పాక్ జాతీయ అసెంబ్లీ ఫ్లోర్‌పై నోట్ల కట్ట
మాదంటే మాదని చేతులెత్తిన ఎంపీలు
పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీలో సోమవారం జరిగిన ఒక సంఘటన, ’నవ్వుకు నోబెల్ బహుమతి’ ఉంటే.. అది పాకిస్తాన్ పార్లమెంటుకే దక్కేదని నిరూపించింది. స్పీకర్ అయజ్ సాదిక్ గారు, పార్లమెంటు ఫ్లోర్‌పై పడి ఉన్న ఒక చిల్లర నోట్ల కట్టను చూశారు. అందులో ఏకంగా 10.. రూ.5,000 పాకిస్తాన్ కరెన్సీ నోట్లు ఉన్నాయి. అంటే, భారతీయ కరెన్సీలో దాదాపు రూ.16,500 విలువ అన్నమాట. ఈ మొత్తం పాక్ కరెన్సీలో మహా అయితే రెండు బిర్యానీ ప్యాకెట్లకు సరిపోతుంది.
నోట్లు పది.. చెయ్యెత్తింది డజను మంది
స్పీకర్ సాదిక్.. ఎంపీల నిజాయితీకి పరీక్ష పెడదామని గొప్పగా అనుకున్నారు. అయితే, అది ఎంత హాస్యాస్పదంగా మారుతుందో ఆయన ఊహించలేకపోయారు. ‘ఎవరి డబ్బు ఇది? దయచేసి చేయి ఎత్తండి!’.. అని ఆ నోట్ల కట్టను గాల్లో ఊపుతూ అడిగారు. ఆయన నోటి మాట పూర్తి కాకముందే, అదో కబాబ్ దొరికినట్లు.. ఒక్క సెకన్‌లో 12 మంది ఎంపీలు హుటాహుటిన చేతులు పైకెత్తేశారు. ఎంపీల వేగం చూసి స్పీకర్ గారికి నోట మాట రాలేదు.
‘నోట్లు ఉన్నది పదే. మరి యజమానులు ఏకంగా పన్నెండు మందా??’.. అంటూ కడుపు చెక్కలయ్యేలా నవ్వారు. పాకిస్తాన్‌కు చెందిన ఆజ్ టీవీ కథనం ప్రకారం, ఆ డబ్బు దాని నిజమైన యజమాని అయిన ఇమ్రాన్ ఖాన్ పార్టీ పాకిస్తాన్ తెహ్రీక్–ఇ–ఇన్సాఫ్ ఎంపీ ముహమ్మద్ ఇక్బాల్ అఫ్రిదికి చేరింది. ఆయన అసెంబ్లీ కార్యాలయం నుండి ఆ మొత్తాన్ని అందుకున్నారు.
తలంటిన పాకిస్తానీలు
సోషల్ మీడియాలో తెగ వైరలైన ఈ వీడియోపై చాలా మంది పాకిస్తానీలు తమ చట్టసభ సభ్యుల వైఖరిని ఛీత్కరించుకున్నారు. ఆ నోట్లు తమవేనని చేతులెత్తిన 12 మంది ఎంపీలను పదవుల నుంచి తొలగించాలని కొందరు పాకిస్తానీలు కోరారు. ‘స్పీకర్ షరీఫ్ సోదరుల నుండి వచ్చిన 25 మిస్డ్ కాల్స్ గమనించలేదు’.. అని మహ్నూర్ ఆసిఫ్ వెటకారంగా ట్వీట్ చేశాడు. మరొకరు ‘ఎంపీలు లక్షల్లో జీతాలు, ప్రోత్సాహకాలు తీసుకుంటారు, అయినా వారి పరిస్థితి ఇదే’.. అని ట్వీట్ చేశారు.
పార్లమెంటులో దొరికిన డబ్బులు కూడా అప్పుగా తీసుకొచి్చనవేమో అని పాకిస్తానీలు వెటకారంగా వ్యాఖ్యానించడం మరో హైలైట్. రజియా సుల్తాన్ అనే ఫేస్‌బుక్ యూజర్ నవాజ్ షరీఫ్ కుమార్తె మరియం నవాజ్ షరీఫ్‌ను ఇందులోకి లాగారు. ‘పీఎంఎల్‌ఎన్ చాలా పేద పార్టీ. స్పీకర్ వారికి ఆ డబ్బు ఇవ్వాల్సింది.. అది మరియం నవాజ్ సన్నబడేందుకు సహాయపడుతుంది’.. అని పోస్టు చేశారు. మొత్తానికి, పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ అప్పుల మీద నడుస్తుంటే, పార్లమెంటు సభ్యులు మాత్రం ఫ్లోర్‌పై పడి ఉన్న రూ.16 వేల చిల్లర నోట్ల కోసం ప్రపంచం ముందు పరువు మొత్తం పోగొట్టుకున్నారు.
– సాక్షి, నేషనల్ డెస్క్


