కొద్ది రోజుల్లో 2025 ముగియబోతోంది. ప్రపంచమంతా 2026కు స్వాగతం పలికేందుకు సిద్దమవుతోంది. ఈ తరుణంలో ఈ ఏడాది వార్తల్లో నిలిచిన ముఖ్యాంశాలను గుర్తుచేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇవే రేపటి ప్రగతికి సోపానాలుగా పరిణమిస్తాయి. ఈ ఏడాది ఇంటర్నెట్‌లో జనం అత్యధికంగా శోధించిన వంటకాలను చూస్తే.. ప్రజల్లో ఆరోగ్యంతోపాటు సంప్రదాయ వంటకాలపై ఆసక్తి పెరిగినట్లు స్పష్టమవుతున్నది. మరి ఈ ఏడాది భారతీయులు ఏఏ వంటకాలకు ఓటు వేశారనే వివరాల్లోకి వెళితే..
ఇడ్లీ.. ఇరగదీసింది!
ఈ క్లాసిక్ బ్రేక్‌ఫాస్ట్.. దేశంలోని ఆరోగ్యకరమైన ఆహారాల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. ఇది కేవలం దక్షిణాదికి చెందిన ప్రధాన అల్పాహారం మాత్రమే కాదని, ఆరోగ్య స్పృహ కలిగిన ప్రతీ ఒక్కరికీ అవసరమైన ఆహారం అని నిరూపితమయ్యింది. రాగి ఇడ్లీ, స్టఫ్డ్ ఇడ్లీ, ఇడ్లీ శాండ్‌విచ్‌లకు ఈ ఏడాది మరింత ఆదరణ పెరిగింది. భారతీయ ఆహారంలో ఆరోగ్యం, పోషక విలువలకు పెరుగుతున్న ప్రాధాన్యతను ఇడ్లీ మరింత రుచికరంగా తెలియజెప్పింది.
పోర్న్‌స్టార్ మార్టినితో పాప్ కల్చర్
ఈ ఏడాది ఎవరూ ఊహించని విధంగా సరికొత్త ట్రెండ్‌లలో ఒకటిగా పోర్న్‌స్టార్ మార్టిని నిలిచింది. ప్యాషన్ ఫ్రూట్, వెనిల్లా వోడ్కా, ప్రోసెక్కో స్ప్లాష్‌ల మిక్సింగ్‌గా పోర్న్‌స్టార్ మార్టిని తయారుచేస్తారు. పాప్ సంస్కృతి, సోషల్ మీడియా రీల్స్‌లో దీనిని చూసిన భారతీయులు దీనిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపారు. దేశంలోని పలు నగరాల్లోని ప్రజలకు కాక్‌టెయిల్ కల్చర్, మిక్సాలజీపై పెరుగుతున్న ఆసక్తిని ఇది ప్రతిబింబిస్తుంది. అలాగే అంతర్జాతీయ ఆహారపానీయాలపై యువత అమితంగా ఆకర్షితులవుతున్నారని ఇది తెలియజేస్తోంది.
మోదక్.. థెకువాలు సూపర్
పండుగల్లో చేసే వంటకాలు ఈ ఏడాది ప్రజల దృష్టిని అమితంగా ఆకర్షించాయి. గణేష్ చతుర్థికి ఉత్తరాదిన సంప్రదాయకంగా తయారుచేసే మోదక్‌కు ఈ ఏడాది జనం పట్టం కట్టారు. ఆవిరిమీద ఉడికించి తయారు చేసే మోదక్ ఈ ఏడాది చాలామందికి ఇష్టమైన ఆహారంగా మారింది. అలాగే ఈ ఏడాది చాక్లెట్ మోదక్‌లు, ఎయిర్-ఫ్రైడ్ వెర్షన్‌లు తయారయ్యాయి. బీహార్ ఛత్ పూజ స్పెషాల్ అయిన థెకువా దేశవ్యాప్తంగా చాలామంది ఇష్టమైన వంటకంగా మారింది.
ఉగాది పచ్చడి, పొంగల్‌కు ఎదురే లేదు
తెలుగు సంవత్సరం ఆరంభాన.. ఉగాది సందర్భంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో చేసే ఉగాది పచ్చడికి జనం పట్టంకట్టారు. జీవితంలోని వైవిధ్యాన్ని ప్రతిబింబిస్తూ, ఆరు రుచులను మిళితం చేసే ఈ వంటకాన్ని అత్యధికులు మెచ్చుకున్నారు. ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకునేందుకు పలువురు ఇంటర్నెట్‌లో శోధించారు. అదేవిధంగా తమిళనాడు సంప్రదాయ పొంగల్‌పై యువత అమితమైన ఆసక్తి చూపారు.
బీట్‌రూట్ కంజి,గోండ్ కటిరా
ఆహారం, ఆరోగ్యం మధ్యనున్న సంబంధంపై ఈ ఏడాది అనేకులు ఇంటర్నెట్‌లో శోధించారు. బీట్‌రూట్‌తో ఉత్తరాదిన తయారు చేసే బీట్‌రూట్ కంజి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ వంటకంలో ఉండే ప్రోబయోటిక్ గుణాల దృష్ట్యా ఇది అందరినీ ఆకట్టుకుంది. వేసవి పానీయాల రూపంలో లభ్యమయ్యే గోండ్ కటిరా గురించి ఇంటర్నెట్‌లో చాలామంది తెలుసుకున్నారు. జనం ఆరోగ్యంపై అమితమైన ఆసక్తి చూపుతున్నారనే దానికి బీట్‌రూట్ కంజి,గోండ్ కటిరా ఉదాహరణలుగా నిలిచాయి.
ఇది కూడా చదవండి: ‘సోషల్’స్వరాలు మూగబోయిన దేశాలు


