ని కొనేసి తగలబెట్టేశాడట!‘దురాక్రమణ పాలైన ప్రాంతాల్లో జీవప్రపంచం అనుభవించిన స్థితిగతులనూ, ఎవరికీ బోధపడని మానవాళి భవితనూ సొంత జ్ఞాపకాల ప్రాతిపదికగా మన కళ్ళముందు ఉంచిన కళ మొద్యానా సొంతమ’న్నారు స్వీడిష్ ఎకాడెమీ శాశ్వత కార్యదర్శి పీటర్ ఇంగ్లండ్. ఫ్రాన్సులో సుప్రసిద్ధుడైన మొద్యానా మరెక్కడా ప్రాచుర్యానికి నోచుకోలేదని 2014లో పీటర్ ఇంగ్లండ్ అన్నమాట వాస్తవమే. అయితే యేం? నోబెల్ పురస్కారం కోసం నామినేట్ అయిన తొలిసారే, అతన్ని ఆ బహుమతి వరించడం కూడా వాస్తవమే మరి! - మందలపర్తి కిషోర్ -
గొలుసు ఉత్తరం..
ఒకప్పటి కాలం ఉత్తరాల కాలం. అప్పట్లో చాలా ఉత్తరాలు వచ్చేవి. కాని జాగృత్ ఆ కాలానికి సంబంధించినవాడు కాదు. ఉత్తరాల అవసరం ఆగిపోయిన, ఎలక్ట్రానిక్ కాలానికి చెందినవాడు. అతను నివసించే అపార్ట్మెంట్లో అతని మెయిల్ బాక్స్‌లో అరుదుగా ఉత్తరాలు పడుతూంటాయి. చిట్‌ఫండ్ కంపెనీ ఇంటిమేషన్, ఎల్.ఐ.సి. రసీదులు, రిమైండర్స్, నవరాత్రులలో పూజకి డబ్బు పంపమని అతని గ్రామ పూజారి నుంచి ప్రింటెడ్ బ్రోచర్ లాంటివి.ఆరోజు అతను ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక, అలవాటుగా తన మెయిల్ బాక్స్ ట్రా¯Œ ్సపరెంట్ అద్దం తలుపులోంచి చూస్తే లోపల ఓ కవర్ కనిపించింది. తాళం తెరిచి దాన్ని తీసుకుని చూశాడు. అది ఐదు రూపాయల పోస్టల్ కవర్. ఫ్రమ్ అడ్రస్ లేదు. టు అడ్రస్ అందమైన చేతిరాతలో ఉంది.అతను దాన్ని తీసుకుని లిఫ్ట్‌లో ఆరో అంతస్తులోని తన అపార్ట్మెంట్కి చేరుకుని దాన్ని బల్ల మీద పడేశాడు. రాత్రి పడుకోబోయే ముందుదాకా అతని దృష్టి దాని మీద పడలేదు. పడుకోబోయే ముందు దాన్ని అందుకుని చింపి చదివాడు. అది చేతిరాతలో ఉన్న ఓ హెచ్చరిక. ఆ ఉత్తరాన్ని అది చదివిన 24 గంటల్లోగా మొత్తం కాపీ చేసి కనీసం ఒకరికి పంపాలని, దాన్ని కాపీ చేసి పంపకపోతే ఒకతని భార్య ఆత్మహత్య చేసుకుందని, మరొకరికి ఆస్తి నష్టం వచ్చిందని, కాబట్టి ఆ చై¯Œ ని బ్రేక్ చేయొద్దని దాని సారాంశం. అందులో షిరిడీ బాబా చెప్పిన పన్నెండు బోధనలు ఉన్నాయి.జాగృత్ కొలిచేది ఒక్క షిరిడీ సాయినే. ప్రతి ఉగాదికి షిరిడీకి వెళ్తాడు. ప్రతి నవరాత్రులలో షిర్డీ సాయిబాబా జీవిత చరిత్ర చదువుతాడు. అయితే అతనిది మూఢ భక్తి కాదు. దేన్నయినా హేతువాదంతో ఆలోచిస్తాడు. తను ఆ చై¯Œ ని బ్రేక్ చేస్తే ఆపద వాటిల్లుతుందని జాగృత్ క్షణకాలం కూడా నమ్మలేదు. ఓ మనిషికి కీడుని కలిగించే గొప్ప శక్తి ఆ గొలుసు ఉత్తరానికి ఉండదని అతని స్థిరనమ్మకం.అయినా, జాగృత్ కాగితం, కలం తీసుకుని ఆ ఉత్తరాన్ని కాపీ చేశాడు. అందుకు కారణం, కొత్తవాళ్ళకి ఆ ఉత్తరం అందితే వారి దృష్టిని తను కొలిచే సాయి మీదకి మళ్ళించినవాడు అవుతాడు. వాళ్ళు సాయి భక్తులు కాకపోతే ఇప్పుడు అయ్యే అవకాశం ఉంటుందనే సదుద్దేశంతో దాన్ని కాపీ చేశాడు.మర్నాడు దాన్ని ఆఫీస్‌కి తీసుకెళ్ళాడు. అది ఎవరికి పంపాలా అని ఆలోచించాడు. లంచ్ అవర్‌లో అతను తిరిగి తన సీట్‌కి వస్తూంటే, ఆ మల్టీస్టోరీడ్ కమర్షియల్ ఆఫీస్ బిల్డింగ్ లోని ఓ ఆఫీస్ తలుపు బయట ఆ కంపెనీ ఫైనాన్షియల్ మేనేజర్ పేరు కనిపించింది. జాగృత్ తన సీట్‌కి వెళ్ళాక ఆఫీస్ కవర్ తీసుకుని, ఆ కవర్ మీద అతని పేరు, డిజిగ్నేషన్, అతని ఆఫీస్ చిరునామా రాశాడు. మధ్యాహ్నం మూడున్నరకి బాత్రూమ్కి వెళ్ళడానికి లేచినప్పుడు డిస్పాచ్ క్లర్క్‌కి ఆ కవర్ ఇచ్చి చెప్పాడు.‘‘దయచేసి దీన్ని పోస్ట్ చెయ్యి.’’జాగృత్ ఆ సంగతి అంతటితో మరిచిపోయాడు.∙∙ కొన్ని వారాల తర్వాత జాగృత్ దగ్గరకి ఓ కొత్త వ్యక్తి వచ్చి తన విజిటింగ్ కార్డ్ ఇచ్చి అడిగాడు.‘‘ఈ ఆదివారం ఫ్రీగా ఉంటారా?’’‘‘ఏమిటి విశేషం?’’ అతను అడిగాడు.‘‘ఈ ఆదివారం మా ఇంట్లో సాయి భజన జరుగుతుంది. ఎందుకో మిమ్మల్ని పిలవాలని అనిపించింది.’’‘‘నేను సాయి భక్తుడిని. తప్పకుండా వస్తాను. లొకేషన్ షేర్ చేయండి.’’ జాగృత్ చిరునవ్వుతో అంగీకరించాడు.‘‘నెహ్రూ నగర్లో ఇండియన్ బ్యాంక్ తెలుసుగా. దాని పక్కన ఫస్ట్ ఫ్లోర్. కాబట్టి తేలిగ్గా రాగలరు.’’జాగృత్ ఆదివారం కొబ్బరికాయ, పూలున్న కేరీ బ్యాగ్‌తో ఆ ఇంటికి చేరుకున్నాడు.‘‘ఇంకా ఎవరూ రాలేదు. ఐదు నిమిషాల్లో అంతా ఇక్కడ ఉంటారు. ఈలోగా మీరు దీన్ని తాగండి. అందరికీ కలిపాను.’’జాగృత్ రూహఫ్జా తాగాక అతను చెప్పాడు.‘‘మీరో ఘోరమైన పొరపాటు చేశారు.’’‘‘పొరపాటా? నేనా? ఏమిటది?’’ జాగృత్ ఆశ్చర్యంగా అడిగాడు.అతను జాగృత్ పంపిన గొలుసు ఉత్తరాన్ని చూపించాడు.‘‘ఇదే మీరు చేసిన ఘోరమైన పొరపాటు.’’‘‘ఏం పొరపాటు?’’ జాగృత్ అర్థం కాక అడిగాడు.‘‘నేను ఒరియావాడిని. నాకు తెలుగు చదవడం వచ్చి, అప్పుడే దీన్ని చదివి ఉంటే ఇరవై నాలుగు గంటల్లో ఈ ఉత్తరాన్ని కాపీచేసి పంపేవాడిని. కాని నిన్నటి దాకా ఇందులో ఏముందో నాకు తెలీదు. నిన్న మా ఇంటికి వచ్చిన తెలుగు తెలిసిన ఓ బంధువు చదివి చెప్పారు. ఇది అందిన నాలుగో రోజున నా భార్య ఆత్మహత్య చేసుకుంది.’’‘‘అయ్యో. ఐ యాం వెరీ సారీ.’’‘‘ఆ తర్వాత రెండు రోజులకి ఊళ్ళోని మా ఉమ్మడి ఆస్తిలోంచి నా జ్ఞాతులు నా భాగాన్ని కొట్టేశారు.’’‘‘అరెరే.’’‘‘నన్ను నా మానాన బతకనివ్వకుండా నువ్వు అనవసరంగా నా జీవితంలో జోక్యం చేసుకున్నావు. ఈ ఉత్తరం ద్వారా నాకు నష్టాన్ని కలిగించావు.’’ అతను కోపంగా చెప్పాడు.‘‘కాదు. నేను దీన్ని నమ్మలేదు. సరదాకి దీన్ని పంపాను. ఈ ఉత్తరానికీ, మీకు జరిగిన నష్టాలకి ఎలాంటి సంబంధం లేదు. హేతువాదంతో ఆలోచించండి.’’‘‘నాకు జరిగిన నష్టాలకి నేను ఆవేదనతో కుమిలిపోతూండగా, ఈ ఉత్తరం నువ్వు పంపావని తెలిసి నా మనసు కుతకుతలాడిపోతోంది. కవర్ మీద నీ ఆఫీస్ ఎడ్రస్ పైన కేరాఫ్ అని నీ పేరు రాసి ఉండటంతో నిన్ను తేలిగ్గా కనుక్కున్నాను. అందుకే భజన నెపంతో నిన్ను ఇక్కడికి రప్పించాను. నువ్వు తాగిన రూహఫ్జాలో విషం ఉంది. ఇంకో పావుగంట తర్వాత నువ్వు జీవించవు.’’డిస్పాచ్ క్లర్క్ కవర్ మీద తన పేరు రాసి ఉంటాడని స్పృహ తప్పేముందు జాగృత్కి తోచింది. - మల్లాది వెంకట కృష్ణమూర్తి ‘ఫన్డే’లో ప్రచురితమయ్యే ఈ శీర్షికలో మల్లాది కథలు రాయడమే కాదు, మిమ్మల్ని కూడా భాగస్వాములను చేస్తున్నారు. మీరైతే ఈ కథకు ఏ పేరు పెడతారో ఈ కింది మెయిల్‌కు పంపండి. kathakalisakshi@gmail.com -
నీవని... నేనని...
‘‘నందినిగారూ మేడం మిమ్మల్ని పిలుస్తున్నారు’’ సడన్‌గా ప్యూన్ వచ్చి చెప్పగానే, ఏదో ఆలోచిస్తున్న నందిని ఉలిక్కిపడి లేచింది. మేడం అంటే ఆ ఆఫీస్‌లో బాస్. పేరు మాలతి– చండశాసనురాలు. నందిని ఉలిక్కిపడిలేచి మాలతి రూములోకి వెళ్ళింది, కొంచెం దిగులుగా భయంగా. తనని చూడగానే మాలతి కూర్చోమని తన స్వభావానికి విరుద్ధంగా మృదువుగా ఇలా అంది.‘‘చూడు నందినీ! ఈ ఆఫీసులో అందరికన్నా శ్రద్ధగా కష్టపడి పనిచేసే అమ్మాయివి నువ్వు. కానీ ఈమధ్య పనిమీద నీ ధ్యాస తగ్గింది. తప్పులమీద తప్పులు చేస్తున్నావు. టెండరు విషయంలో దొర్లిన తప్పువల్ల ఆ కాంట్రాక్ట్ మనకు దక్కకుండా పోయింది. నీలాంటి మంచి ఉద్యోగినిని వదులుకోవడం ఇష్టంలేక ఆఖరిసారి వార్నింగ్ ఇద్దామని పిలిచా. ఉద్యోగుల వ్యక్తిగత విషయాలు ఆఫీసులో చర్చించడం నాకిష్టం ఉండదు. కానీ నీమీద ఉన్న అభిమానంతో అడుగుతున్నా. ఎందుకు ఈమధ్య పరధ్యానంగా ఉంటున్నావ్ ? ఏమైనా సమస్యలా! ఇబ్బందులుంటే చెప్పు. నేను నీకు కావల్సిన సహాయం చేస్తా’’ అనునయంగా అంది మాలతి. చండశాసనురాలిగా పేరున్న బాస్ నోట ప్రేమపూర్వకమైన మాటలు వినగానే నందిని కళ్ళనిండా నీళ్ళు తిరిగాయి. ఏం చెప్పాలో తెలియనట్లు మాలతికేసి చూసింది.‘‘సరే వెళ్ళి పని చూసుకో ఇంటికి వెళ్ళేముందు నన్నోసారి కలిసి వెళ్ళు’’ అని తన పని చూసుకోసాగింది మాలతి. నందిని బయటికి వచ్చి తన సీట్లో కూర్చుంది. అన్యమనస్కంగానే పనిలో నిమగ్నమయ్యింది. ‘సాయంత్రం తన ఉద్యోగం ఊడిపోవడం ఖాయం. అందుకే వెళ్ళేటప్పుడు కలవమంది’ అని ఆలోచించసాగింది. సాయంత్రం ఆరు కాగానే మాలతి వెళ్ళిపోతుందని తెలుసు. ఇక భారంగా లేచింది నందిని. తోటివారి జాలిచూపులు తప్పించుకుంటూ మాలతి రూములోకి నడిచింది. తను లోపలికి వెళ్ళేటప్పటికే మాలతి తన టేబుల్ క్లియర్ చేసి బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్ళడానికి లేచింది. నందినిని చూడగానే,‘‘వచ్చావా! సరే నాతో రా మనం బైటకి వెళ్తున్నాం’’ అంది కూల్‌గా.ఒక్క క్షణం ఆశ్చర్యం, ఉద్వేగం చుట్టుముట్టాయి నందినికి. ఏదో అనేలోగా, మళ్ళీ మాలతే ‘‘నీ డెస్క్ క్లోజ్ చేసి, బ్యాగ్ తీసుకొని బైటకి రా’’ అని బయటకు కదిలింది.అయోమయంగా నందిని తన బ్యాగ్ తీసుకుని బయటకు నడిచింది. కార్లో తన కోసం చూస్తూ మాలతి కనపడింది. మాలతి రమ్మని సైగ చెయ్యటంతో అలాగే ఆశ్చర్యంగా మాలతి పక్కసీటు డోర్ తీసి పక్కనే కూర్చుంది నందిని. దారిలో ఇద్దరూ ఏమీ మాట్లాడుకోలేదు. సీరియస్‌గా డ్రైవ్ చేసుకుంటూ నేరుగా తనింటి దగ్గరికి తీసుకెళ్ళి, ఆపింది మాలతి. తనవెంట రమ్మని సైగ చేసి డోర్ దిగి తన ఇంటి లాక్ తీసి లోపలికి నడిచింది. నందిని లోపలికి రాగానే కూర్చోమని సోఫా చూపించి, టీవీ రిమోట్ ఇచ్చి, ‘‘టీవీ చూస్తూండు. ఒక పది నిమిషాల్లో వస్తా’’ అని లోపలికి వెళ్ళిపోయింది.యాంత్రికంగా రిమోట్ తీసుకుని టీవీ ఆన్ చేసింది నందిని. కాని మనసు టీవీ మీదకు పోవటంలేదు. యథాలాపంగా హాలంతా కలియచూస్తూ కూచుంది. హాలంతా అందంగా అలంకరించి ఉంది. గోడమీద ఒకే ఒక చక్కని కలర్ ఫొటో ఫ్రేమ్ ఉంది. మాలతి, ఆవిడ భర్త కాబోలు చాలా హుందాగా ఉన్నాడు. ఇద్దరూ చూడ చక్కని జంట. నందినికి ప్రభాకర్ గుర్తొచ్చాడు. మనసు వికలమైంది. ఇంతలో మాలతి ఫ్రెష్‌గా తయారై, ఒక ట్రేలో రెండు కాఫీలు పట్టుకు వచ్చింది. నందిని లేచి, ‘‘అయ్యో ఎందుకు మేడం, శ్రమ పడుతున్నారు!’’ అంటూ దగ్గరకెళ్ళింది.‘‘కూర్చో... ఇందులో శ్రమేముంది, ఇది ఆఫీసు కాదు. ఇప్పడు నేను నీ బాస్‌ని కాదు. నువ్వు నా అతిథివి. హాయిగా కూర్చుని ఈ కాఫీ తాగు’’ అని కాఫీ కప్ చేతికిచ్చింది. టీపాయ్ మీద బిస్కట్స్ ప్లేట్ పెట్టి తను కూడ కాఫీ కప్ తీసుకుని సోఫాలో పక్కనే కూర్చుంది. పొద్దుటినుండి జరిగిన సంఘటనలతో మూడీగా ఉన్న నందిని పొగలు కక్కుతున్న కాఫీ కప్పు చూడగానే మాట్లాడకుండా కప్పు తీసుకొని, కాఫీ తాగుతూ కూర్చుంది.కాఫీలు పూర్తయ్యాక ‘‘నందినీ, ఇప్పుడు చెప్పు ఎందుకు ఈమధ్య పనిమీద శ్రద్ధ తగ్గింది? నువ్వంటే నాకెంతో అభిమానం. నువ్వు నిస్సంకోచంగా నీ సమస్య ఏంటో చెప్పు. ఒక బాస్‌గా కాకపోయినా, ఒక స్నేహితురాలిగా సహాయం చెయ్యటానికి ప్రయత్నిస్తాను’’ అని అభిమానంగా నందిని భుజం మీద చెయ్యేసి అడిగింది మాలతి. ఆ అభిమానానికి నందిని కరిగిపోయింది. తనలో గూడు కట్టుకున్న దుఃఖం బయటికి వచ్చింది. నెమ్మదిగా చెప్పటం మొదలుపెట్టింది నందిని.‘‘మేడం, నేను రెండేళ్ళ కిందటే ప్రేమించి, ప్రభాకర్‌ని పెళ్ళి చేసుకున్నా. రెండేళ్ల పాటు ఒకరినొకరు బాగా అర్థం చేసుకున్నాకే ఇదంతా జరిగింది. అమ్మా నాన్న ముందు వెంటనే అంగీకరించకపోయినా, నామాట కాదనలేక మా పెళ్ళి జరిపించారు. ఈమధ్య దాకా మా కాపురం హాయిగా ఆనందంగా గడిచిపోయింది. మాకేమీ ఆర్థిక సమస్యలు లేవు. ఇద్దరం సంపాదిస్తున్నాం. హాయిగా గడిచిపోతున్న జీవితంలో ఎందుకో గాప్స్ రావటం మొదలయ్యింది. తనకి నామీద ప్రేమ తగ్గిందని చెప్పలేను కాని ఆఫీసు ఒత్తిడో, వాళ్ళ చెల్లెలి కాపురం సరిగా లేదని చిరాకో తెలీదు కాని, అనవసరంగా నామీద విసుక్కోవటం ఎక్కువయ్యింది.ఇంట్లో ఏం కూర చెయ్యాలన్న దగ్గర్నుండి, ఏ సినిమాకు వెళ్ళాలన్నదాకా ప్రతిదాన్లో తనకి అసహనం. తాను చెప్పిందే వినాలన్న పంతం మొదలైంది. చెల్లెలి కాపురంలో సమస్యల వల్ల కావచ్చు అనుకుంటూ. నేనే ఓర్పుగా ఉంటున్నా. ఆఫీసు నుండి లేటుగా రావటం మొదలైంది. ఏదో నెలకో రెండు నెలలకో ఒకసారి ఫ్రెండ్స్‌తో పార్టీలంటూ వెళ్ళేవాడు ఉన్నట్టుండి వారానికి ఒకటి రెండుసార్లు అర్ధరాత్రి వరకూ పార్టీలంటూ తిరుగుతున్నాడు. అడిగితే, ‘ఇరవైనాలుగు గంటలూ నీ పక్కన కూర్చుని కబుర్లు చెప్పే ఓపిక టైము లేవు నాకు. ఆదివారం ఇంట్లోనే ఉంటున్నాగా! పెద్ద కొడుకుగా నాకు కొన్ని బాధ్యతలుంటాయి. అవి చూసుకోవాలి. అయినా నీకేం లోటు చేస్తున్నాను! నువ్వు మాత్రం లేటుగా రావటంలేదా అప్పుడప్పుడు ఆఫీసునుండి. అందరూ ఐదు గంటలకే వెళ్ళిపోతుంటే. నువ్వు ఆరు, ఏడు గంటలదాకా పనిచెయ్యటంలేదా! ఐనా నేనేం అనట్లేదే! నాకు కాఫీ కలుపుకోవటం కూడా రాదని నీకు తెలుసుకదా! అయినా ఓపిగ్గా ఎదురుచూశా కదా! నువ్వే నన్ను సరిగా అర్థం చేసుకోవట్లేదు’ అని నన్నే దెప్పడం మొదలుపెట్టాడు.అమ్మ నాన్నలకు చెప్పుకుందామంటే సిగ్గేసింది. ఇంత చదువుకొని, ప్రేమించి పెళ్ళిచేసుకుని, నా కాపురం సరిగా లేదని ఎలా చెప్పగలను! అలా అని అనుభవించనూ లేను’’ అని తన బాధంతా వెళ్ళ గక్కింది నందిని.అంతా ఓపికగా విన్నది మాలతి... నెమ్మదిగా చెప్పసాగింది...‘‘చూడు నందినీ, నీ సమస్య నేను అర్థం చేసుకుంటున్నా. ప్రతి అమ్మాయికి పెళ్ళయ్యాక ఇలాంటి సమస్యలు మొదలవుతాయి. మీరిద్దరూ ప్రేమించి పెళ్ళిచేసుకున్నా, మీ పరిచయాలకి ముందు మీవి భిన్నమైన జీవితాలు. మీ మీ కుటుంబాల్లో కాస్త స్వతంత్రంగా ఉండి ఉంటారు. నీకన్నా తనకి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండి ఉండచ్చు. సమస్య తనదైనా, నీదైనా భార్యాభర్తలయ్యాక ఇద్దరు కలిసి చర్చించి పరిష్కారం కోసం ప్రయత్నిస్తే సులభంగా ఉంటుంది కదా!‘నా చెల్లెలి జీవితాన్ని సరిదిద్దాలని నేను ప్రయత్నిస్తుంటే తను సపోర్టు ఇవ్వటంలేద’నే భావన తనకు రాకూడదు కదా! ఇద్దరిలో కంఫర్ట్ జోన్లో ఉండేవాళ్ళే చొరవ తీసుకుని సహాయానికి పూనుకుంటే, న్యాయంగా ఉంటుంది. రేపు నీకేదైనా నీ తోబుట్టువులకో, తల్లిదండ్రులకో సహాయం చేయవలసివస్తే తన సపోర్టు నీకు అవసరం కదా! తను ఆ సమస్య పరిష్కరించుకొనేందుకు సమయం కావాలనుకుంటే, నువ్వు కొంచెం భిన్నంగా తను ఇదివరకులా సమయం కేటాయించట్లేదని బాధపడుతున్నావా? అదృష్టంకొద్దీ మీకు ఆర్థిక ఇబ్బందులు లేవు.తన చెల్లెలి సమస్య వివరాలు ఎప్పుడైనా అడిగావా! సహాయం చెయ్యడానికి ప్రయత్నించావా?’’ అడిగింది మాలతి. ‘‘ఒకసారి అడిగా మేడం. వాళ్ళ చెల్లెలు ఆడపడుచు ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయికి ప్రభాకర్‌ని ఇచ్చి చెయ్యాలని అనుకున్నారట. ప్రభాకర్ అప్పటికే నామీద ప్రేమలో ఉన్నాడు. ఆ విషయం చెప్పి కుదరదని చెప్పాడట. మొదట్లో భారీగా కట్న కానుకలు వచ్చాయని సరిపెట్టుకున్నా, తర్వాత తర్వాత వాళ్ళ చెల్లెల్ని సతాయించటం మొదలుపెట్టారట. ప్రభాకర్ ఒకసారి ఆ అమ్మాయిని కూడా కలిసి అంతా చెప్పాడట. ఆ అమ్మాయి అర్థంచేసుకొని అడ్జస్ట్ అయ్యిందికానీ, అత్తమామల ధోరణిలో మార్పులేదు. ఇక ఈ విషయంలో నేను ప్రభాకర్‌కి ఏం సహాయం చెయ్యగలను? నేనేదైనా చెప్పబోతే, ఒకసారి కరుగ్గా ‘ఈ సమస్యకి ఒక కారణం నువ్వు కూడా... నువ్వు తలదూరిస్తే, సమస్య ఇంకా పెద్దదవుతుంది.దయచేసి దీనిలో జోక్యం చేసుకోకు’ అన్నాడు. ‘అయితే, ఈ సమస్యకి పరిష్కారం నువ్వు రోజూ నీ స్నేహితులతో తాగి తందనాలాడి ఇంటికి వస్తే దొరుకుతుందా?’ అని నేనూ ఆవేశంగా అన్నా... అంతే, అప్పట్నుంచి దూరం పెరిగింది.. హాయిగా సాగిపోతున్న మా కాపురంలో కలతలు, అపార్థాలు మొదలయ్యాయి. ప్రభాకర్ నన్ను తక్కువగా చూసినా అవమానకరంగా మాట్లాడినా, నేను తట్టుకోలేను. ఇదీ మా కథ మేడం. ఉద్యోగం సరిగా చెయ్యలేకపోతున్నా. రాజీనామా చేద్దామని చాలాసార్లు అనుకున్నా. మళ్ళీ ఇంట్లో ఒక్కతినే ఉంటే ఆలోచనలు ఎక్కువై కుంగిపోతానేమో అని భయపడి చెయ్యలేదు.’’ చెప్పింది నందిని.మాలతి శ్రధ్ధగా విన్నది. ఒక పది నిమిషాలు ఇద్దరూ మౌనంగా ఉండిపోయారు.పది నిమిషాలయ్యాక మాలతి మౌనాన్ని ఛేదిస్తూ, ఇలాఅంది: ‘‘నందినీ, నీ సమస్య కొంచెం జటిలంగానే ఉంది. ఓపిగ్గా పరిష్కరించుకోవాలి. ఇందులో నీ తప్పేమీలేదని కూడా నాకు అర్థమయ్యింది. కానీ ఇలా దూరాలు పెంచుకొని , శాశ్వతంగా దాంపత్య బంధం తెంచుకోవటంకన్నా, దాన్ని మరింత బలపరుచుకోవటం మీద దృష్టి పెడితే మంచిదని నాకనిపిస్తుంది. భార్యా భర్తల మధ్య ఒక జీవితకాల ప్రయాణం ఉంటుంది. ప్రయాణం ఇద్దరిదీ, కాని మార్గం ఒక్కటే! గమ్యం కూడా ఒక్కటే కావాలి. ఇది నిండు జీవితానికి సంబంధించిన సమస్య. నీ భర్త దుర్మార్గుడైతే, శారీరకంగా, మానసికంగా నిన్ను ఇబ్బంది పెట్టేవాడయితే, ఆ బంధాన్నే పట్టుకుని వేలాడమని చెప్పను.నువ్వు చెప్పినదాన్ని బట్టి అతను స్వతహాగా మంచివాడే. పరిస్థితుల ప్రభావంవల్ల ఇబ్బందులు పడుతూ, నిన్ను ఇబ్బంది పెడుతున్నాడు. ఇంచుమించు నీలాంటి పరిస్థితే నాకు ఎదురైనప్పుడు, నేను ఆత్మాభిమానం గురించి ఎక్కువగా ఊహించుకొని, నా భర్తకు దూరమై ఒంటరి జీవితాన్ని గడుపుతున్నాను. అన్నీ ఉన్నా ఏదో వెలితి. తను నన్ను వదిలేసి లండన్ వెళ్ళిపోయాడు. మరోపెళ్ళి గురించి కూడా ఆలోచించా. కాని తన స్థానంలో ఇంకో వ్యక్తిని ఊహల్లో కూడ భరించలేకున్నా. నన్ను చండశాసనురాలు అనుకుంటారు కానీ, పని మీద ఫోకస్ పెట్టి వ్యక్తిగత బాధని మర్చిపోయే ప్రయత్నం చేస్తున్నా.చివరగా నేను చెప్పేదేమిటంటే, నామాట విని కొంచెం నెమ్మదిగా ఓర్పుగా, మళ్ళీ ప్రయత్నించు తనకు దగ్గరవటానికి. నీకు ఈ సలహాతో పాటు ఒక సహాయం కూడా చేస్తున్నా. రేపటి నుంచి నీకు ఒక నెలరోజులు పెయిడ్ లీవ్ శాంక్షన్ చేస్తున్నా. మీ వారికి రాజీనామా చేశానని చెప్పు. ఈ నెలరోజులూ తన మనసు గెలవడానికి ప్రయత్నించు. నా సపోర్టు నీకెప్పుడూ ఉంటుంది. అవసరమైతే లీవ్ పొడిగించుకో.’’ అంటూ ముగించింది మాలతి.నందినికి మనసంతా చాలా తేలికపడింది. ‘‘థాంక్యూ వెరీమచ్ మేడం! మీ మేలు మరచిపోలేను. తప్పకుండా మీ సలహా పాటిస్తా’’ అని సెలవు తీసుకొని ఇంటికి వచ్చేసింది.ఇంటికెళ్ళేటప్పటికి ప్రభాకర్ ఇంకా ఇంటికి రాలేదు. గబగబా రెడీ అయ్యి, తనకిష్టమైన వంట చేసి, ఎదురుచూడసాగింది. ప్రభాకర్ కొంచెం లేటుగానే వచ్చాడు. నందిని ప్రశాంతంగా ‘‘రా వడ్డిస్తాను’’ అని టేబుల్ సర్దుతూ కూచుంది.మామూలుగా ఐతే ఈపాటికి ఒక చిన్నపాటి గొడవ అయితే కానీ భోజనం ఉండేది కాదు ప్రభాకర్‌కి. కాస్తంత రిలీఫ్‌గా ఫీలై వచ్చి కూర్చున్నాడు. వంట అంతా తన కిష్టమైన పదార్ధాలే! తృప్తిగా భోజనం చేసి వెళ్ళి సోఫాలో కూర్చున్నాడు. నందిని అన్నీ సర్దేసి వచ్చేసరికి ప్రభాకర్ సోఫాలోనే నిద్రలోకి జారుకున్నాడు. లేపి బెడ్రూమ్కి తీసుకెళ్ళి పడుకోబెట్టి, తను పడుకుంది నందిని.మర్నాడు తెల్లవారింది. ప్రభాకర్ మామూలుగా ఆఫీసుకి వెళ్ళడానికి రెడీ అయ్యాడు. తనతోపాటు పరుగులు పెడుతూ, ఆఫీసుకు తయారయ్యే నందిని ప్రశాంతంగా కూర్చుని ఉంది.‘‘ఏం నందినీ ఆఫీసులేదా!’’ అడిగాడు ప్రభాకర్. ‘‘ఉద్యోగానికి రిజైన్ చేశా’’ అంది నెమ్మదిగా.ఉలిక్కి పడ్డాడు ప్రభాకర్. ‘విన్నది తానేనా! అన్నది నందినేనా! తను ఉద్యోగం రిజైన్ చెయ్యటమా?’... కొద్ది క్షణాలకు తేరుకుని... ‘‘నిజంగానా, ఎందుకు, ఏమైంది?’’ అన్నాడు ఆశ్చర్యంగా. ‘‘మరేంలేదు. ఈ ఉరుకులు పరుగులు వదిలేసి, మన జీవితాలు కొంచెం ఆనందంగా, హాయిగా ఉండాలని బ్రేక్ తీసుకున్నా. నువ్వు ఆఫీసుకు వెళ్ళిపో... సాయంత్రం ఎదురుచూస్తూంటా, బై...’’ అని సాగనంపింది.ఒక వారం రోజులు ఇలాగే గడిచాయి. ప్రభాకర్‌కి కావల్సినవి అరేంజ్ చెయ్యటం తప్ప ఏం రియాక్టవకుండా మామూలుగా ఉండటానికి ప్రయత్నించింది నందిని.ఒకసారి డ్రింక్ చేసి లేట్‌గా వచ్చినా మౌనంగా సర్దుకుపోయింది. ఇంకో నాలుగు రోజులు పోయాక ప్రభాకర్‌లో కొంచెం కదలిక ప్రారంభమైంది. ‘అరే, తను నందిని తన సమస్యతో బాధపెడుతున్నాడా! తనకెంతో ఇష్టమైన ఉద్యోగం వదిలేసేటట్టు చేశాడా! తను ఇలాగే మౌనంగా ఓర్చుకుంటూ, కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతే... తన జీవితం ఏమైపోతుంది! సరిగా గమనించలేదు కానీ, నందినిలో మునుపటి చలాకీతనం, ఉత్సాహం పూర్తిగా మాయమయ్యాయి. తనే చొరవ తీసుకొని నందినితో మునపటిలా ఉండాలి’ అనుకుంటూ మరో రెండు రోజులు గడిపేశాడు. ఆరోజు ఆదివారం. ఇద్దరూ ఇంట్లోనే ఉన్నారు. మామూలుగానైతే, బైటకెళ్ళి సినిమాకో, షికారుకో వెళ్ళి హోటల్లో డిన్నర్ చేసి వచ్చేవాళ్ళు. ఈమధ్య తను చెల్లెలి సమస్యతో నందినిని దూరం పెడుతున్నాడు. ఆలోచిస్తూనే ఇద్దరూ కాఫీ టిఫిన్లు పూర్తి చేశారు. ఇంతలో నందినే చొరవ తీసుకొని దగ్గర కూర్చుని మాట్లాడటం మొదలు పెట్టింది.‘‘ప్రభా! మన మధ్య దూరం రోజురోజుకి పెరుగుతోందని అర్థమవుతోంది. నావంతు ప్రయత్నంగా నిన్ను కంఫర్ట్ జోన్లో పెట్టడానికి నా ఉద్యోగానికి కూడా రిజైన్ చేశా. నీ సమస్యకి నేనేమీ చెయ్యలేనని అన్నావు కాబట్టి ఆ విషయం గురించి కూడ మాట్లాడలేదు. కానీ, నువ్వు మారుతావన్న నమ్మకం తగ్గిపోతోంది. నీ మౌనం నన్ను కాల్చేస్తోంది. నీకు దూరం అవుతానేమో అన్న ఆలోచనే భయంకరంగా ఉంది. మన బంధం మునుపటిలా ఉండాలంటే ఏం చెయ్యాలో నువ్వే చెప్పు. నీకోసం ఏం కావాలన్నా చేస్తా!’’ నందినికి భావోద్వేగంతో మాటలు పెగలటంలేదు.ఇంకా ఏదో చెప్పబోయేంతలో... అప్పటికే కదిలిపోయిన ప్రభాకర్– నందినికి దగ్గరగా జరిగి గబుక్కున తనని దగ్గరికి తీసుకుని, ‘‘సారీ నందూ! ఇంకేం మాట్లాడకు. తప్పంతా నాది. నా సమస్యని నీ మీద రుద్ది నిన్ను బాధపెట్టాను. మనమధ్య పెరిగిన ఈ దూరంతో నీకన్నా నేనే ఎక్కువ నష్టపోయాను. ఇంకెప్పుడూ ఇలా జరగదు. తిట్టుకుంటూనో, పొగుడుకుంటూనో కలిసుంటేనే ఆనందం. విడిపోతే ఏముంటుంది! మా చెల్లెలు వాళ్ళకు దూరంగా బదిలీ కోసం ప్రయత్నిస్తున్నా. అదైపోతే ఈ గొడవ కూడా ఉండదు. కాకపోయినా పర్లేదు. నీ విలువేంటో నాకర్థమైంది. నువ్వు మళ్ళీ నీ ఉద్యోగం కోసం ప్రయత్నించు. లేదా ఇంకో జాబ్ కోసం ప్రయత్నించు. నాకు నా మునుపటి నందిని కావాలి...’’ చెప్పుకుంటూ పోతున్నాడు ప్రభాకర్.నందినికి సంతోషంతో మాటలు రావటంలేదు. క్షమ, ఓర్పు ఎంత గొప్పవో అని మాలతి చెప్పిన మాటలే గుర్తుకొచ్చాయి. మాలతి మీద కృతజ్ఞతతో మనçసు నిండిపోయింది. ప్రభాకర్‌ని హత్తుకొని గుండెలమీద తలవాల్చి అలాగే ఉండిపోయింది.నందినితో మాట్లాడిన రాత్రి మాలతి– లండన్‌లో ఉన్న భర్త మధుసూదన్‌కి కాల్ చేసింది. ‘‘హాయ్ మధూ! ఎప్పుడు ముగుస్తోంది నీ లండన్ అజ్ఞాతవాసం! రెండేళ్ళు కావొస్తోంది– కెరీర్, బిజినెస్ అంటూ నువ్వక్కడ నేనిక్కడ... డిసెంబరు లోపల రాకపోయావో, ఆఫీసు క్లోజ్ చేసి లండన్ వచ్చేస్తా! ఈ ఒంటరి జీవితం నా వల్లకాదు...’’ ఇంకం పూర్తి చెయ్యకముందే, అట్నుంచి మధు అనబడే మధుసూదన్ ‘‘మహాతల్లీ! ఆ పని చెయ్యకు. ఈలోగా వచ్చేస్తాగా!’’‘‘సరే, చెప్పాగా రాకపోతే ఏమవుతుందో... అన్నట్టు మధూ! నీకొక సంగతి చెప్పాలి. మా ఆఫీసులో నందిని అనే సిన్సియర్ ఎంప్లాయీ గురించి చెప్తుంటా కదా! తన కాపురం చక్కదిద్దటానికి, మనిద్దరం విడిపోయామని, నువ్వు దుర్మార్గుడివని, నన్ను వదిలేసి వెళ్ళిపోయావని చెప్పా’’ అంటూ జరిగిందంతా చెప్పింది మాలతి. విని, నవ్వుతూ అన్నాడు మధు ‘‘పర్లేదు మాలా! చాలాసార్లు సరైన సలహాలు దొరకక, చుట్టూ ఉన్న మనుషులను చూస్తూ, అందమైన దాంపత్యం జీవితానికి దూరం అవుతుంటారు చాలామంది. మంచి పని చేశావు. వాళ్ళ కాపురం చక్కబడాలని కోరుకుందాం. ఉంటామరి... బై!’’ అని ఫోన్ పెట్టేశాడు మధు. - పి.ఎ.యస్. సుధాకరరావు -
