‘సోషల్‌’స్వరాలు మూగబోయిన దేశాలు | Countries Where Social Media is Banned or Restricted | Sakshi
Sakshi News home page

సోషల్‌ మీడియా శాసనాలు: స్వేచ్ఛా స్వరాలు మూగబోయిన దేశాలు

Dec 11 2025 7:24 AM | Updated on Dec 11 2025 7:58 AM

Countries Where Social Media is Banned or Restricted

నేటి డిజిటల్ యుగంలో సోషల్ మీడియా అనేది ఒక కమ్యూనికేషన్ సాధనం మాత్రమే కాదు.. జీవితంలో ఒక అంతర్భాగం. Facebook, Instagram, YouTube, X (గతంలో Twitter) తదితర ప్లాట్‌ఫారమ్‌లు కుటుంబ సభ్యుల ఫోటోలను పంచుకోవడం మొదలు.. సామాజిక ఉద్యమాలను నిర్వహించడం వరకు నెరవేరుస్తూ.. ప్రజల దైనందిన జీవితంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. 

అయితే, ప్రపంచంలోని కొన్ని దేశాల పౌరులకు ఈ డిజిటల్ స్వేచ్ఛ అందుబాటులో లేదు. పలు దేశాలు జాతీయ భద్రత, నైతికత తదితర అంశాలకు ప్రాధాన్యతనిస్తూ, సామాజిక నెట్‌వర్క్‌లపై కఠినమైన నిబంధనలను విధించడం లేదా  పూర్తి నిషేధాలను కొనసాగించడం చేస్తున్నాయి. ఏఏ దేశాలు ఈ తరహా వైఖరిని కలిగివున్నాయి? ఎటువంటి చర్యలు చేపట్టాయనే వివరాల్లోకి వెళితే..

చైనాలో ‘గ్రేట్ ఫైర్‌వాల్’ 
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన ఇంటర్నెట్ నియంత్రణలను అమలు చేస్తున్న దేశం చైనా. ‘గ్రేట్ ఫైర్‌వాల్’ విధానంతో Facebook, X, Instagram, YouTube వంటి ప్రధాన అంతర్జాతీయ ప్లాట్‌ఫారమ్‌లను చైనా పూర్తిగా బ్లాక్ చేసింది. దేశీయ ప్రత్యామ్నాయాలు (WeChat, Weibo వంటివి) ఉన్నప్పటికీ, అవి ప్రభుత్వ పర్యవేక్షణ, సెన్సార్‌షిప్‌కు లోబడి ఉంటాయి. జాతీయ భద్రత, సామాజిక స్థిరత్వం పేరుతో ఈ ఆంక్షలను విధిస్తోంది. ఫైర్‌వాల్‌ను దాటేందుకు వీపీఎన్‌లను వాడటం సాంకేతికంగా చట్టవిరుద్ధం. ఫలితంగా జరిమానాలు లేదా నిర్బంధంలాంటి శిక్షలు ఉంటాయి.

ఉత్తర కొరియా.. బాహ్య కమ్యూనికేషన్‌కు దూరం 
ప్రపంచ ఇంటర్నెట్ యాక్సెస్‌పై ఉత్తర కొరియా పూర్తి నిషేధం విధించింది. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఏవీ ఈ దేశంలో అందుబాటులో లేవు. పౌరులకు విదేశీ వార్తలు లేదా బాహ్య కమ్యూనికేషన్‌కు  ఎలాంటి యాక్సెస్ ఉండదు. దేశీయ కమ్యూనికేషన్ కోసం ప్రభుత్వం ఆమోదించిన కొన్ని వెబ్‌సైట్‌లు ఉన్నాయి. వీటిలో కఠినంగా నియంత్రించిన ఇంటర్‌నెట్‌ను మాత్రమే ఉపయోగిస్తారు. బాహ్య ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసే స్థానికులకు కఠిన శిక్షలు  ఉంటాయి.

ఇరాన్.. కానరాని అంతర్జాతీయ సోషల్ మీడియా
ఇరాన్ దేశం పలు అంతర్జాతీయ సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసింది. Facebook, YouTube,  X వంటివాటికి చాలా పరిమితమైన యాక్సెస్‌ ఉంటుంది. 2022 సామూహిక నిరసనల తర్వాత Instagramను కూడా నిషేధించారు. టెలిగ్రామ్, వాట్సాప్ తదితర మెసేజింగ్ యాప్‌లపై తరచూ నిబంధనలను విధిస్తుంటారు. ప్రజా నైతికత, జాతీయ భద్రత, నకిలీ వార్తల వ్యాప్తిని నిరోధించేందుకు ఈ ఆంక్షలు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అయితే బ్లాక్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేసేందుకు ఇరానియన్లు వీపీఎన్‌లపై ఆధాపడుతుంటారు. అటువంటి సందర్భాల్లో వారికి ప్రభుత్వం జరిమానాలు వడ్డిస్తుంటుంది. వీపీఎన్ అంటే ‘వర్చువల్ ప్రైవేట్ నెట్‌వర్క్’. దీని ద్వారా ఇంటర్నెట్‌ను రహస్యంగా వినియోగిస్తుంటారు.

