సోషల్ మీడియాపై నిషేధం ప్రారంభం
మెల్‌బోర్న్ (ఆస్ట్రేలియా): పదహారేళ్ల లోపు పిల్లలకు సోషల్ మీడియా నిషేధం విధించడా న్ని ఆస్ట్రేలియా ప్రధానమంత్రి ఆంథోనీ అల్బ నీస్ స్వాగతించారు. ప్రపంచంలోనే మొట్టమొ దటిదైన ఈ నిషేధం బుధవారం నుంచి అమల్లోకి వచ్చింది. అయితే నిషేధం అమలు కష్టంతో కూడుకున్నదని ఆయన హెచ్చరించారు.
నిషేధం అమలుతో తమ ఖాతాలు మూతపడినట్లు తెలుసుకున్న పిల్లలు బాధ పడ్డారని తల్లిదండ్రులు తెలిపారు. కొందరు చిన్న పిల్లలు తమ ముఖాలపై మీసాలు, గడ్డం చిత్రించుకుని, సోషల్ మీడియా ప్లాట్‌ఫాంల వయసు అంచనా సాంకేతికతను మోసం చేయగలిగారని వెల్లడించారు. తల్లిదండ్రులు, అన్నలు లేదా అక్కలు కూడా.. కొంతమంది పిల్లలకు ఈ ఆంక్షలను తప్పించుకోవడానికి సహాయం చేస్తారని భావిస్తున్నారు.
కన్నవారికి మనశ్శాంతి తథ్యం
‘బిగ్ టెక్ కంపెనీల నుంచి ఆస్ట్రేలియా కు టుంబాలు అధికారాన్ని తిరిగి పొందే రోజు ఇది. పిల్లలు పిల్లల్లా ఉండటానికి, తల్లిదండ్రులకు మరింత ప్రశాంతత లభించడానికి నిషేధం ఉపకరిస్తుంది’.. అని అల్బనీస్.. ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్ప్‌తో వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా పిల్లలు.. వారి బాల్యాన్ని హాయిగా గడిపేందుకు వీలు కల్పిస్తుంది. ఆస్ట్రేలియా తల్లిదండ్రులకు మరింత మనశ్శాంతినిస్తుంది. ఆస్ట్రేలియా చేయగలిగితే, మనం ఎందుకు చేయలేం?’ అని ప్రపంచ సమాజం ఆస్ట్రేలియా వైపు చూస్తుంది’.. అని అల్బనీస్ చెప్పారు. ఒక బిడ్డ ఆత్మహత్యకు సోషల్ మీడియా కారణమని ఆరోపించే తల్లిదండ్రులతో సహా, సోషల్ మీడియా సంస్కరణ మద్దతుదారుల సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
ఉల్లంఘిస్తే భారీ జరిమానా
బుధవారం నుంచి 16 ఏళ్లలోపు ఆస్ట్రేలియా పిల్లల ఖాతాలను తొలగించడానికి సహేతుక మైన చర్యలు తీసుకోకపోతే, ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రాగామ్, కిక్, రెడ్డిట్, స్నాప్‌చాట్, థ్రెడ్స్, టిక్‌టాక్, ఎక్స్, యూట్యూబ్, ట్విచ్ వంటి ప్లాట్‌ఫాంలు గరిష్టంగా 49.5 మిలియన్ల ఆస్ట్రేలియన్ డాలర్లు అంటే.. సుమారు 32.9 మిలియన్ల అమెరికన్ డాలర్ల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.
క్రిస్మస్ నాటికి నివేదిక
ఈ నిషేధాన్ని ఆస్ట్రేలియాలోని ఈ–సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అమలు చేస్తారు. వయస్సు పరిమితిని కచ్చితత్వంతో అమలు చేయడానికి ప్లాట్‌ఫాంల వద్ద ఇప్పటికే సాంకేతికత, వారి వినియోగదారుల వ్యక్తిగత డేటా అందుబాటులో ఉన్నాయని ఆమె స్పష్టం చేశారు. వయసు పరిమితిని ఎలా అమలు చేస్తున్నారు?, ఎన్ని ఖాతాలు మూతపడ్డాయి? అనే అంశంపై సమాచారం ఇవ్వాలని కోరుతూ లక్షిత పది ప్లాట్‌ఫాంలకు గురువారం నోటీసులు పంపుతానని వెల్లడించారు.
‘ఈ వయస్సు పరిమితులు ఎలా అమలు అవుతున్నాయో, అవి ప్రాథమికంగా పనిచేస్తున్నాయో లేదో క్రిస్మస్ లోపు ప్రజలకు సమాచారం అందిస్తాం’.. అని ఇన్మాన్ గ్రాంట్ చెప్పారు. కమ్యూనికేషన్స్ మంత్రి అనికా వెల్స్ మాట్లాడుతూ, బుధవారానికి ఆస్ట్రేలియాలో 200,000 కంటే ఎక్కువ టిక్‌టాక్ ఖాతాలు నిలిపివేసినట్లు వివరించారు.