పిలవని అతిథి
హైద్రాబాద్‌లోని మారేడ్‌పల్లిలో రెండువేల చదరపు గజాల విస్తీర్ణంలోని అదొక్కటే అతి పాత ఇల్లు. చుట్టుపక్కల ఇళ్ళన్నీ పడగొట్టి అపార్ట్మెంట్ బిల్డింగ్స్ కట్టారు. కాని కింద ఆరు గదులు, పైన ఆరు గదులున్న ఆ పెద్ద ఇల్లు మాత్రం ఏ మార్పులూ లేకుండా ఉంది. అది 1970లలో బాలానగర్‌లో లేత్ మెషిన్స్ తయారు చేసే ఓ పారిశ్రామికవేత్తది. ఆ ఇంటికి వారసురాలైన ఆయన భార్య సిద్ధిధాత్రి ఆ ఇంట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఎనభై రెండేళ్ళ ఆవిడకి నలుగురు పిల్లలు. కూతురికి పెళ్ళై కలకత్తా వెళ్ళిపోయింది. ముగ్గురు కొడుకుల్లో ఒకడు కరోనా సమయంలో పోయాడు. మిగిలిన ఇద్దరిలో ఒకరు డెహ్రాడూన్‌లో టీ పరిశ్రమ నడుపుతున్నారు. మూడో కొడుకు ఇంగ్లండ్‌లో స్థిరపడ్డాడు. ఆ సాయంత్రం ఆవిడ వంటగదిలోకి వెళ్ళి షెల్ఫ్ తలుపు తెరిచి చూసింది. ఆవిడకి ఆ షెల్ఫ్‌లో కాఫీ పొడి సీసాని కుడివైపు, చక్కెర సీసాని ఎడమవైపు ఉంచటం అలవాటు. కాని అవి అటుదిటు, ఇటుదటు కనిపించడంతో తను వాటిని అలా ఎప్పుడు పెట్టిందా అని ఆలోచించింది. మరో రోజు ఆవిడ పలాస నుంచి తెప్పించుకున్న పొట్టు జీడిపప్పు అరకిలో పాకెట్ని సీసాలో పోస్తే అది నిండింది. ఆ అరకిలో ఆవిడకి మూడు వారాలు వస్తుంది. ఆవిడ ఆరోగ్యం కోసం రోజుకి ఏడు పప్పులు తింటుంది. కాని అవి సరిగ్గా సగం రోజుల్లో ఖాళీ అవడం ఆవిడకి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఓ రాత్రి అన్నం తిన్నాక సాంబార్ గిన్నెను ఆవిడ సింక్‌లో పడెయ్యలేదు. దాన్ని డైనింగ్ రూమ్‌లో పింగాణీ డిష్‌లోకి మార్చాక, వేడి పోవాలని డైనింగ్ టేబిల్ మీదే గుర్తుగా ఉంచి మర్చిపోయింది. కాని మర్నాడు ఉదయం అది సింక్‌లో కనిపించింది. ఇంకో రోజు తోటలోని తాజా మెట్టతామర పూలు ఫ్లవర్ వేజ్లో ప్రత్యక్షం అవడంతో సిద్ధిధాత్రి తుళ్ళిపడింది. చూస్తే వాటిని తెంపిన కత్తెర టీవీ కింద కేబినెట్లో కుడి డ్రాయర్లో బదులు ఎడమ డ్రాయర్లో కనిపించింది. అది అలై్జమర్స్ లక్షణం అని స్ఫురించగానే తనకి అనుకోని అతిథిగా అలై్జమర్స్ వస్తోందా అని ఆవిడకి భయం వేసింది.ఆ రాత్రి ఆవిడకి మృదువుగా ఈల వినిపించడంతో మెలకువ వచ్చి లేచి కూర్చుంది. అది పై అంతస్తులోంచా లేక తోటలోంచా? ఆవిడకి బోధపడలేదు. అంతలోనే ఆవిడకి నిద్రపట్టింది. మర్నాడు ఉదయం ఆవిడకి ఆ ఈల గుర్తొచ్చి కలై ఉంటుంది అనుకుంది. మర్నాడు రాత్రి కూడా ఆవిడకి ఈలతో మెలకువ రావడంతో ఇల్లంతా వెతికింది. ఎవరూ కనిపించలేదు. తన భర్త మరణించిన మంచం మీదే నిద్రించే సిద్ధిధాత్రికి దెయ్యాల మీద నమ్మకం లేదు. తనకి అనుకోని అతిథిగా అల్జిమర్స్ రావటం కాదని, ఇంట్లోనే ఏదో జరుగుతోందని ఆవిడకి అనిపించింది. ఆ తర్వాత కొన్ని రోజుల దాకా ఈల శబ్దం వినిపించలేదు. ఓ రాత్రి పెద్ద చప్పుడికి మెలకువ వచ్చి లేచి హాల్లోకి పరిగెత్తుకు వచ్చింది. డైనింగ్ టేబుల్ మీది అన్నం గిన్నె నేల మీద కనిపించింది. పిల్లి అంత పెద్ద గిన్నెని నేల మీదకి నెట్టలేదు. వెంటనే ఆవిడ పోలీసులకి ఫోన్ చేసింది. పావుగంటలో వాళ్ళు వచ్చారు.‘‘ఏం జరిగింది?’’ ఆవిడ వెంట లోపలకి నడుస్తూ ఎస్.ఐ. ప్రశ్నించాడు. ‘‘ఇంట్లో దొంగ పడ్డాడు. ఇది ఆ దొంగ పని. ఇంట్లో నాకు తెలీకుండా ఎవరో మసలుతున్నారు.’’ ఆవిడ నేల మీది ఆ గిన్నెని చూపించి చెప్పింది. ఆవిడ సాంబారు గిన్నె గురించి, జీడిపప్పు, కాఫీ, చక్కెర సీసాల గురించి చెప్పింది. ఆ ఇంట్లో ఆవిడ ఒక్కతే ఉంటుందని తెలిసిన పోలీసులు ఇల్లు, తోట వెతికారు. ఎవరూ కనపడలేదు. తలుపులు, కిటికీలు మూసే ఉన్నాయి.‘‘ఈ ఇంట్లోకి ఇంకెవరో వచ్చి వెళ్తున్నారు. పైన గెస్ట్ రూమ్‌లో దుప్పట్లు పరిచి గుర్తుగా ఓవైపు అంగుళం ఎక్కువ కిందకి జార్చాను. కాని అది మర్నాడు సమానంగా కనిపించింది. ఓ తెల్లవారుఝామున అతిథుల బాత్రూంలోకి వెళ్తే అది తడిగా ఉంది.’’ ఎస్.ఐ., హెడ్ కానిస్టేబుల్ ఒకరి మొహాలు మరొకరు చూసుకున్నారు. అది గమనించిన ఆవిడ చెప్పింది.‘‘నేనేం పిచ్చిదాన్ని కాను.’’ ‘‘రాత్రుళ్ళు మా పెట్రోల్ కారు వాళ్ళని మీ ఇంటివైపు వచ్చి ఓకన్నేసి ఉంచమని చెప్తాను.’’ ఎస్.ఐ. చెప్పాడు. మర్నాడు ఉదయం సిద్ధిధాత్రి ఎప్పటిలా మరో మనిషి ఉనికి కోసం షెల్ఫ్‌లోని కాఫీ సీసాని గమనించింది. అది యథాస్థానంలో లేదు. కావాలని ఆవిడ దాని కింది కాగితం చుట్టూ బాల్ పెన్‌తో గుండ్రం గీసింది. కాఫీ పొడి సీసా ఆ గుండ్రంలో లేదు. ఆవిడ మేడ మెట్లు ఎక్కి పై భాగంలోకి వెళ్ళి గెస్ట్ రూమ్ తలుపు తెరుచుకుని మంచం దగ్గరికి వెళ్ళింది. దాని మీద ఆవిడకి ఓ కాగితం కనిపించింది. దాన్ని అందుకుని చదివింది.మేడం సిద్ధిధాత్రి, ఈ ఇంట్లో మీతో పాటు నేనూ ఉంటున్నాను. చిరుద్యోగినైన నేను పగలు ఉద్యోగానికి ఫ్యాక్టరీకి వెళ్ళి, రాత్రి మీరు నిద్రపోయాక టెర్రేస్ తలుపులోంచి లోపలికి వస్తున్నాను. మీకు ఎలాంటి కీడు చేయను. కేవలం రాత్రుళ్ళు ఆశ్రయం, స్నానం, కాఫీలని, ఆకలేసినప్పుడు స్నాక్స్‌ని మాత్రమే తీసుకుంటున్నాను. ఇది మీకు ఇష్టం లేకపోతే ఈ ఉత్తరాన్ని తీసుకోండి. ఓ అపరిచితుడికి సహాయం చేద్దామనుకుంటే దీన్ని ఇక్కడే ఉంచండి. ఈ అర్ధరాత్రి మంచం మీద ఇది కనపడకపోతే ఇక ఎప్పటికీ మీ ఇంటికి రానని మాట ఇస్తున్నాను. దాన్ని చదివాక ఆవిడ కొద్దిసేపు ఆలోచించింది. ఆ ఉత్తరంతో బయటకి నడిచి మెట్లు దిగింది. మధ్యాహ్నం సిద్ధిధాత్రి దాని కింద ‘నువ్వు ఈల మాత్రం వేయకు’ అని రాసి మళ్ళీ అతిథి గదిలోకి వెళ్ళి మంచం మీద ఆ ఉత్తరాన్ని ఉంచి బయటకి నడిచింది. మల్లాది వెంకట కృష్ణమూర్తి (చదవండి: ‘త్రిపుర రాయని కథ’’) -
ప్రధాని మోదీని మెప్పించిన వంటలక్క యాదమ్మ..!
ఏదైన శుభకార్యానికి వెళ్లొస్తే మొదటగా అందరూ మాట్లాడుకునేది వడ్డించిన వంటల గురించే.. వెజ్ అయినా.. నాన్‌వెజ్ అయినా.. వంటకం ఎలా ఉంది..? ఎన్ని రకాలు వడ్డించారు? ఇలా ఓ చర్చే జరుగుతుంది. అయితే ఈ వంటలక్క చేయి పడితే రుచి చూడడం అవసరం లేదు. నాన్‌వెజ్‌లో బగారా, చికెన్, మటన్, ఫిష్, తలకాయ, బోటీతో పాటు వెజ్‌లో పచ్చిపులుసు, భక్షాలు, పప్పుచారు, పులిహోరాతో పాటు పంచభక్ష పరమాన్నాలు లొట్టలేసుకుని తింటారు. సాక్షాత్తు దేశ ప్రధాని నరేంద్ర మోదీతో శభాష్ అనిపించుకున్న కరీంనగర్‌లోని సప్తగిరికాలనీకి చెందిన ప్రముఖ క్యాటరింగ్ నిర్వాహకురాలు గూళ్ల యాదమ్మ చేతి వంటను రాష్ట్రంలోని ప్రముఖ రాజకీయ నాయకులందరూ రుచిచూశారు. ఒకప్పుడు రూ.15కు దినసరి కూలీగా చేసి, ప్రస్తుతం వందల మందికి ఉపాధి కల్పిస్తున్న యాదమ్మ చేతివంటపై సండే స్పెషల్..!!విద్యానగర్(కరీంనగర్): యాదమ్మది సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం గౌరవెల్లి. చిగురుమామిడి మండలం కొండాపూర్‌కు చెందిన చంద్రయ్యతో పదిహేనేళ్ల వయసులోనే వివాహమైంది. కొడుకు పుట్టిన మూడు నెలలకే చంద్రయ్య ఓ ప్రమాదంలో మరణించాడు. దీంతో కొడుకును తీసుకుని కరీంనగర్‌కు వలసొచ్చారు. కొన్ని రోజులు స్కూల్లో ఆయాగా పని చేశారు. తరువాత మంకమ్మతోటకు చెందిన వెంకన్న వద్ద వంటపనిలో హెల్పర్‌గా చేరారు. అందుకు రోజూ రూ.15 కూలీ తీసుకునేవారు. కాలక్రమేణ చిన్నచిన్న ఫంక్షన్లలో వంటచేస్తూ మన్ననలు పొందారు. క్రమేనా పెద్దపెద్ద ఫంక్షన్లకు క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 50 వేల మందికైనా ఒంటిచేత్తో వంటచేసేలా ప్రావీణ్యం సంపాదించారు.మోదీ మెచ్చిన వంటలు2022లో హైదరాబాద్‌లో జరిగిన బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ప్రధాని మోదీతో పాటు పాల్గొన్న వందలాది మంది ప్రముఖులకు యాదమ్మ తన చేతి వంటలు రుచి చూపించి శభాష్ అనిపించుకున్నారు. హైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్లో జరిగిన కార్యక్రమంలో తెలంగాణ వంటలు రుచిచూసిన ప్రధాని యాదమ్మను ప్రత్యేకంగా అభినందించారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం పలుమార్లు యాదమ్మ వంటలను మెచ్చుకున్నారు. కేటీఆర్ నిర్వహించిన మూడు బహిరంగసభలు, వేములవాడ శివరాత్రి ఉత్సవాలు, కొండగట్టు హనుమాన్ జయంతి, గోదావరి పుష్కరాల్లో వేలాది మందికి వంటలు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూతురు పెళ్లిలో 30వేల మందికి, కరీంనగర్ తీగల వంతెన ప్రారంభం అప్పుడు 20వేల మందికి వంటలు చేశారు. కేంద్రమంత్రి బండి సంజయ్, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసాల్లో జరిగిన ఫంక్షన్లకూ యాదమ్మ క్యాటరింగ్ చేశారు. గతనెల 27న కరీంనగర్‌లోని మహాశక్తి ఆలయంలో జరిగిన శ్రీరామనవమి వేడుకల్లో 25వేల మందికి రుచికరమైన వంటకాలు చేసిపెట్టారు.వందలాది మందికి ఉపాధికిరాయి పెంకుటిళ్లు నుంచి ఇప్పుడు సప్తగిరికాలనీలో తనకంటూ ఒక మంచి సొంతిళ్లు నిర్మించుకుని దుర్గా నిలయంగా పేరు పెట్టుకున్నారు. ఒక్కగానొక్క కొడుకును చదివించి రూ.12 లక్షలు ఖర్చు చేసి అమెరికా పంపింపారు. అక్కడి వాతావరణం పడక అనారోగ్యం పాలు కావడంతో స్వదేశానికి వచ్చి అతనూ క్యాటరింగ్ చేస్తున్నాడు. యాదమ్మ వద్ద దాదాపు 200 మంది వంటలు నేర్చుకుని సొంతంగా క్యాటరింగ్‌లు నిర్వహిస్తున్నారు. మీర్జాపూర్‌కు చెందిన 20 మంది మహిళలు వంటలు నేర్చుకుని స్వయం ఉపాధి పొందుతున్నారు. సీజన్లో 200మందికి ఉపాధి కల్పిస్తున్నారు. మిగతా రోజుల్లో నిత్యం 10 నుంచి 20 మంది యాదమ్మ వంటకు సాయంగా ఉంటారు.ఈ జన్మలో కలిగిన భాగ్యంకరీంనగర్లోని మారుమూల పల్లెలో పుట్టిన నేను ఈ దేశ ప్రధానికి నా చేతి వంట రుచి చూపిస్తానని కలలో కూడ అనుకోలేదు. శాకాహారమే కాకుండా నాన్ వెజ్ వంటకాలు కూడా బాగా చేస్తాను. గంగుల కమలాకర్, బండి సంజయ్‌లు నన్ను బాగా ప్రోత్సహిస్తున్నారు. వారి ఇంట్లో, రాజకీయ పార్టీలకు, కాలేజీ ఫంక్షన్లకు, రాజకీయ సభలకు దాదాపు 20 నుంచి 30వేల మందికి వంట చేయగలను. నా వద్ద ప్రస్తుతం 40మంది వరకు పని చేస్తారు. నా దగ్గర పని నేర్చుకున్న వారు స్వయంగా క్యాటరింగ్ నిర్వహిస్తున్నారు. వారి పిల్లలను అమెరికా సైతం పంపించారు. – గూళ్ల యాదమ్మ -
ఈ సండే ఛత్తీస్‌గఢ్ ముఠియా, చైనా తాంగ్హుల్ క్యాండీ రెసిపీలు చేద్దాం ఇలా..!
పనీర్ బిర్యానీ బాల్స్కావలసినవి: బాస్మతి రైస్– ఒక కప్పు (ఉడికించి తీసుకోవాలి)పనీర్ కర్రీ– ఒక కప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము– కొద్దికొద్దిగాబిర్యానీ మసాలా– ఒక టీ స్పూన్, గుడ్లు– 4, పాలు– ఒక టేబుల్ స్పూన్బ్రెడ్ పౌడర్, మైదా పిండి– ఒక కప్పు చొప్పున, నూనె– సరిపడాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బాస్మతి అన్నం తీసుకుని అందులో పనీర్ కర్రీ, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, బిర్యానీ మసాలా, మూడు కోడి గుడ్లు వేసుకుని బాగా కలిసి గుండ్రటి ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో మైదా పిండి, మరొక చిన్న గిన్నెలో మిగిలిన కోడి గుడ్డు సొన, పాలు కలిపి పెట్టుకోవాలి. మరో గిన్నెలో బ్రెడ్ పౌడర్ వేసి పెట్టుకోవాలి. అనంతరం ఈ బిర్యానీ ఉండలను తీసుకొని, ముందుగా గుడ్డు మిశ్రమంలో రోల్ చేసి, ఆపై మైదాపిండిలో దొర్లించాలి. ఆ తర్వాత అదే ఉండను మరోసారి గుడ్డు సొనలో రోల్ చేసి, చివరకు బ్రెడ్ పౌడర్‌లో రోల్ చేయాలి. అన్ని బాల్స్‌ను అదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో దోరగా వేయించి, నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.చైనా తాంగ్హుల్ క్యాండీకావలసినవి: స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, కివీ, ఆరెంజ్, చెర్రీస్ లేదా నచ్చిన పండ్లు – కొన్ని, పంచదార– ఒక కప్పు, నీళ్లు– అర కప్పు, నూనె– కొద్దిగా, ఐస్ లేదా చల్లని నీళ్లు– పంచదార పాకం గట్టి పడటానికి, పుల్లలు– కొన్నితయారీ: ముందుగా పండ్లను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. వాటిపై నీటి చుక్క కూడా ఉండకూడదు. తడి ఉంటే పంచదార పాకం పండ్లపై సరిగా అంటుకోదు. ఈలోపు ఒక చిన్న పాన్ లేదా గిన్నెలో పంచదార, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తర్వాత, కలపడం ఆపి, పాకం బుడగలు వచ్చి, కాస్త రంగు మారేవరకు మరిగించాలి. ఒక చల్లని నీళ్ల గిన్నెలో కొన్ని చుక్కల పాకాన్ని వేసిన వెంటనే గట్టిపడి, క్రిస్పీగా మారితే అది సరైన స్థితిలో ఉన్నట్టే గుర్తించొచ్చు. దాంతో స్టవ్ ఆఫ్ చేసుకుని పండ్లు ఉన్న పుల్లలను ఒకదాని తర్వాత ఒకటిగా పాకంలో ముంచాలి. పాకం పండ్ల మీద అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పాకం ఉంటే గిన్నె అంచున తట్టి తీసివేయాలి. పాకం పూసిన పండ్లను నూనె రాసిన బేకింగ్ షీట్ మీద పెట్టుకోవాలి. చల్లారాక తింటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పండ్లు డైరెక్ట్‌గా తినని వారు ఇలా ట్రై చేయొచ్చు.]ఛత్తీస్‌గఢ్ ముఠియాకావలసినవి: బంగాళదుంపలు– 3 (మీడియం సైజ్, ఉడికించి తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి), బియ్యప్పిండి– ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరిగినవి)పచ్చిమిర్చి– 3 (సన్నగా తరిగినవి)కొత్తిమీర తురుము– కొద్దిగాఅల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టీస్పూన్కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, ఆవాలు– కొద్దికొద్దిగా, ఉప్పు,మసాలా, పసుపు– తగినంత, నూనె– కొద్దిగాతయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప గుజ్జు, మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, నచ్చిన ఆకారంలో ఒత్తుకోవాలి. వాటిని ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్ర లేదా ఏదైనా స్టీమర్ ఉపయోగించొచ్చు. అవి ఉడికిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులు, కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర ఇలా అన్నీ వేసుకుని వేగించాలి. ఆవాలు చిటపటలాడాక, ముందుగా ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న ముఠియా ముక్కలు వేసి, కొద్దిగా పసుపు వేసి, బాగా కలిపి సుమారు 2 లేదా 3 నిమిషాలు వేగించాలి. అంతే, రుచికరమైన ముఠియా వేడి వేడిగా సిద్ధం అవుతుంది. -
ఈ సండే స్పెషల్‌గా వెరైటీ స్వీట్స్ ట్రై చేయండిలా..!
ఇటలీ క్రిస్పిల్లే రైస్ రోల్స్కావలసినవి: బియ్యం– 250 గ్రాములు (కడిగి శుభ్రం చేసి పెట్టుకోవాలి), చిక్కటి పాలు– 400 మి.లీ., నీళ్లు– 100 మి.లీ., ఉప్పు– చిటికెడు, వెనీలా ఎక్స్ట్రాక్ట్ – ఒక టేబుల్ స్పూన్, పంచదార పొడి– 70 గ్రాములుపైనే, మైదాపిండి– 135 గ్రాములు, తాజా యీస్ట్– 15 గ్రాములు, (2 టేబుల్ స్పూన్లు కాచి చల్లార్చిన పాలలో కలిపి క్రీమ్‌లా చేసుకోవాలి), దాల్చిన చెక్క పొడి– కొద్దిగా, నారింజ తొక్కల తురుము– కొద్దిగా (నిమ్మ తొక్కలు కూడా తీసుకోవచ్చు) తేనె లేదా పంచదార పాకం– కొద్దిగా, నూనె– సరిపడాతయారీ: ముందుగా పాలు, నీళ్లు ఒక పాత్రలో వేసుకుని, చిన్న మంట మీద ఎసరు పెట్టినట్లుగా పెట్టుకోవాలి. పాలు పొంగుతున్న సమయంలో బియ్యం వేసి మెత్తగా ఉడికించుకోవాలి. అన్నం పలుకుగా ఉంటే ఇంకొన్ని పాలు పోసుకుని ఉడికించుకోవాలి. అన్నం పూర్తి అయిన తర్వాత కాసేపు చల్లారనిచ్చి ఒక బౌల్లోకి తీసుకుని, వెనీలా ఎక్స్ట్రాక్ట్, 70 గ్రాముల పంచదార పొడి, దాల్చిన చెక్క పొడి, యీస్ట్, మైదా పిండి, నారింజ తొక్క లేదా నిమ్మ తొక్క తురుము ఒకదాని తర్వాత ఒకటి వేసుకుని బాగా మెత్తగా ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు చిత్రంలో చూపిన విధంగా రోల్స్ చేసుకుని నూనెలో దోరగా వేయించుకోవాలి. ఒక బౌల్లో వేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే తేనె లేదా పంచదార పాకం వేసుకుని పైన పంచదార పొడి జల్లుకుని సర్వ్ చేసుకోవచ్చు. నారింజ ముక్కలతో వీటిని తింటే భలే రుచిగా ఉంటాయి.ఛెన్నా గొజ్జాకావలసినవి: చిక్కటి పాలు– ఒక లీటరు, నిమ్మరసం– 2 టేబుల్ స్పూన్లు (వెనిగర్ కూడా వాడుకోవచ్చు), కూలింగ్ వాటర్– సరిపడా, రవ్వ– ఒక టేబుల్ స్పూన్, మైదా పిండి– ఒక టేబుల్ స్పూన్, ఏలకుల పొడి– అర టీస్పూన్, నెయ్యి– వేయించడానికి సరిపడా, పంచదార, నీళ్లు– ఒక కప్పు చొప్పునతయారీ: ముందుగా ఒక మందపాటి గిన్నెలో పాలు పోసి, మధ్యస్థ మంటపై మరిగిస్తూ, పాలు పొంగకుండా చూసుకోవాలి. మరిగిన తర్వాత ఒక నిమిషం పాటు చల్లారనిచ్చి, ఇప్పుడు నిమ్మరసం లేదా వెనిగర్‌ను కొద్దికొద్దిగా పోస్తూ, పాలు విరిగే వరకు నెమ్మదిగా కలపాలి. పాలు పూర్తిగా విరిగిపోయాక, విరిగిన పనీర్‌ను ఒక బౌల్లోకి తీసుకుని చల్లటి నీటిలో వేసి దానిలో కాసేపు కడిగి, పలుచటి క్లాత్లోకి తీసుకోవాలి. నీరు మొత్తం పిండేసి ఆ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోవాలి. నీరు పిండేటప్పుడు కొద్దిగా తేమ ఉండేలా చూసుకోవాలి.అనంతరం ఆ పనీర్‌ని సుమారు 5 లేదా 7 నిమిషాలు చేత్తో పిసికి మరింత మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు అందులో రవ్వ, మైదా పిండి, ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అది అప్పుడు చపాతీ పిండిలా మెత్తగా అవుతుంది. అనంతరం ఆ మిశ్రమాన్ని చిన్న చిన్న ముద్దల్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని, చిన్న మంట మీద, నేతిలో దోరగా వేయించుకోవాలి. ఈలోపు మరో స్టవ్ మీద పంచదార, నీళ్లు పోసుకుని, ఏలకుల పొడి వేసుకుని, లేత పాకం రాగానే కొద్దిగా నిమ్మరసం వేసుకుని బాగా కలపాలి. ఇప్పుడు అందులో నేతిలో వేగిన ముక్కలను వేయించి పాకంలో నానబెట్టాక సర్వ్ చేసుకోవచ్చు.చాక్లెట్ పీనట్ బార్స్ కావలసినవి: ఓట్స్ పౌడర్– ఒక కప్పుపైనే (ఓట్స్‌ని దోరగా వేయించి పౌడర్లా చేసుకోవాలి), బాదం పౌడర్– ఒక కప్పు, పీనట్ బటర్– 2 కప్పులు, మేపుల్ సిరప్– 80 ఎమ్ఎల్, డార్క్ చాక్లెట్ ముక్కలు– ఒక కప్పు తయారీ: ముందుగా ఓట్స్ పౌడర్‌లో బాదం పౌడర్, పీనట్ బటర్, మేపుల్ సిరప్ ఒక దాని తర్వాత ఒకటి వేసుకుని బాగా కలుపుకోవాలి. ముద్ద కాగానే బేకింగ్ ట్రేలో నింపుకుని సమాంతరంగా ఒత్తుకోవాలి. ఈలోపు చాక్లెట్ ముక్కల్లో కొద్దిగా కొబ్బరి నూనె వేసి కరిగించుకుని, ఆ సిరప్‌ను బేకింగ్ ట్రేలో ఉన్న పీనట్ మిశ్రమంపై, సమానంగా పోసుకుని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు 30 నిమిషాల పాటు ఫ్రిజ్‌లో పెట్టుకుని నచ్చిన విధంగా ముక్కలు కట్ చేసుకుంటే సరిపోతుంది. (చదవండి: నీలిరంగులో కనిపించే పండ్లు, కూరగాయలు ఇవే..!) -
మన 'సారా' ఒక్కటై.. అడవంతా ఆదర్శమై!