తుర్క్మెనిస్తాన్.. నిత్యం పర్యవేక్షణ 
తుర్క్మెనిస్తాన్‌లో సోషల్ మీడియా, ఇంటర్నెట్ యాక్సెస్‌కు అనేక పరిమితులున్నాయి. Facebook, వాట్సాప్, X వంటి ప్లాట్‌ఫారమ్‌లను తరచూ బ్లాక్‌ చేస్తుంటారు. అలాగే ప్రభుత్వ నియంత్రణలో ఉన్న ప్రొవైడర్ల ద్వారా ఫిల్టరింగ్‌తో పర్యవేక్షిస్తుంటారు. వీపీఎన్‌ల ద్వారా బ్లాక్ చేసిన ప్లాట్‌ఫారమ్‌లను యాక్సెస్ చేయడం సర్వసాధారణం అయినప్పటికీ, ఇది జరిమానాలకు దారితీసే అవకాశం ఉంది.

ఆఫ్ఘనిస్తాన్.. ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు 
2021లో తాలిబన్లు తిరిగి అధికారంలోకి వచ్చినప్పటి నుండి, ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంటర్నెట్ స్వేచ్ఛపై ఆంక్షలు పెరిగాయి. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లపై నిత్యం నిఘా ఉంటుంది. కొన్ని ప్రావిన్సులలో అధికారులు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు. నైతిక లేదా మతపరమైన  పాలనా నియమాలకు విరుద్ధమైన కంటెంట్‌పై పూర్తి నిషేధం అమలులో ఉంది.

టర్కీ.. జాతీయ విలువల కోసం.. 
దేశంలో రాజకీయ అశాంతి, నిరసనలు, భద్రతా సంక్షోభాల సమయంలో టర్కీ..  సోషల్‌ మీడియాపై తాత్కాలిక నిషేధం విధిస్తుంటుంది. ఉగ్రవాద దాడులు, రాజకీయ ప్రదర్శనల సమయంలో వాట్సాప్, యూట్యూబ్, ‘ఎక్స్‌’ లాంటి ప్లాట్‌ఫారమ్‌లను కొన్ని రోజుల పాటు బ్లాక్ చేశారు. భద్రత, తప్పుడు సమాచారం నివారణ లేదా జాతీయ విలువలను కాపాడేందుకు ఇలా చేశామని అధికారులు తెలిపారు. టర్కీ చట్టాల ప్రకారం ఈ ప్లాట్‌ఫారమ్‌లు దేశంలో తమ ప్రతినిధులను నియమించాలి. స్థానికంగానే డేటాను నిల్వ చేయాల్సి ఉంటుంది.

మయన్మార్.. తిరుగుబాటు తర్వాత.. 
2021 ప్రారంభంలో జరిగిన తిరుగుబాటు తరువాత, మయన్మార్ సైనిక పాలన నిరసనలు లేదా అశాంతియుత కాలంలో సోషల్ మీడియా, మెసేజింగ్ ప్లాట్‌ఫామ్‌లపై (ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మొదలైనవి)  నిషేధం విధించింది. ఈ నిషేధం.. తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకేనని ప్రభుత్వం తెలిపింది.  

రష్యా.. వీడియో కాలింగ్‌పై నిషేధం
రష్యాలో సోషల్‌ మీడియాపై నిషేధాలు తక్కువే అయినప్పటికీ, పలు పరిమితులు ఉన్నాయి. చట్ట అమలుకు సహకరించడం లేదనే ఆరోపణలతో WhatsApp, టెలిగ్రామ్ వంటి విదేశీ మెసేజింగ్ యాప్‌లలోని వాయిస్ లేదా వీడియో కాలింగ్ ఫీచర్‌లు పరిమితం చేశారు. ఆయా ప్లాట్‌ఫారాలు స్థానిక కార్యాలయాలను తెరవాలని, తీవ్రవాద కంటెంట్‌ను నియంత్రించాలని రష్యా డిమాండ్ చేస్తున్నది.

నేపాల్.. పునరాలోచన
సోషల్‌ మీడియా కంపెనీలు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోవడంతో విఫలం కావడంతో Facebook, Instagram, YouTube, ‘ఎక్స్‌’ తో సహా 26 ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లపై నిషేధాన్ని ప్రకటించారు. ఈ నిర్ణయం నిరసనలకు దారితీసింది. దీంతో ఈ నిషేధాన్ని కొద్ది రోజుల్లోనే ఎత్తివేశారు. అయితే ప్రభుత్వం దీనిపై పునరాలోచన చేస్తున్నదని సమాచారం.

ఇది కూడా చదవండి: వణికిస్తున్న సూపర్‌ఫ్లూ.. రికార్డు స్థాయి కేసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement