
పనీర్ బిర్యానీ బాల్స్
కావలసినవి: బాస్మతి రైస్– ఒక కప్పు (ఉడికించి తీసుకోవాలి)
పనీర్ కర్రీ– ఒక కప్పు, పుదీనా తురుము, కొత్తిమీర తురుము– కొద్దికొద్దిగా
బిర్యానీ మసాలా– ఒక టీ స్పూన్, గుడ్లు– 4, పాలు– ఒక టేబుల్ స్పూన్
బ్రెడ్ పౌడర్, మైదా పిండి– ఒక కప్పు చొప్పున, నూనె– సరిపడా
తయారీ: ముందుగా ఒక గిన్నెలో బాస్మతి అన్నం తీసుకుని అందులో పనీర్ కర్రీ, పుదీనా తురుము, కొత్తిమీర తురుము, బిర్యానీ మసాలా, మూడు కోడి గుడ్లు వేసుకుని బాగా కలిసి గుండ్రటి ఉండలుగా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత చిన్న గిన్నెలో మైదా పిండి, మరొక చిన్న గిన్నెలో మిగిలిన కోడి గుడ్డు సొన, పాలు కలిపి పెట్టుకోవాలి.
మరో గిన్నెలో బ్రెడ్ పౌడర్ వేసి పెట్టుకోవాలి. అనంతరం ఈ బిర్యానీ ఉండలను తీసుకొని, ముందుగా గుడ్డు మిశ్రమంలో రోల్ చేసి, ఆపై మైదాపిండిలో దొర్లించాలి. ఆ తర్వాత అదే ఉండను మరోసారి గుడ్డు సొనలో రోల్ చేసి, చివరకు బ్రెడ్ పౌడర్‌లో రోల్ చేయాలి. అన్ని బాల్స్‌ను అదే విధంగా చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో దోరగా వేయించి, నచ్చిన విధంగా సర్వ్ చేసుకోవచ్చు.
చైనా తాంగ్హుల్ క్యాండీ
కావలసినవి: స్ట్రాబెర్రీలు, ద్రాక్ష, కివీ, ఆరెంజ్, చెర్రీస్ లేదా నచ్చిన పండ్లు – కొన్ని, పంచదార– ఒక కప్పు, నీళ్లు– అర కప్పు, నూనె– కొద్దిగా, ఐస్ లేదా చల్లని నీళ్లు– పంచదార పాకం గట్టి పడటానికి, పుల్లలు– కొన్ని
తయారీ: ముందుగా పండ్లను శుభ్రంగా కడిగి, పూర్తిగా ఆరబెట్టాలి. వాటిపై నీటి చుక్క కూడా ఉండకూడదు. తడి ఉంటే పంచదార పాకం పండ్లపై సరిగా అంటుకోదు. ఈలోపు ఒక చిన్న పాన్ లేదా గిన్నెలో పంచదార, నీళ్లు వేసి స్టవ్ మీద పెట్టుకోవాలి. మంటను మధ్యస్థంగా ఉంచి, పంచదార పూర్తిగా కరిగే వరకు కలపాలి. పంచదార కరిగిన తర్వాత, కలపడం ఆపి, పాకం బుడగలు వచ్చి, కాస్త రంగు మారేవరకు మరిగించాలి.
ఒక చల్లని నీళ్ల గిన్నెలో కొన్ని చుక్కల పాకాన్ని వేసిన వెంటనే గట్టిపడి, క్రిస్పీగా మారితే అది సరైన స్థితిలో ఉన్నట్టే గుర్తించొచ్చు. దాంతో స్టవ్ ఆఫ్ చేసుకుని పండ్లు ఉన్న పుల్లలను ఒకదాని తర్వాత ఒకటిగా పాకంలో ముంచాలి. పాకం పండ్ల మీద అన్ని వైపులా సమానంగా ఉండేలా చూసుకోవాలి. ఎక్కువ పాకం ఉంటే గిన్నె అంచున తట్టి తీసివేయాలి. పాకం పూసిన పండ్లను నూనె రాసిన బేకింగ్ షీట్ మీద పెట్టుకోవాలి. చల్లారాక తింటే భలే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. పండ్లు డైరెక్ట్‌గా తినని వారు ఇలా ట్రై చేయొచ్చు.]
ఛత్తీస్‌గఢ్ ముఠియా
కావలసినవి: బంగాళదుంపలు– 3 (మీడియం సైజ్, ఉడికించి తొక్క తీసి మెత్తగా గుజ్జులా చేసుకోవాలి), బియ్యప్పిండి– ఒకటిన్నర కప్పులు, ఉల్లిపాయ– ఒకటి (సన్నగా తరిగినవి)
పచ్చిమిర్చి– 3 (సన్నగా తరిగినవి)
కొత్తిమీర తురుము– కొద్దిగా
అల్లం వెల్లుల్లి పేస్ట్– ఒక టీస్పూన్
కొత్తిమీర, కరివేపాకు, నువ్వులు, ఆవాలు– కొద్దికొద్దిగా, ఉప్పు,మసాలా, పసుపు– తగినంత, నూనె– కొద్దిగా
తయారీ: ముందుగా ఒక గిన్నెలో బియ్యప్పిండి, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర తురుము, అల్లం వెల్లుల్లి పేస్ట్, బంగాళదుంప గుజ్జు, మసాలా, పసుపు, ఉప్పు వేసి బాగా కలపాలి. ఇప్పుడు కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోవాలి. ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా చేసి, నచ్చిన ఆకారంలో ఒత్తుకోవాలి. వాటిని ఆవిరి మీద ఉడికించడానికి ఇడ్లీ పాత్ర లేదా ఏదైనా స్టీమర్ ఉపయోగించొచ్చు.
అవి ఉడికిన తర్వాత ఒక పాన్ తీసుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక నువ్వులు, కరివేపాకు, ఆవాలు, కొత్తిమీర ఇలా అన్నీ వేసుకుని వేగించాలి. ఆవాలు చిటపటలాడాక, ముందుగా ఆవిరిపై ఉడికించి పెట్టుకున్న ముఠియా ముక్కలు వేసి, కొద్దిగా పసుపు వేసి, బాగా కలిపి సుమారు 2 లేదా 3 నిమిషాలు వేగించాలి. అంతే, రుచికరమైన ముఠియా వేడి వేడిగా సిద్ధం అవుతుంది.