నాగరికతకు ఎంతో దగ్గరగా ఉన్న చెంచు గిరిజనులు ఇంకా ఆదిమ సంస్కృతి, సంప్రదాయా లు పాటిస్తున్నారు. ప్రకృతితో కలసి జీవనం సాగిస్తుండటంతో వారి ఆచారాలు కూడా అంతే స్వచ్ఛంగా ఉంటున్నాయనడంలోసందేహం లేదు. ముఖ్యంగా వివాహ సమయంలో ఇప్పటికీ వరకట్నం లేకపోవడం.. యువతీ యువకుల అభిప్రాయాలకు పెద్దపీట వేయడం.. నిరాడంబరంగా తంతు ముగించడం విశేషం. ప్రకృతి ఒడిలో ఒక్కటై పచ్చని బంధానికి బలమైన పునాది వేసుకుంటూ ఆదర్శంగా నిలుస్తున్నారు. కాలం మారుతోంది. కొన్ని కులాలు, మతాల్లో ఆచారాలు కనుమరుగు అవుతున్నా.. ఆదిమ గిరిజనులైన చెంచులు తమదైన నాటి ఆచారాలు, సంప్రదాయాలను కొనసాగిస్తున్నారు. ముఖ్యంగా వారి వివాహ పద్ధతి నాటి సంస్కృతి సంప్రదాయాలకు అనుగుణంగా జరపడం విశేషం. చెంచు గిరిజన పెద్దలు తమ పిల్లల వివాహ విషయాల్లో వారి ఇష్టాయిష్టాలకే ప్రాధాన్యతన్యత ఇస్తున్నారు. ఒకరినొకరు ఇష్ట పడి ఆ విషయాన్ని పెద్దలకు చెబితే చాలు.. వెంటనే వివాహ యత్నాలు మొదలవుతాయి. గూడెం పెద్దలతో కలిసి అబ్బాయి తల్లిదండ్రులు అమ్మాయి ఇంటికి వెళ్తారు. అబ్బాయి తరుఫు వాళ్లు తీసుకు వచ్చిన ఐదు సీసాల సారాయిని వారి ఎదురుగా ఉంచితే అమ్మాయి తరుఫు వారు మూడు సీసాల సారాను వరుడి వైపు వారు తెచ్చిన సారాయితో కలుపుతారు. ఇది రెండు కుటుంబాల కలయికకు, నూతన బంధానికి చిహ్నంగా భావిస్తారు.అలా ఒకటైన సారాయిని వచ్చిన పెద్దలకు తలా ఇంతా పంచుతారు. ఆ సమయంలోనే వివాహ దినాన్ని పెద్దలు నిర్ణయిస్తారు. చెంచుల వివాహాల్లో వరకట్నం అన్న సాంఘిక దురాచారం కనపడదు. కొద్దిపాటి కన్యాశుల్కం ఉంటుంది. అది కూడా పూర్వపు రోజుల్లో అయితే అణాలలో ఉండేది. ఇప్పుడిప్పుడే రూ.11 దాకా పెరిగింది. ఈ మొత్తాన్ని వివాహ సమయంలో వరుడు వధువుకు ఇవ్వాల్సి ఉంటుంది. అంతే కాకుండా పెళ్లి కూతురింటిలో జరిగే తంతుకు కావాల్సినదంతా పెళ్లి కొడుకు తీసుకు రావాల్సిందే. పెళ్లి కూతురికి రెండు చీరలు, పెళ్లి కూతురికి తల్లికి ఒక చీరను తీసుకెళ్లాలి. వధువు తల్లిదండ్రులకు ఆరోజు పెట్టే పప్పన్నం మాత్రమే ఖర్చు. చెంచుల పురోహితుడు ‘కోలగాడు’ .. ఇరువురిని ఒకటి చేసి వారు దంపతులని సమాజానికి ప్రకటించే తంతే వివాహం. చెంచుల్లో వివాహం జరిపించేందుకు ప్రతి గూడెంలోనూ కోలగాడు అని పిలవబడే పురోహితుడుంటాడు. సగోత్రికులలో వివాహం నిషిద్ధమైన చెంచుల్లో పలు గోత్రనామాలు కలిగిన గుంపులుంటాయి. వాటిలో ఉత్తలూరు, పులిచర్ల, గుళ్ల, దాసరి, మాండ్ల, చిగుళ్ల, జళ్లి, భూమని, కుడుముల వంటి గోత్రాలు వాటిలో కొన్ని. వీటిలోని ఉత్తలూరు గోత్రానికి చెందిన వారిలో ఒకరిని ఆయా గూడేలలో పెళ్లి తంతు జరిపే పురోహితునిగా ఎంచుకుంటారు. చెంచు పురోహితున్ని ‘కోలగాడు’ అనిపిలుస్తారు. ప్రకృతి ఒడిలోనే ఏకాంతం.. పెళ్లయిన వధూవరులకు అనంతరం జరిగే శోభన కార్యక్రమం నాలుగు గోడల మధ్య జరగడానికి చెంచుల ఆచారాలు అనుమతించవు. పెళ్లయిన వధూవరులు ఆహార సేకరణ కోసం అడవుల్లోకి వెళతారు. అక్కడ ప్రకృతి ప్రసాదించిన ఏకాంతం, పచ్చటి పొదరింటి శయ్యాగృహమే నూతన వధూవరులకు శోభన వేదిక అవుతుంది. నూతన వధూవరులే కాదు.. ఏ చెంచు జంటకైనా రాత్రి శృంగారం నిషిద్ధం. విహారమైనా.. ఆహార సేకరణ అయినా.. శృంగారమైనా పగటి పూటే చెంచులకు ఆనవాయితీ. పాత ఆచారాలు మరచిపోలేం నాగరికతకు ఎంత దగ్గరైనా మా చెంచు వాళ్లు మాత్రం పాత పద్ధతులు, ఆచారాలు వదలుకోలేదు. ఇప్పటికీ మా పెద్దోళ్లు చెప్పిన పద్ధతిలోనే పెళ్లిళ్లు చేసుకుంటున్నాం. పద్ధతులు మారిస్తే మా పెద్దోళ్లు పైనుంచి కోపగించుకుంటారనే భయమూ ఉంది.పెళ్లంటే అన్ని ఖర్చులు మగపెళ్లి వాళ్లే పెట్టుకుంటారు. ఆడపెళ్లి వాళ్లకు ఎలాంటి ఖర్చు లేదు. – ఉత్తలూరి అంకన్న, కోలగాడు, నాగలూటి గూడెం పిల్లల ఇష్టాలతోనే మా గూడేల్లోకి చర్చలు, ఆలయాలు వచ్చినా.. మా దేవుళ్లు అయిన ఈదన్న, గుగ్గిళ్ల బయ్యన్న, మంతనాలమ్మలను కొలవడంలో మాత్రం మార్పులేదు. అట్టాగే పెళ్లిళ్లు కూడా సంబరంగా జరుపుకుంటారు. పిల్లగాళ్ల ఇష్టాలతోనే పెద్దవాళ్లు జత కట్టిస్తారు. – వెంకటేశ్వర్లు, చెంచు దేవతల పూజారి, బైర్లూటి చెంచుల పెళ్లింట విశేషాలు..వివాహానికి ముందు రోజు సాయంత్రం పెళ్లి కూతురు ఇంటికి పెళ్లి కుమారుడు తరఫు బంధువులంతా చేరుకుంటారు. పుట్ట మన్నుతో వివాహ వేదికను తయారు చేసి అక్కడ బాణాలను ఉంచుతారు. కొన్ని చోట్ల గంజి కావడి తెచ్చి వచ్చిన వారికి అందిస్తారు. ఆ రాత్రి వధూవరులకు నలుగు కార్యక్రమం ఉంటుంది. ఒక వైపు నలుగులు జరుగుతుంటే మరోవైపు అందరు కలసి నాట్యం చేస్తారు. ఈ నాట్యానికి చెంచులకు ఇష్టమైన తప్పెట వాదన ఉండనే ఉంటుంది. గూడెంలోని ఆడవారంతా తెల్లవారుజామునే వధూవరులను కోలగాడి (పురోహితుడు) సమక్షంలో స్నానాల బండ వద్దకు తీసుకెళ్తారు. పుక్కిట పట్టిన నీళ్లు కూడా ఒకరిపై మరొకరు పుక్కిలించుకుంటారు. (ఈ తంతు అంతా వధూవరుల మధ్య బిడియం తగ్గి పోవడానికే). అనంతరం కోలగాడు వధూవరులిద్దరికీ నూతన వస్త్రాలను అందించడంతో వివాహానికి సిద్ధమవుతారు. కోలగాడు దారంతో నూలుపోగు తయారు చేసి పసుపు కొమ్మును కట్టి మంగళసూత్రంగా త యారు చేస్తాడు. వరుడు పెద్దలందరికీ చూపు తూ అందరి చప్పట్ల మధ్య వధువు మెడలో కట్టడంతో వివాహ క్రతువు ముగుస్తుంది. పెళ్లి జరిగిన రోజు వధువు ఇంటిలో పెండ్లికి వచ్చిన వారికి పప్పన్నాన్ని మాత్రమమే వడ్డిస్తారు. అయితే వధూవరులు వరుడి ఇంటికి వచ్చిన రోజున మాంసాహారంతో విందు చేస్తారు. సారాయి సరేసరి. స్థోమతను బట్టిసంబరం జోరుగుంటుంది. పెళ్లి క్రతువును ఏమాత్రం భరించే శక్తి లేని వధూవరులను ఒక చోటకు చేర్చి కోలగాడు వారి కొంగులు ముడి వేసి వారి పెళ్లి అయ్యిందని ప్రకటించడంతో వారి వివాహ జీవితం ప్రారంభమవుతుంది. -
ఆదివారం సంస్కృతం
బెంగళూరు కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే వేరే లోకానికి వచ్చామా అనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ చేరిన ఒక బృందం మాట్లాడినా ఆడినా చర్చించినా వాడే భాష సంస్కృతం.అంతరించిపోయే దశలో ఉన్న సంస్కృతం ఆ పచ్చని చెట్ల మధ్య చివురులేస్తోంది.సమష్టి గుబ్బి అనే అమ్మాయి ఉచితంగా సంస్కృతం నేర్పడమే కారణం.‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ అనే ఈ కార్యక్రమం అన్ని చోట్లకూ విస్తరించేలా ఉంది.బెంగళూరులోని కబ్బన్ పార్క్‌లో ఆదివారం ఉదయం వెళితే ఎవరో ఒకరు ఎదురు పడి ‘తవనామధేయం కిమ్?’ అంటారు. ‘మీ పేరేమిటి?’ అని ఆ మాటకు అర్థం. ‘మెలనెన బహు సంతోషహ’ అంటారు. ‘మిమ్మల్ని కలవడం సంతోషంగా ఉంది’. ‘అహం సమష్టి’ అని పరిచయం చేసుకుంటారు. ‘నా పేరు సమష్టి’ అని దానికి అర్థం. కన్నడ, తెలుగు, తమిళం మాతృభాషగా కలిగిన బెంగళూరు వాసులు ఆ భాషను లేదా ఇంగ్లిష్‌ను మాట్లాడి మాట్లాడి విసుగు చెంది ఉంటే నాలుక గుండా వెలువడే సంస్కృతం మాటలు కొత్త ఉత్తేజాన్ని, సరదాని కలిగిస్తాయి. అందుకే రెండు నెలల క్రితం కబ్బన్ ΄ార్క్లో మొదలైన ‘శాన్‌స్క్రీట్ వీకెండ్’ కార్యక్రమం పెద్ద హిట్ అయ్యింది. ఇప్పుడు ముంబై, పూణె నగరాలకు వ్యాపించే దాకా వెళ్లింది.‘స్థాయి’ సంస్థ చొరవతోబెంగళూరులోని ‘స్థాయి’ సంస్థ సంస్కృత భాష పునరుద్ధరణకు అంకితమైంది. ఈ తరానికి సంస్కృతం పరిచయం చేయడం కోసం సంస్కృతంలో పాటలు, షార్ట్‌ఫిల్మ్‌లు, పాఠాలు తయారుచేసి యూట్యూబ్‌లో పెడుతోంది. దానిని స్థాపించిన సమష్టి గుబ్బి నేరుగా కూడా సంస్కృతాన్ని పరిచయం చేద్దామని నిశ్చయించుకుని కబ్బన్ ΄ార్క్లో ఆదివారం పూట సంస్కృతం నేర్పే ఇన్ఫార్మల్ క్లాసులను మొదలెట్టింది. మొదటివారం కేవలం ఆమె స్నేహితులు మాత్రమే వచ్చారు. కాని రెండోవారానికి నోటి మాటతో కొత్తవాళ్ల రాక మొదలైంది. ఇప్పుడు ప్రతి వారాంతం చాలామంది నాగా పెట్టకుండా వచ్చి సంస్కృతం నేర్చుకుంటున్నారు. ‘అది పాఠ్యాంశంగా కాకుండా రోజువారీ కార్యకలాపాలకు ఉపయోగపడేలా నేర్పడం వల్ల అందరికీ ఆసక్తి ఏర్పడుతోంది’ అంటోంది సమష్టి.సామాన్యుల భాషే‘సంస్కృతం దేవతల భాష అంటారు. అది సామాన్యుల భాషే. ఇతర దేశాల వాళ్లు వాళ్ల ్ర΄ాచీన భాషలు మాట్లాడితే మనం ఆశ్చర్యపోము. కాని భారతీయులు సంస్కృతం మాట్లాడటం ఎందుకు ఆశ్చర్యకరం. సంస్కృతంలో సినిమాలు, నాటకాలు, ΄ాటలు, ΄ాడ్కాస్ట్లు చేయొచ్చు’ అంటుంది సమష్టి. తిరుపతి సంస్కృత విశ్వవిద్యాలయంలో ఎం.ఏ సంస్కృత గ్రామర్ చదువుకున్న సమష్టి ‘శాన్‌స్క్రిట్ స్పారో’ పేరుతో ఇన్‌స్టా అకౌంట్ ఓపెన్ చేసి సంస్కృత మాటలు నేర్పసాగింది. అది కబ్బన్ ΄ార్క్లు ముఖాముఖి కార్యక్రమంగా మారింది. సంస్కృత భాష వ్యాప్తి కోసం సమష్టి తన బృందాన్ని తీసుకుని బైక్‌మీద కొత్త ్ర΄ాంతాలకు వెళ్లి సంస్కృతాన్ని ప్రచారం చేస్తోంది. దీనికి ‘శాన్‌స్క్రిట్ రైడ్’ అని పేరు పెట్టింది. ‘శివమొగ్గ జిల్లాలోని మట్టూరు గ్రామంలో ప్రతి ఒక్కరూ సంస్కృతంలో మాట్లాడతారు. అందుకే అది సంస్కృత గ్రామంగా వాసికెక్కింది. నా బృందాన్ని ఆ ఊరికి తీసుకెళ్లాను’ అని చెప్పింది సమష్టి. ‘మార్కుల కోసం స్కూళ్లలో కాలేజీల్లో చాలా మంది సంస్కృతం చదివారు. కాని నిజజీవితంలో ఉపయోగించరు. అలాంటి వాళ్లంతా మా సంస్కృత ఆదివారాల గురించి విని సంస్కృతాన్ని తలుచుకుంటున్నారు. అది సంతోషం’ అంది సమష్టి. ఆమె తన బృందం చేత హిందీ ΄ాటలను సంస్కృతంలో డబ్ చేయించి ΄ాడిస్తుంది. ‘మై హూ డాన్’ ΄ాటను ‘అహం డాన్ అస్మి’ అని ΄ాడుతుంటే కేరింతలు వినిపిస్తాయి. ఏ భాష అయినా ఇంత సరదాగా, సజీవంగా ఉంటే ఎందుకు అంతరిస్తుంది? -
ఫన్డే: ఈ వారం కథ: 'లెఫి బొ'
"ఆఫీస్‌కి వెళ్ళబోతున్న భర్తకు ‘బై’ చెప్పడం కోసం గడపదాటి వసారాలోకొచ్చి, నవ్వుతూ చేయి వూపింది ఆద్విక. అతిలోకసౌందర్యవతి తన భార్య అయినందుకు గర్వపడని రోజు లేదు నిషిత్‌కి. అతను కూడా నవ్వుతూ ‘బై’ చెప్పాడు. ‘లోపలికెళ్ళి తలుపేసుకో. సాయంత్రం నేను తిరిగొచ్చేవరకు తలుపు తీయకు’ అన్నాడు. ‘నన్నెవరైనా ఎత్తుకెళ్తారని భయమా?’ చిలిపిగా నవ్వుతూ అంది. ‘దొంగలెత్తుకుపోతారేమోనన్న భయంతో విలువైన వజ్రాల్ని భద్రంగా లాకర్లో పెట్టి దాచుకుంటాం కదా. నువ్వు నాకు వజ్రాలకన్నా విలువైనదానివి’ అన్నాడు. ఆద్విక సమ్మోహనంగా నవ్వింది." అందం, అణకువ ఉన్న ఆద్విలాంటి స్త్రీలని కిడ్నాప్ చేసి, సగం ధరకే అమ్మేస్తున్న ముఠాలున్న విషయం ఆద్వికి తెలిస్తే అలా నవ్వగలిగేది కాదేమో అనుకున్నాడు నిషిత్. ప్రస్తుతం నడుస్తున్న లాభసాటి వ్యాపారం అదే. అలా కొన్నవాళ్ళు, కొన్ని మార్పులు చేర్పులు చేసి, అందానికి మరిన్ని మెరుగులు దిద్ది తిరిగి ఎక్కువ ధరకు అమ్మేసుకుంటున్నారు. అతను వీధి మలుపు తిరిగేవరకు చూసి, లోపలికెళ్ళబోతూ ఎవరో తననే చూస్తున్నట్టు అనుమానం రావడంతో ఆగి.. అటువైపు చూసింది ఆద్విక. అనుమానం కాదు. నిజమే. ఎవరో ఒకతను తన వైపే చూస్తున్నాడు. ముప్పయ్యేళ్ళకు మించని వయసు, నవ్వుతున్నట్టు కన్పించే కళ్ళు, సన్నటి మీసకట్టు, అందంగా ట్రిమ్ చేసిన గడ్డం.. అతన్ని యింతకు ముందు ఎప్పుడైనా చూశానా అని ఆలోచించింది. ఎంత ఆలోచించినా తన జ్ఞాపకాల పొరల్లో అతని ఆనవాళ్ళేమీ కన్పించలేదు. మెల్లగా యింటిలోపలికి నడిచి, తలుపు మూయబోతూ మళ్ళా అతని వైపు చూసింది. అతను అక్కడే నిలబడి కళ్ళార్పకుండా తన వైపే చూస్తుండటంతో భయమేసి, ధడాల్న తలుపు మూసి, గడియ పెట్టింది. ఎవరతను? ఎందుకు తన వైపే చూస్తున్నాడు? తనను కాదేమో.. యింటివైపు చూస్తున్నాడేమో.. దొంగతనం చేసే ఉద్దేశంతో అవకాశం కోసం ఎదురుచూస్తున్నాడేమో.. అతని కళ్ళలో కన్పించిన దైన్యం ఆమెను గందరగోళానికి గురిచేస్తోంది. దొంగ కాదేమో.. ఏదైనా చిక్కు సమస్యలో ఉన్నాడేమో.. తనేమైనా పొరపడిందా? అది దైన్యం కాదేమో.. పదునైన కత్తితో గొంతు కోయగల క్రూరత్వాన్ని దాని వెనుక దాచుకుని ఉన్నాడేమో? మొదట నిషిత్‌కి ఫోన్ చేసి చెప్పాలనుకుంది. ఆఫీస్ బాధ్యతల్లో తలమునకలై ఉంటాడు కదా. ఎందుకతన్ని మరింత ఒత్తిడికి లోనుచేయడం? సాయంత్రం యింటికొచ్చాక చెప్తే చాలు కదా అనుకుంది. నిషిత్ యింటికి తిరిగొచ్చేలోపల చేయాల్సిన పనులన్నీ గుర్తొచ్చి వాటిని యాంత్రికంగా చేయసాగింది. ఈ లోపలే ఆ ఆగంతకుడు లోపలికొచ్చి, ఏమైనా చేస్తాడేమోనన్న భయం ఆమెను వీడటం లేదు. ఐనా తలుపులన్నీ వేసి ఉన్నాయిగా. ఎలా వస్తాడు? అనుకుంటున్నంతలో కాలింగ్ బెల్ మోగింది. ఆద్విక ఉలిక్కిపడి తలుపు వైపు చూసింది. ఈ సమయంలో ఎవరై ఉంటారు? ఒకవేళ అతనే నేమో అనుకోగానే ఆమె గుండె వేగంగా కొట్టుకోసాగింది. మరోసారి కాలింగ్ బెల్ మోగింది. ఆమె శిలలా కదలకుండా నిలబడింది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతోంది. మెల్లగా కదిలి, తలుపుని చేరుకుంది. గోడ పక్కనున్న ఓ స్విచ్ని నొక్కింది. పదహారంగుళాల స్క్రీన్ మీద ఆ వ్యక్తి మొహం కన్పించింది. అతనే.. తన భర్త ఆఫీస్కెళ్ళే సమయంలో తన వైపు అదోలా చూస్తూ నిలబడిన వ్యక్తి.. ఆడియో కూడా ఆన్ కావడంతో అతని మాటలు తనకు స్పష్టంగా విన్పిస్తున్నాయి. ‘భువీ.. నన్ను గుర్తుపట్టలేదా? నేను భువీ.. రియాన్ని. ఒక్కసారి తలుపు తీయవా? ప్లీజ్ భువీ.. నీకు చాలా విషయాలు చెప్పాలి’ అతని గొంతులో ఆవేదన.. కళ్ళల్లోంచి కారుతున్న కన్నీళ్ళు తను చెప్తున్నది నిజమే అంటూ సాక్ష్యం పలుకుతున్నాయి. కానీ తన పేరు భువి కాదుగా. అదే చెప్పింది. ‘మీరేదో పొరబడినట్టున్నారు. నాపేరు భువి కాదు. ఆద్విక.. మీరెవరో నాకు తెలియదు. మిమ్మల్ని నేనెప్పుడూ చూడలేదు. దయచేసి యిక్కణ్ణుంచి వెళ్ళిపోండి’ అంది. ‘అయ్యో భువీ.. నేను పొరబడలేదు. నా ప్రాణంలో ప్రాణమైన నిన్ను గుర్తుపట్టడంలో పొరబడ్తానా? లేదు. నువ్వు నా భార్యవి. నేను నీ రియాన్ని.’ ‘క్షమించాలి.. నా భర్త పేరు నిషిత్. మరొకరి భార్యని పట్టుకుని మీ భార్య అనడం సంస్కారం కాదు. తక్షణమే వెళ్ళిపొండి. లేకపోతే మీపైన సెక్యూరిటీ సెల్‌కి కంప్లెయింట్ చేయాల్సి వస్తుంది.’ ‘నన్ను నమ్ము భువీ. ఒక్కసారి తలుపు తెరువ్. నేను చెప్పేది నిజమని రుజువు చేసే సాక్ష్యాధారాలన్నీ నా దగ్గర ఉన్నాయి. ఒక్క పది నిమిషాలు చాలు. ప్లీజ్ తలుపు తెరువు’ అతను జాలిగొలిపేలా వేడుకుంటున్నాడు. ఆద్విలో దయాగుణం .. అతని వల్ల తనకేమీ ప్రమాదం ఉండదన్న నమ్మకం కలగడంతో తలుపు తెరిచి, ‘లోపలికి రండి. దయచేసి ఏడవకండి. ఎవరైనా ఏడుస్తుంటే చూసి తట్టుకునేంత కఠినత్వం నాలో లేదు’ అంది. అతను హాల్లో ఉన్న సోఫాలో కూచున్నాక, అతనికి గ్లాసునిండా చల్లని మంచినీళ్ళిచ్చింది. అతను గటగటా తాగి, గ్లాస్‌ని టీపాయ్ మీద పెట్టాక, అతని ఎదురుగా కూచుంటూ ‘ఇప్పుడు చెప్పండి. మీరేం చెప్పాలనుకుంటున్నారో’ అంది. ‘నా పేరు రియాన్. ఎనిమిదేళ్ళ క్రితం కాయ్ అనే కంపెనీలో నిన్ను చూసినపుడే ప్రేమలో పడ్డాను. లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారే. అప్పుడు నా వయసు ఇరవై రెండేళ్ళు. కాయ్ సంస్థ గురించి నీకు తెల్సుగా. సిఓవై కాయ్.. కంపానియన్ ఆఫ్ యువర్ చాయిస్ అనే సంస్థ’ అంటూ ఆమె సమాధానం కోసం ఆగాడు. ‘తెలుసు. మూడేళ్ళ క్రితం నన్ను నిషిత్ తెచ్చుకుంది అక్కడినుంచే’ అంది ఆద్విక. ‘నాకు మొదట కాయ్ని సందర్శించే ఆసక్తి లేదు. మంచి అమ్మాయిని చూసి పెళ్ళి చేసుకుని, ఒకర్నో యిద్దర్నో పిల్లల్ని కని.. ఇలాంటి మామూలు కోరికలే ఉండేవి. విడాకులు తీసుకున్న మగవాళ్ళ కోసం, భార్య చనిపోయాక ఒంటరి జీవితం గడుపుతున్న వాళ్ళకోసం అత్యంత అందమైన ఆడ ఆండ్రాయిడ్లను తయారుచేసి, అమ్మకానికి పెడ్తున్నారని విన్నప్పుడు, ఎంత అందమైన ఆడవాళ్ళని తయారుచేస్తున్నారో వెళ్ళి చూడాలనుకున్నాను. కొనాలన్న ఉద్దేశం లేదు. ఎనిమిదేళ్ళ క్రితం ఒక్కో ఆండ్రాయిడ్ ధర యాభైలక్షల పైనే ఉండింది. మనక్కావల్సిన ఫీచర్స్‌ని బట్టి కోటి రూపాయల ధర పలికే ఆండ్రాయిడ్స్ కూడా ఉండేవి. అంతడబ్బు పెట్టి కొనుక్కోవాల్సిన అవసరం నాకేమీ లేదు. కానీ అక్కడ డిస్ప్లేలో పెట్టిన పాతిక్కి పైగా ఉన్న ఆడవాళ్ళలో నిన్ను చూశాక, చూపు తిప్పుకోలేక పోయాను. చెప్పాగా ప్రేమలో పడ్డానని! అందుకే ఎనభై లక్షలు చెల్లించి నిన్ను నా సొంతం చేసుకున్నాను. మన ఐదేళ్ళ కాపురంలో ఎన్ని సుఖాలో.. ఎన్ని సంతోషాలో.. నీ సాన్నిధ్యంలో మనిల్లే ఓ స్వర్గంలా మారిపోయింది.’ ‘ఐదేళ్ళ కాపురమా? నాకేమీ గుర్తులేదే.. అలా ఎలా మర్చిపోతాను? నా జీవితంలో జరిగిన ఏ ఒక్క క్షణాన్ని కూడా మర్చిపోలేదు. నా మెమొరీ చాలా షార్ప్. మీరు చెప్పేది కట్టు కథలా ఉంది’ అంది ఆద్విక. ‘నేను చెప్పేది నిజం భువీ.’ ‘నా పేరు భువి కాదని చెప్పానా.. అలా పిలవొద్దు. ఆద్విక అనే పిలవండి.’ ‘సరే ఆద్వికా. అసలు జరిగిందేమిటో తెలుసా? నీ మెమొరీని పూర్తిగా ఎరేజ్ చేసి, మళ్ళా నిన్ను ఫ్రెష్‌గా మొదటిసారి అమ్ముతున్నట్టు ఇప్పుడున్న నీ భర్తకు అమ్మారు. అందుకే నాతో గడిపిన రోజులు నీకు గుర్తుకు రావడం లేదు.’ ‘నా మెమొరీని ఎరేజ్ చేశారా? ఎవరు? ఎందుకు?’ ‘ఆండ్రాయిడ్లను దొంగిలించే ముఠాల గురించి వినలేదా? ప్రస్తుతం అన్నిటికంటే లాభసాటి వ్యాపారం ఆడ ఆండ్రాయిడ్లని అమ్మడమే. ఒక్కో ఆండ్రాయిడ్ ధర కోటిన్నర వరకు పలుకుతోంది. ఆల్రెడీ అమ్ముడుపోయిన ఆండ్రాయిడ్లని దొంగలు ఎత్తుకెళ్ళి తక్కువ ధరకు కంపెనీకే అమ్మేస్తారు. కంపెనీ వాళ్ళు అందులో మరికొన్ని మార్పులు చేర్పులు చేసి, మెమొరీ మొత్తాన్ని తుడిచేసి, కొత్త ఆండ్రాయిడ్ అని కస్టమర్లను నమ్మించి కోటిన్నరకు అమ్ముకుంటారు.’ ‘అంటే నాలో కూడా మార్పులు చేసి అమ్మి ఉండాలి కదా. అలాగైతే మీరెలా గుర్తుపట్టారు?’ అంది ఆద్విక. ‘నిన్ను గుర్తుపట్టకుండా చాలా మార్పులే చేశారు. జుట్టు రంగు మార్చారు. ముక్కు, పెదవులు, చెంపల్లో కూడా మార్పులు చేశారు. కానీ నీ కళ్ళను మాత్రం మార్చలేదు. అదే నా అదృష్టం. వాటిని చూసే నువ్వు నా భువివే అని గుర్తుపట్టాను. ఆ కళ్ళు చూసేగా భువీ నేను ప్రేమలో పడింది.. ప్రేమగా, ఆరాధనగా చూసే కళ్ళు..’ ‘ఇవేమీ నమ్మశక్యంగా లేవు.’ ‘నా దగ్గర రుజువులున్నాయని చెప్పాగా. మనిద్దరం కలిసి ఉన్న ఈ ఫోటోలు, వీడియోలు చూడు’ అంటూ చూపించాడు. వాటిల్లో తనలానే నాజూగ్గా, తనెంత పొడవుందో అంతే పొడవుగా ఉన్న అమ్మాయి కన్పించింది. అతను చెప్పినట్టు కళ్ళు అచ్చం తన కళ్ళలానే ఉన్నాయి. కానీ మొహంలోని మిగతా అవయవాలు వేరుగా ఉన్నాయి. తన వైపు అనుమానంగా చూస్తున్న ఆద్వికతో ‘యిది నువ్వే భువీ..’ అన్నాడు రియాన్. ‘మీరు చూపించిన ఫొటోల్లోని అమ్మాయి నేను కాదు. కళ్ళు ఒకేలా ఉన్నంతమాత్రాన అది నేనే అని ఎలా నమ్మమంటారు? యిప్పుడున్న టెక్నాలజీతో ఎన్నిరకాల మాయలైనా సాధ్యమే. యిక మీరు వెళ్ళొచ్చు’ అంది లేచి నిలబడుతూ. ‘నువ్వు నా భువివే అని నిరూపించడానికి మరో మార్గం ఉంది. నీ మెమొరీని ఎరేజ్ చేసినా అది పూర్తిగా అదృశ్యమైపోదు. లోపలెక్కడో నిక్షిప్తమై డార్మెంట్‌గా ఉంటుంది. దాన్ని రిట్రీవ్ చేయవచ్చు. ప్లీజ్ నాకో అవకాశం యివ్వు. రేపు మళ్ళా వస్తాను. నాతో బైటికి రా. నీ పాత జ్ఞాపకాల్ని బైటికి తోడగల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్స ఎక్స్పర్ట్ దగ్గరకు పిల్చుకెళ్తాను. జస్ట్ వన్ అవర్. ప్లీజ్ నాకోసం.. కాదు కాదు. మనకోసం..’ ‘మీరు మొదట బైటికెళ్ళండి’ కోపంగా అంది. ‘నిజమేమిటో తెల్సుకోవాలని లేదా నీకు? ప్రశాంతంగా ఆలోచించు. ఒక్క గంట చాలు. రేపు మళ్ళా వస్తాను’ అంటూ అతను వేగంగా బైటికెళ్ళిపోయాడు. ∙∙ రాత్రి పన్నెండు దాటినా నిషిత్‌కి నిద్ర పట్టడం లేదు. రియాన్ అనే వ్యక్తి చెప్పిన విషయాలన్నీ ఆద్విక నోటి ద్వారా విన్నప్పటి నుంచి అతనికి మనశ్శాంతి కరువైంది. రియాన్ చెప్పేది నిజమేనా? ఆద్వికను తను కొనుక్కోక ముందు రియాన్ తో ఐదు సంవత్సరాలు కాపురం చేసిందా? ఆ మెమొరీని ఎరేజ్ చేసి, తనకు అమ్మారా? ఎంత మోసం.. ఇలా ఫస్ట్ సేల్ అని చెప్పి తనలాంటివాళ్ళని ఎంతమందిని మోసం చేసి, పాత ఆండ్రాయిడ్లని అంటగడ్తున్నారో! కాయ్ కంపెనీ అమ్మే ఆండ్రాయిడ్లన్నీ ఇరవై యేళ్ళ వయసులోనే ఉంటాయి. దశాబ్దాలు జరిగిపోయినా వాటి వయసు మారదు. ఇరవై యేళ్ళే ఉంటుంది. అతనికి ఆద్వికను కొనడం కోసం కాయ్ కంపెనీకి వెళ్ళిన రోజు గుర్తొచ్చింది. అసలెప్పుడైనా మర్చిపోతే కదా.. తన జీవితాన్ని అందమైన మలుపు తిప్పిన రోజది. ఎంత తీయటి జ్ఞాపకమో.. అతనికి పాతికేళ్ళ వయసులో జోషికతో పెళ్ళయింది. యిద్దరూ ఒకే ఆఫీస్‌లో పనిచేసేవారు. పెళ్ళయిన ఏడాదివరకు హాయిగా గడిచింది. ఆ తర్వాతే సమస్యలు మొదలయ్యాయి. రోజూ ఏదో ఒక విషయం గురించి పోట్లాట.. ఎంత ఓపికతో భరించాడో.. అందమైన పూలవనాల్లో విహరిస్తూ శ్రావ్యమైన పాటల్ని వింటున్నంత తీయగా తన సంసారం కూడా సాగిపోవాలని కదా కోరుకున్నాడు .. ఆ కోరిక తీరనే లేదు. ఎన్నేళ్ళయినా జోషికలో మార్పు రాలేదు. పోనుపోను మరింత మొండిగా, మూర్ఖంగా తయారైంది. యిద్దరు పిల్లలు పుట్టారు. ఆమె కోపాన్ని తట్టుకోవడం కష్టమైపోయింది. విడిపోవాలని ఎంత బలంగా అన్పించినా పిల్లల భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని ఆ కోరికను వాయిదా వేశాడు. పిల్లలు పెద్దవాళ్ళయి, వాళ్ళ పెళ్ళిళ్ళు కూడా అయి జీవితంలో స్థిరపడ్డాక, తన భార్యతో విడాకులు తీసుకున్నాడు. అప్పుడతని వయసు నలభై ఎనిమిదేళ్ళు. తర్వాత రెండేళ్ళ వరకు ఒంటరి జీవితమే గడిపాడు. మళ్ళీ పెళ్ళి చేసుకోవాలని అన్పించలేదు. ఆ వచ్చే స్త్రీ కూడా జోషికలా కయ్యానికి కాలుదువ్వే రకమైతే.. నో.. అన్నింటికన్నా మనశ్శాంతి ముఖ్యం కదా. అది లేని జీవితం నరకం. ఆ రెండేళ్ళు యింటిపని, వంటపని యిబ్బంది అన్పించలేదు. ప్రతి పనికీ రకరకాల గాడ్జెట్స్ అందుబాటులో ఉన్నాయి. ఏం కూర కావాలో గాడ్జెట్‌లో ఫీడ్ చేస్తే చాలు. కూరలు కడిగి, తరిగి, నూనెతో పాటు కారం, ఉప్పులాంటి అవసరమైన దినుసులూ వేసి, వండి హాట్ బాక్స్‌లో పెట్టేస్తుంది. కాని యిబ్బందల్లా ఎవరూ తోడు లేకపోవడం. మనసులోని భావాలు పంచుకోడానికి ఓ మనిషి కావాలి కదా. అప్పుడే అతనికి కాయ్ కంపెనీ గుర్తొచ్చింది. అప్పటికే కాయ్ కంపెనీ చాలా ప్రాచుర్యం పొందింది. కోటి కోటిన్నర పెట్టగల తాహతున్న ఒంటరి మగవాళ్ళందరూ ఎన్నేళ్ళయినా వన్నె తరగని, వయసు పెరగని ఇరవై యేళ్ళ అందమైన ఆండ్రాయిడ్లను కొనుక్కోడానికి ఎగబడసాగారు. దానికి ఆ కంపెనీ వాళ్ళిచ్చిన రసవత్తరమైన, ఆకర్షణీయమైన వ్యాపార ప్రకటనలు మరింత దోహదం చేశాయి. ‘గొడవలూ కొట్లాటలూ లేని ప్రశాంతమైన, సంతోషకరమైన జీవితం కావాలనుకుంటున్నారా? మా దగ్గరకు రండి. అందమైన, అణకువ గల ఇరవై యేళ్ళ ఆండ్రాయిడ్లని వరించే అదృష్టం మీ సొంతమవుతుంది. భార్యగా కావాలా? సహజీవనం చేస్తారా? మనసుకి ఆహ్లాదాన్ని అందించే ప్రియురాలు కావాలా? తీయటి కబుర్లు కలబోసుకునే స్నేహితురాలు కావాలా లేదా ఆల్ ఇన్ వన్ నెరజాణ కావాలా? మీరెలా కోరుకుంటే అలాంటి అప్సరసల్లాంటి ఆండ్రాయిడ్లని అందించే బాధ్యత మాది. రిపేరింగ్, సర్వీసింగ్ అవసరం లేని, మెయింటెనెన్ ్సకి రూపాయి కూడా ఖర్చు లేని ఆండ్రాయిడ్లు.. ఇరవై యేళ్ళ అమ్మాయి చేయగల అన్ని పనులను ఎటువంటి లోటూ లేకుండా చేస్తుందని హామీ ఇస్తున్నాం. మీ సుఖసంతోషాలే మాకు ముఖ్యం.. మీ మనశ్శాంతే మా లక్ష్యం’ అంటూ సాగాయి ఆ ప్రకటనలు. అతనిక్కావల్సింది కూడా అదే. భార్యగా అన్ని విధుల్ని నిర్వర్తిస్తూ, మనశ్శాంతిని పాడు చేయని స్త్రీ. ఓ రోజు ఆఫీస్‌కి వెళ్ళకుండా నేరుగా కాయ్ కంపెనీకి వెళ్ళాడు. కళ్ళు జిగేల్మనిపించేలా అధునాతనంగా అలంకరించిన పదంతస్తుల భవనం.. యం.డి అతన్ని సాదరంగా ఆహ్వానించాడు. ‘మొదట మీకెలాంటి అమ్మాయి కావాలనుకుంటున్నారో చెప్పండి. అటువంటి లక్షణాలున్న ఆండ్రాయిడ్లనే చూపిస్తాం. వాళ్ళలోంచి మీక్కావల్సిన అమ్మాయిని సెలక్ట్ చేసుకోవచ్చు. ఆ అమ్మాయిలో కూడా మీరు ప్రత్యేకంగా ఏమైనా మార్పులు కోరుకుంటే, వారం రోజుల్లో అటువంటి మార్పులు చేసి, మీకు అందచేస్తాం’ అన్నాడు. ‘నాదో సందేహం. నేను మొత్తం ఎమౌంట్ కట్టేసి, అమ్మాయిని యింటికి పిల్చుకెళ్ళాక, ఏదో ఓ సందర్భంలో నాతో గొడవపడితే ఏం చేయాలి? నాకు గొడవలు అస్సలు ఇష్టం ఉండదు’ అన్నాడు నిషిత్. అదేదో జోక్ ఆఫ్ ది ఇయర్ ఐనట్టు యం.డి పెద్దగా నవ్వాడు. ‘దానికి అవకాశమే లేదు. వీటిలో పాజిటివ్ భావోద్వేగాలు మాత్రమే ఉంటాయి. నెగటివ్ భావోద్వేగాలు ఒక్కటి కూడా లేకుండా డిజైన్ చేశాం. కోపం, చిరాకు, విసుగు, అలగడం, ఎదురుచెప్పటం, పోట్లాడటం, మాటల్లో షార్ప్‌నెస్.. ఇవేవీ మీకు కన్పించవు. రెండు వందల యేళ్ళ క్రితం మన భారతదేశంలో భార్యలు ఎలా ఉండేవారో మీరు పుస్తకాల్లో చదివే ఉంటారుగా. మేము మార్కెట్ చేస్తున్న అమ్మాయిలు అచ్చం అలానే ఉంటారు. భర్త అదుపాజ్ఞల్లో ఉంటూ, అణకువతో మసలుతూ, దాసిలా సేవలు చేస్తూ, రంభలా పడగ్గదిలో సుఖాలు అందిస్తూ.. యిక అందంలో ఐతే అప్సరసల్తో పోటీ పడ్తారు. అందుకే మా ఆండ్రాయిడ్లకు ‘లెఫి బొ’ అని పేరు పెట్టాం. ఫ్రెంచ్‌లో లెఫి బొ అంటే అత్యంత అందమైన స్త్రీ అని అర్థం. ఇంటర్నేషనల్‌గా డిమాండ్ ఉన్న ప్రాడక్ట్ మాది. మీరు రిగ్రెట్ అయ్యే చాన్సే లేదు. మీ జీవితం ఒక్కసారిగా రాగరంజితమైపోతుంది. మగవాళ్ళకు ఏం కావాలో సాటి మగవాడిగా నాకు తెలుసు. నేను ఎలాంటి కంపానియన్ ఉంటే జీవితం హాయిగా సాగిపోతుందని కలలు కన్నానో, అటువంటి లక్షణాలతోనే ఆండ్రాయిడ్లను తయారుచేయించాను’ చెప్పాడు. ‘ఖరీదు ఎంతలో ఉంటుంది?’ ‘మీరు మొదట పై అంతస్తుల్లో ఉన్న మా మోడల్స్‌ని చూశాక, ఎవరు నచ్చారో చెప్పండి. అదనంగా ఏమైనా మాడిఫికేషన్ ్స కావాలంటే చేసిస్తాం. దాన్ని బట్టి ధరెంతో చెప్తాను’ అన్నాడు. అతనికి ఆద్విక బాగా నచ్చింది. ముఖ్యంగా ఆమె కళ్ళు.. ‘గుడ్ చాయిస్ సర్. నిన్ననే ఫ్యాక్టరీ నుంచి వచ్చిన పీస్’ అంటూ దాని ధరెంతో చెప్పాడు. అతనడిగినంత ధర చెల్లించి, ఆద్వికను యింటికి తెచ్చుకున్నాడు. ఆద్విక యింటికొచ్చిన క్షణం నుంచి తన జీవితమే మారిపోయింది. అన్నీ సుఖాలే.. కష్టాలు లేవు. అన్నీ సంతోషాలే.. దుఃఖాలు లేవు. అశాంతులు లేవు. కానీ ఇప్పుడీ ఉపద్రవం ఏమిటి? ఎవరో వచ్చి తన భార్యను అతని భార్య అని చెప్పడం ఏమిటి? అతని మనసునిండా అలజడి.. ఆందోళన.. అశాంతి. కాయ్ ఆఫీస్‌కి వెళ్ళి వాళ్ళను నిలదీయాలనుకున్నాడు. కానీ దానివల్ల ప్రయోజనమేమీ ఉండదనిపించింది. మీకు అమ్మిన ఆండ్రాయిడ్ ఓ రోజుముందే తయారై వచ్చిన ఫ్రెష్ పీస్ అంటారు. వాళ్ళు చెప్పేది అబద్ధమని రుజువు చేసే ఆధారాలేమీ తన దగ్గర లేవు. అతనికి ఆలోచనల్తో నిద్ర పట్టలేదు. మరునాడు ఉదయం నిషిత్ ఆఫీస్కెళ్ళిన పది నిమిషాల తర్వాత రియాన్ లోపలికి వచ్చాడు. రాత్రంతా ఆలోచించాక, నిజమేమిటో తెల్సుకోవాలనే నిర్ణయానికి వచ్చి ఉండటంతో, ఆద్విక ఇంటికి తాళం వేసి, అతన్తోపాటు బయల్దేరింది. కొంతసేపు ప్రయాణించాక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్ ్సలో నిష్ణాతుడైన ప్రొఫెసర్ గారి ప్రయోగశాలను చేరుకున్నారు. రియాన్ అతనికి ముందే జరిగిందంతా వివరంగా చెప్పి ఉండటంతో, ఆద్విక తలలో అమర్చి ఉన్న చిప్‌ని బైటికి తీసి, ఎరేజ్ చేయబడిన మెమొరీని రిట్రీవ్ చేసి, మళ్ళా చిప్‌ని లోపల అమర్చాడు. ఆద్విక కళ్ళు తెరిచి తన ఎదురుగా నిలబడి ఉన్న రియాన్ వైపు చూసింది. రియాన్.. తన భర్త.. ఐదేళ్ళు అతన్తో గడిపిన జ్ఞాపకాలన్నీ ఒకటొకటిగా గుర్తుకు రాసాగాయి. ఆమెకో విషయం అర్థమైంది. తను మొదట రియాన్ భార్యగా ఐదేళ్ళు గడిపాక, ఇప్పుడు మూడేళ్ళ నుంచి నిషిత్‌కి భార్యగా కొనసాగుతోంది. ‘భువీ.. నేను చెప్పింది నిజమని యిప్పటికైనా నమ్ముతావా? నువ్వు నా భార్యవి. నిన్ను అమితంగా ప్రేమించాను భువీ. నువ్వోరోజు అకస్మాత్తుగా మాయమైపోతే పిచ్చిపట్టినట్టు నీకోసం ఎన్ని వూళ్ళు తిరిగానో.. చివరికి నా శ్రమ ఫలించింది. నిన్ను కల్సుకోగలిగాను. మనిద్దరం ఎక్కడికైనా దూరంగా వెళ్ళి బతుకుదాం భువీ. నాతో వచ్చేయి. నువ్వు లేకుండా బతకలేను భువీ’ అన్నాడు రియాన్. ఈ విషయంలో తొందరపడి నిర్ణయం తీసుకోకూడదు అనుకుంది ఆద్విక. ‘ఆలోచించుకోడానికి నాక్కొంత సమయం ఇవ్వండి’ అంది. ‘యిందులో ఆలోచించడానికి ఏముంది భువీ. నువ్వు నా భార్యవి. మనిద్దరం ఐదు సంవత్సరాలు కలిసి బతికాం. అక్రమంగా డబ్బులు సంపాదించే ముఠా నిన్ను ఎత్తుకెళ్ళి కంపెనీకి అమ్మేసింది. కంపెనీ నుంచి నిన్ను నిషిత్ కొనుక్కున్నాడు. యిందులో పూర్తిగా నష్టపోయింది నేను. అన్యాయం జరిగింది నాకు. నువ్వు తిరిగి నా దగ్గరకు రావడానికి యింకా సంశయం దేనికి?’ అన్నాడు రియాన్. ‘నేను ప్రస్తుతం నిషిత్ భార్యని. అతన్ని వదిలేసి ఉన్నపళంగా మీతో వచ్చేస్తే అతనికి అన్యాయం చేసినట్టు కాదా? నన్ను ఆలోచించుకోనివ్వండి’ అంది ఆద్విక. మరునాడు రియాన్ రావడంతోటే ‘అన్నీ సర్దుకున్నావా? నాతో వస్తున్నావు కదా’ అన్నాడు. ‘సారీ.. నేను నా భర్త నిషిత్ని వదిలి రాను’ అంది ఆద్విక. ‘నీకో విషయం అర్థం కావడం లేదు. నిషిత్‌కి నువ్వు కేవలం తన అవసరాలు తీర్చే ఓ వస్తువ్వి. అంతకన్నా అతను నీకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడు. కానీ నాకు మాత్రం నువ్వు నా ప్రాణానివి. నా ఆరాధ్య దేవతవి. నా ప్రేమ సామ్రాజ్ఞివి. మన ప్రేమను తిరిగి బతికించుకోడానికి నువ్వతన్ని వదిలి రాక తప్పదు భువీ’ అన్నాడు. ఆద్విక మెత్తగా నవ్వింది. ‘మీరో విషయం మర్చిపోతున్నారు. నేను మనిషిని కాదు, ఆండ్రాయిడ్‌ని. అబద్ధాలు చెప్పడం, మోసం చేయడం, కుట్రలు పన్నడం, అన్యాయాలు చేయడం మాకు చేతకాదు. మీ మనుషుల్లో ఉండే అవలక్షణాలేవీ మా సిస్టంలో లోడ్ అయి లేవు. యిక ప్రేమంటారా? కాయ్ కంపెనీతో నిషిత్‌కి కుదిరిన ఒప్పందం ప్రకారం నేను అతని అవసరాల్ని తీర్చాలి. అతన్నే ప్రేమించాలి. కాంట్రాక్ట్‌ని ఉల్లంఘించడం మా ఆండ్రాయిడ్ల నిఘంటువులో లేదు.’ ‘భువీ.. నేను నిన్ను ప్రేమించాను.’ ‘మీతో కాపురం చేసిన ఐదేళ్ళు నేను కూడా మిమ్మల్ని ప్రేమించి ఉంటాను.’ ‘అప్పుడు మీ కంపెనీ నాతో కుదుర్చుకున్న ఒప్పందం మాటేమిటి?’ ‘మీ వద్దనుంచి నన్నెవరో కిడ్నాప్ చేశారు. అందులో నా ప్రమేయం లేదు. అది నా తప్పు కాదు. కంపెనీ నా మెమొరీని ఎరేజ్ చేసి మరొకరికి అమ్మడంలో కూడా నా ప్రమేయం లేదు. అది కంపెనీ చేసిన తప్పు. ఇప్పుడు నేను నిషిత్ని వదిలి మీతో వస్తే అది తప్పకుండా నేను చేసిన తప్పవుతుంది. మనుషులు తప్పులు చేస్తారు. నేను మనిషిని కాదు ఆండ్రాయిడ్‌ని’ ఆద్విక లేచి, తలుపు తీసి, ‘యిక వెళ్ళండి’ అనేలా అతని వైపు చూసింది.+ – సలీం. ఇవి చదవండి: Womens Day: 'జనతనయ బస్తర్..' చరిత్ర ఒక భద్రత.. భరోసా..! -
World Marriage Day: మనసే జతగా.. మమతే లతగా..
పెళ్లి, లగ్గం, వివాహం, కల్యాణం.. పేరేదైనా ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యే ఆడ, మగ కుటుంబ వ్యవస్థకు పునాదులవుతారు. మూడు ముళ్ల బంధంలో ఒదిగి ముచ్చటగా కాపు రం చేసి సమాజంలో ఓ భాగమవుతారు. బాధ్యతలను గుర్తుచేసి కుటుంబంలో తమ పాత్ర ఏమిటో తెలియజేసే వివాహ వ్యవస్థకు మన సమాజంలో ఎంతో ప్రాధాన్యం ఉంది. మూడుముళ్ల బంధంతో ఒక్కటై బాధ్యతలు, బాంధవ్యాలు, కర్తవ్యాలను మనకు జ్ఞప్తికి తెచ్చే వివాహం ప్రతిఒక్కరి జీవితంలో కీలకమైన ఘట్టమే. స్త్రీ, పురుషులు ఒకరి తలపై ఒకరు జీలకర్ర బెల్లం పెట్టి, 'మాంగల్యం తంతునానేనా' అనే పురోహితుడి మంత్రోచ్ఛరణతో ఒక్కటయ్యే గొప్పదైన మన భారతీయ వివాహ వ్యవస్థ ప్రపంచ దేశాలకు ఆదర్శంగా నిలిచింది. వివాహం భార్య, భర్తలను విడదీయలేని బంధంగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని జీవనం సాగిస్తే వందేళ్ల జీవితాన్ని సుఖసంతోషాలతో గడిపేయొచ్చు. మనస్పర్థలు, కోపతాపాలు, అనుమానాలు రేకెత్తకుండా చూసుకోవాలి. కోపతామాలతో నేనే గొప్ప అంటే నేనే గొప్ప అనే అహంకారం, చిన్న చిన్న కారణాలతో కాళ్లాపారణి ఆరకముందే విడాకులు తీసుకుంటున్న ఘటనలు నేటి సమాజంలో చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి పరిణామాలు లేని స్వచ్ఛమైన ఆదర్శ దాంపత్యం సాగిపోవాలంటే ఒకరినొకరు అర్థం చేసుకుని ప్రేమానురాగాలు పెంపొందించుకోవాలి. ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో జంటలు ఆదర్శనీయ జీవనం గడుపుతూ నేటి యువతకు స్ఫూర్తిదాతలుగా నిలుస్తున్నారు. ఇవి చదవండి: 'మిలియనీర్లుగా బిచ్చగాళ్లు'..జస్ట్ 45 రోజుల్లో ఏకంగా రూ. 2.5 లక్షలు..! -
'రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో..' కథ కాదు నిజం..
‘జీవితం విలువైన బహుమతి, ఒక్కసారి మీ కుటుంబం గురించి ఆలోచించండి. దయచేసి ఒంటరిగా ఇక్కడ తిరగొద్దు.. వెంటనే క్షేమంగా తిరిగి వెళ్లిపోండి’ ఇవి ఔకీగహారా సమీపంలో కనిపించే ప్రమాద హెచ్చరికలు. ‘పో.. దూరంగా పో.. తిరిగి వెళ్లిపో.. బతుకు..’ అంటూ గమనిక బోర్డులనిండా రాతలు. అవి స్పష్టంగా కనిపిస్తున్నా.. అడవి మాత్రం ‘రా.. ఇటువైపు రా.. ఇక్కడే, ఈ క్షణమే చచ్చిపో’ అని పిలుస్తుందట. టోక్యోకు పశ్చిమంగా దాదాపు 100 కిలోమీటర్ల దూరంలో.. ఫుజి అనే ఎత్తైన పర్వతానికి ఆనుకుని.. ఔకీగహారా అనే ఫారెస్ట్ ఉంది. అక్కడ ప్రతి మొక్కలో, ప్రతి మలుపులో విషమ గీతమే వినిపిస్తుంది. ఏదో తెలియని క్రూరత్వం రారమ్మంటూ వల విసురుతున్నట్లుగా ఉంటుంది. ‘అవన్నీ ఆత్మహత్యలకు ఆహ్వానాలే’ అంటుంటారు చాలామంది. ఈ అడవి భూమ్మీద అత్యంత భయంకరమైన ప్రదేశాల్లో ఒకటి. ప్రపంచంలోనే ఆత్మహత్యల రేటులో ఈ అడవిది రెండో స్థానం. ఏటా ఇక్కడి నుంచి సుమారు వందకు పైగా మృతదేహాలను వెలికితీస్తుంటారు. ఇది ఇంత ప్రమాదకరమైన ప్రదేశమని తెలిసి కూడా కొందరు .. ఇక్కడికే హైకింగ్‌కి వస్తుంటారు. పురాణ కథనం పురాణాల ప్రకారం.. కొన్నేళ్ల క్రితం కొంతమంది పేదలు ఇక్కడ ఆకలితో మరణించి ఆత్మలుగా మారారని ఒక కథనం. ఆ ఆత్మలు కొత్త ఆత్మల కోసం వెదుకుతూ ఉంటాయని.. అందుకే అవి అడవి సమీపానికి వచ్చిన మనుషుల్ని ఆత్మహత్యలకు ప్రేరేపిస్తుంటాయని చాలామంది నమ్ముతారు. అయితే ఈ అడవిలో చనిపోయిన శవాలు కదులుతాయని.. భీకరంగా కేకలు వేస్తుంటాయని స్థానికులు చెబుతుంటారు. మరో కథనం ప్రకారం.. పూర్వం స్థోమత లేని కుటుంబాల్లోని వృద్ధులు లేదా అనారోగ్యంతో బాధపడే బంధువులను ఈ అడవికి తీసుకొచ్చి వదిలేసేవారని.. వారంతా అక్కడే ఆకలితో చనిపోయేవారని.. వారి ఆత్మఘోషే ఈ విషాదానికి కారణమని మరో కథనం. 'సీచో మాట్సిమోటో' అనే రచయిత.. 1961లో రచించిన ‘ది టవర్ ఆఫ్ వేవ్స్’ అనే నవల వల్ల.. ‘ఔకీగహారా’ అడవి విశేషాలు బాగా పాపులర్ అయ్యాయని కొందరి అభిప్రాయం. అప్పటి నుంచే ఈ అడవి మిస్టరీని కథాంశంగా తీసుకుని.. అనేక చిత్రాలు, కథనాలు పుట్టుకొచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. శాస్త్రవేత్తల మాట్లలో.. కొందరు శాస్త్రవేత్తలు మాత్రం.. ‘ఇక్కడి ఇనుప నిక్షేపాల కారణంగా అవి దిక్సూచిగా మారి దారి తప్పించడంతో అడవిలోనే చనిపోతున్నారు. అందుకే ఈ అడవిలోకి వెళ్లాలి అనుకునే హైకర్స్.. టేప్ లేదా స్ట్రింగ్‌ని ఉపయోగించడం మంచిది’ అని సూచిస్తున్నారు. అడవి ప్రాంతం విస్తారంగా, దట్టంగా ఉండటంతో.. ఇక్కడ అడుగుపెట్టిన చాలామంది శవాలు కూడా దొరకట్లేదు. మిస్ అయిన వాళ్లని కనిపెట్టడంలో రెస్క్యూ టీమ్ కూడా ఫెయిల్ అవుతూ వచ్చింది. దాంతో ఆత్మహత్యలను, మిస్సింగ్లను నివారించడానికి.. అటవీ ద్వారాల ముందు భద్రతా కెమెరాలతో పాటు.. సెక్యూరిటీనీ పెంచారు. నిర్మానుష్యమైన ఈ అడవిలో.. నిర్ఘాంత పోయే దృశ్యాలు భయపెడుతూ ఉంటాయి. చెల్లాచెదురుగా పడి ఉన్న షూలు, బట్టలు, టోపీలతో పాటు భీతికలిగించే బొమ్మలు కూడా ఉంటాయి. అవన్నీ చెట్టు కొమ్మలతో తాళ్లు మెలిపెట్టి బొమ్మల్లా అల్లినట్లు ఉంటాయి. చూడటానికి రాక్షసుల్లా కనిపిస్తూ ఉంటాయి. అయితే వాటిని ఎవరు అలా పెట్టారో ఎవరికీ తెలియదు. మనిషి పుర్రెలు, ఎముకలు అక్కడక్కాడా అగుపిస్తూ హడలెత్తిస్తుంటాయి. చనిపోయిన వారి శవాలు కూడా దిష్టిబొమ్మల్లా.. ఊడలమర్రిపై దయ్యాల్లా వేలాడుతూ భయపెడుతూ ఉంటాయి. ఏదిఏమైనా ఈ అడవి.. మనుషుల్ని ఆత్మహత్యలకు ఎలా ప్రేరేపిస్తోంది? అక్కడ తాళ్లతో రాక్షసుల రూపాలను ఎవరు తయారు చేశారు? వంటివన్నీ మిస్టరీలుగానే మిగిలిపోయాయి. - సంహిత నిమ్మన -
బ్లాక్ అండ్ వైట్ టూ కలర్ సినిమా.. దాని ప్రత్యేకతే వేరు!
మనసు కాస్త మందగించగానే.. ఏదైనా కామెడీ బిట్ పెట్టుకుని.. ఆస్వాదిస్తుంటాం. ఎల్లవేళలా అస్వాదాన్ని కలిగించే వినోదంలో సినిమా ప్రముఖపాత్ర పోషిస్తూ వస్తోంది. నిజానికి నటించడం ఓ ఎత్తు.. నవ్వించడం మరో ఎత్తు. ఎవరైనా నటించగలరేమో కానీ.. ఎవరు పడితే వాళ్లు నవ్వించలేరు. నవ్వనేది నాటికీ నేటికీ సినిమాల్లో ఒక భోగమే. పప్పులో ఉప్పులేకపోతే కూర ఎంత చప్పగా ఉంటుందో.. సినిమాలో కామెడీ లేకపోయినా అంతే చప్పగా సాగుతుంది. ఎన్ని యాక్షన్ సీక్వెన్సులున్నా.. గుండెల్ని బరువెక్కించే ఎమోషనల్ సీన్లున్నా.. వినసొంపైన పాటలున్నా.. కథలో కామెడీ లేకపోతే ఏదో లోటుగానే అనిపిస్తుంటుంది. ఎంత పెద్ద సినిమా అయినా వినోదం లేకపోతే పెదవి విరుపులు ఎక్కువగా కనిపిస్తుంటాయి. హాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్.. ఇలా ఏ వుడ్ తీసుకున్నా కామెడీ ట్రాక్ లేకుండా సినిమాలు నడవవు. తెలుగు చిత్ర సీమ నవ్వుల వనంలో వికసించిన హాస్య పద్మాలెన్నో.. ఎన్నెన్నో. బ్లాక్ అండ్ వైట్ కాలంలో రేలంగి, రాజబాబు, రమణారెడ్డి, అల్లు రామలింగయ్య, పద్మనాభం వీళ్లంతా నవ్వుకి నాట్యం నేర్పిన వారే. ఆ తరువాత కాలంలో.. బ్రహ్మానందం, బాబు మోహన్, కోటా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, ఏవిఎస్, అలీ, సుత్తివేలు, ఆహుతి ప్రసాద్, కొండవలస, గుండు హనుమంత రావు, సునీల్, వేణుమాధవ్, ఎంఎస్ నారాయణ, జయప్రకాష్ రెడ్డి, కృష్ణ భగవాన్, వెన్నెల కిషోర్, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ ఇలా చాలామంది నవ్వుల రారాజులున్నారు. మరి నవ్వుల రాణులు లేరా అంటే.. నవ్వుల సామ్రాజ్యానికి మహారాణిగా నిలిచింది సూర్యకాంతం. ఆ తరువాత.. శ్రీలక్ష్మి, రమాప్రభ, తెలంగాణ శకుంతల, కోవై∙సరళ ఇలా చాలామందే ఆ వారసత్వాన్ని కొనసాగించారు. చాలా సార్లు బాధలో ఉన్నప్పుడు కూడా మనల్ని గిలిగింతలు పెట్టించేవి ఈ సినీ నవ్వులే. ఇక నటుడు జంధ్యాల సృష్టించిన చిత్ర విచిత్రమైన పాత్రలు నవ్వుకి జీవం పోశాయంటే అతిశయోక్తి కాదేమో. ఆ తరువాత ఈవీవీ.. ఆయన పెట్టించిన ‘కితకితలు’ ప్రేక్షకుల మోవి మీద నవ్వులు పూయించాయి. ప్రస్తుతం అనిల్ రావిపూడి టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా నిలిచారంటే.. ఆయన అస్త్రం కూడా ఈ నవ్వే. యాక్షన్, సెంటిమెంట్, లవ్, థ్రిల్లర్, హారర్, డ్రామా ఇలా ఏ జానర్ చూసుకున్నా.. అందులో కామెడీ ఉంటేనే కిక్కు. అందుకే ఎంతటి బాహుబలి సినిమా అయినా.. కామెడీ ప్రధానం కాబట్టే కట్టప్పతోనూ జోకులు వేయించాడు రాజమౌళి. అలాగే అనుష్క బావ కుమార వర్మగా సుబ్బరాజుతో హాస్యం పండించాడు. ఇలా చెప్పుకుంటూ పోతే చిత్ర సీమలో నవ్వుకు ఉన్న ప్రాధాన్యం వేరే లెవెల్ అనే చెప్పుకోవాలి. -
శివారులో వినూత్న హోటళ్లు
కర్నూలు: ఉమ్మడి జిల్లాలో ఒకప్పుడు ఎలాంటి పని మీద కర్నూలుకు వచ్చి టిఫిన్ తినాలనుకున్నా, మధ్యాహ్నం ఆకలి తీర్చుకోవాలన్నా.. రాత్రికి నాలుగు మెతుకులు గొంతు దిగాలన్నా ముందుగా గుర్తుకొచ్చే పేర్లు అజంతా, గోపి, హిందుస్తాన్, రమా దర్శన్, గీతా లంచ్హోం, అమరావతి.. తరహా పదుల సంఖ్యలో హోటళ్లు మాత్రమే. అప్పటి జనాభాకు అనుగుణంగా ఈ హోటళ్లు ఎంతో రుచికరమైన అల్పాహారంతో పాటు షడ్రుచులను అందించి ప్రజల ఆదరాభిమానాలు చూరగొన్నాయి. ఇందులో కొన్ని హోటళ్లు మారిన కాలంతో పాటు భోజన ప్రియుల అభిరుచులకు అనుగుణంగా మార్పులు చేసుకొని ఇప్పటికీ ఉనికి చాటుకుంటున్నాయి. అయితే నగరం వేగంగా విస్తరించడంతో పాటు నాలుక భిన్న ఆహారాన్ని కోరుకోవడంతో అందుకు అనుగుణంగా హోటళ్లు వెలుస్తూ వచ్చాయి. ఇప్పుడు నగరంలోనే కాదు శివారు ప్రాంతాల్లోనూ భారీ రెస్టారెంట్లు స్వాగతం పలుకుతున్నాయి. జాతీయ రహదారుల్లో దారి పొడవునా ఆకలి తీర్చే ఘుమఘుమలు వాహనాలు ముందుకు కదలనివ్వవంటే అతిశయోక్తి కాదు. ఒక్క పూటైనా కలిసి మెలసి భోజనం నగర వాతావరణానికి అలవాటుపడిన చాలా కుటుంబాలు, భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగులు కావడంతో ఇటీవల కాలంలో ఇంట్లో వంట చేసుకోవడం చాలా వరకు తగ్గిపోయింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉరుకులు పరుగుల జీవితం నుంచి కాస్త ఊరట పొందేందుకు, ఇంటిల్లిపాదీ కలసి భోజనం చేసేందుకు అనువుగా హోటళ్లు ఏర్పాటయ్యాయి. ఇక ఇటీవల నగరంలోని గుత్తి పెట్రోల్ బంకు సమీపంలో బ్రిడ్జి కింద రూపుదిద్దుకున్న ఖానా ఖజానా ఎంతో ఆహ్లాదకర వాతావరణంలో ఆకలి తీరుస్తోంది. సాయంత్రం వేళ వెలుగుజిలుగులు మధ్య ఇక్కడి అల్పాహార.. వెజ్, నాన్ వెజ్ ఆహారం తియ్యని అనుభూతి మిగులుస్తోంది. అదేవిధంగా ఇంకాస్త ప్రయాణం చేసి ఊరి బయటకు వెళ్లాలనుకునే వారికి, సమయం వెచ్చించాలనుకుంటే అందుకు అనువైన హోటళ్లు కూడా రారమ్మని ఆహ్వానిస్తుండటం విశేషం. సరికొత్త రుచులు ఒకప్పుడు హోటళ్లకు వెళితే ఇడ్డీ, వడ, దోశ.. మధ్యాహ్నమైతే అరిటాకులో వడ్డించే భోజనం.. రాత్రికి వీటితో పాటు చపాతి, పరోటా అదనం. మాంసాహార ప్రియులకు బిర్యానీ ఉండనే ఉంటుంది. ఇప్పుడు వీటితో పాటు సరికొత్త రుచులు భోజన ప్రియులను హోటళ్ల వైపునకు కాళ్లు కదిపేలా చేస్తున్నాయి. రకరకాల బిర్యానీలతో పాటు హైదరాబాద్, బెంగళూరు, ముంబయి, చెన్నై తదితర మహానగరాల్లో లభించే అన్నిరకాల వంటకాలు దాదాపుగా ఇక్కడ లభ్యమవుతున్నాయి. కేఎఫ్‌సీ, బార్బీక్యూ, ఇంకా ఎన్నో ఇప్పుడు నగరంలోనే అడుగడుగునా కనిపిస్తున్నాయి. ఇప్పటికీ పాతబస్టాండ్ ప్రాంతంలో నెయ్యి దోశ నోరూరిస్తుంది. రకరకాల వంటకాలు దాదాపుగా ప్రతి హోటల్లో వెజ్, నాన్ వెజ్ భోజనాలు లభిస్తున్నా.. ఒక్కొక్కరు ఒక్కో ప్రత్యేకతను సొంతం చేసుకుంటున్నారు. ఒకచోట కుండ బిర్యానీ, మరోచోట చిట్టి ముత్యాల బిర్యానీ, మరోచోట రాగిముద్ద తలకాయ కూర.. ఇంకోచోట నెల్లూరు చేపల పుసులు.. ఇక మటన్ కడ్డీలు నోరూరిస్తుంటాయి. ఇటీవల కాలంలో మండీ భోజనం నగరవాసులను విశేషంగా ఆకట్టుకుంటోంది. ఒక భారీ ప్లేట్లో ఇంటిల్లిపాదీ భోజనం చేసే సదుపాయం ఉండటం సరికొత్త అనుభూతిని పంచుతోంది. అదేవిధంగా బకెట్ బిర్యానీ ప్యాకింగ్‌లోనూ వినూత్న పంథాకు అద్దం పడుతోంది. ఒకరు.. ఇద్దరు.. నలుగురు.. ఆరుగురు.. పది మంది వరకు తినేలా ఈ బకెట్ బిర్యానీలను సిద్ధం చేస్తున్నారు. ఆరోగ్యానికి అనువుగా.. పంటల సాగులో రసాయన ఎరువుల వాడకం విచ్చలవిడిగా పెరిగిపోవడంతో వ్యాధుల తీవ్రత కూడా అదేస్థాయిలో ఉంటోంది. చిన్న వయస్సులోనే బీసీ, షుగర్, క్యాన్సర్ మహమ్మారి ఉక్కిరిబిక్కిరి చేస్తుండటంతో ఆ రోగాల నుంచి బయటపడేందుకు జేబుకు చిల్లు పెట్టుకోక తప్పనిపరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ తమ ఆహార అలవాట్లలో మార్పు చేసుకుంటున్నారు. తద్వారా కొద్ది వరకైనా అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చనే భావన కనిపిస్తోంది. ఇందుకు అనుగుణంగా నగరంలో పలుచోట్ల మిల్లెట్ హోటళ్లు కూడా ఏర్పాటయ్యాయి. చిరుధాన్యాలతో తయారు చేసిన ఇడ్లీ, దోశ, పూరీలు ఆరోగ్యాన్ని పంచుతున్నాయి. ఇదే సమయంలో రాగి సంకటితో పాటు జొన్నరెట్టె కూడా కడుపును చల్లబరుస్తూ బలాన్ని చేకూరుస్తుండటం విశేషం. శివారులో వినూత్న హోటళ్లు జాతీయ రహదారుల వెంట వెలసిన హోటళ్లు భోజన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులతో పాటు నగరవాసులు సైతం ఈ హోటళ్లకు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు అనుగుణంగానే ఆయా హోటళ్లలో బిగ్ స్క్రీన్లు ఏర్పాటు చేసి సినిమాలు, పాటలను ప్రదర్శిస్తున్నారు. ఇక క్రికెట్ మ్యాచ్‌లు ఉంటే.. ఆ రోజుల్లో సందడే సందడి. ముందుగానే టేబుళ్లు బుక్ చేసుకొని మరీ ఈ రెస్టారెంట్లకు క్యూకడుతున్నారు. ఒక హోటల్ ఎదుట ఏర్పాటు చేసిన ఏనుగు అటుఇటూ కదులుతూ, పిల్లలకు సరికొత్త అనుభూతిని మిగులుస్తున్నాయి. అసలైన ఏనుగునే ఇలా నిల్చోబెట్టారా అనే భావన కలిగించే రీతిలో నిర్వాహకులు ఈ సెట్టింగ్‌ను ఏర్పాటు చేశారు. ఓ యజమాని ఇంకాస్త ముందుకెళ్లి ఏకంగా విమానాన్నే హోటల్‌గా మారుస్తున్న తీరు చూస్తే ఈ రంగం ఏస్థాయిలో విస్తరిస్తుందో అర్థమవుతోంది. కేరళ ఆపం: నగర శివారులోని ఓ చిన్న దుకాణంలో ఏర్పాటు చేసిన హోటల్ ఇటీవల కాలంలో తమ ప్రత్యేకతను చాటుకుంటోంది. కేరళవాసులకే పరిమితమైన ఆపం ఇప్పుడు ఇక్కడ లభిస్తుంది. డిగ్రీ పూర్తి చేసిన ఇద్దరు అన్నదమ్ములు ఈ హోటల్ నిర్వహిస్తున్నారు. స్వయంగా వీరిద్దరే ఆపం తయారు చేస్తూ చెట్నీతో పాటు నాన్ వెజ్తోనూ అందిస్తున్నారు. కొత్త వంటకాలకు ఎప్పుడూ ఆదరణ లభిస్తుందనేందుకు వీరి వినూత్న ఆలోచనే నిదర్శనం. కోకోనట్ జ్యూస్: ఇప్పటి వరకు టెంకాయ నీళ్లను మాత్రమే తాగిన వాళ్లకు.. ఈ దుకాణానికి వస్తే సరికొత్త రుచి లభిస్తుంది. బయట ఒక టెంకాయ కొనుగోలు చేయాలంటే రూ.50 తీసుకుంటున్నారు. ఇదే ధరతో ఇక్కడ కోకోనట్ జ్యూస్ లభిస్తుంది. ఇందులో టెంకాయ నీళ్లకు తోడు అందులోని కొబ్బరి, గ్లూకోస్, కాస్త చక్కెరను మిక్సీలో వేసి జ్యూస్‌ను సిద్ధం చేస్తున్నారు. దీనికి అదనంగా ఫ్లేవర్ కోరుకునే వాళ్లకు మరో రూ.10 అదనంగా తీసుకొని సీజన్‌కు అనుగుణంగా లభించే పండ్లతో కూడిన కోకోనట్ జ్యూస్‌తో ఆకట్టుకుంటున్నారు. చిట్టిముత్యాల బిర్యానీ ఎంతో రుచి వ్యాపార రీత్యా వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సి ఉంటుంది. అలా కర్నూలుకు వచ్చిన ప్రతీసారి నగర శివారులోని రెస్టారెంట్లో చిట్టిముత్యాల బిర్యానీ తినడం అలవాటుగా మారింది. శివారు ప్రాంతం కావడంతో ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. వాహనాల పార్కింగ్‌కు అనువుగా ఉండటంతో వీలైనంత వరకు ఇలాంటి హోటళ్లకే వెళ్తుంటా. – వెంకటేశ్వర్లు, నెల్లూరు జిల్లా -
తిరుమల ఆలయ పాలనలో.. ఇప్పటికీ బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది!
సాక్షి: స్వామి రోజూ అద్దంలో చూసుకుంటారా? అంటే అవుననే చెబుతోంది వైఖానస ఆగమ శాస్త్రం. ప్రత్యూష కాల పూజల్లో గర్భాలయ మూలమూర్తికి ఆదర్శం (అద్దం), గోవు, సలక్షణమైనటువంటి కన్య, గజం, అశ్వం, గాయకుడు.. ఇలా వరుసగా దర్శింప చేయాలని వైఖానస ఆగమం చెబుతోంది. ఇదే సంప్రదాయం ఆధునిక కాలంలోనూ స్పల్పమార్పులతో నేటికీ కొనసాగుతుండటం విశేషం. ► 8వ శతాబ్దంలో వైఖానస మహాపండితుడు శ్రీమాన్ నృసింహ వాజపేయ యాజులవారు తన ‘భగవదర్చాప్రకరణమ్’ అనే గ్రంథంలో తిరుమల ఆలయంలో నిత్యం వైఖానస ఆగమోక్తంగా జరిగే ఆరాధన గురించి తెలియజేశారు. శ్రీవారికి కైంకర్యాలు, ఆగమ సంప్రదాయాల అమలు కోసం పూర్వం వైఖానస అర్చకులు దూరదృష్టితో కొన్ని ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేశారు. ► ప్రత్యూష కాలంలో అర్చకులు ఆలయ ప్రవేశం చేసి కుంచెకోల (తాళాలు)తో మంత్ర పూర్వకంగా బంగారు వాకిలి ద్వారాలు తెరిచి వేదపఠనంతో అంతరాళంలోకి ప్రవేశిస్తారు. ► గర్భాలయంలోని స్వామి మూర్తికి కుడివైపున దక్షిణ దిశలో దర్పణం ఏర్పాటు చేసి ఉంది. అర్చకులు ఆ అద్దంలోగుండానే స్వామిని చూస్తూ ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఆగమ సంప్రదాయానికి లోబడే మూలమూర్తికి ఎదురుగా బంగారు వాకిలిలోని గరుడాళ్వారు సన్నిధికి పైభాగంలో టీటీడీ పెద్ద అద్దం ఏర్పాటు చేసింది. ► లేగదూడతో సహా గోవును స్వామివారి ప్రథమ వీక్షణకై అంతరాళంగా పరిగణించే శయన మండపంలో నిలిపి ఉంచాలి. పూర్వం శ్రీవారికి ప్రత్యూష కాల కైంకర్యాల నిర్వహణ కోసం సన్నిధి గొల్ల ముందుగా ఆవు, దూడతో వెళుతుండగా, ఆయనను అనుసరించి అర్చకులు ఆలయ ప్రవేశం చేసేవారు. ► ఆవు, లేగదూడలను గర్భాలయ మూలమూర్తికి అభిముఖంగా నిలిపి, ప్రథమ వీక్షణ కైంకర్యాన్ని పూర్తి చేయించాలి. తర్వాత సన్నిధి గొల్ల గోవు పొదుగు నుండి పాలు పితికి అర్చకులకు అందించేవాడు. ఆగమంలో చెప్పినట్టు ఆ పాలు ‘ధారోష్ణం’ అంటే ఆవు పొదుగు నుండి పాలు పితికినపుడు పాత్రలో పడిన పాలధార వల్ల కొంత ఉష్ణం పుడుతుంది. అటువంటి ధారోష్ణం కలిగిన పాలను నివేదనగా సమర్పించేవారు. ► ప్రస్తుత పరిస్థితుల్లో గోవు, లేగదూడ ఆలయంలోనికి ప్రవేశించే సంప్రదాయం లేదు. వైఖానస ఆగమంలో చెప్పబడిన ‘గో సూక్తం’ అనే వేద మంత్ర పఠనం ద్వారా పురాతన సంప్రదాయాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ఆగమ సంప్రదాయంకోసం స్వామివారే యాదవ వంశస్థుడైన సన్నిధి గొల్లకు ప్రథమ దర్శనం చేసుకునే వరమిచ్చారు. అదే సంప్రదాయం నేటికి కొనసాగుతోంది. గజముఖాన్ని దర్శించే స్వామి.. ► స్వామివారు ప్రథమ వీక్షణ కోసం గజాన్ని దర్శించేందుకు ఆలయంలో ప్రత్యేక ఏర్పాటు చేశారు. ► గర్భాలయ మూలమూర్తికి ప్రతినిధిగా శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సమస్త పూజలను మూలమూర్తికి సమానంగానే నిర్వహిస్తారు. రాత్రి ఏకాంత సేవ కూడా శ్రీ భోగ శ్రీనివాసమూర్తికే నిర్వహిస్తారు. ఇదే చివరగా నిర్వహించే పవళింపు పూజ. గర్భాలయానికి ముందున్న శయనమండపంలో వేలాడదీసిన నవారు మంచంపై దక్షిణ దిక్కుగా శిరస్సు ఉంచి భోగ శ్రీనివాసుడిని శయనింప చేస్తారు. మరుసటి రోజు ప్రత్యూషకాల సుప్రభాత సేవలో భాగంగా, శ్రీ భోగ శ్రీనివాసమూర్తి వారిని మేల్కొలుపుతారు. ► శయన మండపంలో స్వామివారికి ఉత్తర, దక్షిణ దిశల్లో రెండేసి శిలాస్తంభాలు ఉన్నాయి. ఇందులో ఉత్తర దిశలో ఉన్న ఓ శిలాçస్తంభం అగ్రభాగాన గజ శిర స్సు చెక్కబడి ఉంది. ► శ్రీ భోగ శ్రీనివాసమూర్తి సుప్రభాత సేవలో మేల్కొలుపు తర్వాత ప్రథమంగా శిలాççస్తంభంపై ఉన్న గజ ముఖాన్ని దర్శింప చేస్తారు. ఆ తర్వాతే భోగ శ్రీనివాసుడిని శయనమండపం నుంచి గర్భాలయంలో మూలవిరాట్టు పాదాల వద్ద ఉన్న సింహాసనంపై జీవస్థాపంలో వేంచేపు చేస్తారు. శ్రీవారి పద్మపీఠం.. దివ్యతేజో రహస్య యంత్రం! ► శ్రీవేంకటేశ్వర స్వామి వారు గర్భాలయంలోని ఉపద్యక పవిత్ర స్థానంలో స్వయంవ్యక్త సాలగ్రామ అర్చావతారంగా స్థానిక మూర్తి/ ధ్రువమూర్తిగా పద్మపీఠంపై కొలువయ్యారు. స్వామి పాదపద్మాల కింద రహస్య యంత్రం ఉంది. సాక్షాత్తు మూలమూర్తి అంశగా భావించే శ్రీ భోగ శ్రీనివాసమూర్తి విగ్రహ పరిశీలనలో ఈ విషయం తేలింది. ► క్రీ.శ.614 వ సంవత్సరంలో పల్లవ రాణి సామవై పెరుందేవి మహారాణి ఈ రజత మూర్తిని ఆలయానికి సమర్పించారు. శంఖచక్రాలు ధరించి, అడుగున్నర పొడవు కలిగిన ఈ రజితæమూర్తి పూర్తిగా మూలమూర్తిని పోలి ఉంటుంది. ఈ విగ్రహం కింద యంత్రం ఉన్నట్టు అర్చకులు గుర్తించారు. అందువల్ల కచ్చితంగా మూలవిరాట్టు పాదపద్మాల కింద యంత్రస్థాపన ఉండి ఉంటుందనీ అర్చకుల వాదన. వైష్ణవ పరంపరలో గొప్ప ఆచార్యుడైనటువంటి నమ్మాళ్వారు ఈ రహస్యాన్ని గురించి వివరణ ఇచ్చి ఉండటం అర్చకుల వాదనకు బలం చేకూరింది. తెల్లదొరలూ... శ్రీవారి సేవకులే.. 1801 నుండి 1843 వరకు బ్రిటన్‌కు చెందిన ఈస్టిండియా పాలకుల హయాంలోనే ఆలయ పాలనకు కఠిన నిబంధనలు, క్రమశిక్షణ పద్ధతులు అమలయ్యాయి. నేటికీ తిరుమల ఆలయం, టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో బ్రిటిష్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. 1801 నుండి 1843 వరకు 43 ఏళ్లపాటు తిరుమల ఆలయ పాలన బ్రిటిష్ ఈస్టిండియా కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్ నార్త్ ఆర్కాట్ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో సాగింది. అప్పటికే ఆలయంలో అంతర్గత కలహాలు ఉండేవి. దీంతో బ్రిటిష్ పాలకులు కఠిన నిబంధనలు అమలు చేశారు. క్రమశిక్షణతో ఆలయ పాలనను గాడిలో పెట్టారు ∙1803 జనవరి 31న తొలిసారిగా మద్రాసు ఈస్టిండియా కంపెనీ ప్రభుత్వానికి స్టాటన్ దొర నివేదికను సమర్పించారు. ఆయన తర్వాత తిరుమల ఆలయ పాలనలో జరిగిన అవకతవకలపై విచారణాధికారిగా పి.బ్రూస్ నియమితులయ్యారు. టీటీడీ పాలనకు ఐదు మార్గదర్శకాలు దిట్టం: శ్రీవారికి సమర్పించే నైవేద్యం తయారీలో ముడిసరుకులు ఏయే పరిమాణంలో వినియోగించాలన్నదే దీని ముఖ్యోద్దేశం. ఇప్పటికీ ఆలయంలో లడ్డూలు, ప్రసాదాల తయారీతోపాటు స్వామికి సమర్పించే పుష్పాలు కూడా దిట్టం ఆధారంగానే నిర్వహిస్తున్నారు. కైంకర్యపట్టీ: తిరుమల ఆలయ సిబ్బంది, పరిచారకులు, మిరాశీదారులు, జియ్యర్ సిబ్బంది వి«ధులపై 1801, 1820 రెండుసార్లు కైంకర్యపట్టీ తయారు చే శారు. దీనిప్రకారం సిబ్బంది హోదా, విధులు, పూర్తి వివరాలు ఉంటాయి. బ్రూస్‌కోడ్: బ్రిటిష్ ప్రావిన్షియల్ జడ్జి పి.బ్రూస్ ఈస్టిండియా కోడ్ ఆఫ్ డైరెక్టర్ ఉత్తర్వుల ప్రకారం ఆలయ పాలన సక్రమంగా సాగించేందుకు ప్రత్యేకంగా కోడ్ రూపొందించారు. అదే బ్రూస్ కోడ్. నేటికీ ఆలయపాలనకు అదే దిక్సూచిగా ఉంది. సవాల్–ఇ–జవాబు: శ్రీవారి ఆలయంలో సేవలు, సిబ్బంది విధులు, ఆలయ ఖర్చులు, ఆదాయం, తిరుమల ఇతిహాసం, చరిత్రను నిర్వహించేందుకు ఈస్టిండియా కంపెనీ ప్రయత్నించింది. 1819లో 14 ప్రశ్నలు వేసి వాటికి సమా«ధానాలు రూపొందించారు. దీన్నే సవాల్– ఇ–జవాబు పట్టీగా పిలుస్తారు. పైమేయిషీ ఖాతా: ఆలయ స్థిర, చరాస్తులు, దేవతావిగ్రహాల వివరాలు, చిత్రాలు, తిరుమల, తిరుపతి, ఇతర పరిసర ప్రాంతాల్లోని ఆలయాల వివరాలు, విస్తీర్ణం, ఇనాం గ్రామాల వివరాలు రికార్డు చేశారు. 1819లో రూపొందించిన ఈ పద్ధతిని ‘పైమేయిషీ అకౌంట్’ అని పిలుస్తారు. ధార్మికసంస్థ పరిపాలనలో రికార్డులు, వి«ధి విధానాలు రూపొందించడం, బ్రహ్మోత్సవాలు, ఇతర ప్రత్యేక ఉత్సవాలకు కలెక్టర్లను పర్యవేక్షకులుగా నియమించడం వీరి హయాంలోనే సాగింది. ►జీవో ఎంఎస్ నెంబరు 4429 తేది:23.09.1940, జీవో ఎంఎస్ 659, తేదీ 16.06.1941 ప్రభుత్వ గెజిట్ ప్రకారం తిరుమల ఆలయానికి 27.5 కిలోమీటర్ల విస్తీర్ణంలో చుట్టూ అటవీ ప్రాంతం టీటీడీ పరిధిలోకి వచ్చింది. ఈ 27.5 చదరపు కి.మీ. పరిధిలో మాత్రమే సాగే టీటీడీ కార్యకలాపాలకు నాటి తెల్లదొరలు నిర్ణయించిన సరిహద్దులపైనే నేటికీ టీటీడీ ఆధారపడుతుండటం వారి భక్తి తత్పరతకు నిదర్శనం. -
తిరుపతి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తులకే ప్రాధాన్యం! మీకు తెలుసా! \
అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుని బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ సర్వసన్నద్ధమవుతోంది. అక్టోబరు 14 నుంచి 23వ తేదీ వరకు తొమ్మిదిరోజుల పాటు పదహారు వాహనాలపై శ్రీవారు తిరువీథుల్లో ఊరేగే వైభవాన్ని తిలకించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి తిరుమలకు రానున్న భక్తుల సౌకర్యం కోసం టీటీడీ అన్ని ఏర్పాట్లూ చేసింది. టీటీడీ చైర్మన్ హోదాలో భూమన కరుణాకర్ రెడ్డికి స్వామివారి సేవచేసే భాగ్యం మరోసారి దక్కింది. గతంలో చైర్మన్‌గా ఉన్న సమయంలో టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. చైర్మన్‌గా మరోసారి అవకాశం వచ్చిన వెంటనే తిరిగి నూతన సంస్కరణలతో హిందూ ధర్మ ప్రచారాలపై ప్రత్యేక దృష్టి సారించారు. ప్రజలు భక్తి మార్గంలో నడిచేందుకు గోవింద కోటిని ప్రారంభించారు. గోవింద కోటి రాసిన ప్రతి ఒక్కరికీ స్వామివారి దర్శనం లభించేలా పాలకమండలి సమావేశంలో తీర్మానం చేశారు. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డితో ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో పంచుకున్న విషయాలు. సాక్షి: టీటీడీ చైర్మన్‌గా మీకు రెండోసారి శ్రీవారి సేవచేసే అవకాశం లభించింది. గతంలో చైర్మన్‌గా ఉన్నప్పుడు టీటీడీలో ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చి మీకంటూ ఒక ప్రత్యేకతను చాటుకున్నారు. ఇంతటి మహద్భాగ్యాన్ని మీరు ఏమనుకుంటున్నారు? చైర్మన్: శ్రీ వేంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో ఊహించని విధంగా నాకు రెండోసారి టీటీడీ చైర్మన్‌గా పనిచేసే మహద్భాగ్యం దక్కింది. ఇంతటి అదృష్టం ఇచ్చిన స్వామివారికి, మరోసారి పనిచేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. • 2006 నుంచి 2008 వరకు టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షుడిగా పనిచేసిన సమయంలో ఒకవైపు సనాతన హిందూ ధర్మాన్ని దేశవ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తూనే, సామాన్య భక్తులకు అవసరమైన వసతుల కల్పనకు అనేక నిర్ణయాలు తీసుకుని అమలుచేశాం. మరోవైపు సామాజిక సేవా కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున నిర్వహించాము. • ఎందరో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, కార్యనిర్వహణాధికారులు, ఉద్యోగుల కృషి, స్వామివారి పట్ల అచంచల భక్తి విశ్వాసాలతో పని చేసినందువల్ల టీటీడీలో మంచి వ్యవస్థ ఏర్పడింది. దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్ళి, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడంతోపాటు, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించేలా మా ధర్మకర్తల మండలి, అధికారుల సహకారంతో పనిచేస్తాను. ఈ సందర్భంగా గతంలో నా నేతృత్వంలో చేపట్టిన కొన్ని కార్యక్రమాల గురించి తెలియజేయడం సముచితమని భావిస్తున్నాను. దళిత గోవిందం! తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామివారితో పాటు శ్రీదేవి, భూదేవిని దళితవాడలకు తీసుకుని వెళ్ళి అక్కడే కల్యాణం నిర్వహించి వారికి స్వామివారి ఆశీస్సులు అందజేసే దళిత గోవిందం కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఎంతోమంది పీఠాధిపతులు, మఠాధిపతులతో పాటు, శ్రీవారి ఆలయ అర్చకులు అంతా దళిత వాడలకు వెళ్ళి కల్యాణం అనంతరం అక్కడే నిద్రించాం. మత మార్పిడులకు అడ్డుకట్ట వేసేందుకు స్వామివారినే దళితుల చెంతకు తీసుకుని వెళ్ళాం. దీనికి కొనసాగింపుగా గిరిజన గ్రామాల్లో గిరిజన గోవిందం, మత్స్యకార గ్రామాల్లో మత్స్య గోవిందం కార్యక్రమాలు కూడా నిర్వహించాం. శ్రీనివాస కల్యాణాలు భగవంతున్నే భక్తుల దగ్గరికి తీసుకుని వెళ్ళి ఆశీస్సులు అందించేలా, స్వామివారి కల్యాణాన్ని వారంతా చూసి ఆనందించేలా శ్రీనివాస కల్యాణాలు పెద్ద ఎత్తున నిర్వహించాం. కల్యాణమస్తు! పిల్లల పెళ్లిళ్లకు అప్పులు చేసి ఆర్థికంగా చితికిపోతున్న పేద, మధ్య తరగతి వర్గాల వారికి చేయూతనివ్వడానికి నిర్వహించిన కార్యక్రమమే కళ్యాణమస్తు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 35 వేలకు పైగా జంటలకు స్వామివారి సమక్షంలో పెళ్లి చేసి ఆయన ఆశీస్సులు అందింపజేశాం. అందరికీ అన్నప్రసాదం 2006కు ముందు తిరుమలలో స్వామివారి దర్శనం చేసుకున్న భక్తులకు మాత్రమే అన్నదానంలో భోజనం చేసే అవకాశం ఉండేది. మా హయాంలో దర్శనంతో సంబంధం లేకుండా కొండ మీదకు వచ్చిన ప్రతి భక్తునికీ రెండు పూటలా కడుపు నిండా భోజనం చేసే అవకాశం కల్పించాం. నాలుగుమాడ వీథుల్లో పాదరక్షలు నిషేధం.. తిరుమల ఆలయ పవిత్రతను కాపాడడానికి నాలుగుమాడ వీ«థుల్లో పాదరక్షలతో ప్రవేశాన్ని నిషేధించాం. చంటిబిడ్డ తల్లులకు మహాద్వారం పక్కనుంచి ఆలయ ప్రవేశం చంటిబిడ్డలతో స్వామివారి దర్శనానికి వచ్చే తల్లులు క్యూల్లో చాలా ఇబ్బందిపడే వారు. దీన్ని గమనించి చంటిబిడ్డలతో పాటు తల్లులు మహాద్వారం కుడివైపు నుంచి ప్రత్యేక క్యూ ద్వారా ఆలయంలోకి వెళ్ళేలా నిర్ణయం తీసుకున్నాం. పుష్కరిణి హారతి.. ఎంతో పవిత్రమైన స్వామివారి పుష్కరిణికి ప్రతిరోజూ హారతి ఇచ్చే కార్యక్రమం ఏర్పాటు చేశాం. పౌర్ణమి గరుడ సేవ.. బ్రహ్మోత్సవాల్లో విశిష్టమైన స్వామివారి గరుడ సేవను భక్తులు చూసి తరించడానికి ప్రతి పౌర్ణమికి నాలుగు మాడ వీథుల్లో స్వామివారి గరుడ సేవ జరిపేలా నిర్ణయం తీసుకున్నాం. ఆర్జిత సేవలో పాల్గొనే వారు పంచె కట్టుకునే నిర్ణయం! స్వామివారి ఆర్జిత సేవల్లో పాల్గొనే భక్తులు సంప్రదాయబద్ధంగా పంచె కట్టుకుని వచ్చేలా నిర్ణయం అమలు చేశాం. ఇప్పుడు సేవలతో పాటు బ్రేక్ దర్శనంలో కూడా ఈ విధానం అమలవుతోంది. అలాగే స్వామివారి దర్శనానికి వెళ్ళే భక్తులు తిరునామం ధరించి వెళ్లే ఏర్పాటు చేశాం. మహిళా క్షురకుల నియామకం: కల్యాణకట్టలో తలనీలాలు సమర్పించే మహిళలకు మహిళలే తలనీలాలు తీసేందుకు మహిళా క్షురకులను నియమించాం. దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచిత లడ్డు సర్వదర్శనంలో స్వామివారి దర్శనం చేసుకున్న ప్రతి భక్తుడికీ ఉచితంగా ఒక చిన్న లడ్డు ఇచ్చే కార్యక్రమం ప్రారంభించాం. శ్రీ పద్మావతి అమ్మవారికి సహస్ర దీపాలంకార సేవ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారికి రోజూ సహస్ర దీపాలంకార సేవ ప్రారంభించాం. నడకమార్గంలో దశావతార విగ్రహాలు అలిపిరి నుంచి తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు ఆధ్యాత్మిక ఆనందం కల్పించడానికి దశావతార మూర్తుల విగ్రహాలు ఏర్పాటు చేయించాం. హిందువులకే ఉద్యోగాలు! ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన టీటీడీలో హిందువులకు మాత్రమే ఉద్యోగాలు ఇచ్చేలా నిర్ణయం చేశాం. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం చేత చట్టం చేయించి అమలు చేశాం. ఎస్వీబీసీ శ్రీ వేంకటేశ్వర స్వామివారి కీర్తిని, సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తంగా ప్రచారం చేయడం కోసం శ్రీ వేంకటేశ్వర భక్తి చానల్‌ను ఏర్పాటు చేశాం. అలాగే ఎఫ్ఎం రేడియోను కూడా ప్రారంభించాం. వేద విశ్వవిద్యాలయం వేద పరిరక్షణకు టీటీడీ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయించడంలో కీలక పాత్ర పోషించాను. అప్పటి గవర్నర్ శ్రీరామేశ్వర్ ఠాకూర్‌తో అనేకసార్లు చర్చించి అనుమతులు మంజూరు చేయించాను. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిగారి సంపూర్ణ సహకారంతో విశ్వ విద్యాలయం ప్రారంభమైంది. విద్యార్థులకు ఉచిత భోజనం టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతూ హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఉచితంగా భోజన సౌకర్యం కల్పిస్తున్నాం. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం శ్రీ వేంకటేశ్వర స్వామివారిపై 32 వేల సంకీర్తనలు రచించిన శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల విగ్రహాన్ని ఆయన జన్మస్థలానికి సమీపంలో ఉన్న రాజంపేటలో ఏర్పాటు చేయించాం. గోమహాసమ్మేళనం! సనాతన హిందూ ధర్మంలో గోమాతకు ఉన్న విశిష్టత ఎంతో గొప్పది. సాక్షాత్తు శ్రీ వేంకటేశ్వర స్వామివారే గో సంరక్షణకు ముందుకు వచ్చారు. అలాంటి గోవిందుడి ఆశీస్సులతో తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో పెద్ద ఎత్తున గో మహాసమ్మేళనం నిర్వహించాం. పీఠాధిపతులు, మఠాధిపతులు, గో ప్రేమికులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గోమాత విశిష్టతను ప్రపంచానికి చాటుతూ గో సంరక్షణ కోసం నిర్వహించిన ఈ కార్యక్రమం పండిత, పామరుల మన్ననలు పొందింది. ధార్మిక సదస్సు సనాతన హిందూ ధర్మాన్ని విశ్వవ్యాప్తం చేయడానికి టీటీడీ చేపట్టాల్సిన చర్యలపై చర్చించేందుకు తిరుమల ఆస్థాన మండపంలో పెద్ద ఎత్తున ధార్మిక సదస్సు నిర్వహించాం. దేశంలోని ప్రముఖ పీఠాధిపతులు, మఠాధిపతులు హాజరై అనేక సూచనలు చేయడంతోపాటు ధర్మకర్తల మండలి చేస్తున్న హిందూ ధర్మ ప్రచారం పై ప్రశంసలు కురిపించారు. అమృతోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్థానం 75వ సంవత్సరంలోకి అడుగుపెట్టిన సందర్భంగా పెద్ద ఎత్తున అమృతోత్సవాలు నిర్వహించాం. ద్వాదశి శ్రీవైష్ణవ క్షేత్రాల్లో ప్రముఖంగా నిర్వహించే కైశిక ద్వాదశి ఉత్సవాన్ని ప్రారంభించాం. మాలదాసర్లకు ప్రోత్సాహకాలు గ్రామీణ ప్రాంతాల్లో సనాతన హిందూ ధర్మప్రచారకులుగా పనిచేస్తున్న మాలదాసర్లు ప్రత్యేక ప్రోత్సాహకాలు అందించాం. ఎస్సీ, ఎస్టీలకు అర్చక శిక్షణ ఎస్సీ, ఎస్టీ ప్రాంతాల్లోని ఆలయాల్లో అర్చకులుగా పనిచేస్తున్న వారికి అర్చక శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించాం. స్థానికాలయాల్లో దిట్టం పెంపు తిరుపతికి బయట ఉన్న టీటీడీ ఆలయాల్లో ప్రసాదాల దిట్టం, తీర్థం పెంచడం జరిగింది. అన్ని ఆలయాల్లోనూ మూలవర్లకు పట్టువస్త్రాలను అలంకరించేలా నిర్ణయం తీసుకున్నాం.. వకుళమాత ఆలయం తిరుపతికి సమీపంలోని పేరూరు బండ మీద శిథిలావస్థలో ఉన్న ఆలయాన్ని గుర్తించి, అది వకుళమాత ఆలయంగా నిర్ధారించాం. అర్చకులకు జీతాలు పెంపు అర్చకులకు జీతాలు పెంచడంతో పాటు వారికి ఉద్యోగ భద్రత కల్పించాం. సాక్షి: శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో సామాన్య భక్తుల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు విచ్చేసే సామాన్య భక్తులకు పెద్దపీట వేస్తూ సర్వదర్శనం మాత్రమే అమలు చేయాలని నిర్ణయించాం. భక్తుల రద్దీ దృష్ట్యా బ్రేక్ దర్శనాలు, వృద్ధులు, చంటిపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు, ఎన్ ఆర్ఐలు, రక్షణ సిబ్బందికి ప్రత్యేక దర్శనాలు తదితర ప్రివిలేజ్డ్ దర్శనాలను రద్దు చేశాం. ఆర్జిత సేవలు, రూ.300 టికెట్ల దర్శనాలతో పాటు అన్ని ట్రస్టు దాతలకు దర్శన టికెట్లను రద్దు చేశాం. వీఐపీల దర్శన సమయాన్ని కూడా రద్దు చేయడం ద్వారా సాధారణ రోజుల కంటే అధికంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేశాం. ఈ నిర్ణయం వల్ల రోజుకు అదనంగా 15 వేల మంది సామాన్యభక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. సాక్షి: బ్రహ్మోత్సవాలకు విశేషంగా తరలి వచ్చే భక్తులకు తిరుమలలో వసతి సౌకర్యాలు ఎలా ఉండబోతున్నాయి? చైర్మన్: తిరుమలలో ఉన్న 7 వేల గదుల్లో కొన్ని మరమ్మతుల్లో ఉన్నాయి. ప్రస్తుతం 25 వేల మందికి సరిపడా వసతి మాత్రమే ఉంది. ఉన్న గదుల్లో 50 శాతం గదులను భక్తులు బుక్ చేసుకునేందుకు వీలుగా అందుబాటులో ఉంచాం. మిగిలిన 50 శాతం గదులను ఆఫ్‌లైన్‌లో ముందు వచ్చిన వారికి ముందు అనే ప్రాతిపదికన కేటాయిస్తున్నాం. తిరుమలలో గదుల లభ్యత పరిమితంగా ఉన్న కారణంగా భక్తులు తిరుపతిలోని వసతి సముదాయాల్లో గదులు పొంది బస చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. సాక్షి: భక్తులు అన్న ప్రసాదాల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: సాధారణ రోజుల్లో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ఉదయం 11 నుంచి రాత్రి 11 గంటల వరకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. బ్రహ్మోత్సవాల రోజుల్లో ఉదయం 8 నుంచి రాత్రి 11.30 వరకు, గరుడసేవ రోజున రాత్రి 1 గంట వరకు భక్తులకు అన్నప్రసాద వితరణ ఉంటుంది. ఎంతమంది భక్తులు వచ్చినా అన్నప్రసాదం అందించేలా అధికారులను, సిబ్బందిని సమాయత్తం చేశాం. సాక్షి: తిరుమలకు వచ్చే భక్తులందరికీ లడ్డూ, ప్రసాదం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? చైర్మన్: బ్రహ్మోత్సవాల్లో లడ్డూ ప్రసాదాలు భక్తులందరికీ అందించేందుకు వీలుగా తొమ్మిది లక్షల లడ్డూలు బఫర్ స్టాక్ ఉండేలా ఏర్పాట్లు చేశాం. సాక్షి: ఈసారి గరుడసేవకు గతంలో కంటే అధికంగా భక్తులు వచ్చే అవకాశం ఉందని ఒక అంచనా. భక్తులకు ఇబ్బంది లేకుండా ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? చైర్మన్: అక్టోబర్ 19న గరుడసేవ రోజున అదనంగా మరిన్ని బస్సులు నడిపేలా చర్యలు తీసుకున్నాం. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గరుడ వాహనాన్ని వీక్షించేలా ఏర్పాట్లు చేస్తున్నాం. సాక్షి: భక్తులు వాహన సేవలను తిలకించేందుకు వీలుగా మాడవీథుల్లో ఎలాంటి ఏర్పాట్లు చేశారు? చైర్మన్: లక్షలాదిగా వచ్చే భక్తులు మాడవీథుల్లో స్వామివారి వాహనసేవలను చూసి తరించాలనుకుంటారు. ఇందుకు అనుగుణంగా మాడవీథుల్లో ఉండే ప్రతి భక్తుడికీ స్వామివారి వాహనసేవ దర్శనం లభించేలా ప్రణాళిక రూపొందించాం. వాహనసేవల ముందు ఆధ్యాత్మిక భావన ఉట్టిపడేలా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి అపురూపమైన కళారూపాల ప్రదర్శన ఏర్పాటు చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీసుల సమన్వయంతో బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణ ఏర్పాట్లు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాల్లో ఇరవై నాలుగు గంటలూ పనిచేసేలా కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేస్తున్నాం. ముఖ్యమైన ప్రాంతాల్లో సీసీ కెమెరాల నిఘా ఉంటుంది. సాక్షి: లక్షలాది భక్తులు వచ్చే తిరుమలలో పర్యావరణ పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? చైర్మన్: ఒక పుణ్యక్షేత్రంలో ప్లాస్టిక్ వాడకాన్ని పూర్తిగా నిషేధించి, పర్యావరణ పరిరక్షణకు చారిత్రక నిర్ణయం తీసుకోవడం దేశంలో తిరుమలలో మాత్రమే జరిగింది. బ్రహ్మోత్సవాలకు దేశంలోని నలుమూలల నుంచి వచ్చే భక్తులు ఈ విషయాన్ని గుర్తించి తిరుమలకు ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులు తీసుకురావద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. అలిపిరి వద్ద విజిలెన్స్ సిబ్బంది ప్లాస్టిక్ బాటిళ్లు, సంచులను తిరుమలకు రాకుండా చేసే తనిఖీలకు భక్తులు సహకరించి తిరుమలలో పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతకు సహకారం అందించాలని కోరుతున్నాం. - లక్ష్మీకాంత్ అలిదేన, సాక్షి, తిరుమల ఇవి చదవండి: 'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే? -
'శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వరస్వామి' కి స్వయాన తోబుట్టువు.. ఎవరంటే?
దేశంలోనే అత్యంత ప్రాచీనమైన గ్రామదేవత తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ తల్లి శ్రీవారికి స్వయానా చెల్లెలు. తిరుపతి ప్రజలను పరిరక్షించే గ్రామదేవతగా భక్తులచే పూజలందుకుంటోంది. శ్రీవేంకటేశ్వరస్వామికి స్వయాన తోబుట్టువు కావడంతో తిరుపతి గంగమ్మ జాతర సమయంలో శ్రీవారు సారె పంపేవారు. ఈ సంప్రదాయం సుమారు నాలుగు శతాబ్దాల నాటిది. విష్ణువు అవతారమైన శ్రీవేంకటేశ్వరస్వామి ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు. కాటమరాజుల కథల ప్రకారం గంగమ్మ శ్రీకృష్ణునికి చెల్లెలు. అందుకే శ్రీవారి ఆలయం నుంచి ప్రతి ఏటా ఆమెకు పుట్టింటి సారె పంపే సంప్రదాయం కొనసాగుతోంది. శ్రీవారి తోబుట్టువుగా భారతీయ సనాతన సంప్రదాయం ప్రకారం శ్రీతాతయ్యగుంట గంగమ్మకు ప్రతి ఏటా జాతర నెలలో శ్రీవారి ఆలయం నుంచి గంగమ్మ ఆలయానికి గంప, చేట, పట్టుశేషవస్త్రాలు, పసుపు, కుంకుమలను టీటీడీ వారు అందజేస్తున్నారు. తిరుచానూరులో చక్రతీర్థం రోజున తిరుమల శ్రీవారి ఆలయం నుంచి శ్రీపద్మావతి అమ్మవారికి ఏనుగుపై పసుపు ముద్దను పంçపుతారు. శ్రీవారు శ్రీపద్మావతి అమ్మవారికి పంపే పసుపు ముద్ద తిరుమల నుంచి తిరుచానూరు చేరుకున్నాకే అమ్మవారి చక్రస్నానం జరిగే ఆచారం ఉంది. ఈ పసుపు ముద్దను తిరుచానూరుకు తీసుకెళ్లే మార్గమధ్యలో ఉన్న తాతయ్య గుంట గంగమ్మ గుడి ముందు ఆపి పూజారులు, అధికారులు అమ్మవారికి కొబ్బరి కాయ సమర్పించి హారతి ఇస్తారు. ఆ తరువాతే తిరుచానూరుకు ఊరేగింపుగా తీసుకెళ్తారు. ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర! తాతయ్య గుంట గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. ఆలయ పునర్నిర్మాణంలో భాగంగా చేపట్టిన తవ్వకాల్లో బయటపడ్డ పురాతన కట్టడాలే ఇందుకు నిదర్శనమని చరిత్రకారులు చెబుతున్నారు. గర్భాలయ నిర్మాణంలో భాగంగా 12 అడుగుల లోతులో బయటపడిన అపురూపమైన శిల్పాలతో బయటపడ్డ రాతి కట్టడాలు పల్లవుల ఆఖరి కాలం నాటివని పురావస్తుశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ ఆలయాన్ని శ్రీవారి భక్తాగ్రేసరుడు అనంతాచార్యులు స్వయంగా ప్రతిష్ఠించారు. అప్పటి కుగ్రామమైన తిరుపతి ప్రజలను పరిరక్షించే ఆ గ్రామదేవతకు భక్తులు పూజలందిస్తూ.. ఏడు రోజుల పాటు జానపద వేషధారణలతో ప్రతిష్ఠాత్మకంగా జాతర సంబరాలను కొనసాగిస్తారు. దేశంలోనే ప్రథమ గ్రామదేవత ఉత్సవాన్ని జరుపుకున్న ఆలయం కూడా తిరుపతి తాతయ్య గుంట గంగమ్మ తల్లి. సమ్మక్క–సారక్క జాతర చరిత్ర 200 ఏళ్లు అయితే, పైడితల్లి అమ్మవారి జాతరకు 300 ఏళ్ల చరిత్ర ఉంది. తిరుపతి గంగమ్మ ఆలయానికి వెయ్యేళ్ల చరిత్ర ఉండటం విశేషం. తాతయ్య గుంట ఎందుకొచ్చిందంటే? వైష్ణవ భక్తుడైన తాతాచార్యులకు కైంకర్యార్థం లభించిన చెరువుకు తాతయ్యగుంట అని పేరు ఉండేది. ఇదే చెరువు గట్టు మీద వెలసినందున అమ్మవారిని తిరుపతి గంగమ్మ అని పిలిచేవారు. కాలక్రమేణ శ్రీతాతయ్యగుంట గంగమ్మ అని ప్రశస్తి పొందింది. నాటి నుంచే అశేష భక్తకోటి పూజలందుకుంటూ గంగమ్మ భక్తుల కొంగుబంగారంగా ఆలరారుతోంది. ఈ ఆలయం తరువాతే దేశంలోని గ్రామాల్లో గంగమ్మ ఆలయాలు వెలసి భక్తజనుల పూజలు అందుకోవడం ఆరంభమయ్యాయి. తాళ్లపాక అన్నమయ్య తిరుపతి గంగమ్మను దర్శించి మొక్కులు చెల్లించడంతో తాళ్లపాక గంగమ్మ అని కూడా పిలుస్తున్నారని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. 18వ శతాబ్దానికి చెందిన ప్రముఖ కవయిత్రి తరిగొండ వెంగమాంబ ‘జలక్రీడావిలాసం’ యక్షగానంలో తాతయ్యగుంట గంగమ్మను ప్రస్తావించింది. నాటి నుంచే టీటీడీ పర్యవేక్షణలో గంగమ్మ ఆలయం గంగమ్మ ఆలయాన్ని ఎప్పటి నుంచో తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షిస్తోంది. బ్రిటిష్ వారు 1843 సంవత్సరంలో టీటీడీ ఆలయ పర్యవేక్షణను హథీరామ్జీ బాబాకు అప్పగించారు. అప్పటి నుంచి తిరుమల శ్రీవారి ఆలయంతో పాటు తిరుపతిలోని శ్రీగోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరులోని శ్రీపద్మావతి అమ్మవారి ఆలయం, కపిలతీర్థం ఆలయం ఇలా 26 ఆలయాల పర్యవేక్షణను హాథీరామ్‌జీ బాబా చూసేవారు. హాథీరామ్‌జీ బాబా పర్యవేక్షణలోనే శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం కూడా ఉండేది. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటవటంతో బ్రిటిష్ వారు తిరుమల శ్రీవారి ఆలయ పర్యవేక్షణను పాలకమండలికి అప్పగించారు. అప్పట్లో శ్రీతాతయ్యగుంట గంగమ్మ రికార్డులు మాయమయ్యాయి. అంటే తిరుపతిలోని శ్రీతాతయ్యగుంట గంగమ్మ ఆలయం టీటీడీ ఉప ఆలయమే అని చారిత్రక ఆధారాలు చెబుతున్నాయి. గంగమ్మ దర్శనం తర్వాత శ్రీవారి దర్శనం.. తిరుమల స్వామివారి దర్శనం కోసం వచ్చే భక్తులు ముందుగా శ్రీవారి చెల్లెలైన గంగమ్మను దర్శించుకునే వారు. ఆ తరువాతే తిరుమల శ్రీవారిని దర్శించుకునే ఆచారం మొదలైంది. శతాబ్దాల పూర్వం నుంచే ఈ ఆచారం ఉండేది. నాటి రాజులందరూ అదే సంప్రదాయాన్ని పాటించారు. అయితే కాలక్రమేణా తిరుమలకు వెళ్లే దారులు పెరగటంతో ఈ సంప్రదాయం కనుమరుగైంది. నాటి సంప్రదాయాన్ని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేత పునఃప్రారంభించారు. 75 ఏళ్ల స్వాతంత్య్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రీ గంగమ్మవారిని దర్శించుకున్న దాఖలాలు లేవు. ఓ ఆధ్యాత్మిక ప్రాచీన సంప్రదాయాన్ని కొనసాగించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఈ సంప్రదాయం గురించి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించటంతో గత ఏడాది, ప్రస్తుత ఏడాది సెప్టెంబర్‌లో నిర్వహించిన బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సీఎం ముందుగా తిరుపతిలోని తాతయ్యగుంట గంగమ్మను దర్శించుకున్నారు. గంగమ్మ దర్శనం తర్వాతే శ్రీవారికి పట్టువస్త్రాలను సమర్పించి స్వామివారి దర్శనం చేసుకోవటం ద్వారా సరికొత్త చరిత్రకు తెరతీశారు. ప్రతిష్ఠాత్మకంగా అమ్మవారి ఆలయ పునర్నిర్మాణం తాతయ్యగుంట గంగమ్మ ఆలయ నిర్మాణాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టారు. టీటీడీ చైర్మన్, ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి చొరవతో రూ.16 కోట్లలో దేవదాయశాఖ, టీటీడీ నిధులతో ఆలయ నిర్మాణాన్ని చేపట్టారు. ఆలయం మొత్తాన్ని కేవలం రాతితోనే నిర్మిస్తున్నారు. తాతయ్య గుంట గంగమ్మ జాతర విషయాన్ని ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి రాష్ట్ర పండుగగా ప్రకటించిన విషయం తెలిసిందే. అందులో భాగంగానే మే నెలలో గంగమ్మ జాతరను ప్రభుత్వం అంగరంగ వైభవంగా నిర్వహించటం గమనార్హం. - తిరుమల రవిరెడ్డి, సాక్షి–తిరుపతి -
సాటిలేని రుచులు శ్రీనివాసుడి నైవేద్యాలు!
తిరుమలేశుడు భక్తసులభుడే కాదు, నైవేద్య ప్రియుడు కూడా! అందుకే ఆయన ప్రసాదాలు ప్రత్యేకం. తిరుమలేశుని ప్రసాదం అంటే కేవలం లడ్డు, వడలే కాదు.. దోసెలు, పోలి (పూర్ణం భక్ష్యాలు), జిలేబీ, తేనెతొల, సుఖియం, అప్పం, కేసరిబాత్, పాయసం, సీరా వంటివెన్నో స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ ప్రసాదాల రుచి, నాణ్యత మరెక్కడా లభించవు. మూలమూర్తికి మూడు సార్లు నైవేద్యం.. గర్భాలయ మూలమూర్తికి రోజుకు మూడుసార్లు నైవేద్యం సమర్పిస్తారు. ఉదయం 5 తర్వాత మొదటిగంటలో ఒకసారి, ఉదయం 10 గంటల్లోపే (మధ్యాహ్న నైవేద్యం అంటారు) మరోసారి, రాత్రి 7 గంటలకు ఒకసారి ప్రసాద సమర్పణ ఉంటుంది. మాతృ దధ్యోదనమంటే స్వామికి మహా ఇష్టం. కులశేఖరపడి దాటుకుని గర్భాలయంలోకి వెళ్లేది చిక్కటి మీగడతో కూడిన ‘మాతృదధ్యోదనం’ మాత్రమే. అది కూడా సగం పగిలిన కొత్త మట్టి ఓడులోనే పెడతారు. చివరగా ఏకాంత సేవ సమయంలో వివిధ ఫలాలు, చక్కెర, తేనెతో తయారు చేసిన ‘మేవా’, చక్కెర, జీడిపప్పు, బాదంపలుకులు, ఎండుద్రాక్ష, ఏలకులు, గసగసాలు, ఎండుకొబ్బరి ముక్కలతో తయారు చేసిన ‘పంచకజ్జాయం’, చక్కెర కలిపిన వేడిపాలను నివేదిస్తారు. వకుళ మాత సమక్షంలోనే..! గర్భాలయానికి ఆగ్నేయ మూలలోగల వంటశాల (పోటు)లో కొలువైన శ్రీనివాసుని తల్లి వకుళమాలిక విగ్రహం వద్ద కొంత సమయం ఉంచిన తర్వాతే స్వామికి నైవేద్యంగా సమర్పిస్తారు. ‘గమేకార్లు’(వంట పరిచారకులు) భక్తిశ్రద్ధ్దలతో, శుచిగా పోటులో అన్నప్రసాదాలు వండుతారు. లడ్డు, వడ, అప్పం, దోసె, పోళి, సుఖియం, మురుకు, జిలేబీ వంటి పిండి ప్రసాదాలు (పనియారాలు) వెండివాకిలికి బయట సంపంగి ప్రాకారం ఉత్తర భాగాన ‘పోటుతాయారు’ అమ్మవారి విగ్రహం సమక్షంలో తయారు చేస్తారు. వారపు సేవల్లో భాగంగా సోమవారం విశేష పూజలో పెద్ద వడలు, లడ్డూలు, అన్నప్రసాదాలు, బుధవారం సహస్ర కలశాభిషేకంలో ప్రత్యేకంగా క్షీరాన్నంతోపాటు మిగిలిన అన్నప్రసాదాలు, గురువారం తిరుప్పావడ సేవలో మొత్తం 450 కిలోల బియ్యంతో తయారు చేసిన పులిహోర, జిలేబీలు, పెద్దమురుకులు (తేనెతొల) నైవేద్యంగా సమర్పిస్తారు. ఇక శుక్రవారం నాడు పోళీలు(పూర్ణం భక్ష్యాలు), సుఖియం (ఉండ్రాళ్లు), ఆదివారం మాత్రం ‘ఆదివారం ప్రసాదం’ అనే చలిమిడి ప్రసాదాన్ని నివేదిస్తారు. దీనినే అమృత కలశం అంటారు. స్వామి తర్వాత గరుడాళ్వారుకు సమర్పిస్తారు. ఏకాదశి, వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో స్వామికి దోసెలు, శెనగపప్పుతో తయారు చేసిన శుండలి(గుగ్గి్గళ్లు) సమర్పిస్తారు. వీటితోపాటు పెసరపప్పు పణ్ణారం, పానకం కూడా నివేదిస్తారు. ధనుర్మాస వ్రత సమయంలో అన్నప్రసాదాలతోపాటు ప్రత్యేకంగా ‘బెల్లపు దోసె’ను ప్రియంగా ఆరగిస్తాడు స్వామి. అందువల్లే ఆ నాణ్యత, రుచి..! 1951వ సంవత్సరంలో ఈ ప్రసాదాల తయారీకి తిరుమల తిరుపతి దేవస్థానం కమిటీ ‘దిట్టం’ (కొలత) కొలమానంగా నిర్ణయించింది. తర్వాత పలుమార్లు దిట్టాన్ని సవరించారు. ప్రస్తుతం 2001లో సవరించిన దిట్టం ప్రకారం ప్రసాదాలు తయారు చేస్తున్నారు. మూడు రుచుల్లో శ్రీవారి లడ్డూలు తిరుపతి లడ్డూలు మూడు రకాలుగా తయారు చేస్తున్నారు. వీటిలో ఆస్థానం లడ్డు, కళ్యాణోత్సవం లడ్డు, ప్రోక్తం లడ్డూ. ఆలయంలో జరిగే ప్రత్యేక ఉత్సవాలు, పర్వదినాలు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, ముఖ్యమంత్రి ఇలా.. అతిముఖ్యమైన వ్యక్తులు ఆలయాన్ని సందర్శించిన సందర్భాల్లో ఆస్థానం లడ్డూ తయారు చేస్తారు. దీని బరువు 750 గ్రాములు. దిట్టంలో ఖరారు చేసిన మోతాదు కన్నా ఎక్కువ నెయ్యి, జీడిపప్పు, కుంకుమపువ్వు వేసి ఈ లడ్డూను ప్రత్యేక శ్రద్ధతో తయారు చేస్తారు. వీటిని గౌరవ అతిథులకు అందజేస్తారు. స్వామివారి ప్రసాదాన్ని స్వీకరిస్తున్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి - వైఎస్ జగన్మోహన్రెడ్డి సామాన్యులకు అంతసులువుగా లభించదు. ఇక స్వామివారి నిత్య కల్యాణోత్సవ సేవలో పాల్గొనే గృహస్తులకు ప్రత్యేకమైన కల్యాణోత్సవం లడ్డూ ను ప్రసాదంగా ఇస్తారు. ఇది చిన్న లడ్డూ కంటే చాలా రుచిగా ఉంటుంది. మూడవది 175 గ్రాముల ప్రోక్తం లడ్డూ. ఇది భక్తులందరికీ లభించే లడ్డూ. దర్శనం తర్వాత వెండివాకిలి దాటుకుని వెలుపలకు వచ్చే భక్తులకు ఉదయం నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు వివిధ రకాల ప్రసాదాలు వితరణ చేస్తారు. -
ఆ హోటల్లో తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే
లండన్: బ్రిస్టల్ లోని ఓ ప్రఖ్యాత పబ్‌లో ప్రతేకమైన ఆదివారం స్పెషల్ డిష్ తినాలంటే నాలుగేళ్లు ఎదురు చూడాల్సిందే. ఈరోజు బుక్ చేసుకుని నాలుగేళ్లపాటు ఎదురు చూస్తే చాలు ఆ వంటకం రుచి చూసే భాగ్యం కలుగుతుంది. సాధారణంగా ఓ హోటల్లో తినడానికి ఏదైనా ఆర్డర్ ఇచ్చిన తరవాత నిముషాల వ్యవధిలో ఆ ఐటెం మన ముందు ప్రత్యక్షమవుతుంది. ఆర్డర్ ఇచ్చిన ఐటెం కోసం గంటల తరబడి ఎదురు చూడటమన్నది చాలా అరుదుగా చూస్తుంటాం. మరికొన్ని ప్రముఖ హోటళ్లలో మాత్రం ఆదివారం ప్రైమ్ టైమ్ ఫుడ్ బుకింగ్ కావాలంటే ఒకట్రెండు రోజుల ముందు టేబుల్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ఒక ఫుడ్ ఐటెం కోసం నాలుగేళ్లు ఎదురు చూడటమంటే నిజంగా విడ్డూరమే. అలాంటి విడ్డూరమే బ్రిస్టల్ లోని ది బ్యాంక్ టావెర్న్ పబ్. ఈ పబ్‌లో ఆర్డర్ చేయాలంటే ఓపిక ఉండాలి. అందులోనూ ఆ హోటల్ ప్రత్యేకం తినాలంటే బుకింగ్ టైమ్ నాలుగేళ్లు పడుతుంది. అంత పొడవాటి వెయిటింగ్ లిస్టు ఉన్న హోటల్ ప్రపంచంలోనే మరొకటి లేదు. ఆ హోటల్లో సండే స్పెషల్ రోస్ట్ బుక్ చేసుకుంటే మన టైమ్ వచ్చేసరికి కనీసం నాలుగేళ్ల సమయం పడుతుంది. అన్నేళ్ల పాటు ఆగాలంటే నిజంగానే ఓపికపట్టడంలో పీ.హెచ్.డి చేనుండాలి. అందులోనూ భోజనప్రియులు అంత కలం ఆగడమంటే చాలా గొప్ప విషయం. ది బ్యాంక్ టావెర్న్ హోటల్ వడ్డించే సండే రోస్టులో రుచికరమైన ప్రత్యేక వంటకాల ఉఉంటాయి. నోరూరించే ఈ వంటకానికి 2018లో బ్రిస్టల్ గుడ్‌ఫుడ్ అవార్డుల్లో ఉత్తమ సండే లంచ్ అవార్డుతోపాటు అనేక అవార్డులను సొంతం చేసుకుంది. అయితే కరోనా సమయానికి ముందు ఈ హోటల్లో ఆర్డర్లన్నీ సమయానికే డెలివరీ ఇచ్చేవారు. కానీ లాక్డౌన్ సమయంలో పబ్ మూసివేసి ఉండటంతో ఆ సమయంలో వచ్చిన ఆర్డర్లన్నీ పెండింగ్‌లో ఉండిపోయాయి. వాటిని ఒక్కొక్కటిగా క్లియర్ చేస్తున్న పబ్‌వారు ప్రస్తుతానికి నాలుగేళ్లు వెనుకబడ్డారు. దీంతో ఈ హోటల్లో ఇప్పుడు సండే రోస్ట్ ఆర్డర్ చేసేవారు నాలుగేళ్లు వేయిట్ చేయక తప్పదు. అందుకే ఈ రెస్టారెంట్ వారు ప్రస్తుతానికైతే బుకింగ్ లను పూర్తిగా నిలిపివేశారు. ఇది కూడా చదవండి: వివేక్ రామస్వామికి ఓటు వేయొద్దంటూ మత ప్రచారకుడి ప్రచారం.. -
సండే స్పెషల్.. ఇంతకన్నా ఏముంటుంది?: ఉపాసన
మెగా కోడలు ఉపాసన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. సామాజిక కార్యక్రమాలతో పాటు సినిమాలకు సంబంధించిన అన్ని ప్రోగ్రామ్స్‌లోనూ యాక్టివ్‌గా పాల్గొంటుంది. తన విషయాలను ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. తాజాగా సండే స్పెషల్ అంటూ ఓ వీడియోను ఆమె ట్విటర్లో షేర్ చేశారు. (ఇది చదవండి: రామ్ చరణ్‌కు ఉపాసన స్పెషల్ విషెస్.. ఒళ్లో కూర్చొబెట్టుకుని మరీ!) ఉపాసన ట్విటర్లో రాస్తూ.. 'నాయనమ్మ ప్రేమతో చేసిన పులావ్. ఇంతకన్నా ఏం అడగాలి' అంటూ వీడియోను పోస్ట్ చేసింది. ఆ వీడియోలో చిరంజీవి మదర్ ప్రత్యేకంగా తయారు చేసిన పులావ్‌ను పరిచయం చేసింది ఉపాసన. ప్రేమతో చేసిన దానికంటే మించి ఏమని అడగాలి? అంటూ ట్వీట్ చేసిందామె. ఇటీవలే మాల్దీవుస్ వేకేషన్ పూర్తి చేసుకున్న ఉపాసన- రామ్ చరణ్ హైదరాబాద్‌కు తిరిగొచ్చారు. త్వరలోనే ఈ జంట తల్లిదండ్రులు కాబోతున్న సంగతి తెలిసిందే. Sunday Pulao made with loads of love ❤️. What more can I ask for. 🤗🤗🤗 pic.twitter.com/EegIdtsU80 — Upasana Konidela (@upasanakonidela) April 16, 2023 -
ఏంటీ, పెళ్లిలో నాన్‌వెజ్ లేదా?.. మూడు దశాబ్దాలుగా ఇదే ఆచారం!
‘పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్టమధు, మంథని ప్రాంతానికి చెందిన ఎంపీపీలు, పలువురు ప్రజాప్రతినిధులు ఇటీవల సిరిసిల్లలో జరిగిన పెళ్లి వేడుకల్లో పాల్గొన్నారు. వధువరులను ఆశీర్వదించి భోజనాలకు ఉపక్రమించారు. విందులో పప్పు, పచ్చిపులుసు, పప్పుచారు, వంకాయ, టమాట, గోబీఫ్రై, ఆలుగడ్డ కర్రీ, మిర్చి, స్వీట్లను చూసి అవాక్కయ్యారు. నాన్‌వెజ్ లేదా..! అని పుట్ట మధు ప్రశ్నించారు. సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో నాన్‌వెజ్ పెట్టరని, ఓన్లీ వెజ్ మాత్రమే వడ్డిస్తారని చెప్పడంతో మధుతో పాటు, మంథని ప్రాంతానికి చెందిన ప్రజాప్రతినిధులు షాకయ్యారు.’ సాక్షి, సిరిసిల్ల: ఇంట్లో పెళ్లి చేస్తున్నామంటే మొదటగా అతిథులకు రుచికరమైన భోజనం వడ్డించాలని ఆలోచన చేస్తారు. తెలంగాణ జిల్లాల్లో ఎక్కడైనా పెళ్లిల్లో మాంసాహారానికి అగ్రతాంబూలం ఉంటుంది. కానీ కార్మిక క్షేత్రమైన సిరిసిల్లలో ఎంతపెద్ద కోటీశ్వరులైనా.. పేదోళ్లయినా పెళ్లిళ్లలో శాకాహారం.. సాత్విక ఆహారంతోనే విందు చేస్తారు. ఇది నిన్న, మొన్నటి విధానం కాదు.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్ల పద్మశాలీ సమాజంలో కొనసాగుతోంది. లక్ష జనాభా ఉన్న పట్టణంలో పద్మశాలీ సమాజమే 80శాతం ఉంటుంది. అందరికీ ఆదర్శంగా నిలు స్తున్న ఆ సాంప్రదాయంపై సండే స్పెషల్.. మూడు దశాబ్దాలుగా సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా పద్మశాలీ సమాజంలో పెళ్లిళ్లలో శాకాహారం ఏర్పాటు చేయడం ఆనవాయితీగా వస్తోంది. 1993లో మొదలైన ఆచారం 30 ఏళ్లుగా కొనసాగుతోంది. సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాలైన చంద్రంపేట, రాజీవ్‌నగర్, తంగళ్లపల్లిలోనూ శాకాహార భోజనాలనే పెళ్లిలో వడ్డిస్తున్నారు. సంఘం స్ఫూర్తి.. అదే కీర్తి 1992లో సిరిసిల్ల పద్మశాలీ సంఘం పెద్దలుగా ఉన్న రుద్ర శంకరయ్య, గూడూరి పర్శరాం, గున్నాల రామచంద్రం, కొండ శంకరయ్య, కట్టెకోల లక్ష్మీనారాయణ, కుడిక్యాల రాజారాం పెళ్లిలో శాకా హారం వడ్డించాలని తీర్మాణం చేసి అమలు చేశారు. కొద్ది రోజులకే శాంతినగర్‌లోని ఓపెళ్లిలో ఈ నిర్ణయాన్ని ఉల్లంఘించి మాంసాహారాన్ని వడ్డించారు. ఈ విషయం తెలుసుకున్న పద్మశాలీ సంఘం పెద్దలందరూ ఆ పెళ్లికి వెళ్లి వధూవరులను ఆశీర్వదించి, భోజనం చేయకుండా వెనుదిరిగారు. ఆ సంఘటన అప్పట్లో చర్చనీయాంశమైంది. పెళ్లి పెద్దలు సైతం మరుసటి రోజే సంఘం పెద్దవద్దకు వచ్చి పొరపాటైందని అంగీకరించారు. 1993 నుంచి సిరిసిల్ల పట్టణంతో పాటు పరిసర గ్రామాల్లో పద్మశాలీ సమాజం శాకాహార భోజనాలు వడ్డిస్తున్నారు. రిసెప్షన్ వేడుకల్లో వారి ఇష్టం ఆర్థిక అసమానతలున్న సిరిసిల్లలో శాకాహార భోజనం అందించడం స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. పెళ్లి జరిగే ఇంట్లో హోమం ఉంటుంది కాబట్టి మాంసాహారం ముట్టకూడదన్న కులపెద్దల నిర్ణయం మేరకు మాంసాహారాన్ని బంద్ చేశారు. ఆర్థికంగా ఉన్నవారు పెళ్లిలో శాకాహార భోజనం పెట్టి, మరుసటి రోజు పెళ్లి రిసెప్షన్లో (విందులో) మాంసాహార భోజనాలు పెడుతుంటారు. ఇది వారి వ్యక్తిగతం పెళ్లిలో మాత్రం మాంసాహారం ఉండదు. సాత్వికాహారం ఆరోగ్యానికి మంచిదని పద్మశాలీ సంఘం పెద్దలు నిర్ణయించారు. అందరూ తింటారు శాకాలతో భోజనం పెడితేనే ఆరోగ్యానికి మంచిది. మాంసాహారం ఖర్చుతో కూడుకున్న పని. కూరగాయల భోజనమైతే అందరు చేస్తారు. శాకాహారమైతే అందరికీ బాగుంటుంది. సిరిసిల్ల పద్మబ్రాహ్మణులు, సంఘం పెద్దలు శాకాహార భోజనం విషయంలో మంచి ప్రోత్సాహం ఇచ్చి.. స్ఫూర్తిగా నిలిచారు. – కాముని వనిత, పద్మశాలీ సంఘం మహిళా అధ్యక్షురాలు, సిరిసిల్ల చాలా ప్రాంతాల్లో.. ఉమ్మడి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో పెళ్లిలో నాన్ వెజ్ పెట్టవద్దని తీర్మాణాలు చేశారు. అందరికీ సిరిసిల్ల స్ఫూర్తిగా నిలిచింది. కానీ ఆయా ప్రాంతాల్లో సంఘాల పర్యవేక్షణ లేక కొన్ని ప్రాంతాల్లో అమలు చేస్తున్నారు.. కొన్ని గ్రామాల్లో ఉల్లంఘించారు. ఎవరిష్టం వారిదే అన్నట్లుగా మారింది. సిరిసిల్లలో మూడు దశాబ్దాలుగా అమలవుతోంది. – కొక్కుల భాస్కర్, పద్మశాలీ జాతీయ పరిషత్ అధ్యక్షుడు ఇప్పటికీ అమలవుతోంది చాలా ఏళ్ల కిందట పద్మశాలీ సంఘం పెద్దలు తీసుకున్న ఆ నిర్ణయం ఇప్పటికీ అమలవుతోంది. పెళ్లిళ్లలో మాంసం వద్దని తీర్మానం చేశారు. అన్ని రకాలుగా అదే మంచిదని అందరూ భావించారు. ఉన్నవాళ్లు ఉంటారు.. లేనివాళ్లు ఉంటారు.. అందరూ సమానమే అని చెప్పడం కోసం శాకాహార భోజనాలను అమలు చేస్తున్నాం. – గోలి వెంకటరమణ, పద్మశాలీ సంఘం అధ్యక్షుడు, సిరిసిల్ల -
వైర్లు లేకుండా విద్యుత్
సాక్షి, అమరావతి: ప్రపంచవ్యాప్తంగా పునరుత్పాదక విద్యుత్ రంగంలో రోజురోజుకూ కొత్తకొత్త సాంకేతికత వెలుగులోకి వస్తోంది. ప్రస్తుతానికి కొంచెం వింతగా అనిపించినా భవిష్యత్తులో సాధారణంగా మారే అవకాశం ఉన్న సరికొత్త పరిజ్ఞానాన్ని శాస్త్రవేత్తలు ఆవిష్కరిస్తున్నారు. అసాధ్యాన్ని సుసాధ్యం చేస్తున్న అలాంటి కొన్ని సరికొత్త వాస్తవాలను పరిచయంచేసే ప్రయత్నమే ఈ వారం సండే స్పెషల్. వైర్లెస్ విద్యుత్.. ప్రస్తుతం మనకు వైర్లెస్ ఇంటర్నెట్ గురించి తెలుసు. కానీ, వైర్లెస్ కరెంటు గురించి తెలీదు. త్వరలోనే ప్రతి ఇంట్లోకి వైర్లెస్ కరెంట్ అందుబాటులోకి రాబోతోందని దక్షిణ కొరియాలోని సెజాంగ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంటున్నారు. 30 మీటర్ల దూరం వరకూ ఇన్ఫ్రారెడ్ కాంతిని ఉపయోగించి, 400 మిల్లీవాట్ల వైర్లెస్ విద్యుత్‌తో ఎల్ఈడీ లైటును వెలిగేలా చేశారు. ట్రాన్స్‌మీటర్, రిసీవర్ ద్వారా ఈ విద్యుత్ సరఫరా జరిగినప్పుడు ఏదైనా ఆటంకం కలిగితే వెంటనే వ్యవస్థ మొత్తం పవర్ సేఫ్ మోడ్‌లోకి వెళ్లిపోతుంది. దీంతో ఎలాంటి అపాయాలు జరగవని పరిశోధన బృందం పేర్కొంది. అంతేకాదు.. ఈ సాంకేతికత ద్వారా స్మార్ట్‌హోమ్స్ లేదా పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఇంటర్నెట్ ద్వారా పనిచేసే పరికరాలు)కు విద్యుత్‌ను అందించే అవకాశముంటుందని చెబుతున్నారు. ఇసుకతో బ్యాటరీ.. ఫిన్లాండ్ శాస్త్రవేత్తలు ఇసుకతో పనిచేసే బ్యాటరీని అభివృద్ధి చేశారు. దీనిలో ఒకసారి గ్రీన్ పవర్‌ను స్టోర్చేస్తే నెలవరకూ నిల్వ ఉంటుంది. సౌర, పవన విద్యుత్ లాంటి గ్రీన్ ఎనర్జీని ఏడాది పొడవునా అందించడంలో సమస్యలు ఎదురవుతున్నాయి. వీటిని ఈ తాజా బ్యాటరీ పరిష్కరించగలదని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పునరుత్పాదక విద్యుత్‌ను ఉష్ణం రూపంలో 500 డిగ్రీల సెంటీగ్రేడ్ వద్ద దీనిలో నిల్వచేయొచ్చు. సోలార్, పవన విద్యుత్‌ను గ్రిడ్లతో అనుసంధానించవచ్చు. కానీ, రాత్రివేళ, గాలి లేనప్పుడు విద్యుదుత్పత్తి జరగదు. ఈ సమస్యను పెద్దపెద్ద బ్యాటరీలతో పరిష్కరించవచ్చు. ప్రస్తుతం చాలావరకు బ్యాటరీలను లిథియంతోనే తయారుచేస్తున్నారు. ఇది చాలా ఖరీదైన లోహం. ఫిన్లాండ్ ఇంజినీర్లు ఇసుకతో తయారుచేసిన బ్యాటరీలో తక్కువ ఖర్చుతో విద్యుత్ నిల్వచేయగలిగారు. అమెరికాలోని నేషనల్ రెన్యూవబుల్ ఎనర్జీ లే»ొరేటరీ కూడా ఇసుకను హరిత ఇంధనంగా భావించి పరిశోధనలు చేపట్టింది. రాత్రిపూటా సోలార్ విద్యుత్ రాత్రిపూట కూడా విద్యుత్‌ను ఉత్పత్తిచేసే సోలార్ ప్యానెల్‌ను కాలిఫోరి్నయాలోని స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఇంజనీర్లు తయారుచేశారు. ఇప్పుడు మనం చూసే సోలార్ ప్యానెల్ ఏదైనా పగటిపూట మాత్రమే విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఎందుకంటే దానికి సూర్యకాంతి అవసరం. కానీ.. కొత్త ప్యానెల్స్‌తో బ్యాటరీ ఛార్జ్ అవుతుంది. ఆ బ్యాకప్ నుంచి పగలు, రాత్రి నిరంతరంగా విద్యుత్ సరఫరా చేయవచ్చు. రాత్రిపూట విద్యుదుత్పత్తి కోసం ఇంజనీర్లు థర్మోఎలక్ట్రిక్ జనరేటర్‌ను రూపొందించారు. ఈ జనరేటర్ సోలార్ ప్యానెల్, గాలి, ఉష్ణోగ్రత మధ్య వ్యత్యాసం ద్వారా ఉత్పత్తి అయిన శక్తిని విద్యుత్‌గా మారుస్తుంది. ఎన్నెన్నో ప్రయోగాలు.. ఇక గాలిపటాలతో విద్యుత్‌ను పుట్టించే టెక్నాలజీని స్కాట్లాండ్కు చెందిన రాడ్ కనిపెట్టారు. ‘ఫ్లయింగ్ టర్బైన్’ టెక్నాలజీని ఆయన ఆవిష్కరించారు. గాలి పటాలు తిరుగుతున్నప్పుడు విడుదలయ్యే శక్తిని కింద ఉండే గ్రౌండ్ స్టేషన్ విద్యుత్‌గా మారుస్తుంది. మరోవైపు.. బ్రిటన్‌లోని ఒక నైట్‌క్లబ్ తమ క్లబ్‌కు వచ్చి డ్యాన్స్ చేసే కస్టమర్ల శరీర ఉష్ణోగ్రతల ఆధారంగా విద్యుత్ తయారుచేస్తోంది. ‘బాడీహీట్’ పేరుతో ఇలా తయారుచేసిన విద్యుత్‌ను నిల్వచేసుకుని అవసరమైనప్పుడు వాడుకునేలా ఏర్పాటు కూడా చేసింది. పలు దేశాలతోపాటు ఆంధ్రప్రదేశ్‌లోనూ సముద్ర అలలతో విద్యుదుత్పత్తి చేసే అవకాశాలపై అధ్యయనం జరుగుతోంది. ఇటీవల మన రాష్ట్రంలో ప్రపంచంలోనే అతిపెద్దదైన నీటిలో తేలియాడే ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్‌ను స్థాపించారు. ఇక బొగ్గు కొరత నుంచి బయటపడేందుకు బ్లూ హైడ్రోజన్ ప్రత్యామ్నాయమని జపాన్ భావిస్తోంది. అమ్మోనియానుగానీ, హైడ్రోజన్‌ను గానీ మండించడం ద్వారా విద్యుదుత్పత్తి చేయడమే ఈ బ్లూ హైడ్రోజన్ విధానం. జపాన్‌లోని టోక్యోలో బ్లూ హైడ్రోజన్ ఫ్యూయెల్ సెల్‌తో వాహనాలను ఆ దేశం ప్రయోగాత్మకంగా నడిపింది. -
ట్యాంక్‌బండ్‌పై ‘సండే పండగ’ సందడి... కళ‘కళ’లాడుతున్న సాగర తీరం
-
‘ట్యాంక్‌బండ్‌పైకి నో ఎంట్రీ’.. ఎందుకో తెలుసా..?
సాక్షి, సిటీబ్యూరో: ట్యాంక్‌బండ్ పైకి ఆదివారాల్లో వాహనాలకు నో ఎంట్రీ విధానం అమలు చేస్తున్నారు. దీన్ని ఇప్పటి వరకు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 10 గంటల మధ్య కేవలం సందర్శకులకే కేటాయించారు. ఈ సమయాన్ని మరో రెండు గంటలు పొడిగించాలని నగర పోలీసు కమిషనర్ అంజనీకుమార్ నిర్ణయించారు. ఆయన నుంచి ఆదేశాలు అందుకున్న క్షేత్రస్థాయి అధికారులు మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ విధానం అమలుకు కసరత్తు చేస్తున్నారు. (చదవండి: ఇంట్లో మృతిచెందినా పరిహారం) ఈ ఆదివారం (సెప్టెంబర్ 26వ తేదీ) నుంచే దీన్ని కార్యరూపంలోకి తేవాలని భావిస్తున్నారు. గత నెల 24న అశోక్ చంద్రశేఖర్ అనే నెటిజనుడు చేసిన ట్వీట్‌కు స్పందించిన మంత్రి కేటీఆర్ ఆదివారాల్లో ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించేలా చర్యలు తీసుకోవాలని పోలీసు విభాగాన్ని సూచించారు. దీంతో యుద్ధప్రాతిపదికన చర్యలు తీసుకున్న ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం అధికారులు గత నెల 29వ తేదీ నుంచి దీన్ని అమలులోకి తీసుకువచ్చారు. ఇటీవల ప్రభుత్వం సైతం భారీగా నిధులు వెచ్చించి ట్యాంక్‌బండ్‌ను సుందరీకరణ ప్రాజెక్టు చేపట్టింది. దీనికి తోడు ఆదివారం సాయంత్రం వేళల్లో వాహనాలను నో ఎంట్రీ జోన్‌గా మార్చడంతో ప్రజల నుంచి భారీ స్పందన వచ్చింది. ఈ విధానం అమలైన తొలిరోజు స్వయంగా నగర కొత్వాలే ట్యాంక్‌బండ్ వద్దకు వెళ్లి సందర్శకులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూడు ఆదివారాలు ఈ విధానం అమలు కాగా.. గణేష్ నిమజ్జనం నేపథ్యంలో గత వారం సాధ్యం కాలేదు. ఆ ప్రాంతానికి వస్తున్న సందర్శకుల తాకిడి, వారి అభిప్రాయాలను ఉన్నతాధికారులు ఎప్పటికప్పుడు పరిగణనలోకి తీసుకుంటున్నారు. వీటి ఆధారంగా మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు ట్యాంక్‌బండ్‌ను సందర్శకులకే కేటాయించాలని నిర్ణయించారు. ఆదివారం సాయంత్రం వేళల్లో ట్యాంక్‌బండ్‌కు వచ్చే సందర్శకుల కోసం దానిపైనే పార్కింగ్ ఏర్పాటు చేశారు. రెండు పక్కలా పార్కింగ్ ఉండేలా చర్యలు తీసుకున్నారు. అంబేడ్కర్ విగ్రహం వైపు నుంచి వచ్చే సందర్శకుల వాహనాలకు లేపాక్షి వరకు, రాణిగంజ్ వైపు నుంచి వచ్చే వాటికి చిల్డ్రన్ పార్క్ వరకు పార్కింగ్‌కు కేటాయించారు. (చదవండి: తెలంగాణ పర్వతారోహకుడికి సీఎం జగన్ భారీ ఆర్థిక సహాయం) Glimpses of Sunday-Funday @TankBund yesterday @KTRTRS @HMDA_Gov pic.twitter.com/1mldNxzug3 — Arvind Kumar (@arvindkumar_ias) September 13, 2021 -
Bigg Boss 5 Telugu: ఈసారి ఎవరు?
ఆకర్షణీయమైన నాలుగు గోడల ‘బందీఖానా వినోదం’కు మళ్లీ తెర లేవనుంది. బిగ్‌బాస్ హౌస్‌లో కంటెస్టెంట్ల మధ్య స్నేహం, శతృత్వం, పోటీ, ప్రతీకారం... ఇవన్నీ జనం కుతూహలంగా చూడనున్నారు. మరో వారం రోజుల్లో సెప్టెంబర్ 5 నుంచి బిగ్‌బాస్ 5 తెలుగు. నాగార్జున యాంకర్ అని తెలుసు. కాని ఈసారి కంటెస్టెంట్లు ఎవరు? అసలు ఈ షో సక్సెస్ ఫార్ములా ఏమిటి? సండే స్పెషల్... ఎదుటివారి జీవితంలోకి తొంగి చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. పల్లెల్లో అయితే నిన్న మొన్నటి వరకూ బహిరంగ జీవితం ఉండేది. ఏ ఇంట్లో ఏ మంచి చెడు జరిగినా అందరికీ తెలిసిపోయేది. కాని ఇప్పుడు మనుషులు ‘ప్రయివేటు’గా ఉండటానికే ఇష్టపడుతున్నారు. జ్వరం వచ్చినా, ఆరోగ్యం బాగలేకపోయినా మన ఇంటి వరకే అనుకుంటున్నారు. సమస్యలు, సంతోషాలు కూడా దాచుకుంటున్నారు. ఇక నగరాల్లో ఎవరికి వారే మూసీకి నీరే. పక్క ఫ్లాట్‌లో ఏం జరుగుతున్నదో తెలిసే అవకాశమే లేదు. ఈ వెలితిని, మానవ స్వభావంలో ఉండే ‘పొరుగింటి కుతూహలాన్ని’ అడ్రస్ చేస్తూ సూపర్‌హిట్ అయిన షో ‘బిగ్‌బాస్’. మొదట హిందీలో మొదలయ్యి ఆ తర్వాత ప్రాంతీయ భాషల్లోకి మారిన ఈ షో ఇంటింటా రాత్రుళ్లు ‘ఇంకో ఇంటి’ని తీసుకొచ్చి ఆ ఇంటి సభ్యుల జీవితాన్ని పరిశీలించే వినోదాన్ని ఇస్తూ ఒక సీజన్ అయిన వెంటనే మరో సీజన్ ఎప్పుడూ అని ఎదురు చూసేలా చేస్తుంది. ఆ ఎదురు చూపులకు జవాబే వచ్చే వారం మొదలు కానున్న ‘బిగ్‌బాస్ 5’. 16 మనస్తత్వాల గేమ్ బిగ్‌బాస్ హౌస్‌లో భిన్న నేపథ్యాలు, సామాజిక జీవనాలు, సెలబ్రిటీ స్టేటస్లు, వయసులు, జెండర్లు ఉన్న కంటెస్టెంట్లను 16 మందిని ఒకచోట చేర్చి వారి ఇంటికి బయట నుంచి తాళం వేసి వారి మధ్య నడిచే ‘భావోద్వేగాల డ్రామా’ను లెక్కకు మించిన కెమెరాలతో రికార్డు చేయడమే బిగ్‌బాస్ షోలో విశేషం. ఒకసారి వచ్చిన వారు మరోసారి రారు కనుక ప్రతిసారీ కొత్త మనుషుల స్వభావాలను చూసే వీలు ఈ షోలో ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ వీరి మధ్య స్నేహాలు ఏర్పడతాయి. శతృత్వాలు ఏర్పడతాయి. కక్షలు క్షణికావేశాలు... ఇవన్నీ ఉత్కంఠను కలిగిస్తాయి. ఎంత సెలబ్రిటీ అయినా సగటు సందర్భాలలో ఎలా ప్రవర్తిస్తాడో చూపడమే ఈ షో ఫార్ములా. మానవ మనస్తత్వాన్ని గుర్తెరిగి ఎదుటివారి ప్రవర్తనకు చలించకుండా ఎవరైతే తమ వ్యక్తిత్వాన్ని కాపాడుకుంటారో లేదా తమ వ్యక్తిత్వాన్ని నిజాయితీగా ప్రదర్శనకు పెడతారో వాళ్లే ఈ షోలో విజేతలు అవుతారు. లేని వారు ఎలిమినేట్ అవుతూ వెళతారు. ఈసారి ఎవరు? బిగ్‌బాస్ షో మొదలయ్యే వరకు అందులో పాల్గొనేవారు ఎవరు అనే విషయాన్ని షో నిర్వాహకులు రహస్యంగా ఉంచుతారు. అయినా సరే ‘లీకుల’ కోసం ప్రయత్నించి కొద్దో గొప్పో సమాచారాన్ని, ఊహాగానాలు చేయడాన్ని ప్రతిసారీ చూడవచ్చు. షోను అద్యంతం ఆసక్తికరం చేయడానికి నిర్వాహకులు రకరకాల సెలబ్రిటీస్‌ను చివరివరకూ సంప్రదిస్తూనే ఉంటారు. కనుక ఫైనల్ లిస్ట్ అనూహ్యంగా ఉంటుంది. బిగ్‌బాస్ 5 కోసం ఎవవరెవరిని సంప్రదించారు అనే విషయంలో ఎవరెవరు పాల్గొంటారన్న విషయంలో కొన్ని పేర్లు వినిపిస్తున్నాయి. వాటిలో సీనియర్ నటి సురేఖవాణి పేరు ఒకటి. టీవీ, సినిమాల్లో ఆదరణ పొందిన సురేఖవాణి మంచి మాటకారి. కనుక ఆమె షోలో ఆమె ఉండటం బాగుంటుందని భావించవచ్చు. అలాగే టీవీ, సినీ నటి ప్రియ కూడా కంటెస్టెంట్ల జాబితాలో ఉందని భోగట్టా. హుందా అయిన పాత్రలు చేసిన ప్రియ బిగ్‌హౌస్‌లో ఉండటం మహిళా ప్రేక్షకులకు నచ్చొచ్చు. టీవీ యాంకర్ల కోటాలో ఈసారి రవికి అవకాశం దక్కిందని అంటున్నారు. రవి కూడా మంచి మాటకారి కనుక ఈ షోకు ఎనర్జీ తెచ్చే అవకాశం ఉంది. గతంలో డాన్స్మాస్టర్లు బాబా మాస్టర్, అమ్మ రాజశేఖర్ల వరుసలో ఈసారి డాన్స్‌మాస్టర్ నట్రాజ్ పేరు వినిపిస్తోంది. అలాగే ఈసారి వినిపిస్తున్న మరోపేరు దీపక్ సరోజ్. ‘అతడు’ సినిమాలో బ్రహ్మానందం కొడుకుగా బాలనటుడిగా కనిపించిన దీపక్ సరోజ్ ఆ తర్వాత ‘మిణుగురులు’ సినిమాలో నటించాడు. ఈసారి యూత్ ఐకాన్‌గా అతడు షోలో కనిపించవచ్చు. వీరు కాకుండా జబర్దస్త్ టీమ్ నుంచి పవన్, యాంకర్ లోబో పేర్లు కూడా వినపడుతున్నాయి. ఇంకా యూట్యూబ్ స్టార్లు కొందరు చోటు దక్కించుకోవచ్చు. సీనియర్లు కొందరు రంగప్రవేశం చేయొచ్చు కూడా. 100 రోజులు ఎవరిస్తారు? బిగ్‌బాస్ హౌస్‌లో కనీసం 100 రోజులు ఉండాలి. 100 రోజుల పాటు కుటుంబాన్ని, కెరీర్‌ను పక్కన పెట్టి ఈ షోలో పాల్గొనాల్సి ఉంటుంది. పైగా బిగ్‌బాస్ టాస్కుల్లో నచ్చినా నచ్చకపోయినా పాల్గొనాల్సి ఉంటుంది. సున్నిత మనస్కులకు ‘నామినేషన్’ ప్రక్రియ పెద్ద శిక్షే. అదీగాక ఈ షో వల్ల వచ్చే పాపులారిటీ బాగానే ఉన్నా అది కొత్తవారికి ఉపయోగపడినంతగా సీనియర్స్‌కు ఉపయోగపడదు. అందుకే షో తాలూకు సీజన్లు గడిచే కొద్దీ ‘తెలిసిన స్టార్లు’ తగ్గుతూ వెళ్లి పూర్తిగా కొత్త ముఖాలు చోటు చేసుకోవడం బిగ్‌బాస్ షో ట్రెండ్‌ను గమనించినవారికి అర్థమవుతుంది. గతంలోని బిగ్‌బాస్ సిరీస్‌ల వల్ల హరితేజ, రోల్ రైడ, రాహుల్ సిప్లిగంజ్, సోహైల్ తదితర యువతరం సెలబ్రిటీలే ఎక్కువగా లబ్ధి పొందారు. సెప్టెంబర్ 5 నుంచి మొదలు సెప్టెంబర్ 5 నుంచి ‘మా’ టీవీలో మొదలుకానున్న ఈ షో ఈసారి ఎన్ని సర్ప్రైజ్లను తేనుందో తెలియదు. యాంకర్‌గా నాగార్జున గత సీజన్లో మరింత ఈజ్‌తో షోను రక్తి కట్టించారు. ఆయనకు వీలు కాని రోజుల్లో ఒకసారి నటి రమ్యకృష్ణ, ఒకసారి సమంత షోను హోస్ట్ చేయడం కూడా విశేషం. ఈసారి ఆయన కాస్ట్యూమ్స్, లుక్ ఎలా ఉంటాయన్నది ఆసక్తికరమే. ఏమైనా ఒక పెద్ద వినోదానికి తెర లేవనుంది. నానా చికాకులతో ఉన్న నేటి ప్రేక్షక లోకానికి ఈ షో ద్వారా మంచి వినోదం అందుతుందనే ఆశిద్దాం. -
సిగలో అవి విరులో...
‘ఊహ తెలిశాక నేను చదివిన తొలి కవిత– నీ పేరు’ అంటాడు వినీత్ టబూతో ‘ప్రేమికుల దేశం’లో. ‘చరణ కింకిణులు ఘల్లుఘల్లుమన’ అంటాడు ‘చెల్లెలి కాపురం’లో శోభన్‌బాబు. ‘మరుమల్లెల కన్నా తెల్లనిది’ అని ఇదే శోభన్‌బాబు ‘మల్లెపూవు’లో కవిత్వం రాస్తాడు. ‘సిగలో అవి విరులో’ అని అక్కినేని జయసుధలోనే తన ఊహాసుందరిని వెతుక్కుంటాడు ‘మేఘసందేశం’లో. ‘రానీ రానీ వస్తే రానీ కష్టాల్ నష్టాల్ కోపాల్ తాపాల్’ అని తానే శ్రీశ్రీగా అవతరిస్తాడు కమలహాసన్ ‘ఆకలి రాజ్యం’లో. ఢిష్యూం ఢిష్యూం హీరోలకు కవిత్వం చుక్కెదురే. కాని కొన్ని సినిమాలలో వారి వల్ల కవిత్వం మెరిసింది. ‘నేడు ప్రపంచ కవితా దినోత్సవం’ సందర్భంగా సినిమాల్లో కవులపై సండే స్పెషల్... ‘సాగర సంగమం’లో కమలహాసన్ గొప్ప డాన్సర్. కాలక్షేపానికి కల్చరర్ రిపోర్టర్‌గా చేస్తూ శైలజ డాన్స్‌ని విమర్శించాడని అతణ్ణి అవమానిస్తారు. దానిని ఎంత భరించాలో అంత భరిస్తాడు. కాని చాలక అతడి స్నేహితుడైన శరత్‌బాబును ఉద్యోగంలో నుంచి తీసేస్తారు. అది మాత్రం భరించలేకపోతాడు. శరత్ బాబు అదే పేపర్లో ప్రూఫ్‌రీడర్. కాని అతడు ఒక గొప్ప కవి. ‘ఒక మహా కవికి ప్రూఫ్‌రీడర్ ఉద్యోగం ఇవ్వడమే కాక మళ్లీ ఉద్యోగంలో నుంచి తీసేస్తారా’ అని పత్రికాఫీసుకు వెళ్లి నానా రభసా చేస్తాడు. ‘టూ మిస్టేక్స్.. టూ మిస్టేక్స్’ అని రొప్పుతాడు. నిజమే. కవి అరుదు. కవి గౌరవం ఇవ్వవలసినవాడు. కవి సగటు మనిషి కంటే ఒక మెట్టు ఉన్నతుడు. అతడు కవిత్వం పలుకుతాడు. మనిషికి అవసరమైనది ఆహ్లాదపరిచేది అందులో ఏదో ఉంటుంది. అందుకే అతడు ఉన్నతుడు. పద్యమే... అది మన సొంతం ప్రపంచమంతా కవిత్వం ఉంది. తెలుగు వారికి పద్యం ఉంది. పదం ఉంది. వాగ్గేయకారులు ఉన్నారు. అందుకే సామాన్యులకు వచనం రాసేవారు, నాటకం రాసేవారు, నవలలు రాసే వారు ఎక్కువగా తెలియదు. ‘కై’గట్టేవాళ్లే తెలుస్తారు. తెలిశారు. ‘వాడు కైగడతాడురా’ అంటారు. బడికి వెళ్లి చదువుకోనివారికి కూడా ఒక వేమన పద్యం తెలుసు. పోతన భాగవతం తెలుసు. అందుకే కవికి ఆ దర్జా ఆ హోదా. తెలుగు సినిమా ఆ విషయాన్ని కనిపెట్టకుండా ఎలా ఉంటుంది. అందుకే కవులే కథా నాయకులుగా సినిమాలు వచ్చాయి. చిత్తూరు వి.నాగయ్య మనకు తెలుగు తెర మీద కవిని చూపించారు. ‘యోగి వేమన’ ఆయనే. ‘భక్త పోతన’ ఆయనే. రెంటికీ కె.వి.రెడ్డి దర్శకత్వం వహించారు. ఒక కవి అచ్చతెనుగులో మరో కవి గ్రాంథిక తెనుగులో కవిత్వం చెప్పి తెలుగువారి సారస్వతానికి లంకెల బిందెలు ఇచ్చి వెళ్లారు. వెండితెర అది నిక్షిప్తం చేసింది. కవి అంటే అక్కినేనే కత్తి పట్టుకునే ఎన్.టి.రామారావు ఘంటం పట్టుకుంటే బాగోదని నిర్మాత దర్శకులు అనుకున్నారో ఏమో అక్కినేనిని కవిని చేశారు. ‘మహాకవి కాళిదాసు’లో అక్కినేని కాళిదాసుగా అద్భుతమైన నటనను ప్రదర్శిస్తారు. ‘మాణిక్యవీణాం ముఫలాల యంతి’ అని సరస్వతి కటాక్షం తర్వాత తన్మయత్వంతో ఆయన చేసే స్తోత్రం పులకింప చేస్తుంది. అక్కినేనికే ఆ తర్వాత ‘తెనాలి రామకృష్ణ’ కవి పాత్ర పోషించే గొప్ప అవకాశం దొరికింది. ఈ వికటకవి తెలుగువారికి ప్రీతిపాత్రుడు. సినిమాని అందుకే హిట్ చేశారు. ఎన్.టి.ఆర్ శ్రీకృష్ణదేవరాయలుగా అక్కినేని ఆదరించడం, ఆయన అల్లరికి అదిరిపోవడం ఈ సినిమాలో చూశాం. అక్కినేనికి భక్తికవుల పాత్రలు దొరికాయి. ‘భక్త జయదేవ’, ‘భక్త తుకారాం’, ‘మహాకవి క్షేత్రయ్య’ ఇవన్నీ ఆయనకు దొరికిన అదృష్టపాత్రలే అనుకోవాలి. నాగార్జున అన్నమయ్యలో ‘భక్త కబీర్’గా కూడా ఆయన నటించారు. కబీర్ మహాకవి కదా. శ్రీనాథ కవిసార్వభౌమ అయితే ఎన్.టి.ఆర్కు మాత్రం శ్రీనాథ కవి సార్వభౌముడి పాత్ర పోషించాలని ఉండిపోయింది. ఆయన ‘బ్రహ్మంగారి’ పాత్ర పోషించినా ఆయన కవితాత్మకంగా భవిష్యత్తు చెప్పినా అది కాలజ్ఞానంగా జనం చెప్పుకున్నారు తప్ప కవిత్వంగా కాదు. కనుక తెలుగువారి ఘన కవి శ్రీనాథుడిని వెండి తెర మీద చూపడానికి ఎన్.టి.ఆర్ ఏకంగా బాపు, రమణలను రంగంలోకి దించారు. ఎంతో ఇష్టపడి కష్టపడి నటించారు. అయితే మునపటి దర్శక నిర్మాతల అంచనాయే కరెక్టు. ఎన్‌టిఆర్‌ను కవిగా ప్రేక్షకులు పెద్దగా మెచ్చలేకపోయారు. చరణ కింకిణులు సాంఘిక సినిమాలు వచ్చేసరికి కవిగా శోభన్‌బాబుకు ఎక్కువ అవకాశాలు వచ్చాయి. ‘చెల్లెలి కాపురం’లో నిజ కవి సి.నారాయణరెడ్డి సహాయంతో తెర మీద ఆయన చెలరేగిపోయారు. ‘చరణకింకిణులు ఘల్లుఘల్లుమన’ అని ఆయన పాడే పాట నేటికీ హిట్. ‘ప్యాసా’ రీమేక్‌గా తెలుగులో ‘మల్లెపువ్వు’ సినిమా తీస్తే హిందీలో గురుదత్ వేసిన పాత్ర శోభన్‌బాబుకు దక్కింది. ఆ పాత్రను ఆయన హుందాగా చేసి సినిమా హిట్ కావడానికి కారకుడయ్యాడు. ‘మరుమల్లెల కన్నా తీయనిది’, ‘ఎవరికి తెలుసు చితికిన మనసు’, ‘చిన్నమాటా ఒక చిన్నమాటా’ పాటలన్నీ అందులోవే. ఆకలేసి కేకలేసి ‘ఆకలేసి కేకలేశాను’ అన్నాడు శ్రీశ్రీ. ఆకలేసిన కుర్రకారు తన ఆగ్రహన్ని, ఆక్రందనను శ్రీశ్రీ కవితల ద్వారానే వ్యక్తం చేశారు. అలా చేయని వారిని ‘కొంతమంది కుర్రవాళ్లు పుట్టుకతో వృద్ధులు’ అని హేళన చేశారు. ‘ఆకలి రాజ్యం’ సినిమాలో కమలహాసన్ ప్రతి ముఖ్యమైన సందర్భంలో శ్రీశ్రీని తలుచుకుంటాడు. ‘పతితులారా భ్రష్టులారా బాధాసర్పదష్టులారా ఏడవకండేడవకండి’ అని పొయెట్రీ చెబుతాడు. ఆకలికి తాళలేక శ్రీశ్రీ పుస్తకాలు అమ్ముతాడు. ‘విప్లవకవి శ్రీరంగం శ్రీనివాసరావు విలువ 3 రూపాయలు’ అని కన్నీరు కారుస్తాడు. ఒక నిజ కవి సినిమాలో నిజ కవిగా వ్యక్తీకరణ కావడం ఈ సినిమాతోనే మొదలు ఆఖరు. ప్రేమ కవిత్వం ఊహాసుందరిని ఊహించుకుని కవిత్వం చెప్పే తెలుగు హీరోలు కూడా ఉన్నారు. ‘సువర్ణ సుందరి’లో చంద్రమోహన్, ‘మేఘ సందేశం’లో నాగేశ్వరరావు ఇలా కనిపిస్తారు. మేఘసందేశంలో భార్యను తన ఊహా సుందరిగా మలుచుకోవడానికి అక్కినేని చూసినా ఆమెకు అదంతా తెలియదు. ఆ ఆర్తిని జయప్రద తీర్చాల్సి వస్తుంది. ‘సంకీర్తన’లో నాగార్జున కవిగా కనిపిస్తాడు. ఆ తర్వాత డబ్బింగ్ సినిమాలో కవిత్వం కనిపిస్తుంది. మణిరత్నం ‘ఇద్దరు’, ‘అమృత’ సినిమాలలో కవిత్వం విస్తృతంగా ఉంటుంది. ‘ప్రేమదేశం’లో కవిత్వాన్ని చెప్పే ఆస్వాదించే కుర్రాళ్లను చూపిస్తాడు దర్శకుడు. కొత్తతరం హీరోలు ఈ కవిత్వానికి దూరంగా ఉన్నారు. జీవితంలో అయినా సినిమాల్లో అయినా పొయెట్రీ మిస్ కావడం వెలితి. కవిత్వం వర్థిల్లాలని కోరుకుందాం. – సాక్షి ఫ్యామిలీ -
కల్లుప్రియుల్లారా లొటలొట తాగేసేయండి
సాక్షి, మెదక్: తూప్రాన్-నర్సాపూర్ రోడ్డులోని బ్రాహ్మణపల్లి రైల్వేట్రాక్ పక్కన మూడున్నర ఎకరాల్లో ఏపుగా పెరిగిన ఈతచెట్ల వనం.. అడవిని తలపిస్తున్నా అక్కడంతా కోలాహలంగా ఉంది. అడపాదడపా కార్లు.. మరెంతోమంది బైక్‌లపై అక్కడికి వచ్చిపోతున్నారు. లోపలికి వెళ్తే.. కొంతమంది ఈతచెట్లపై నుంచి కల్లు తీస్తున్నారు. అక్కడికి వచ్చిన వారు అప్పుడే తీసిన కల్లును ఇష్టంగా తాగుతున్నారు. ఇంకొందరు కల్లు తీసుకుని వెళ్తున్నారు. ఈ ఈతవనం యజమాని లచ్చాగౌడ్‌ది వెంకటాపూర్ (పీటీ) గ్రామం. మొదట్లో వ్యవసాయంతోపాటు కల్లు గీసేవాడు. 2007లో కల్లు గీత సొసైటీలో సభ్యత్వం కోసం ప్రయత్నిస్తే.. దొరకలేదు. పిల్లల చదువులు మధ్యలో ఉన్నాయి. ఈ క్రమంలో బ్రాహ్మణపల్లిలో తన మూడున్నర ఎకరాల భూమిలో ఈతమొక్కలు నాటాలని నిర్ణయించాడు. అటవీ శాఖలో పనిచేసే పరిచయస్తుడైన బాలేశ్‌గౌడ్ సాయంతో సదాశివపేట, తాండూరు, చేవెళ్ల, మరెన్నో ప్రాంతాలు తిరిగాడు. చివరకు నాటి ఉమ్మడి మెదక్ జిల్లాలోని పెద్దాపూర్‌లో ఒక్కోటి రూ.30 చొప్పున.. 2 వేల ఈతమొక్కలు కొన్నాడు. ఒక్కో మొక్కకు ఆరడుగుల దూరం, ఒక్కో వరుస మధ్య పన్నెండు అడుగుల దూరం ఉండేలా నాటాడు. 2012లో కల్లు పారడం మొదలైంది. ఎందరికో జీ‘వన’ ఉపాధి ఈతవనం నాలుగు గీత కార్మిక కుటుంబాలకు ఉపాధి కల్పిస్తోంది. ఒక్కొక్కరికి నెలకు రూ.12 వేల చొప్పున జీతం ఇస్తుండగా.. రోజుకు రూ.300 కూలీకి మరో ఇద్దరు మహిళలు పనిచేస్తున్నారు. ఖర్చులన్నీ పోను నెలకు రూ.50 వేల వరకు ఆదాయం ఉంటుందని లచ్చాగౌడ్ తెలిపారు. లచ్చాగౌడ్‌కు భార్య బాలమణి, నలుగురు కుమారులు. వారూ తండ్రితో పాటు ఈతవనాన్ని చూసుకుంటున్నారు. ఈతవనం చేతికందిన దశలో ఎక్సైజ్ అధికారులు, కొందరు స్థానికులు అడ్డుతగిలారు. దీంతో లచ్చాగౌడ్ కుమారులు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాల మేరకు ఎక్సైజ్ అధికారులు లచ్చాగౌడ్‌తో పాటు కుమారులకు సైతం లైసెన్స్ జారీచేశారు. ఇక్కడి నుంచే ‘ట్రెండ్’ మొదలు ఒకేచోట ఈతవనాలను పెంచడం.. అక్కడే కల్లు అమ్మడం అనే ట్రెండ్ బ్రాహ్మణపల్లి నుంచి మొదలుకాగా, రాష్ట్రంలోని పలుచోట్ల ఇటువంటివి ఏర్పాటవుతున్నాయి. మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని పలు గ్రామాల్లో గౌడ కులస్తులే కాకుండా ఇతర వర్గాలు సైతం ఆదాయ మార్గంగా ఈతవనాల పెంపకం చేపట్టాయి. దొంతి, గుండ్లపల్లి, చండి, చిన్నగొట్టుముక్కుల, చెన్నపూర్, నవాబుపేట గ్రామాల్లో వీటి పెంపకం ఊపందుకుంది. ప్రస్తుతం జిల్లావ్యాప్తంగా 40 ఎకరాల్లో ఈతచెట్ల పెంపకం సాగుతోంది. చేగుంట మండలం కర్నాల్‌పల్లిలో గౌడ సొసైటీకి చెందిన ఎకరంన్నర స్థలంలో రెండు దఫాలుగా 500 చొప్పున వెయ్యి ఈతచెట్లు పెట్టారు. తొలుత పెట్టిన చెట్లకు కల్లు పారుతోంది. ఏడాదికి పది కుటుంబాల చొప్పున సంరక్షణ, అమ్మకపు బాధ్యతలు తీసుకుంటున్నాయి. అప్పటికప్పుడు స్వచ్ఛమైన కల్లు అప్పటికప్పుడు చెట్ల నుంచి తీసిన కల్లు విక్రయించడం, చుట్టూ అడవిలో ఉన్న భావన.. ఇవి కల్లుప్రియుల్ని ఇక్కడకు రప్పిస్తున్నాయి. సంగారెడ్డి, నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్, సిద్దిపేటతోపాటు హైదరాబాద్ నుంచి ఇక్కడకు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లీటర్ కల్లు రూ.50కి విక్రయిస్తున్నారు. ఇక, ఒకే చెట్టుకు కట్టిన లొట్టి నుంచి ఆ సమయానికి ఎంత కల్లు లభిస్తే అంత.. రూ.200 పలుకుతోంది. వీకెండ్లో నగరం నుంచి వచ్చే వారితో రద్దీగా ఉంటుంది. ఇక్కడ సీజన్‌తో సంబంధం లేకుండా కల్లు పారుతోంది. ఒక్కో చెట్టు నుంచి రోజుకు 2 నుంచి 5 లీటర్ల కల్లు వస్తోంది. వేసవిలో రోజుకు 300 చొప్పున.. అన్‌సీజన్‌లో 150 చొప్పున చెట్లు గీస్తామని, సీజన్లో రోజూ రూ.20 వేల వరకు అమ్మకాలు సాగుతున్నాయని లచ్చాగౌడ్ చెబుతున్నారు. తలరాత మార్చుకున్నా.. ఈతవనం పెంపును మొదట్లో ఇంటోళ్లు వద్దన్నారు. అయితే, ఈ తరం వాళ్లకు ప్రకృతి వరప్రసాదమైన స్వచ్ఛమైన కల్లు అందించాలనే సంకల్పంతో ఈతవనం పెంచా. అడ్డంకులెదురైనా హైకోర్టు అండగా నిలిచింది. నాకొచ్చిన ఆలోచనతో నా తలరాత మార్చుకున్నా. - లచ్చాగౌడ్ ఎకరంలో ఈతవనం పెట్టా.. ఎకరా పొలంలో మూడేళ్ల క్రితం ఉపాధి హామీ ద్వారా 500 ఈత మొక్కలు నాటాను. ఆరేళ్లకు కల్లు తీసే అవకాశం ఉంటుంది. కులవృత్తిని కాపాడుకోవడానికి ఇదో అవకాశంగా మారింది. - బాలాగౌడ్, చండి, శివ్వంపేట -
ముక్కుద్వారా కరోనా టీకా
సాక్షి, హైదరాబాద్: ప్రాణాంతక మహమ్మారి కరోనాను ఎదుర్కొనేందుకు భారత ప్రభుత్వం తాజాగా మరిన్ని ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఒకవైపు భారత్ బయోటెక్, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలు ఇప్పటికే రెండు వ్యాక్సిన్ల ప్రయోగాలు కొనసాగిస్తూండగా.... తాజాగా ఈ రెండు సంస్థలు వేర్వేరుగా రెండు సరికొత్త వ్యాక్సిన్ల ప్రయోగాలకు సిద్ధమయ్యాయి. ముక్కు ద్వారా అందించే ఈ రెండు కొత్త వ్యాక్సిన్లపై ప్రయోగాలు త్వరలో మొదలవుతాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ స్వయంగా ఆదివారం ప్రకటించడం గమనార్హం. నియంత్రణ సంస్థల నుంచి తగిన అనుమతులు లభించిన తరువాత ఈ రెండు సంస్థలు ముక్కు ద్వారా అందించే కోవిడ్–19 నిరోధక వ్యాక్సిన్ల ప్రయోగాలు మొదలు పెడతాయని డాక్టర్ హర్షవర్ధన్ తన సండే సంవాద్ కార్యక్రమంలో ప్రకటించారు. మొత్తం నాలుగు హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న భారత్ బయోటెక్ కోవిడ్–19 నియంత్రణ కోసం మొత్తం నాలుగు రకాల టీకాలను అభివృద్ధి చేస్తూండగా.. ఇందులో ఒకటైన కోవాగ్జిన్ ఇప్పటికే రెండు దశల మానవ ప్రయోగాలను పూర్తి చేసుకుంది. మిగిలిన మూడు వ్యాక్సిన్లలో ఒకటి భారత వైద్య పరిశోధన సమాఖ్య సహకారంతో తయారవుతోంది. ఈ కొత్త వ్యాక్సిన్ కోసం వాషింగ్టన్ యూనివర్సి టీ, సెయింట్ లూయిస్ యూనివర్శిటీలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇందులో భాగంగా భారత్ బయోటెక్‌కు ముక్కుద్వారా అందించే టీకా ప్రయోగాలు, తయారీ, పంపిణీలపై హక్కులు లభిస్తాయని డాక్టర్ హర్షవర్ధన్ తన ప్రసంగంలో తెలిపారు. ఎలుకల్లో ఈ టీకా మెరుగైన ఫలితాలు కనబరిచింది. ఇంజెక్షన్, సిరంజి వంటివి లేకుండానే ఈ టీకాను అందరికీ అందివ్వవచ్చు. సీరమ్ ఇన్స్టిట్యూట్ కూడా ఇదే రకమైన టీకా ప్రయోగాలను భారీ ఎత్తున చేపట్టనుందని మంత్రి హర్షవర్ధన్ చెప్పారు. అన్నీ సవ్యంగా సాగితే మరికొన్ని నెలల్లోనే ఈ కొత్త టీకాల ప్రయోగాలు మొదలు కానున్నాయి. దేశంలో ప్రస్తుతం మూడవ దశ ప్రయోగాలు జరుపుకుంటున్న టీకాలన్నీ ఇంజెక్షన్ రూపంలో ఇచ్చేవి మాత్రమే కావడం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. ఇదిలా ఉండగా.. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్–వీ టీకాపై రెండు, మూడవ దశ ప్రయోగాలు జరిపేందుకు డాక్టర్ రెడ్డీస్ ల్యాబొరేటరీకి డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇటీవలే అనుమతి జారీ చేసింది. వీటన్నింటి ఆధారంగా చూస్తే భారత్‌లో రానున్న ఆరు నెలల్లో టీకా అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ టీకా ముందుగా వైద్యులు, నర్సులు, పారిశుద్ధ్య కార్మికులు, ఆరోగ్య కార్యకర్తలకు ఇచ్చే అవకాశం ఉంది. ఫలితంగా ఆరోగ్యంగా ఉన్న వారికి కోవిడ్–19 నిరోధక టీకా అందేందుకు మరికొంత సమయం పడుతుంది. -
పండుగలు ఇంట్లోనే చేసుకోండి
న్యూఢిల్లీ: దేశంలో కరోనా మహమ్మారి వ్యాప్తి ఇప్పట్లో తగ్గిపోయే అవకాశం లేదు కాబట్టి ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ కోరారు. ‘సండే సంవాద్’లో భాగంగా ఆయన ఆదివారం సోషల్ మీడియాలో ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు. కరోనా నియంత్రణకు ప్రభుత్వ నిబంధనలను కచ్చితంగా పాటించాలని, రాబోయే పండుగ సీజన్లో ఊరేగింపులు, మతపరమైన సభలకు దూరం గా ఉండాలని సూచించారు. పండుగ వేడుకలతో తమను మెప్పించాలంటూ ఏ మతమూ, ఏ దేవుడూ ప్రజలను కోరరని అన్నారు. ఊరేగింపుల్లో పాల్గొని ముప్పు కొనితెచ్చుకోవద్దని హితవు పలికారు. మన లక్ష్యం.. కరోనా అంతం త్వరలో ప్రారంభం కానున్న చలికాలంలో కరోనా వ్యాప్తి మరింత ఉధృతమయ్యే ప్రమాదం ఉందని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ తెలిపారు. సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఉంటాయన్నారు. ఆరోగ్యం, భద్రతకు సంబంధించిన ఏ సమాచారమైన పూర్తిగా నిర్ధారించుకోకముందే ఇతరులతో పంచుకోరాదని సూచించారు. కరోనా వైరస్, వ్యాక్సిన్ గురించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం జరుగుతోందని అన్నారు. దీనిపై ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరోకు ఫిర్యాదు చేయాలని చెప్పారు. వైద్యులు, ఆరోగ్య కార్యకర్తలు కరోనా బారిన పడకుండా పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని గుర్తుచేశారు. అందుకోసం రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు మొదటి దశలో రూ.3,000 కోట్లు ఇచ్చామని మంత్రి పేర్కొన్నారు. ఫలితాల కోసం ఎదురు చూస్తున్నాం దేశంలో కరోనా వ్యాక్సిన్లకు అత్యవసర అనుమతి ఇవ్వడంపై ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని హర్షవర్ధన్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ల హ్యూమన్ క్లినికల్ ట్రయల్స్ ప్రస్తుతం ఒకటి, రెండు, మూడో దశల్లో ఉన్నాయని, ఫలితాల కోసం ఎదురు చూస్తున్నామని వివరించారు. కరోనా నిర్ధారణ కోసం దేశీయంగా అభివృద్ధి చేస్తున్న ఫెలూడా పేపర్ స్ట్రిప్ టెస్టు మరికొన్ని వారాల్లో నే అందుబాటులోకి రానుందని ఆయన చెప్పారు. -
ఆహా! ఉప్పు చేప.. జొన్న రొట్టె
సాక్షి, సిటీబ్యూరో : కొంత కాలంగా చికెన్ విషయంలో రకరకాల అపోహలకు గురవుతున్న నగరవాసులు సీఫుడ్ మీద తమ దృష్టిని మళ్లిస్తుండడంతో ఈ మధ్య సీ ఫుడ్ కోసమే ప్రత్యేకంగా రెస్టారెంట్లు కూడా ఏర్పాటవుతున్నాయి. సీఫుడ్‌ని ఆహారం ఇష్టపడేవాళ్లతో పాటు దాన్నే ఆదాయమార్గంగా మలచుకున్న కొందరు మహిళలు. రెస్టారెంట్స్‌లో వంటకాలు తయారు చేసే చెఫ్‌లకు ధీటుగా ఫిష్ ఫుడ్ ఫెస్ట్‌లో డిష్‌లను తీర్చిదిద్దారు. మిగతా నాన్‌వెజ్ ఉత్పత్తులతో పోలిస్తే ఫుడ్ మార్కెటింగ్ కాలుష్యం పెద్దగా సోకనిది సీ ఫుడ్. దీనికి కారణం వీటి పెంపకంలో ఎక్కువగా సహజసిద్ధమైన పద్దతుల పైనే ఆధారపడడమే. ఆరోగ్యపరమైన అనుకూలతలున్నా... డిమాండ్ విషయంలో చికెన్‌తో పోలిస్తే ఫిష్ వెనుకబడడానికి కారణం చికెన్‌లో లభించే వైవిధ్యభరిత వంటకాలే. ఈ పరిస్థితిని అధిగమిస్తూ ఫిష్ వంటకాల్లోనూ వెరైటీలు చికెన్‌కు పోటీగా ఇప్పుడిప్పుడే అందుబాటులోకి వస్తున్నాయి. వీటికి అద్దం పట్టింది ఫిష్ ఫుడ్ ఫెస్ట్. కేఎఫ్‌సీ ఫిష్... ఈ పేరు వింటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. కేఎఫ్సి అంటే కేవలం చికెన్ మాత్రమేనా ఫిష్ ఎందుకు కాకూడదు అనుకున్నారేమో..పాశ్చాత్య పద్ధతిలో కేఎఫ్సి ఫిష్ ఫ్రై ని జ్యోతి వండారు. ఇందులో కూడా ముల్లులేవీ లేకపోవడం వల్ల వీటిని హాయిగా చిప్స్ తిన్నట్టుగా తినేయవచ్చు. ఉప్పు చేప జొన్న రొట్టె.. పాత తరం వారు అమితంగా ఇష్టపడే వంటకాల కాంబినేషన్ ఉప్పుచేప జొన్నరొట్టె. ఇందులో భాగంగా సముద్ర చేపలైన కొర్రమీను, బొచ్చె, బంగారు తీగ లాంటి చేపలను శుభ్రం చేసి వేయించి దంచిన మెంతులు, మసాలాలతో కలిపి వండుతారు. దీనికి జతగా సహజంగా పండించిన జొన్న పిండితో చేసిన రొట్టెలను వాడతారు. జొన్న పిండిలోని ప్రొటీన్స్, చేపలోని విటమిన్స్ కండ పుష్టికి ఉపయోగపడతాయి అంటున్నారు వీరాభిమన్యునగర్కి చెందిన మహిళలు. ఫిష్ టిక్కా, ఫిష్ కట్లెట్, పకోడీ, లాలీపప్ వంటి వెరైటీలనూ వీరు తయారు చేశారు. కుండచేపల పులుసు ఒకప్పుడు కుండలు, మట్టి దొంతులు వంటసామగ్రిగా వాడేవారు. ఈ మట్టి పాత్రల్లో చేప పులుసు ఉడకడంతో ఈ వంటకానికి ప్రత్యేకమైన రుచి రావడమే కాకుండా ఆరోగ్యకరం కూడా. అందుకే కుండతో వండే చేపల పులుసు క్రేజీగా మారుతోంది. మెంతి ఫిష్ కర్రీ దీనిని పిల్లలు ఇష్టంగా తింటారని, ఇందులో కారం, పులుపు తక్కువ మోతాదులో వేసి కాసింత పచ్చిమిరప, మెంతీ పేస్ట్‌తో తయారు చేశానని శ్వేత చెబుతున్నారు. డయాబెటిస్ వంటి సమస్యలు ఉన్నవారికి ఇటు పత్యంగానూ, అటు ఆరోగ్యపరంగానూ మేలు చేస్తుందని ఆమె చెప్పారు. బిర్యానీ... హైదరాబాద్ అంటేనే బిర్యానీ గుర్తుకు వస్తుంది. అయితే బిర్యానీకి సంబంధించి చికెన్ తర్వాతే ఏదైనా అంటారు భోజన ప్రియులు. ఈ నేపథ్యంలో బాస్మతి రైస్ తీసుకుని చేపలు, రొయ్యలుతో హైదరాబాదీ స్టైల్లో వండిన బిర్యానీ అందుకు ధీటుగా ఉంటుందని సీ ఫుడ్ తయారీలో చేయి తిరిగిన మహిళలు చెబుతున్నారు. పిలాతీ...ఫ్రై చైనీస్ వంట తీరుతో హైద్రాబాదీ మసాలాలు దట్టించి రొయ్యల వేపుడు చేశారు స్వరూప. అదే విధంగా ఫిష్ ఫ్రై కూడా వండారు. ఇందులో సముద్రంలో లభించే ఫిలాతీ రకం చేపను వాడానని, ఈ చేపలో కేవలం ఒకటే ముల్లు ఉంటుందని, పిల్లలు, వృద్ధులు తినడానికి సులభంగా ఉంటుందని వివరించారామె. అపోలో...ఫ్రై నగరంలో అపోలో ఫిష్కి ఉన్న క్రేజ్‌కి ప్రధాన కారణం అందులో అతి తక్కువగా లేదా అసలు ముల్లు లేకపోవడం అనేది తెలిసిందే. ఈ అపోలో ఫిష్కి మంచి రుచి రావడం కోసం అల్లం, వెల్లుల్లి, దంచిన మసాలాలు, కారం, జీలకర్ర పోడితో చేసిన మిశ్రమంతో గంట సేపు నిల్వచేసి ఆ తర్వాత ఫ్రై చేయడం వల్ల మంచి రుచి వచ్చిందని హేమలత చెప్పారు. వెస్ట్రన్ స్టైల్.. కమలా నగర్‌కి చెందిన రాజశ్రీ, అనిత, విజయలక్ష్మి, ధనలక్ష్మి, రేణుకలు అందరూ కలిసి రెస్టారెంట్స్‌లో మాత్రమే లభ్యమయ్యే వెరైటీ వంటకాలతో అందరినీ ఆకట్టుకొన్నారు. వీరి వంటకాలు ఫిష్ రోల్స్, ఫిష్ మంచూరియా, రొయ్యల సమోసా, రోయ్యల బిర్యానీ, ఫిష్ బిర్యానీ వంటివాటిలో కొన్ని రెస్టారెంట్స్‌లో కూడా లభించవు. కేరట్‌తో పాటు కొన్ని కూరగాయలు, సీ ఫుడ్ కలిపి గ్రైండ్ చేసిన తర్వాత ఆ మిశ్రమానికి బ్రెడ్ పొడిని అంటిస్తామని తద్వారా లోపల మెత్తగా, పైన పెలుసుగా ఉంటూ అచ్చం కెఎఫ్సి తరహాలో ఈ ఐటమ్స్ వండామని వీరు చెప్పారు. రెడీ టూ ఈట్... వెంటనే తినే వంటకాలే కాకుండా ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉండే ఫిష్, ఫ్రాన్స్ చట్నీలను తయారు చేస్తున్నారు స్వర్ణలత. ఇందులో వాడిన ఫ్రాన్స్ విశాఖపట్నం నుంచి వచ్చాయని, సముద్ర చేపలతో చేసిన చెట్నీలు ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా పలు రకాల రెడీ టూ ఈట్ ఫిష్ ప్యాకెట్స్ కూడా ఆమె రెడీ చేయడం విశేషం. సీ ఫుడ్.. దాబా స్టైల్... సోమాజిగూడలోని మెర్క్యురీ హోటల్లో మార్చ్ 2న వీకెండ్ ధాబా ఫుడ్ ఫెస్ట్‌ని నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పంజాబీ, బెంగాలీ స్టైల్లో సీ ఫుడ్‌ను అందించనున్నారు. ఇది డిన్నర్ సమయంలో సాయంత్రం 4–7 గంటల వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. -
ఉల్లి... ఎందుకీ లొల్లి!
గత మార్చి నుంచి ఇప్పటివరకు ఉల్లి ధరలు 400 శాతం పెరిగాయి. దేశంలో చాలా చోట్ల కేజీ ఉల్లి ధర రూ.150 నుంచి రూ.200 వరకు చేరుకుంది. ధరాఘాతం కేవలం ఉల్లికే పరిమితం కాలేదు. గత నాలుగు నెలల కాలంలో దాదాపు 20 నిత్యావసర వస్తువుల ధరలు రెట్టింపయ్యాయి. బియ్యం, గోధుమలు, పప్పు దినుసులు, కూరగాయలు, నూనె, బెల్లం వంటి సరుకుల రేట్లు ఆకాశాన్నంటాయి. అయినా ఉల్లి గురించే దేశవ్యాప్తంగా రచ్చ జరుగుతోంది. మిగిలిన వాటి ధరలు పెరిగినా పట్టించుకోని జనం.. ఉల్లి ధరపై ఎందుకింత తల్లడిల్లిపోతున్నారు? ఇదే సండే స్పెషల్.. ఇది మొఘల్స్ ఘాటు ఇప్పుడంటే ఉల్లి కోసం అందరూ ఎగబడుతున్నారు కానీ ఒకప్పుడు ఉల్లికి మన సమాజంలో చోటే లేదు. మొఘలాయిలు మన దేశంలోకి అడుగుపెట్టక ముందు ఉల్లి, వెల్లుల్లికి బదులుగా భారతీయులు వంటల్లో అల్లం ఎక్కువగా వాడేవారని చరిత్రకారులు చెబుతున్నారు. 2 వేల ఏళ్ల కింద ఆయుర్వేద వైద్యుడు చరకుడి చరక సంహితలో ఉల్లి గురించి చాలా గొప్పగా రాశారు. కూరల్లో ఉల్లిని వాడితే మోకాళ్ల నొప్పులు తగ్గిపోతాయని, జీర్ణక్రియకు దోహదపడుతుందని పేర్కొన్నారు. అప్పట్లో ఉల్లి వాడకం బాగా ఉండేది. కానీ కొన్ని దశాబ్దాల తర్వాత ఆయుర్వేదంలో ఉల్లిని నిషేధించారు. ఉల్లిని తమోగుణాన్ని పెంచే వస్తువుగా చూసేవారు. ఉల్లి తింటే శారీరక వాంఛలు పెరుగుతాయని తేల్చారు. దీంతో ఉల్లి అనేది కొన్ని కులాలకు మాత్రమే పరిమితమైంది. వితంతువులు ఉల్లి తినకూడదని ఆంక్షలు విధించారు. క్రీస్తుశకం 7వ శతాబ్దంలో భారత్‌ను సందర్శించిన చైనా యాత్రికుడు హ్యూయన్‌త్సాంగ్ పుస్తకాల్లో.. భారత్‌లో ఉల్లిపై నిషేధం ఉందని, దాన్ని వాడేవారిని ఊరి నుంచి వెలివేశారని రాశారు. క్రీ.శ.1526లో మొఘలాయిలు భారత్‌లో అడుగు పెట్టిన తర్వాత ఉల్లి వాడకం ఇంటింటికీ పాకింది. వాళ్లు చేసే బిర్యానీ, ఇతర వంటకాల్లో మసాలాలు, ఉల్లి లేనిదే రంగు, రుచి వచ్చేది కాదు. అలా కాలక్రమంలో ఉల్లి లేనిదే వంటలు చేయలేని పరిస్థితి వచ్చింది. అయితే జైనులు ఉల్లిపాయ, వెల్లుల్లికి ఎప్పుడూ దూరమే. ఒకప్పుడు బ్రాహ్మణ కుటుంబాల్లో కూడా ఉల్లి వాడేవారు కాదు. కానీ రానురానూ ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదన్న సత్యాన్ని గ్రహించి ఉల్లి వాడకాన్ని మొదలు పెట్టారు. ఉల్లి ఉల్లికో కథ సామాన్యుల నుంచి కోట్లకు పడగలెత్తిన వారి వరకు ఉల్లి లేనిదే అసలు ముద్దే దిగదు. ఏ వంట చేయాలన్నా ఉల్లి తప్పనిసరి. సలాడ్స్ నుంచి మాంచి మసాలాలు దట్టించిన కుర్మాలు, చికెన్, మటన్ వరకు ఉల్లి లేకుండా వంటలకి రుచే రాదు. శాకాహారులు ఎక్కువగా తినే సాంబార్లో చిన్న ఉల్లిపాయలు వాడకుండా టేస్ట్ తేలేరు. నిరుపేదలకు గంజన్నం, ఉల్లిపాయ ఉంటే చాలు అదే పంచభక్ష పరమాన్నం. -
సండే స్పెషల్ ఇక డైలీ!
పశ్చిమగోదావరి , నరసాపురం: నరసాపురం రైల్వేస్టేషన్ నుంచి ప్రతి ఆదివారం హైదరాబాద్‌కు నడుస్తున్న ప్రత్యేక రైలును శాశ్వతంగా కొనసాగించాలని రైల్వేశాఖ భావిస్తోంది. రెండున్నర నెలలుగా నడుస్తున్న ఈ రైలులో విపరీతమైన రద్దీ ఉండటంతో రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలు వారం రోజుల్లో తెలియజేస్తామని నరసాపురం రైల్వేస్టేషన్ మాస్టర్ మధు తెలిపారు. ఇటు జిల్లాలోని డెల్టా, అటు తూర్పుగోదావరి జిల్లా రాజోలు, అమలాపురం, అంతర్వేది చుట్టుప్రక్కల ప్రాం తాల వారికి ఉపయోగపడే విధంగా నరసాపురం నుంచి హైదరాబాద్‌కు ప్రతి ఆదివారం ప్రత్యేక రైలును ప్రవేశపెట్టారు. గత మే 6 నుంచి ఈరైలు సర్వీస్ ప్రారంభమైంది. నిజానికి వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని మే, జూన్ నెలల్లో ఈ రైలును నడపాలని ప్రవేశపెట్టారు. అయితే వేసవి ముగిసినా రద్దీ ఏమాత్రం తగ్గకపోవడంతో ఈ స్పెషల్ రైలును ఆగస్ట్ నెలాఖరు వరకూ మరో రెండు నెలలుపాటు పొడిగించారు. అయితే రద్దీ తగ్గకపోవడంతో ఈ రైలును శాశ్వతంగా నడపాలని రైల్వేశాఖ భావిస్తోంది. ప్రతి ఆదివారం సా యంత్రం 6 గంటలకు నరసాపురంలో బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5 గంటలకు ఈ రైలు హైదరాబాద్ చేరుకుంటుంది. నాలుగు జనరల్ బోగీలతో కలిపి మొత్తం 18 కోచ్‌లు ఉంటాయి. రిజర్వేషన్ సదుపాయం అందుబాటులో ఉండటంతో హైదరాబాద్ వెళ్లే ప్రయాణికులకు ఉపయోగంగా ఉంటుంది. డెల్టా, కోనసీమ వాసులకు ఉపయోగం సింహాద్రి లింక్ ఎక్స్‌ప్రెస్‌ను నరసాపురం నుంచి తొలగించి ఆరు మాసాలుగా నిడదవోలు నుంచి కొనసాగిస్తున్నారు. దీంతో సింహాద్రి ఎక్స్‌ప్రెస్‌ను నిలిపి ఉంచే ట్రాక్ స్టేషన్లో ఖాళీగా ఉంటుంది. దీంతో ఈ ప్రత్యేక రైలును నరసాపురం నుంచి ప్రవేశపెట్టడానికి వీలు చిక్కింది. ప్రస్తుతం నరసాపురం నుంచి గుంటూరు మీదుగా రాత్రిళ్లు నరసాపూర్ ఎక్స్‌ప్రెస్, పగలు నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ న డుస్తున్నాయి. నరసాపురం, పాలకొల్లు, భీమవ రం, ఉండి, ఆకివీడు ప్రాంతాల వారు, అటు తూ ర్పుగోదావరి జిల్లా నుంచి కోనసీమ ప్రాంతాల వారు హైదరాబాద్ చేరడానికి ఇవే రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో రెండు నెలలు ముందుగా బుక్ చేసుకున్నా ఈ రైళ్లలో టికెట్లు దొరకడం కష్టంగా మారింది. పండుగలు, సెలవు రోజుల్లో మరింత రద్దీ ఉంటోంది. దీంతో వీకెండ్లో తిప్పుతున్న ఈ ప్రత్యేక రైలు ప్రయాణికులకు ఎక్కువగా ఉపయోగపడుతుంది. దీనిని శాశ్వతం చేసే యోచనలో రైల్వేశాఖ ఉంది. -
‘అనంత’ స్థైర్యం
సండే స్పెషల్ ఆమె సొంతం! ఆడ.. పిల్ల. పురిట్లో ఇలాంటి నిట్టూర్పులు ఇప్పటికీ వింటున్నాం. ఇంటికి లక్ష్మీ కళ వచ్చిందని సంతోషపడే వాళ్లు ఉన్నప్పటికీ.. ఆడపిల్ల పుట్టుకను జీర్ణించుకోలేని కుటుంబాలే సమాజంలో అధికం. దేశాధినేతలుగా రాణిస్తున్నా.. అంతరిక్షాన్ని చుట్టేస్తున్నా.. అద్భుతాలు ఆవిష్కరిస్తున్నా.. ఇప్పటికీ ఆమె పట్ల వివక్ష కొనసాగుతోంది. కాలు బయటపెట్టాలంటే ఆంక్షల సంకెళ్ల కట్టడి. ఇలాంటి పరిస్థితుల్లోనూ అవకాశాలను అందిప్చుకుంటూ తనను తాను నిరూపించుకునే ప్రయత్నం చేస్తోంది మహిళ. ఆ రంగాలు పురుషులకే పరిమితం అనే భావనను చెరిపేస్తూ.. అవకాశం వస్తే తామూ తీసిపోమంటూ సవాల్ విసురుతున్నారు. ఈ కోవలోనే కొందరు మహిళలు ఆటో రంగాన్ని జీవనోపాధిగా ఎంచుకొని ‘అనంత’ స్థైర్యం కనబరుస్తున్న తీరు అభినందనీయం. ప్రాణం పోతుంటే చూస్తూ ఉండలేం కదన్నా.. ఈ చిత్రంలోని మహిళ పేరు భాగ్యలక్ష్మి. అనంతపురంలోని ఉమానగర్‌కు చెందిన ఈమె డిగ్రీ వరకు చదువుకున్నారు. ఓ ప్రైవేట్ సంస్థలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పనిచేస్తూ కుటుంబ పోషణలో భర్తకు చేదోడువాదోడుగా ఉన్నారు. ఆ తర్వాత కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆటో డ్రైవింగ్‌లో శిక్షణ తీసుకుని, ప్రస్తుతం ఆటో డ్రైవర్‌గా జీవనం సాగిస్తున్నారు. భాగ్యలక్ష్మి ఎంత ధైర్యవంతురాలో.. అంతే సున్నిత మనస్కురాలు. ఓ సారి రోడ్డు ప్రమాదం జరిగితే బాధితులను తన ఆటోలోనే సర్వజనాస్పత్రికి చేర్చింది. ఆ సందర్భంగా ఆటోలో రక్తపు మరకలు పడితే.. ఆస్పత్రి ఆటోస్టాండ్ వద్దనున్న ఆటోడ్రైవర్లు ‘ఎందుకమ్మా ఇలాంటి కేసులను ఎక్కించుకొస్తావు.. ఇంకోసారి తీసుకురావద్దు’ అని చెప్పారు. అందుకామె ‘ప్రాణం పోతుంటే చూస్తే ఉండలేం కదన్నా..’ అంటూ తనలోని మానవత్వాన్ని చాటుకుంది. ఇలాంటి భాగ్యలక్ష్మిలు అనంతపురం పట్టణంలో సొంతంగా బతుకు బండి లాగిస్తున్నారు. వీరి విజయగాథే ఈ వారం సండే స్పెషల్. - సాక్షి, అనంతపురం -
వీఐపీ అల్లుళ్లు
ఇందూరు : ప్రొఫెసర్ కోదండరాం,రాజనర్సింహా మోర్తాడ్ : మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి జంగంపల్లి : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి రెంజల్ : ఏపీ వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి ప్రసన్నకుమార్‌రెడ్డి దోమకొండ : సినీ నటుడు రామ్‌చరణ్ నవీపేట : కోడళ్ల జాబితాలో ఎంపీ కవిత కామారెడ్డి : ఢిల్లీకి రాజైనా తల్లికి కొడుకే . అలాగే ఏ తల్లి కొడుకైనా ఓ ఇంటికి అల్లుడు కావాల్సిందే. ఏ బిడ్డ అయినా ఓ ఇంటికి కోడలుగా వెళ్లాల్సిందే. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు, ఉన్నత స్థానాల్లో ఉన్నవారందరూ అందరిలాగే ఓ ఇంటికి అల్లుళ్లు, కోడళ్లవుతారు. అలా మన జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి పెళ్లి చేసుకున్న ‘వీఐపీ అల్లుళ్లు’ ఎందరో ఉన్నారు. అలాంటి అల్లుళ్లపై ‘సాక్షి’ సండే స్పెషల్. తెలంగాణ ఉద్యమాన్ని భుజానెత్తుకుని రాష్ట్ర ఏర్పాటు దాకా ముందుండి నడిచిన ప్రొఫెసర్ కోదండరాం,సినిమా హీరో రాంచరణ్‌తేజ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, మాజీ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, నెల్లూరు జిల్లాకు చెందిన ఏపీ వైఎస్సార్ సీపీ రాష్ర్ట ప్రధాన కార్యదర్శి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రొఫెసర్ పీఎల్ విశ్వేశ్వర్రావు, మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి... ఇలా ఎందరో ఈ జిల్లాకు అల్లుళ్లయ్యారు. అలాగే నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత జిల్లాకు కోడలయ్యారు. వీరినే చేసుకున్నారు.. తెలంగాణ జాయింట్ యూక్షన్ కమిటీ కన్వీనర్‌గా తెలంగాణ ఉద్యమాన్ని నడిపిన ప్రొఫెసర్ కోదండరాం ఎడపల్లి మండలం జానకంపేట గ్రామానికి చెందిన సుశీలను వివాహమాడారు. సినీనటుడు రాంచరణ్‌తేజ దోమకొండ సంస్థాన వారసుడు అనిల్ కామినేని కూతురు ఉపాసనను వివాహ మాడారు. వీరి వివాహం నాలుగేళ్ల క్రితం జరిగింది. పెళ్లికి ముందు, పెళ్లి తరువాత రాంచరన్ దోమకొండ కోటకు పలుమార్లు వచ్చి వెళ్లారు. మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా నిజామాబాద్ నగరానికి చెందిన పద్మినిని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి భిక్కనూరు మండలం జంగంపల్లికి చెందిన కావ్యను వివాహమాడారు. కావ్య వాళ్ల కుటుంబం ప్రస్తుతం హైదరాబాద్‌లో నివాసముంటోంది. బంధువుల ఇళ్లలో జరిగే శుభకార్యాలకు వచ్చివెళ్తుంటారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన నెల్లూరు జిల్లా కొవ్వూరు మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి రెంజల్‌కు చెందిన గీతను వివాహమాడారు. రాష్ట్ర దేవాదాయ, గృహనిర్మాణ శాఖ మాత్యులు అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి మన జిల్లా అల్లుడే. మోర్తాడ్ మండలం సుంకేట్ గ్రామానికి చెందిన విజయను వివాహం చేసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్‌రెడ్డి సదాశివనగర్ సంస్థానానికి చెందిన సీతను వివాహమాడారు. సీత కూడా మహబూబ్‌నగర్ జిల్లాలో ఎమ్మెల్యేగా పనిచేశారు. ఉస్మానియూ ప్రొఫెసర్ విశ్వేశ్వర్రావు నిజామాబాద్ నగరానికి చెందిన అఖిలేశ్వరిని వివాహమాడారు. వక్తగా వివిధ కార్యక్రమాల్లో పాల్గొనడానికి జిల్లాకు వచ్చినపుడు ఆయన అత్తారింట వచ్చివెళతారు. మెదక్ మాజీ ఎమ్మెల్యే, ప్రస్తుత హైదరాబాద్ టీఆర్ఎస్ అధ్యక్షుడు మైనంపల్లి హన్మంత్‌రావు నవీపేట మండలం జన్నెపల్లికి చెందిన వాణిని వివాహమాడారు. సీఎం కేసీఆర్ తనయ, ప్రస్తుత నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత నవీపేటకు చెందిన అనిల్‌కుమార్‌ను వివాహమాడారు. దీంతో ఆమె ఈ జిల్లాకు కోడలిగా వచ్చి ఇక్కడే ఎంపీగా పోటీ చేసి గెలుపొందారు. అత్తారింట జరిగే అన్ని కార్యక్రమాలకు హాజరవుతారు. -
ఆ రోజు ఎలా పడితే అలా ఉంటా!
హాయ్ ఇలియానా... సండే అంటేనే అందరికీ స్పెషల్. మరి మీకు? ఆదివారం అంటే ఎవరికైనా హాలిడే మూడ్ ఉంటుంది. నేనైతే ఆదివారం నాడు పూర్తిగా రిలాక్స్ అయిపోతా. ప్రపంచంలో నా అంత బద్ధకస్తురాలు ఉండదేమో అన్నట్లుగా ఉంటాను. ఆదివారం ఆలస్యంగా నిద్ర లేస్తాను. అన్ని పనులూ బద్ధకంగా పూర్తి చేస్తాను. మా ఇంట్లో నా ఫేవరెట్ ప్లేస్ ఏదంటే అది బాల్కనీయే. అక్కడ కూర్చుని టీ సిప్ చేస్తూ, పరిసర ప్రాంతాలను పరిశీలించడం నాకిష్టం. ఆదివారం నేనెక్కువగా చేసే పని ఇదే. అంటే.. ఆదివారం వ్యాయామాలకు కూడా సెలవిచ్చేస్తారా? దాదాపు అంతే అనుకోండి. గోవాలో అమ్మా నాన్నలతో కలిసి ఉండేదాన్ని. ముంబయ్‌లో ఒంటరిగా ఉంటున్నాను. అది చెయ్యి.. ఇది చెయ్యి.. అని నసపెట్టేవాళ్లు ఉండరు (నవ్వుతూ). అందుకే నాకు నచ్చిన రీతిలో ఉంటాను. ఆదివారం అంటే సెలవు దినం అని స్కూల్ డేస్ నుంచే బలంగా మనసులో నాటుకుపోయింది. పెద్దయ్యాక కూడా ఆ ఫీలింగ్ అలా ఉండిపోయింది. సండే కేవలం ఒంటరిగా గడపడమేనా? ఏమైనా పార్టీలు ప్లాన్ చేసుకుంటారా? నేను పార్టీ పర్సన్ కాదండి. నా ఫ్రెండ్స్‌లో కూడా పార్టీ యానిమల్స్ ఎవరూ లేరు. మేమందరం కలిస్తే హాయిగా టీవీ చూడటం, షాపింగ్‌కి వెళ్లడం, ఏదైనా హోటల్లో డిన్నర్ తీసుకోవడం.. అంత మటుకే. మాకిదే పెద్ద ఎంజాయ్‌మెంట్‌లా భావిస్తాం. మరి.. ఆదివారం ఆహార నియమాలకు కూడా సెలవిచ్చేస్తారా? దాదాపుగా ఇచ్చేస్తా. కేక్స్, ఐస్‌క్రీమ్స్.. ఇలా శరీర బరువు పెంచేవన్నీ లాగించేస్తా. విడి రోజుల్లో వంట చేసేంత తీరిక నాకు ఉండదు. ఆదివారం తీరిక ఉన్నా చేయను. అప్పుడప్పుడూ కేక్స్ బేక్ చేస్తుంటాను. బేకింగ్ అంటే నాకు చాలా ఇష్టం. కేక్స్ బేక్ చేసేటప్పుడు ఓ సువాసన వస్తుంది కదా.. అదంటే నాకు చాలా ఇష్టం. సండే షూటింగ్స్ లేకపోతే బాగుండు అనుకుంటారా? అవును. కానీ, అప్పుడప్పుడూ షూటింగ్‌కి వెళ్లక తప్పదు. అందుకే ముందురోజు నుంచే ‘రేపు మనకు సెలవు లేదు.. షూటింగ్‌కి వెళ్లాలి’ అని మానసికంగా ప్రిపేర్ అవుతుంటాను. మీ మాటలను బట్టి ఆదివారం అస్సలు పని చేయరేమో అనిపిస్తోంది...? దాదాపు అంతే. కానీ, ఒకే ఒక్కటి చేస్తాను. ఇల్లు శుభ్రంగా ఉంచుకోవడం ఇష్టం. అందుకే వ్యాక్యూమ్ క్లీనర్ తీసుకుని ఇల్లంతా తళతళలాడిపోయేలా చేసేస్తా. దీన్ని మాత్రం నేను పనిలా భావించను. సరదా కోసం చేస్తున్నట్లుగా ఫీలవుతా. మీ ఆదివారం కబుర్లు వింటుంటే భలే ఉందే... చెబుతుంటే నాక్కూడా భలే ఉంది. మీకింకో విషయం చెప్పాలి. ఆదివారం ఇంట్లో ఉంటే.. క్యాజువల్ ప్యాంట్, టీ-షర్ట్ వేసుకుంటా. మేకప్ వేసుకోను. జుత్తుని ఫ్రీగా వదిలేస్తా. ఓ పద్ధతిగా మాత్రం ఉండను. అప్పుడప్పుడు ఎలా పడితే అలా ఉండటం కూడా చాలా బాగుంటుంది. ఫైనల్‌గా సండే గురించి ఇంకా ఏం చెబుతారు? మామూలుగా మనం పండగలప్పుడు ‘హ్యాపీ దివాలి’ అనీ, ‘హ్యాపీ హోలీ’ అనీ చెప్పుకుంటుంటాం కదా. నేను సండేని పండగలా భావిస్తాను కాబట్టి, ఒకవేళ బాగా దగ్గరైనవాళ్లకి ఫోన్ చేస్తే, ‘హ్యాపీ సండే’ అని చెబుతా. ఇప్పుడు మీ అందరికీ కూడా అదే చెబుతున్నా ‘హ్యాపీ సండే’. - డి.జి. భవాని


